ట్యాగులు

నీకు అప్పటి నా ఫోటో దొరక్క పోవచ్చు. కానీ మేడ మీద పాత సాక్స్ లో నా పాద ముద్రలు ఉంటాయి.” అన్నాడు ఒకాయన గత స్మృతుల గురించి మాట్లాడుతూ. ఫోటోలు లేని ఆ జీవితం ఎంత సువాసన భరితంగానూ, చైతన్య భరితంగానూ ఉండేదీ!

అప్పుడు మేము నరసరావుపేట లోని రామిరెడ్డి పేటలో ఉండేవాళ్ళం. అక్కడ బ్రాహ్మణ కుటుంబాల పిల్లలు నా క్లాస్ మేట్స్. అందరం సిద్ధార్ధ విద్యాలయలో ఐదో క్లాస్ లో ఉండేవాళ్ళం. మొదట బిడియంగా మొదలైన నా స్కూల్ జీవితం తరువాత నన్ను క్లాస్ లీడర్ గా మార్చింది. అబ్బాయిలతో పందాలు కాయటం, పోట్లాటలు పెట్టుకోవటం, నా చుట్టూ ఉండే అమ్మాయిల ముఠాను గెలిపించటం నా తీపి విజయాలు అప్పడు.

మీరు నమ్మరేమో ఆ వయసులోనే నాగార్జున సాగర్ కాలవలో ఈతకు వాళ్ళను నాతో తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న చేత వాళ్ళకు తిట్లు తినిపించేదాన్ని. శుద్ద సాంప్రదాయ కుటుంబాల ఆడపిల్లలు. వాళ్ళ అమ్మలు బయట మూడు రోజులు కూర్చుంటే వంటలు చేసి, తమ కన్నా చిన్న పిల్లల్ని సంతరించేటంతటి బాద్యతతో ఉండే ఆడపిల్లలని నేను సినిమాలకు, తోటలకు తిప్పేదాన్ని.

ఆలాగే మునిసిపల్ గర్ల్స్ హైస్కూల్ లో ఆరో క్లాస్ లో చేరాము అందరం. అక్కడా నేనే లీడర్ ని. స్కూల్ జీవితం ఆస్వాదించటం అంటే అదే. టీచర్స్ మమ్మల్ని ప్రేమించి నేర్పించేవాళ్ళు. లాంతర్లు పట్టుకొని వెళ్ళే రాత్రి ట్యూషన్స్, స రి గ మ పా అంటూ నేర్చుకొన్న సరళీ స్వరాలు, హిందీ ప్రాధమిక క్లాసులు అన్నీ ఉమ్మడి గానే జరిగేవి. నాకు స్కూలు జీవితం, ఇంటి జీవితం ఒకటే లాగా ఉండేదీ; తినటం, పడుకోవటం తప్ప. మా ఇంట్లో కూడా నా మీద పెద్ద దృష్టి ఉండేదీ కాదు.

సంద గొబ్బెమ్మల పేడ కోసం స్కూల్ అయిపోయాక ఊరి చివర తోపులో ఆవుల వెనకాలే నడిచే వాళ్ళం. సాయంకాలం ఒక్కో ఇంటిలో గోబ్బెమ్మ పెట్టి, దాని చుట్టూ పాటలు పాడుతూ నాట్యం చేసే వాళ్ళం. బ్రాహ్మణుల ఈ వినోదాలు నేర్చుకోవటానికి మా ఇంట్లో పెద్ద అభ్యంతరం ఉండేదీ కాదు. కానీ ఒక శూద్ర కులస్తురాల్ని నన్ను, ఆ కుటుంబాలు ఇష్ట పడటమే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం గా ఉంటుంది. చదువులో నా చురుకుదనం నాకు అప్పుడు ఉపయోగపడింది. హేమ నా ముఖ్య స్నేహితురాలు. మధ్వుల పిల్ల. వాళ్ళ నాన్నగారు కెమిస్ట్రీ లెక్చరర్. వాళ్ళ అమ్మగారి సంస్కారవంతమైన నవ్వు నాకింకా గుర్తు. హేమకు ఒక అన్న, బోలెడంత మంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉండే వాళ్ళు. “శివుడు తాండవమూ చేయునమ్మా” చాలా బాగా చేసేది. కొన్ని సార్లు నన్ను గెలిపించటానికి తను నా కంటే తగ్గి ఉండేదని నా కిప్పుడు అనిపిస్తుంది.

