ట్యాగులు

5e3a8-lonlywoman
కొన్నినక్షత్రాలు.. కాసిన్నికన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్నికన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి,  దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై  ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు. నలభై ఏళ్ళ గోదావరీలోయ విప్లవపోరాటం వెనుక మనసు ఆగక పరుగులు పెట్టినట్లు గుర్తు. నాకు తెలిసిన తెలంగాణ పల్లెలు, గడీలు స్మృతి పధంలో నడచినట్లు గుర్తు. చైతన్యగనులైన పి.డి.ఎస్.యు విధ్యార్దులు గుండెగదుల్లో కవాతు చేసినట్లు గుర్తు. ఈ కధ తెలంగాణ, అందులోను  కరీంనగర్, విప్లవోద్యమ నేపధ్యంలో రాసింది. రాసింది ఆ ఉద్యమంలో ఊపిరి పోసుకొని ఎదిగిన విమలగారు. మొదట పాలపిట్ట మాసపత్రికలో ప్రచురించబడి కధ 2012 లో కనిపించిన ఈ కధ ఒక ఆణిముత్యం.
కధాస్థలం కరీంజిల్లాలోని ఒక పల్లె. కాలం తొంభయ్యవ దశకం ప్రారంభం. ఆ పల్లెలో ప్రధాన బాధ్యతలు వహిస్తున్నది ఒక మహిళ. ఎన్నికల సందర్భంగా వచ్చిన వెసులుబాటును విప్లవ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవాలనుకొంటారు. అప్పుడు ఆమె ముందుకు వస్తారు ఇద్దరు నవయువకులు. ఒకరు పెళ్ళై చంటిబిడ్డకు తండ్రి అయిన తిరుపతి …  ఇంకొకరు అనాధ అయి  ప్రేమ తప్పఇంక ఏమిలేని మాధవ. యాధృచ్చికంగా మాధవ ప్రేమకధని వింటుంది ఆమె. ఒక గంట ప్రేమికుడిని కలవటానికి తొమ్మిదిగంటలు ప్రయాణంచేసి వెళ్ళిన తన తొలిప్రేమను జ్ఞాపకం చేసుకొంటుంది. అతను తన చేతిమీద వేయించుకొన్న  వెలుగుతున్న దీపం పచ్చబొట్టు చూసి కదిలిపోతుంది. ” నాకు మొక్కలంటే యిష్టం. ఎప్పటికన్నాపొలంగొంటె ఏటివడ్డున ఒక రెండెకరాలనా – అందులో చిన్న గుడిసేసుకొని చుట్టూ పూలమొక్కలు పెట్టుకొని ఉండాల. మేమిద్దరం గల్సి చిన్నపిల్లల కోసం ఒక మంచి స్కూల్ పెడతాం. క్లాసులు చెట్లక్రింత – అదేంది. ఆ (:  శాంతినికేతన్ లెక్క” అంటూ అతడు చెప్పే కలలను వెన్నెల్లో నులకమంచం మీద పడుకొని వింటుంది. అతనికి తప్పక సాయం చేయాలనుకొంటుంది. “ఆ చల్లటి వెన్నెలరాత్రి, ఆ పిల్లవాడి ముఖంలో ఏదో అవ్యక్తపు ఆనందం. నక్షత్రపుకాంతి.  ప్రేమ, అది ఎంత అధ్బుత అనుభవం!”
తెల్లవారి మసకచీకటిలో, మసకకళ్ళతో వారికి వీడ్కోలు పలికి, మధ్యాహ్నానికి ఇద్దరి ఎన్ కౌంటర్ వార్త వింటుంది. ఒకరు తిరుపతి. ఇంకొకరు? ” కట్టెలు చేర్చిన ఆ చితి మధ్య – విగతజీవిగాఎవరో పిల్లవాడు. వాడికీ కల ఉందా? ఒక ప్రేమకధ ఉందా? ఒక వెన్నెలరాత్రి వాడూ వాడి జీవకాంక్షని- ఎవరికైనా చెప్పాడా? ఎవరా పిల్లవాడు…మాధవా నువ్వు బతకాలరా” అని రోదిస్తుంది. ఎవరు మరణించారు? ఎవరు బతికారు? ఆ క్షణం నేను కూడ మరణించానా వాళ్ళతో పాటు? అని ప్రశ్న వేసుకొంటుంది. కాని చనిపోయింది మాధవానే. కూబింగ్ చేసి వస్తున్నపోలిసులను చూసి భయపడి పారిపోతుంటే ఇద్దర్నికాల్చివేసారు. గాయాలతో తూములో దాక్కొన్న నిరాయుధుడైన మాధవాను చంపబోమని చెప్పి బయటికి పిల్చి కాల్చేసారు.
కధ  మొత్తం ఆమె జ్ఞాపకాల ఉద్విగ్నతలతో సాగుతుంది. మానేరు ఒడ్డున కూర్చొని “మానేరా, మానేరా! నను వీడని మనియాదా” అని పలవరిస్తుంది. “చీకట్లు ముసురుతున్న ఆ సాయంవేళ, నాల్కలు చాచుతున్న ఆ మంటల్ని నిర్ఘాంతపడి చూస్తూ… పెనుగులాడి…  పెనుగులాడి నాలోపల నేనే పొడిపొడిగా రాలుతూ…”  అంటూ ఆనాటి విషాదాన్ని  ధ్యానించుకొంటుంది. రచయిత్రికి  విప్లవంపట్ల నిబద్దత, అది అందుకోలేని బాధ కధపొడవునా వ్యక్తం అవుతాయి. “ఏదీ ఆ మరోప్రపంచం, ఎర్రబావుటా నిగనిగలు, ప్రళయఘోషలు, ఝుంజామారుతాలు, జగన్నాధ రధచక్రాలు, ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా .. జాబిల్లా?  నేనా? ఏవి, ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహలు?”
 
