ట్యాగులు

a265b-chandigarh
ఇంక రెండు రోజుల్లో ఈ గది, ఈ తోటలు, ఈ ఊరు వదలబోతున్నాను. బహుశ ఇంకొక్కసారి వస్తానేమో ఇక్కడికి థీసిస్ వైవాకి.
రెండు సంవత్సరాలు నేను ఎక్కువగా గడిపిన నా రైటింగ్ చైర్ చూస్తుంటే దిగులు వేసింది. ఈ కుర్చీ ని నేను మిస్ కాబోతున్నానా? నవ్వు వచ్చింది.

నలభై ఐదేళ్ళ రిలాక్సడ్ జీవితాన్ని వదిలి ఈ కుర్చీ జైలులో నాకు నేను శిక్ష వేసుకొని, నేను గడిపిన నిద్ర లేని రోజులు గుర్తుకు వచ్చాయి. 
డిశంబర్ మాసంలో నేను వణికింది చలికా? పరీక్షల భయానికా? అచ్చూ ఇలాంటి ఇంకో కుర్చీ లో క్లాసులో కూర్చొని పాఠాలు అర్ధం కాక, టీచర్స్ కి నా ఖాళీ మొహం చూపించలేక యాతన పడ్డ ఇంకో టీచర్ ని నేను.
ఖాళీ మొహం, ఖాళీ మైండ్ తో అయోమయంగా దిక్కులు చూసిన దారి తప్పిన పక్షిని అప్పుడు నేను. క్లాస్ అయిపోగానే తోటి విద్యార్ధులు కోలాహంగా కేకలు పెడుతుంటే నేను పరుగులు పెడుతూ రూముకి వచ్చి ఈ కుర్చీలోనే కదూ ఓదార్పు పొందింది!
చెప్పిన పాఠాలు బుర్రకు అందక, అందినవి గుర్తుకు రాక, గుర్తుకు వచ్చినవి పరీక్షలో రీ ప్రొడ్యూస్ చేయలేక, రీ ప్రొడ్యూస్ చేయగలిగినా రాయగలిగేంత శక్తి మిగలకా పేపర్ ను విసిరి కొట్టి బయటకు పారి పోదామనే కోర్కెను బలవంతంగా చంపుకొని ఆ హాలు కిటీకీలోనుండి చూసినపుడు నన్ను ఓదార్చింది ఎవరు? ఆ మోదుగుపూల చెట్టు కదూ! భారీగా నిల్చొని నాకు భరోసా ఇచ్చింది!
ఎలా బయట పడ్డాను ఆ దీనస్థితి నుండి? నన్ను ప్రేమించిన ఈ చిన్ని తల్లులు, బంగారు తండ్రులు కదూ నా రూము కొచ్చి నాకు లెక్కలు, ఇమేజ్ ప్రోససింగ్, డిజిటల్ కమ్యూనికేషన్, మొబైల్ కమ్యూనికేషన్ నా ముడుచుకొని పోయిన మెదడును తెరిచి కుక్కి, అవన్నీ నాకు సరళం చేసి, వారెక్కే నిచ్చనకు నాకూ చేతులు అందించి పైకి లాగింది!
ఆయనెవరూ? డిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ రాయ్ కదూ వీడియో క్లాసులలో నాకు డిజిటల్ సిగ్నల్ ప్రాససింగ్ భోదించి సులభతరం చేసింది! అదిగో ఆ టేబుల్ క్రింద నేను గుర్తు ఉంచుకోవటానికి రాసిన నోటు పుస్తకాల దొంతరలు, నా జ్ఞాపకశక్తికి పదును పెట్టిన ఆయుధాలు.
ఇక్కడ జీవితం నాకు సుందరం, సులభతరం అవటం ఎప్పుడు మొదలయ్యింది?
అక్టోబర్ మాసంలో ప్రకృతి అంతా ఆవహించిన చల్లదనం నా వంటిని తాకి స్వాంతన పరిచినప్పుడా?
నవంబర్ నెలలో బంతులు, చేమంతులు, గులాబీలు తోటంతా విరగపూసి సమ్మోహన పరిచినపుడా?
రకరకాల పక్షులు వాటి కూతలతో నాకు పరిచయం అయినపుడా?
సుఖనాలేక్ దారిలో నా వంటరి నడకకు నీడ నిచ్చిన కమ్ముకొన్న వృక్షాలతో నా సంభాషణ తరువాతా?
నా భాష రాని, నా భావం పట్టుకోలేని ఒక ఎలెక్ట్రీషియన్ హరవిందర్ దయతో నాకు చేసిన సహాయాల తరువాతా?
నేనిచ్చిన వంద రూపాయల టిప్పుకు రోజుకి నాలుగుసార్లు నాకు విష్ చేసే హిమాచల్ పేద మెస్ పిల్లాడు హంసరాజ్ తో స్నేహం చేసిన తరువాతా?
ఏడవ సెక్టారులో నన్ను చూసి తలపంకించే సన్నటి దర్జీ, పాల షాపు ముసలి యజమాని, బండ కళ్ళద్దాల నుండి తొంగి చూసే మందులషాపు భయ్యా… వీళ్ళందరూ కరుణతో నను ఆదరించినపుడా?
ఎప్పుడో గుర్తు లేదు.
ఈ చండీఘర్ నా జీవితంలో చెరగని ముద్ర వేసి, ఇప్పుడీ వీడ్కోలు పరితాపానికి గురి చేస్తుంది.