ట్యాగులు

,

1098

అమృత్ సర్ లో మా బస్ ప్రవేశించగానే నేను మొదట చూడాలనుకొన్నది జలియన్ వాలా బాగ్. స్వర్ణ దేవాలయం కూడ ప్రముఖమైనదే. రెండు నరమేధాలకు సాక్షీ భూతాలుగా రెండు ఎదురెదురుగా నిల్చొని వున్నాయి. ముందు లంగరుకి వెళ్ళాము. సిక్కులు అతిధులను చాలా గౌరవిస్తారు. చెప్పుల కౌంటర్ లో, వంట దగ్గర, వడ్డింపుల దగ్గర, ఎంగిలి కంచాలు కడిగే దగ్గర అందరూ భక్తులే. నేను తిన్న ఎంగిలి కంచం తీసుకొని ఒక ముసలి సిక్కు నాకు నమస్కరించాడు. ఏమి చేయాలో తెలియక నేనూ ఎంగిలి చేత్తో నమస్కరించాను.

చెప్పులు స్టాండ్ దగ్గర, తిరిగి ఇచ్చే చెప్పులను కొందరు స్త్రీలు వాళ్ళ చున్నీలతో తుడిచి ఇస్తున్నారు. స్వర్ణదేవాలయం ఆవరణలోకి వెళ్ళి నేను సరస్సు వడ్డున కూర్చొన్నాను. మా క్లాస్మేట్స్ గురుద్వారలోకి వెళ్ళారు. నాకు తోడుగా గురుప్రియ ఉండిపోయింది. బంగారు తాపడం చేసిన గురుద్వార ప్రతిబింబం సరస్సు నీటిలో ప్రతిబింబిస్తుంది. వేల భక్తులు తిరుగుతున్నా ఎక్కడ ధ్వనులు పెద్దగా వినబడటం లేదు. దూరంగా క్యూలో భక్తులు, కవాతు చేస్తున్న సైనికుల లాగా స్లో మోషన్ లో కదులుతున్నారు. అప్పటికే రెండు సార్లు నా తల మీద ముసుగు జారిపోవడం ….. మహిళా భక్తులు వచ్చి, స్నేహపూర్వకంగానే సరి చేసి వెళ్ళటం జరిగింది.

గురుద్వారా చుట్టూ వున్న కట్టడాలను చూసాను. ఎటువైపు నుండి కాల్పులు జరిగి ఉంటాయి? వందమంది సిక్కు తీవ్రవాదుల మీద, వెయ్యిమంది సైనికులు గ్రేనేడ్స్ తో, టాంకర్స్ తో అటాక్ చేసిన కిరాతకానికి తెర ఎక్కడ లేచి ఉంటుంది? దేశభక్తులు, శాంతి కాముకులు, శాంత స్వభావులు అయిన సిక్కులు ఆయుధాలు పట్టడానికి ప్రేరేపించిన రాజకీయాలు ఎంత క్రూరమై ఉంటాయి? వందల సంవత్సరాలు అన్ని మతాలతో సహజీవనం చేసిన సిక్కు మతం ఆగ్రహాన్ని పాలకులు సకల ప్రజల వైపు చూపించి ఆడిన కుటిల నాటకం ఖరీదెంత? పదిహేను వందల అమాయక సిక్కుల ప్రాణాలు. స్వేచ్చ వాయువుల కోసం జలియన్ వాలా బాగ్ లో గుమికూడిన ప్రజలను హతమార్చిన బ్రిటీషు వాడికి, మత ప్రార్ధనల కోసం దేవాలయానికి వచ్చిన అమాయక భక్తులను అంతం చేసిన ప్రజాస్వామిక, లౌకిక ప్రభుత్వానికి తేడా ఎంత? బహుశ డయ్యర్ ని చంపిన ఉద్దాం సింగ్ ని దేశభక్తుడిగాను, ఇందిరాగాంధిన చంపిన సత్వంత్ సింగ్ దేశ ద్రోహి గాను చిత్రీకరించినంత.

మెల్లిగా లేచి నడవడం మొదలు పెట్టాము. బహుశ ఈ కారిడర్ మీదనే తన తోటి సిక్కుని కాల్చి, శవాన్ని మోసుకెళుతున్న సైనికుడు రోదించి ఉంటాడు. ఇక్కడ నివాసముంటున్న ఖల్సాల అన్నం పళ్ళాలలో బుల్లెట్ గాయాలు ఉండే ఉంటాయి. మతమే బలం అనుకొనే సమూహాల నమ్మకాల మీద వీరు చేసిన గాయాలు ఇక్కడా, తరువాత బాబ్రీలో ఇంకా స్రవిస్తూనే ఉన్నాయి.

“పైన సిక్కుల మ్యూజియం ఉంది, వెళదామా?” అంది గురుప్రియ. మ్యూజియంలో సిక్కు మతం ప్రారంభం నుండి అమరులైన వారి చిత్రపటాలు ఉన్నాయి. చూస్తూ ఒక గదిలోకి వెళ్ళగానే అక్కడనుండి ఫొటోలు కనిపించాయి. స్వర్ణదేవాలయం దాడి లో మరణించిన వారి ఫొటోలు. పక్క గదిలో ఇందిరాగాంధి మరణం తరువాత జరిగిన మారణకాండలో మరణించిన వారు. ఇందిరాగాంధి చితి మంటల వెలుగుల్లో కనబడిన రాజీవ్ గాంధి కళ్ళ కసి…గుట్టలు గుట్టలు శవాలుగా… విలపిస్తున్న తల్లుల అవిసిపోయిన గుండెలుగా… అన్నల, తమ్ముళ్ళ, తండ్రుల శవాల వద్ద నిలబడిన యువకుల మౌనపు రక్తపు మరిగింపుగా….. కనిపిస్తుందక్కడ నాకు.

నా చెయ్యి పట్టుకొన్న గురుప్రియ వైపు తెరిపార చూసాను. “బహుశ మీ పెద్దలు అవమానాన్ని దిగమింగి, దుర్మార్గాన్నిభరించి తలవంచి….పిచ్చి తల్లి నీకీ అశాంతిలేని జీవితాన్ని ప్రసాదించి ఉంటారు. నీ నిష్కల్మషమైన, స్వచ్చమైన,  ప్రశాంతమైన నవ్వుకోసం వారు చెల్లించిన మూల్యం వెల లేనిది” గొణిగాను.