ట్యాగులు

dark portrait

 

ఫ్యాషన్ సినిమా చూళ్ళేదా?

భార్య పక్క కూర్చొని ఫోన్ ఎత్తని

ప్రియుడితో రాజీ పడలేక

రగిలిపోయిన ప్రియాంక కంటి ఎర్రజీరలు మర్చిపోయావా?

మిధ్యా వివాహంతో మద్యానికి బానిసైనా మహానటి

హీన నిష్క్రమణం నిను అప్రమత్తను చేయలేదా?

మీనాకుమారీ, ఫటాఫట్ ల ఆత్మ రోదనలు

ఓహో నీ దాకా చేరలేదా!

నా సఖియా

గీష్మంలో ప్రసవించిన నీ కన్నీరు

పుష్యంలో చారికలతో ఎండి పోవాల్సిందేగా!

దాహార్తితో, ప్రేమార్ధివై మోకరిల్లినా

భద్రజీవిత మకరందాన్నినిత్యం సేవించే గూటి గోరింకకు

పిపాసలేగాని ప్రేమాంశలుండవుగా!

తాంబూల సేవన సుఖం తరువాత

పవళింపులులే కానీ, హృదయ పరిష్వంగాలకు కాలం చాలదు మరి.

నీ దాస్యానికి , దాసోహానికి పురుషాత్మ పొంగుతుందేకానీ

గట్టు తెంపుక వచ్చి హత్తుకోదు.

పంటి బిగువున

మోసే నీ కంటి నీటి బుంగలు

చిట్లి కుప్పబడిన హృదయపు పొరల రాపిడికి రాజుకొన్న నిప్పులో

ఆవిరవ్వాల్సిందే కానీ

భుజం పోటు పెట్టి భారం దింపే బాసట ఉండదుగా!

ప్రియభాంధవి!

మిగులు పడి విదిల్చే ఎంగిలి క్షణాలకై

ధౌర్భల్యంతో దోసిళ్ళు పడతావా?

సౌలభ్యం గీటురాయైన బంధానికి

ఆత్మను అనుసంధించి అపాత్ర దానం చేస్తావా!