ట్యాగులు

81745-delhi

నేను చండీఘర్ వచ్చిన కొత్తల్లో జరిగిన సంఘటన ఇది. ఇక్కడ పి.హెచ్.డి చేస్తున్న ఒక అమ్మాయి హఠాత్తుగా ఆంధ్ర వెళ్ళాల్సి వచ్చింది. ఆమె ఒంటరిగా ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. పైగా చండిఘర్ నుండి రైలు ఢిల్లీ స్టేషన్ కి వెళుతుంది. అక్కడ నుండి నిజాముద్దీన్ స్టేషన్ కి వెళ్ళి ఆంధ్రాకు ట్రైన్ పట్టుకోవాలి.

వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ‘మీరు ఢిల్లి వరకు అమ్మాయిని దించగలరా’ అని అడిగారు. మనకు భాష రాదు అని బెరుకు ఉన్నా గుండెధైర్యం ఎక్కువ కదా. ‘సరే’ అని భరోస ఇచ్చేసాను.

ఢిల్లీ వరకు మా ప్రయాణం సరదాగా నడిచింది. ఢిల్లి నుండి నిజాముద్దీన్ కి ఆటో రేట్లు నెట్ లో చూసి పెట్టుకొన్నాము. మోసపోకూడదు అని ముందుగానే నిర్ణయం తీసుకొన్నాము.


ఢిల్లీ స్టేషన్ బయటకు రాగానే ఆటో వాళ్ళు మమ్మల్ని ముట్టడించేసారు. నాతో ఉన్న అమ్మాయికి హింది వచ్చు. వాళ్ళు చెబుతున్న రేట్లుకు మా నెట్ రేట్లకు పొంతన లేదు.

అప్పుడు నేను ‘మనం బస్ లో పోదాము’ అని ప్రకటించేసాను. బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందో కూడ నేను నెట్ లో చూసి ఉన్నాను. బస్ స్టాప్ కి వెళ్ళి నిలుచున్న తరువాత గర్వంగా ఆ అమ్మాయిని చూసి “నేను లేకపోతే నీకు చాలా ఇబ్బంది అయ్యేది కదా?” అన్న నా ప్రశ్నకు ఆమె చూసిన చూపుకి అర్ధం నాకు అప్పుడు బోధపడలేదు.

చాలా మందిని అడిగి నిజాముద్దీన్ వెళ్ళే బస్ ఎక్కాము. ‘అది స్టేషన్ దాక వెళ్ళదు. ముందే ఒక స్టాప్ లో దిగి కొంత నడవాలి ‘ అని చెప్పారు. దారిలో నేను వీలైనంత వరకు స్టేషన్స్ గుర్తు పెట్టుకొన్నాను. వాపసులో నేను ఒక్కదాన్నే మళ్ళీ డిల్లి స్టేషన్ కి రావాలి కదా.

మొత్తానికి బస్ లో వాళ్ళను అందర్ని వేధించి మేము దిగాల్సిన స్టాప్ లో దిగాము. ఒక రిక్షావాలా మా దగ్గరకు వచ్చి మేము ఎక్కడ వెళ్ళాలో చెప్పకుండానే ‘ఇరవై రూపాయలు ఇవ్వండి. నిజాముద్దీన్ స్టేషన్ కి తీసుకొని వెళతాను ‘ అన్నాడు.

స్టేషన్ చాలా దగ్గరని విన్నాము కదా. ‘వద్దు వద్దు’ అని నడవటం మొదలు పెట్టాము.’పది రూపాయలు ఇవ్వండి మేం జీ’ అని వెంట బడ్డాడు.

అతను నుండి తప్పించుకోని మేము వేగంగా నడిచాము. అతను వెనుక నుండి ఏదో అరుస్తున్నా పట్టించుకోలేదు. ఎంత నడిచినా స్టేషన్ రాదే! మధ్య మధ్యలో అడుగుతుంటే దారి చెబుతున్నారు. అరగంట ఎర్రటి ఎండలో నడిచి ఎట్టకేలకు నిజాముద్దీన్ స్టేషన్ చేరాము.

రిక్షావాలాని తప్పించుకొనే ప్రయత్నంలో మేము తప్పు మలుపు తిరిగామని, అతను అరిచి చెబుతున్నా మేము పట్టించుకోలేదని ఇద్దరికి అర్ధం అయినా అర్ధం కానట్లు మేకపోతు గాంభీర్యం వహించాము.


