ట్యాగులు

hangings

 

నిర్భయ మానభంగం, హత్య నేపధ్యంలో పెల్లుబుకిన ప్రజాగ్రహం అనేక నాణ్యమైన చర్చలకు, పరిణితి గలిగిన ఉద్యమాలకు పురుడు పోసింది. అత్యాచారాలకు సంబందించిన మూలాల మీద దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల నుండి మెరుగైన సాహిత్యం వచ్చింది. ఏళ్ళ తరబడి ఉచ్చరించటానికి వెసులుబాటు దొరకని, మాట్లాడుకోవటానికి అనుమతి దొరకని అత్యాచారాల అంతర్గత మూలాలు ఈ సంధర్భంగా గాలి పీల్చుకొని వెలుగు చూశాయి.

నిర్భయ కేసులో ఉరి శిక్షల తీర్పు దరిమిలా ఒక వర్గం నుండి ప్రతిస్పందనలు ఉరికి అనుకూలంగా వచ్చినా వివేకం కలిగిన వ్యక్తులు, సమూహాలు ఈ ఉరి శిక్షలను ఆమోదించక పోవటం కొంత ఊరట కలిగించింది. బాలగోపాల్ గారు ఇరవై సంవత్సరాల క్రితం ఉరిశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేబట్టినపుడు వచ్చిన వ్యతిరేకత ఇప్పుడు అంత వ్యవస్థీకృతంగా కనబడక పోవటం గమనించదగిన విషయం. సాపేక్షికంగానైనా మారిన సామాజిక ఆలోచనాధోరణి కొత్త దిశలవైపు చూపు సాచుతుంది. అయితే మెదడును అటువైపు తెరిచిపెట్టటానికి సంసిద్ధత ఉండాలి. భావోద్వేగాలు, ఆవేశకావేశాలు తరచుగా అందుకు ఆటంకాలు అవుతుంటాయి.

రాక్షస అకృత్యానికి బలై, నిస్సహాయంగా రాజధానిలోనే ఓ రహదారి నడిబొడ్డున సహాయం కోసం అల్లాడిన నిర్భయ కోసం నాడు యావత్భారతం కన్నీరు పెట్టింది. ఈ ఉదంతాన్ని ఒక ఒంటరి సంఘటనగా చూసి కదిలి పోయిన వారు పరిష్కారం కంటే ప్రతిచర్య ఎక్కువ కోరుకున్నారు. అందువల్ల అది కసితో కూడుకుని ఉంది. అయితే ఈ ఘటనను దేశంలో అనేక యేళ్ళుగా స్త్రీలపై జరుగుతున్న పాశవిక లైంగిక దమనకాండకు కొనసాగింపుగా చూస్తూ, ఒక కడపటి దశ కోసం పరిష్కారాలు వెతుకుతున్నవారి కనుచూపు మాత్రం నలువైపులా పరికిస్తుంది. శాశ్వత పరిష్కారాల కోసం అన్వేషిస్తుంది. ఈ వర్గం ఈ సంఘటనకు కరుణ, సానుభూతులకు అతీతంగా ఒక నిస్పాక్షిక దృష్టితో హేతుబద్దమైన ప్రయత్నం చేస్తుంది.

నిజానికి, నిర్భయ లాంటి ఉదంతం మన దేశానికి కొత్త కాదు. ఈ ఘటనకు వచ్చిన ప్రజా స్పందన ఖచ్చితంగా ఆహ్వానింపదగ్గదే. కానీ తాత్కాలిక ఆగ్రహావేశాలు, ప్రతీకార కాంక్షలు హేతుబద్ధమైన చూపుని మసక బారుస్తాయి. ఉరికి భయపడి ఇటువంటి నేరాలు తగ్గవని పశ్చిమ బెంగాల్ లో ధనుంజయ ఘటన తిరుగు లేకుండా రుజువు చేసింది. బాధితురాలి కుటుంబం, బాధితురాలి తరఫున గొంతెత్తిన వారి క్రోధావేశాలు చల్లారటానికే ఉరిశిక్ష అనుకొంటే, ఈ శిక్షలను అనుమతించటం వలన జరగబోయే పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. అత్యాచారం జరిగాక హత్య జరిగితే ఐ.పి.సి సెక్షన్ 302 కింద మరణ శిక్ష అందుబాటులో ఉంది. అయితే అత్యాచార నేరానికి (సెక్షన్ 376 కింద దోషిగా రుజువయిన వ్యక్తికి) ఉరిశిక్షలు ఉండాలా లేదా అనే దగ్గరే చర్చ వస్తోంది. జస్టిస్ వర్మ కమిషన్ కూడా ఈ విషయంలో లోతైన విచికిత్స జరిపింది. శిక్షా భయం వలన అత్యాచారాల తరువాత హత్యలు కూడా జరుగుతాయని మహిళా సంఘాలు వెలిబుచ్చుతున్న అభిప్రాయాన్ని పరిగణించి మరణ శిక్షను తిరస్కరించింది.

