ట్యాగులు

12

 

 

తాజ్ మహల్ చూసిన తరువాత తిరుగు ప్రయాణంలో ‘మధుర’ కూడ ఉంది మా టూర్ లో. అప్పటి దాక మాతో ఉన్న గైడ్ దిగిపోయాడు బస్సు నుండి. సన్నగా, రివటలాగా ఉండి, మధ్య మధ్యలో సిగెరెట్ పీలుస్తూ, ఎంతో భావుకత్వంతో అతను మాకు తాజ్ మహల్ , ఆగ్రా ఫోర్టుల గురించి వర్ణించాడు. “ఆగ్రాకోట; భవనాల రూపంలో ఉన్న ఇరాక్, కుర్సాన్ మొదలైన పట్టణాలు” అంటూ జహంగీర్ పలుకులను అతను ఉటంకించటం నేను మర్చిపోలేను. మధుర పట్టణం, ఆగ్రానుండి ఢిల్లీకి వచ్చే దారిలో కొంత డైవర్షన్ లో వస్తుంది. పట్టణంలోకి ప్రవేశించగానే, ఇంకో గైడ్ బస్సు ఎక్కాడు. తెల్లగా, స్పురద్రూపంతో, చురుకైన కళ్ళతో ఉన్నాడు. వెనుక చిన్న పిలక ఉన్నప్పటికి ఆధునికంగానే ఉన్నాడు. ఇంగ్లీష్ మంచి ఉఛ్ఛారణతో మాట్లాడుతున్నాడు. మధుర గుడిలో టెంపుల్ బ్రాహ్మీన్స్ ని మాత్రమే గైడ్స్ గా అనుమతిస్తారని, తనకు లైసెన్స్ ఉందని చెప్పాడు. మధురగుడిలో ఎవరూ షాపింగ్ చేయవద్దని, చాలా మోసాలు ఉంటాయని కూడ అన్నాడు. సన్నని ఇరుకైన, మురికి దారుల వెంట మమ్మల్ని చాలా దూరం నడిపించి గుడిలోకి తీసుకొని వెళ్ళాడు. ఆ గుడుల్లో ఉన్న వన్నీ ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో చేసిన విగ్రహాలే. అవన్నీ ఇటీవల కాలంవి అని అర్ధం అయిపోయింది.
శ్రీకృష్ణుడు పుట్టిన కారాగారం అంటూ ఒక ప్రదేశాన్ని చూపించాడు. భారతం జరిగినదని చెప్ప బడుతున్న కాలానికి, ఆయన చూపించిన ప్రదేశానికి సంబంధమే లేదు. అయినా నేను ఆశగా ఏమైన చారిత్రిక ఆధారాలు దొరుకుతాయేమోనని వెతికాను.
పక్కనే ఉన్న ఇంకో పెద్ద దేవాలయం మిలటిరీ పహారతో కనిపించింది. అది అసలైన కృష్ణుడి గుడి అని, ‘టెర్రరిష్టుల’ భయంతో దానిని మూసివేసారని, దానికి పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ ఉన్నదని చెప్పాడు. మధుర చాలా చరిత్ర కలిగిన పురాతన పట్టణం అని, దాన్ని జైనులు, హిందువులు, ముస్లిములు పాలించారని, భౌద్ధమతం కూడ అక్కడ వ్యాప్తి చెందినదని నేను చదివాను. అతను గుడులు తప్ప ఇంక దేని గురించి మాట్లాడటం లేదు. ఇంకా ముస్లిములు మన దేవాలయాలను సర్వ నాశనం చేసారని చెబుతున్నాడు. నాతో వచ్చిన స్నేహితురాలు పరమ భక్తురాలు. నా వైపు కోపంగా చూసింది, దీనికేమి సమాధానం చెబుతావు అన్నట్లు. “వాళ్ళు బంగారం, డబ్బు దొరుకుతుందని గుడులను తవ్వారులే, అప్పట్లో ప్రజల నుండి దోచిన సంపదంతా దేవాలయాల్లో నిక్షప్తం అయి ఉండేది. అది శ్రమ చేసిన పేద ప్రజల సొత్తు. దోచుకొన్నవాళ్ళకు దోచుకొన్నంత” అని చెప్పాను.
అతనికి కూడ నేను నచ్చలేదని అర్ధం అయ్యింది. బస్సులో వచ్చిన వాళ్ళ చేత ఆయన భజనలు చేయిస్తున్నాడు. “శ్రీ కృష్ణ భగవాన్ కి జై” అనిపిస్తున్నాడు అక్కడక్కడ. నేను వాటికి దూరంగా ఉన్నాను.
చివరకు అందరం బస్సు ఎక్కాము. బస్సు ఇక మధుర దాటబోతుండంగా ” భక్తులు మీకు తోచినంత నాకు సహాయం చేయవచ్చు. నిర్భంధం ఏమి లేదు”. అన్నాడు. అందరు అతనికి డబ్బులు ఇస్తున్నారు. కొంతమంది అతనికి చిల్లర కూడ ఇవ్వటం చూసాను. నా దగ్గరకి వచ్చి ఆగాడు. అనుకోకుండ అతనితో కళ్ళు కలిసిన నాకు అప్పటి వరకు అతని మీద ఉన్న నా అసంతృప్తి పటాపంచలైంది. “ఇతను చదువుకొన్న నిరుద్యోగి. ఈ దేశ భవిష్యత్తుని దిశానిర్దేశం చేయాల్సిన యువతరం ప్రతినిధి. ఉత్పత్తిలో భాగస్వామ్యం ఇవ్వకుండా మన దేశం అనేకానేక రకాలుగా కోల్పోతున్న చైతన్య శక్తి. ఇతనికి మధుర దేవాలయం ఎవరో నాశనం చేసారని నిజంగా కోపం ఉందా? ఇక్కడ తీసుకొన్న చిల్లర తన పిల్లలకు పుస్తకాలకు సరిపోతుందా అని ఆలోచిస్తూ ఉండి ఉంటాడు. రేపు టూరిస్టులు రాకపోతే పరిస్థితి ఏమిటని ఆలోచిస్తుంటాడు.” అతన్ని చూసి స్నేహ పూరితంగా నవ్వాను.