ఏడో క్లాస్ లో వచ్చింది గీత. పొడవుగా బాబ్డ్ హెయిర్ తో తెల్లగా ఉండేదీ. అప్పటి దాకా ఉన్న నా ఏకఛత్రాధిపత్యానికి బీటలు పడ్డాయి. చదువులో నా కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకొనేది. నేను బింకంగా తనతో పలకకుండా తిరిగేదాన్ని. ఒక శుభోదయాన “ లెక్కల్లో మనిద్దరి మార్క్స్ ఒకటే” అంటూ వచ్చి చేయి కలిపింది. అప్పటి నుండి తనూ మా గుంపు లో చేరిపోయింది. మా స్నేహంలో తను అప్పటి వరకూ చూడని అద్భుత లోకాల్ని చూసింది. మేమందరం కలిసి “పొన్నలు విరిసే వేళలో, వెన్నెల కురిసే రేలలో” పాటకు కోలాటంవేసేవాళ్ళం.చుట్టూ పక్కల వాళ్ళు మా కోలాటం చూడటానికి గోడలు ఎక్కే వాళ్ళు. గీత త్వరలోనే నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళ నాన్న గారు ఎల్.ఐ.సి లో ఆఫీసర్. ఆరుగురు ఆడపిల్లల్లో చివరిది. నాతో తను ఒక స్వేచ్చయుతమైన కొత్త జీవితం చూసింది. మా ఇంటికి వచ్చి క్రింద నేల మీద కూర్చొని మా ఇంట్లో ఉండే పత్రికలు చదివేది. తను అప్పుడు మోకాళ్ళు మడిచి కూర్చోన్న భంగిమ నా స్మృతి పధంలో నిలిచిపోయింది.

మా వాళ్ళు అప్పుడు సొంత ఇల్లు కొని నన్ను నా స్నేహాలకు దూరం చేశారు.స్కూల్ కూడా మార్చారు. అయినా ఆదివారాలు మేము కలిసే వాళ్ళం. ఒక ఆదివారం నేను గీతా వాళ్ళింటికి వెళ్ళాను. హఠాత్తుగా సినిమా ప్రోగ్రామ్ వేసింది. నేను డబ్బులు తెచ్చుకోలేదు. ఇంట్లో బెంచ్ టిక్కెట్ అని రూపాయి తీసుకొంది. వాళ్ళ అక్క “రమ ఏ టిక్కెట్ కి డబ్బులు తెచ్చుకోందో అడుగు.చాలక పోతే ఇబ్బంది” అని చెబుతూనే ఉంది. గీత ఆ మాటలు పట్టించుకోకుండా నన్ను లాక్కొని వెళ్ళింది. అలా మేమిద్దరం “మల్లీశ్వరీ” సినిమా నేల టిక్కెట్ తో, అచ్చు నేల మీదే కూర్చొని చూసాము.

