ట్యాగులు

woman sketch

 

పంజాబ్ లో ఇంకో అందమైన నగరం హోషియాన్ పూర్. అక్కడ ఒక హైయ్యర్ మిడిల్ క్లాస్ సిక్కు కుటుంబం నుండి గురుప్రియ సంధు వచ్చింది. అన్నలు ఇద్దరు అబ్రాడ్ లో సెటిల్ అయ్యారు. వాళ్ళిద్దరి తరువాత చాలా లేట్ గా పుట్టిందీ గుడియా.సున్నితమైన మనసు. ఎంత సున్నితం అంటారా! చేతికి ఒక పువ్వు ఇచ్చి నలపమంటే నలపలేదు.పన్నెత్తి ఎవరిని ఒక కఠినమైన మాట ప్రత్యక్షంగా కాని, పరోక్షం గా కాని అనలేదు. చిరు దరహాస, స్నేహపూరిత వీక్షణాలే కాని ఆమె ఆగ్రహాన్నిఎవరూ చూడలేదు.
నా M.Tech లో మొదటి లేబ్ క్లాస్. Matlab software లో simulate చేయాలి. నాకు fundamentals కూడా తెలియవు. గరీమా మేడం వచ్చి హిందీలో ఏదో చెప్పి వెళ్ళారు. Take your classmates’ help అనే english ముక్కే అర్ధం అయ్యింది. ఎవర్ని అడగాలి? ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భాష నాకు గ్రీకు, లాటిన్ లాగా వినిపిస్తుంది. అప్పట్లో వాళ్ళ హావభావాలు కూడా నాకు అర్ధం అయ్యేవి కావు. చిన్నప్పుడు తిరణాళ్ళల్లో తప్పిపోయినట్లు ఒంటరితనం హఠాత్తుగా నన్ను ఆవహించింది. నా ఆత్మవిశ్వాసం జీరో లెవెల్ కి పడిపోయింది. ఇరవయ్యేళ్ళ సర్వీసు తరువాత కూడ నేను ఇంతేనా అనే ఆత్మన్యూనతలో ఉన్నట్లుండి కూరుకుపోయాను.
ఇంతలో ‘May i help you’? అంటూ స్వచ్చమైన ఇంగ్లీష్ ఉచ్చారణ తో ఈ అమ్మాయి పక్క డెస్క్ నుండి నన్ను పలకరించింది. పొడుగు జడ, సాంప్రదాయమైన పంజాబీ వేషధారణ. చిరునవ్వుతో నాకు కమేండ్స్ వివరించింది. అది మా మొదటి పరిచయం. తరువాత ఎప్పుడూ గ్రూప్ లో తప్ప వంటరిగా గురుప్రియ నాకు కనబడలేదు. కాని భాషా రానితనంతో నేను మందిలో దిగులుగా ఉన్నప్పుడు ఏవో కళ్ళు నన్ను పరిశీలిస్తున్నట్లు ఉండేవి. కొన్ని రోజులకు కనిపెట్టాను ఆ అందమైన కళ్ళు’ గురుప్రియ’ వని.
ఒక రోజు తన గ్రూపు ని వదిలి నా పక్కన చేరి ‘u are looking just like my mousie’ అని గుసగుసలాడింది. నేను నవ్వి ఊరుకొన్నాను. హాస్టల్ లో ఉండే అమ్మాయిలకు హోమ్ సిక్ నెస్ తో అందరూ ఇంట్లో వాళ్ళలాగా అనిపిస్తారని నాకు తెలుసు. కాని కాలక్రమేణా గురుప్రియ తన ఫ్రెండ్స్ గ్రూప్ లో వంటరి గా ఫీల్ అవుతుందని అర్ధం అయ్యింది. ఆమె నిర్మలమైన మనసు,మానసిక పరిణితి చూసి నేను అబ్బురపడ్డాను. ఎవరి నుండి ప్రత్యుపకారం ఆశించని దృక్పధం, అందరిని తేట తెల్లని మనసుతో పరికించే వైనం చూసి ఒక్కోసారి నేను మరుగుజ్జులాగా ఫీల్ అవుతాను. ఇసుమంత ఈర్ష, ద్వేషాలు ఈమెలో కనబడవు.
అన్నట్లు మా గురుప్రియ చక్కని డాన్సర్. పంజాబ్ సాంప్రదాయ జానపద నృత్యం ‘గిద్ద’ (గ్రామీణ పంజాబ్ స్రీల పనిపాటలను, కాలక్షేపాలను దృశ్యీకరిస్తుంది) లో దిట్ట. తల పక్కన చేతులు పెట్టుకొని రెండు కాళ్ళు వేగంగా కదిలిస్తుంటే ఆడిటోరియం చప్పట్లతో మారుమోగుతుంది.
హృదయాన్ని నేరుగా తాకే ఆపేక్షతో కూడిన నవ్వు ఈమె అందానికి వన్నె చేరుస్తుంది. నడకలో, నడతలో తొణికసలాడే హుందాతనం కనిపిస్తుంది. జీవిత భాగ స్వామిని ఎన్నుకోవటంలో ఆమె నిరాడంబరత, ప్రేమ వ్యవహారంలో ఆమె నిజాయితి నన్ను ఈ అమ్మాయికి అభిమానిని చేసేసాయి. ఇక మా అనుభంధం అంటారా! అది మాటలకు,వ్యక్తీకరణలకు అందనిది. అది ఒక చల్లని సాయంత్రం విహారం కావచ్చు, అమృత్ సర్ స్వర్ణదేవాలయ దర్శనం కావచ్చు, మండు వేసవిలో నా రూమ్ లో కాలక్షేపం కావచ్చు…. ఆమె సమక్షం, సాంగత్యం నాకు అమృతప్రాయం. నా చెవులును మూస్తూ దుప్పటి కప్పే ఆమె కరుణే ఆనందం. ఇతరులకై కనుజారే ఆమె కన్నీరే ఆనందమానందం.