ధనం, పరపతి, ఆధిపత్యం, కులం దందా చేస్తున్న ఈ సమాజంలో ఎలాంటి శిక్షలైనా బలహీన వర్గాలపైనే మొదట ఎక్కు పెట్టబడతాయనేది ఎల్లరెరిగిన సత్యం. ఆలా కాదు అనుకొంటే మన పార్లమెంట్ లో కూర్చొని వున్న ముప్ఫై నలుగురు అత్యాచార ఆరోపితులను విచారించి శిక్షించగలగాలి. అలాగే దేశంలో వివిధ చట్ట సభల్లో ఉన్న ఆరొందల చిల్లర అత్యాచార నిందితుల మీద విచారణ జరపగలగాలి. ఇప్పుడున్న వ్యవస్థ ఈ పని చేయగలదా? ఆవేశపరులు, ప్రతీకారేచ్ఛపరులు ఈ సంగతి ఆలోచించాలి.

భారత దేశం లో సగటున ప్రతి ఐదుగురి మగాళ్ళలో ఒకరు అత్యాచారమో, అత్యాచార ప్రయత్నమో చేశారని లెక్కలు చెబుతున్నాయి. సామాజిక శాస్త్రవేత్తలు కూడా దీనిని ధ్రువపరుస్తున్నారు. భారతదేశ కుటుంబాలలో ఉన్న ఫ్యూడల్ సంబంధాలు ‘స్త్రీలు బలహీనులు’ అని పసి మనసుల నుండే నూరి పోస్తున్నాయి. అత్యాచార మూలాలు కుటుంబంలో కరడు కట్టిన శిలలైన పురుషాధిక్యత, లింగ వివక్షల్లో ఉన్నాయి. ఈ వివక్షలకు పునాదులు ఫ్యూడల్, పెట్టుబడిదారీ సంబంధాల్లో ఉన్నాయి. ఈ పరిస్ధితుల్లో అసమాన, అప్రజాస్వామిక పెంపకాలు ఒకవైపు ఆడపిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తుంటే, మరోవైపు మగపిల్లల ఆరోగ్యకరమైన అవగాహనను, మానసిక ఎదుగుదలను నివారిస్తున్నాయి. ఇంట్లో స్త్రీల అణచివేతకు ప్రత్యక్ష సాక్షి అయిన పిల్లాడు బయట కొంత వెసులుబాటుతో తిరిగే స్త్రీ పట్ల చులకన భావం పెంచుకొంటున్నాడు. ఇది ఈవ్ టీజింగ్ తో మొదలై లైంగిక వేధింపులు నుండి అత్యాచారాల వరకు విస్తరిస్తోంది. దేశంలోకి చొచ్చుకువచ్చిన విదేశీ విష సంస్కృతి ఈ మానసిక వైకల్యానికి ఊతం ఇచ్చి లైంగిక ఉన్మాదానికి బాటలు వేస్తున్నది.

దేశంలో నెలకొన్న ఆర్ధిక, సామాజిక స్ధితిగతులకు ప్రభుత్వాల నిర్లిప్తత తోడుగా ఉంటోంది. ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఆర్ధిక విధానాలు, చేస్తున్న చట్టాలు ప్రజలను మరింత పేదరికంలోకి, ఉపాధి లేమిలోకి నెట్టడం వలన అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రజల ఫైనాన్స్ వనరులు క్రమంగా విదేశీ కంపెనీలకు అప్పజెప్పే విధానాలు ఒక్కొక్కటీ వరుసగా పార్లమెంటులో చట్టాలుగా రూపొందుతున్నాయి. రిటైల్ ఎఫ్.డి.ఐ చట్టం, భీమా, బ్యాంకింగ్ రంగాల ప్రైవేటీకరణ మొదలైన సంస్కరణల చర్యలు ఒకపక్క పబ్లిక్ రంగ ఉద్యోగాలను హరించివేస్తూ మరోపక్క స్వయం ఉపాధి మార్గాలను కూడా మూసేస్తున్నాయి. దానితో ఎన్నో కుటుంబాలు వీధిపాలై సామాజిక సంక్షోభం ఆవిష్కృతం అవుతోంది. ఈ పరిస్ధితులు అనేకమంది యువతులు వ్యభిచార కూపంలోకి లాక్కెళ్తుంటే, యువకులు సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్తున్నారు. (నూతన ఆర్ధిక విధానాలు అమలు అయిన నాటి నుండి ఫ్లెష్ మార్కెట్, నేరప్రవుత్తి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.) మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నఇంకో విచారకరమైన సంగతేమిటంటే పట్టణాలలో పేదరికం వలన ఏకాంతం కరువైన ఇళ్ళళ్ళో తల్లితండ్రుల ఏకాంతం పిల్లల భావోద్వేగాల మీద ప్రభావం చూపుతోంది. బహిరంగ, బలవంత శృంగారానికి పునాదులు ఒక కోణంలో గృహాల నుండి కూడా పడుతున్నాయి. ఆదాయాల అసమాన పంపిణీ ఫలితంగా వృద్ధి చెందుతున్న దరిద్రం, పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలకు ఛాందస సంస్కృతీ విలువలు తోడై మహిళలపై అత్యాచారాలకు దారి తీస్తున్న సంగతి గుర్తించకపోతే అత్యాచార నేరాలకు సామాజిక పరిష్కారం బదులు ఎంతమాత్రం పరిష్కారం కాని ప్రతీకార పరిష్కారమే మిగులుతుంది.