ఆమె ట్రైన్ లేట్ అయ్యింది. తనను సీట్లో కూర్చోబెట్టి, వాళ్ళ నాన్న గారికి ఇచ్చిన మాటను నిలుపుకొన్న సంతోషంతో నేను బయట పడ్డాను.

ఇక బస్ ప్రయోగాలకి టైమ్ లేదు. ప్రీ పైడ్ ఆటో స్టాండ్ కి వెళ్ళి డబ్బులు కట్టి ఆటో ఎక్కాను ఢిల్లి స్టేషన్ కి. దారిలో నేను చూసిన భవనాలు ఏవీ కనబడటం లేదు. నాలో పిరికితనం మొదలైంది. ఆటో అతను కొన్ని ప్రశ్నలు వేయ సాగాడు.’ చాకచక్యంగా’ హిందింగ్లీష్ సమాధానాలు చెబుతూ అన్యమనస్కంగానే ఉన్నాను.

చాలా సేపటి తరువాత ఢిల్లీ స్టేషన్ కనబడింది. గుండెల మీద రాయి తొలిగింది. దిగంగానే ఆటో డ్రైవర్ ‘మేమ్ జీ పచ్హీస్’ అని అడిగాడు.

నాకు హింది కొంత అర్ధం అవుతుంది కాని అంకెలు తెలియవు. అప్పుడప్పుడే వాటిని బట్టీ పట్టి నేర్చుకొంటున్నాను. అతను యాభై రూపాయలు అదనంగా అడుగుతున్నాడని అర్ధం అయ్యింది. నై నై అంటూ వెళ్ళ సాగాను. అతను ఏదో అరుస్తూ నా వెంటే పడ్డాడు. కొద్ది సేపటికి ఆటో వాళ్ళంత నా చుట్టు ముట్టేసారు.

అతను వాళ్ళకు ఏదో చెప్పాడు, వాళ్ళు నన్ను ఏదో అంటున్నారు. నేను బేంబేలెత్తి పోయాను. ప్రీపైడ్ టాక్సీ స్టాండ్ లో దూరిపోయి, ఆ పోలిస్ ఆఫీసర్ కు ఇంగ్లీష్ లో నా పరిస్తితి వివరించాను. ఈ లోపు ఆటో డ్రైవర్స్ అందరు లోపలికి వచ్చేసారు. ఆ పోలిస్ ఆఫీసర్ వాళ్ళను మందలించాడు.

హఠాత్తుగా ఆటో డ్రైవర్ మొహం లోకి చూసిన నేను అతని కళ్ళల్లో నీళ్ళను చూసి ఆశ్చర్యపోయాను. “ముఝకో బాల్ బచ్చే హై. మై క్యోం ఏ మేమ్ కో సతాతా హూం. మేంజీ ముఝకో పచ్చీ నహి దియా” అన్నాడు.

విషయం పోలీస్ ఆఫీసర్ చెప్పకుండానే అర్ధం అయ్యింది. నేను కట్టిన ప్రీపైడ్ ఆటో రసీదు ఇవ్వలేదు. అది ఇస్తేనే అతనికి డబ్బులు వస్తాయి. ‘పచ్చి ‘ అంటే రసీదు. దాని కోసమే అతను నా వెంట పడ్డాడు.

నా కళ్ళు భూమిలో కూరుకుపోయాయి. మనసు అధఃపాతాళానికి కుంగిపోయింది. “ముఝ్ కో మాఫ్ కర్ దో భయ్యా” అని అతని చేతులు పట్టుకొన్నాను. నిజానికి నాకతని కాళ్ళు పట్టుకోవలని ఉండింది. ఆటోడ్రైవర్లంతా “రహన్ దో బహెన్ జీ” అంటూ సర్ధి చెప్పారు.

మర మనిషి లాగా వచ్చి రైలు ఎక్కాను. బాగా ఏడవాలనిపించింది. ఆ ఏడుపు ఆటో డ్రైవర్ కోసం కాదు.

పనిపాటలు చేసుకొనే వాళ్ళంతా మోసాలు చేస్తారనుకొనే నా అల్పత్వానికి సిగ్గుపడుతూ ఏడవాలనిపించింది.

కష్టజీవుల కోసం పాటలు పాడి, ధర్నాలు చేసిన నేను; సారంలో నా మధ్యతరగతి దృక్కోణాన్ని వదలేక పోయానని తెలిసి ఏడవాలనిపించింది.

నేను చదివిన పెట్టుబడి పరిచయాలు, మావో రచనలు నన్ను పడక కుర్చీ మేధావిగానే మిగిల్చాయన్న చేదు నిజం అవగతం అయ్యి ఏడవాలనిపించింది