ట్యాగులు

meri-ankhain-kahareedo-gay

 

అది నీకు

నా పై పాతేననుకొన్న విజయ బావుట

పరస్త్రీ పైట చాటున కూడా

పరాచకాలాడగల మరీచిక

గొప్ప పుంలింగ నిరూపణ

నీ అహాన్ని గెలిపించే ఒకానొక గర్వ ప్రదర్శన

కాలంతో, బలంతో, కామంతో మాత్రమే తూచి

నీకు నువ్వే కితాబులిచ్చుకొనే కపట నాటిక

క్షణాల వ్యవధిలో నీకు మహావైద్యం చేయగల ఈ దేహం

మరుక్షణమే నీకు అపరిచితం.

తిని లేచి పోయే ఎంగిలి కంచం.

మరి నాకూ?

అది నా అణువణువు పై నాకున్న మమకారం

నువ్వు స్పృశించి నాకందించగలిగిన గర్వం

ప్రశాంత వెన్నెల సముద్రాలలోకి

వేలు పట్టి నడిపించుక పోయే నీ సమక్షం.

నువ్వు సర్వ కాల సర్వావస్తల్లోనూ నాకుంచగలిగిన నమ్మకం

కేవలం కాయంతోనే కాదు

సమస్త జ్ఞాన ఇంద్రియాలతో నిర్వహించే పవిత్ర కావ్యం

చరమాంకం వరకు చేయబోయే సజీవ సాహచర్యం.