సామాజిక రుగ్మతలకు కారణాలు వెదికి, మూలాలు పరిశీలించి, అవి రూపుమాపటానికి ఓపికగా వైద్యం చేసే చిత్తశుద్ది, సంసిద్ధత లేక, సమూహాల ఆగ్రహాన్ని సులభంగా చల్లార్చేటందుకు అమలు పరిచే ఆటవిక న్యాయమే ‘ఉరి ‘. ప్రజలకు అత్యాచారాలు చేయటానికి భీతి కలగాలంటే ఉరిశిక్షలు కాదు వేయాల్సింది. అత్యాచారాలు నిషిద్దాలని, వాటిని నాగరిక సమాజం ఆమోదించదనే భావజాలాన్ని వ్యాపింప చేయగలగాలి. ఆ రకమైన నైతిక జ్ఞానాన్ని ప్రజలకు ఇవ్వగలగాలి. ఆ కర్తవ్యాన్ని స్వీకరించడానికి బదులు ఉరిశిక్షను పరిష్కారంగా ప్రభుత్వం చూపించడం అంటే రాజ్యమే సమాజంపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లే.

ప్రజల ప్రజాస్వామిక కాంక్షలను అణగదొక్కడానికి రాజ్యం యొక్క వివిధ అంగాలు అత్యాచారాలని ఒక మార్గంగా ఎన్నుకోవటం యాదృచ్ఛికం కాకపోవచ్చు. భద్రతాబలగాల చేతుల్లో కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన రాష్ట్రాల మహిళలు ఎదుర్కొంటున్న అమానవీయమైన లైంగిక హింస నుండి వారికి విముక్తి కల్పించాలనీ, పోలీసులు, తదితర భద్రతా బలగాలు సాగిస్తున్న అత్యాచారాలను సాధారణ నేరచట్టాల పరిధిలోకి తేవాలన్న అతి ముఖ్యమైన జస్టిస్ వర్మ సిఫారసు గురించి రాజ్యం మాట్లాడకపోవడం వల్ల ఈ అనుమానం కలుగుతోంది. సంఘర్షణాత్మక రాష్ట్రాల్లో ప్రజలు తమ ప్రాధమిక హక్కుల కోసం సాగిస్తున్న పోరాటాలను అణచివేయడానికి వీలుగా ప్రభుత్వాలు అమలులోకి తెచ్చిన ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం’ –AFSPA-ను సమీక్షించాలన్న వర్మ కమిటీ సిఫారసు ఊసు కూడా ప్రభుత్వానికి పట్టలేదు. పైగా ఈ చట్టం ఉపసంహరణను సాయుధ బలగాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయని, కాబట్టి తామేమీ చేయలేమని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. మేకల్ని వేటాడొద్దని చట్టం చేయడానికి ఎవరన్నా పులుల అనుమతి కోరుతారా, తాముకూడా పులుల్లో భాగం అయితే తప్ప!

అత్యాచార బాధితులు సమాజంలో భాగమైనట్లే అత్యాచార నేరస్తులు కూడా మనతోటే ఉన్నారన్న సత్యాన్ని అంగీకరించక పోతే, మనం ఒక నేరమయ ప్రపంచంలో జీవిస్తున్నామనే కఠిన వాస్తవాన్ని నిరాకరించిన వారమౌతాము. నేరస్ధ సమాజాన్ని సంస్కరించకుండా ఎన్ని ఉరితాళ్ళు పేనినా ప్రయోజనం శూన్యమే.