ట్యాగులు

7639e-tuukam
ఒంగోల్లో పినాకిని దిగి బయటకు వచ్చాను. ఆటో కోసం దిక్కులు చూస్తున్నాను. ఒక ఆటో డ్రైవర్ దగ్గరగా వచ్చి, కళ్ళల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పలకరింపుగా నవ్వాడు. ఎక్కడో చూసినట్లు అనిపించి నేనూ నవ్వాను.
ఒంగోల్లో చాలా కాలం నివసించటం , ఎంతో కొంత జనంతో సంబంధం ఉండటం వలన చాలా మంది తెలిసిన వాళ్ళే ఉంటారు. కానీ ఆ నవ్వు అంతకు మించిన అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నట్లు అనిపించినా పట్టించుకోకుండా “రామనగర్ వస్తావా” అని అడిగాను.
అతని ముఖం వివర్ణం అవటం గమనించాను. తల ఊపి ఆటో దగ్గరకు నడిచాడు. నేనేదో తప్పు చేస్తున్నానని నా సృహకందింది.

ఆటో ఎక్కేటప్పుడు “ నన్ను గుర్తు పట్టలేదా అక్కా ?” అని అడిగాడు. అప్పటి దాకా నా మైండ్ శరవేగంతో పని చేస్తూనే ఉంది. మెదడు పొరల నుండి అతనిని రీకలెక్ట్ చేసుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాను.ఎంతో కొంత విచక్షణా జ్ణానం, అదృస్యం గా పని చేసి “ఎంత తీసుకొంటావు” అని అడగలేదు. అప్పుడు ఏదో గుర్తుకొచ్చినట్లు అనిపించి…
“మీది మద్దులూరు కదా” అని అడిగాను మనసులో టాస్ వేసుకొంటూ. అతను కొద్దిగా సంతోషంగా ముఖం పెట్టి నవ్వాడు. “హమ్మయ్య “ అనుకొన్నాను.
ఆటో ఒంగోలు రోడ్ల మీద నడుస్తోంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మధ్య కొన్ని సంవత్యరాలు ఒంగోలుకు దూరంగా ఉండి, మనుష్యులను కూడా మర్చిపోవటం క్షమించరాని నేరం. దానికి కారణం నా లోకం మారటమా, లేక నా మతిమరుపా అనే మీమాంస లో ఉన్నాను.

“అక్కా! నేను ప్రెసిడెంట్ వెంకట్రావుని“ హఠాత్తుగా అన్నాడు.
ఉలిక్కి పడ్డాను. వెంకట్రావ్! మద్దులూర్ ప్రెసిడెంట్! నేను మద్దులూరు ఎన్ని సార్లు వెళ్ళలేదూ! వాళ్ళింట్లో అన్నం తిన్నాను కూడా.
తెల్లని బట్టల్లో, తెచ్చిపెట్టుకొన్నదే అయినా హుందాతనంతో ఉండే వెంకట్రావు వెంటనే నా బుర్రకు తగిలాడు. మద్దులూరులో జరిగే మా మహిళా సంఘం మీటింగ్ కి ఎప్పుడూ ఇష్టంగా సహకరించేవాడు.
మరి ఇదేంటి ? ఈ ఆటో ? నల్లబడి, చిక్కి పోయిన ఈ రూపం? నలిగి పోయిన వేషం ?“
ఏమయ్యింది వెంకట్రావ్?” అని అడుగుతుండగానే ఇంకో విషయం గుర్తుకు వచ్చింది. అతని పదవీ కాలంలోనే వేరొక మహిళతో సంబంధం ఏర్పడిందని మద్దులూరు వాళ్ళు చెప్పగా విన్నాను. అయినా ఈ మార్పు నా ఊహకందనిది.
“మీ పొలాలు, ఆస్తులు ఏయమయ్యాయి ? నువ్వేమిటి ఇలా?”

“నీకు తెలియదేమో అక్క. నేను ఒకామెను ప్రేమించాను. అన్ని వదులుకొని ఒంగోలు వచ్చాను.” అన్నాడు.
“మరి నీ భార్యా, పిల్లలు?” అడగకుండా ఉండలేకపోయాను, వ్యర్ధమైన ప్రశ్న అని తెలిసినా.
“ఆస్తి అంత ఆమెకే వదిలేశాను. నేను ఆటో వేస్తున్నాను.” చెప్పాడు.
కొద్దిగా ఆగి “మేనకోడలని నాకు ఇచ్చి చేశారు. నాకు మొదలు నుండి ఇష్టం లేదక్క.” వివరణ ఇస్తున్నట్లుగా చెప్పాడు.
వాళ్ళ ఇష్టాలు ఇంకా ఏర్పడక ముందే , ఇరవై లోపలే జరిగే పెళ్ళిళ్ళలో ముందే ఎందుకు ఆ విషయం పెద్దలకి చెప్పలేదనే ప్రశ్న అర్ధాన్ని కోల్పోతుందని తెలుసు. అందుకే అడగలేదు.

“మరి మద్దులూర్ లో మీ ఆవిడ వ్యవసాయం చేసుకోగలుగుతుందా? “ అని మాత్రం అడగగలిగాను.
“ఆమె ఆ పొలాన్ని ముట్టుకోలేదక్క. హోటల్ పెట్టుకొని పిల్లల్ని సాకుతుంది.“ నిర్వికారంగా చెప్పాడు.
“మరి ఈ సంబంధానికి…?” అర్ధోక్తిలో ఆగాను.
నా భావం అర్ధం అయినట్లుగా, “ఇద్దరు పిల్లలు “ నా ప్రశ్న పూర్తి కాకుండానే చెప్పాడు.

ఆటో ఇంటి దగ్గర ఆగిన తరువాత , “ఇంట్లోకి రా వెంకట్రావ్ “ పిలిచాను. “లేదక్క. స్టేషన్ లో లైన్ పోతుంది. నిన్ను చూసి సంతోషంగా అనిపించింది. మాట్లాడాలనిపించి ఇక్కడి దాకా వచ్చాను.“ అన్నాడు.

ఇంట్లొకి వచ్చి పాలు కాస్తున్నాను.
ప్రేమ కోసం సర్వస్వం వదులుకొని పేదరికాన్ని వరించిన వెంకట్రావ్…!
ఆత్మ గౌరవంతో, రెక్కల సాయంతో బిడ్డలను సాక్కొంటున్న ఆయన భార్య…!
….మనసంతా గందరగోళంగా ఉంది.
మరి తండ్రి ప్రేమకు దూరమై, పేదరికంలో బ్రతుకుతున్న పిల్లలు? చేతి మీద పాలు పడి చెయ్యి చురుక్కుమని సృహ లోకి వచ్చాను.