ట్యాగులు

Books shelf

 

యాంత్రికత

ప్రేమ రాహిత్యం

కవల దెయ్యాలై

కలవర పెడుతున్నాయి.

వంచన, ఉదాశీనత

కత్తి ఝళిపించి

భయపెడుతున్నాయి.

కాచుకోడానికి

మేమున్నామంటూ

కప్ బోర్డ్ లో

కొలువైన

వారన్నారు

జ్నానంతో కాచి

అనుభవంతో వడకట్టి

సంక్లిష్టతను వొలిచి

సారాన్ని అందిస్తామని

ఆరగించుకోమని,

ఆకళింపుకోమని.

ఆత్మ న్యూనత

అశక్తత

అధాటుగా మీదికొస్తున్నాయి

నన్నే నాకు చూపి

వెన్ను విరుస్తున్నాయి

కాచుకోడానికి

మేమున్నామంటూ

కప్ బోర్డ్ లో

కొలువైన

వారన్నారు.

అంతరంగానికి

ఆలంబనగా

ఆత్మ విశ్వాసం

ఆయుధంగా

అందిస్తామని

అక్షర కొరడాతో

ఆదుకొంటామని.

ధిక్కార స్వరం అలసిపోతుంది

ఎదురీత ఎగశ్వాస అవుతుంది

ఏ క్షణాన్నయునా

పట్టుతప్పి కొట్టుకు పోయేటట్లున్నా

కాచుకోడానికి

మేమున్నామంటూ

కప్ బోర్డ్ లో

కొలువైన

వారన్నారు.

అక్కున చేర్చుకో

అలసట తీరుస్తాం

స్థైర్యపు వింజామరలౌతాం.

అవిశ్రాంత యుద్దానికి

అకుంఠిత

శక్తి దాతలమౌతాం.

అవును

నాకు వారున్నారు

నా నడకకు

నా నడతకు

ఉద్దీపనగా

నాలోని నాకు

వైతాళికులుగా

నా ప్రాపంచిక దృక్పధానికి

దిక్సూచులుగా

మిగిలిన బతుకుకు

తరగని శాంతిగా….