తరువాత జీవితంలో ఎన్నో మజిలీలు, ఎన్నో స్నేహాలు. కానీ తొలి స్నేహాలతో దేనికి సాటి? హేమ, నేను ఉత్తరాలు రాసుకొంటూనే ఉండేవాళ్ళం. మధ్య మధ్య లో కలుస్తున్నాము. గీతా వాళ్ళ నాన్నగారికి బదిలీ అయ్యి తను కనబడకుండా అయిపోయింది. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు హేమ నుండి ఒక ఉత్తరం వచ్చింది. హైదారాబాద్ లో ఉస్మానియాలో న్యూక్లియార్ ఫిజిక్స్ చదువుతున్న గీత ఒక రోడ్ ప్రమాదం లో చనిపోయిందని. నా చిన్న నాటి నేస్తం, నన్ను ఆరాధించి నాలా తను, తనలా నేను ఉండాలనుకొనే అమాయక వయసు దోస్తు నా జీవితం నుండి అలా నిష్క్రమించింది. చాలా రోజులు నేను కోలుకోలేక పోయాను.

హేమను నా పెళ్ళికి ముందు వరకూ కలుస్తూనే ఉన్నాను. తను ఎం. ఎస్. సి. ఎలక్ర్టానిక్స్ చేసింది. చివరి సారి వాళ్ళ చెల్లి పెళ్ళిలో చూశాను. అప్పటికి వాళ్ళ నాన్న గారు రిటైర్ అయ్యి గుంటూరు లో వాళ్ళ పాత సొంత ఇంట్లో సెటిల్ అయ్యారు. బ్రాడీపేట రాఘవేంద్ర స్వామి గుడిలో పెళ్ళి భోజనాలు అయ్యాయి. వంట బ్రాహ్మలు స్వయంగా వడ్డించారు. నేను చిన్నప్పుడు కొట్లాడిన అబ్బాయిలను ఆ భోజనాలపంక్తిలో దూరం నుండి చూపించి నవ్వింది. ఆకాసం రంగు కంచి పట్టు ఫ్లైయిన్ చీర కట్టుకొని హుందాగా ఆ పెళ్ళిలో తిరగాడిన వినయశీలి, స్నేహమయి, ప్రియబాంధవి నా ప్రెండ్ హేమమాలినిని అదే చివర సారి కలవటం.

తరువాత తనని ఎందుకు కలవలేక పోయాను? హేమ తప్పు ఏమి లేదు. నా జీవితంలో కొత్త ద్వారాలు తెరవబడ్డాయి. నాకు కొత్త లోకాలు తెలిసాయి. కొత్త మనుషులు ప్రవేశించారు. నేను ఎన్నుకొన్న మార్గం ఆ బ్రాహ్మణ పిల్ల ఆమోదించలేదు అనే సందేహం వలన కావచ్చు. సాంప్రదాయబద్దంగా జరగని మా పెళ్ళిని తను ఇష్టపడక పోవచ్చు అనే శంక కావచ్చు. గుంటూరులోనే నా పెళ్ళి జరిగినా తనను నేను పెళ్ళికి ఆహ్వానించలేదు. కానీ నా అభిప్రాయం తప్పు. షరతులు లేని స్నేహం అది. చిన్నప్పుడే నాలోని ఎగిరే పక్షిని అర్ధం చేసుకొన్న హేమ నన్ను నన్ను గానే ఆమోదించి ప్రేమించిన హేమ, నా ఈ కొత్త జీవితాన్ని కూడా అర్ధం చేసుకొనేది. ఆ విషయం నాకు అర్ధం అయ్యేసరికి ఒక జీవిత కాలం ఆలస్యం. ఇప్పుడు గుంటూర్లో వాళ్ళ ఇంటి కోసం వెదికితే అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. హేమ గురించి చెప్పేవాళ్ళే లేరు.

మా హేమ కనబడితే చెప్పరూ! తన కంటికొనకుల్లో పరధ్యానంలాగా కనబడే పసితనం, తెల్లని తన నుదురులో పయనించే పరిణితి చెందిన ఆలోచనల మేఘం, తన నవ్వులో పూయించే కల్తీ లేని అనురాగం బహుశ అలాగే ఉండి ఉంటాయి. మీరు నా కళ్ళతో చూస్తే గుర్తు పట్టగలరు.