ట్యాగులు

sketch-weeping-womanనవ నవొన్మేష ఊహల

పల్లకిలో

నవమాసాలు మోసి

నిను కన్న

క్షణాన

నిశ్చింతలో

స్నానమాడి

నాకు నీవు

నన్ను మించిన

స్వంత మనుకొని

ముద్దాడి మురిసి పోయానే

నీ చిట్టి పాదాలు

కందకుండా

మోసిన గుండే

బండగా ఎలా మారిపోయుంది కన్నా

నీ సంతోషాలకు

సన్నిహితులకు

ఆట పాటలకు

ఆనందాలకు

నేనే అడ్డంకి నై

నిర్ధాక్షిణ్యం గా

నా కలల దారాలకు

నిన్ను వేలాడదీసి

హిరణ్య కసిపుని

అవతార మెత్తి

హింసించానుగా కన్నా

రెండేళ్ళ పాటు

నీ పసి రెక్కలపై

పెట్టిం భారం

నిన్నెంత కృంగదీసిందో

తెలియక చేసిన తప్పురా ఇది

నీ తల్లిని క్షమించగలవా

ఫలితాలు

నీ కళ్ళలో మిగిల్చిన నిరాశ

నాలో పశ్చాతాపం రగిల్చి

నిలువునా కాల్చివేసింది కన్నా.

కన్నా మళ్ళీ నిన్ను

నా కడుపులోకి తీసుకొని

అర్ధం చేసుకోవాలనుందిరా

కాలం లో వెనక్కి జరిగి

మళ్ళీ నిన్ను కనాలనుందిరా.

తప్పును దిద్దుకొని

నిన్ను నిన్నుగా పెంచాలనుందిరా

మంచుముద్దులిచ్చే

చల్లని తల్లి నవ్వాలనుందిరా

నీ నవ్వులు నీకే ఇవ్వాలనుందిరా!