ఈ కధ ఒక ఎన్ కౌంటర్ దుఃఖాంతాన్ని వర్ణించే కరుణ రస ప్రధానమైన కధగా కనిపిస్తున్నా, కధ వెనుక అప్రకటితభాష్యం (అన్-టోల్డ్ టెక్ట్స్ ) చాలా ఉంది. “ఈ కధ నాలో అంతరంతరాలలో అనేక ఏళ్ళుగా దాగిన దుఃఖం.” అని రచయిత్రి చెప్పుకొన్నారు. ఆ దుఃఖం వైయుక్తమైనది కాదు. అది ఉద్యమాల దుఃఖం.  సమసమాజం నిజమైన అర్ధంలో స్థాపించటానికి బలైపోయిన వందలాది యువతీయువకుల మృత్యుకేళి కలిగించిన వగపు. మాధవా కన్నకలలు భారతదేశంలోని ప్రతి లేబ్రాయపు యువతి, యువకుడు కనే ఉంటారు. చిన్నఇల్లు, చేయటానికి పని …  ఇవి ఇచ్చిన భరోసాతో ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన. బహుశ  మాధవలాంటి వాని ఊహలలో ఈరాజ్యహింస తాలూకూ పీడకలలు ఉండి ఉండకపోవచ్చు. ఈ ఎన్ కౌంటర్ లు అలాంటి కనీస కోరికలు కోరే వారికీ, వాటి కోసం పోరాడేవాళ్ళకు ఈ భూభాగంలో చోటు లేదని చెప్పే తీర్పులు. కాలే చితిపై మండుతున్నశవాల తాలూకూ పొగలు …  అదే సందేశాన్ని మోసుకొని పోయి ఉంటాయి. తన ప్రియుడి మరణం తెలుసుకొని వచ్చి ఏడ్చి వెళ్ళిన జ్యోతి ..  ఈ మరణాలను ప్రశ్నించలేని, ఎవరినీ తప్పుపట్టలేని అమరవీరుల కుటుంబాల ప్రతినిధి.
ఈ కధలో ఒకప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిన ప్రాంతాలలో మారిన పరిస్థితుల వర్ణన అత్యధ్బుతంగా చేసారు. క్షీణించిన సాంస్కృతిక, ఆర్ధికజీవనాల గురించి , ముగిసిపోయిన  జమిందారీవ్యవస్థ గురించి, కొండెక్కిన ఉద్యమాలు, ప్రపంచీకరణ సునామి ఉధృతిలో పడిపోయిన గ్రామీణ ఉపాధులు ఒక్కవాక్యంలో  దృశ్యీకరించారు.
“శిధిలమైన మట్టిగోడలు, జాజు నీలంరంగులు పూసిన దర్వాజాలు, చెదిరిపోయిన నినాదాలు, రెక్కలు చాచిన రాబందుల్లా యాంటీనాలు, కోకోకోలాలు, బిస్లరీవాటర్లు, మద్యంసీసాలు, జిల్లెళ్ళు మొలుస్తున్నగడీలు, పలకని రాతిదేవుళ్ల గుడులు, చదువు చెప్పని బడులు, విరిగిన మగ్గాలు- ఆకు – తంబాకుచేటలు….”  .
మారిన సామాజిక ఆర్ధికపరిస్థితులను అందుకొని చేయవలసిన కర్తవ్యాలను మరిచిన ఉద్యమ వైఫల్యాలను కూడ ఎత్తిచూపారు. వచ్చిన మార్పులను స్వీకరించి ఉద్యమాలను పునర్నిమాణము చేయని అశక్తతను కూడ పేర్కొన్నారు.  “పెరిగిన మధ్యతరగతి మనుషులు- నీటివసతి- కొత్తవ్యాపారాలు పెరిగి- ఒకప్పటి – కరీంనగర్ కాదిది –  జరిగిన మార్పులను అంచనా వేసే వాళ్ళెవరు – ఏం చేయాలో – మళ్ళీ కొత్తగా ప్ర్రారంభిచేది ఎవరు?”
 ఈ ఘటన జరిగిన పద్దెనిమిదేళ్ళ తరువాత మాధవ ప్రియురాలు జ్యోతిని అనుకోకుండా కలిసిన ఆమె, జ్యోతి చేతిపై మాధవ గుర్తుగా వేయించుకొన్న పచ్చబొట్టును చూస్తుంది. తన రిక్తహస్తాలను చూసుకొంటుంది. ఉద్యమవైఫల్యాలు, మిగిలిపోయిన కర్తవ్యాలు ఈ చివరవాక్యం ద్వారా మనకు వ్యక్తమౌతాయి. ఎంత ఉదాత్తమైన ముగింపు? కధనంతటినీ ఈ చిన్నవాక్యంలో కుదించి మనకు సందేశమిచ్చిట్లు అయ్యింది.
 
ఈ రివ్యూ సారంగ వెబ్ మాగ్ జైన్ లో  ఇక్కడ