ట్యాగులు

88761-images

జాస్మిన్ ముక్కు నులుముకొంటూ దడిలోకి ప్రవేశించింది. లంగా, చీరను గట్టిగా పైకి కట్టి జాగ్రత్తగా మోకాళ్ళపైన కూర్చుంది. చేత్తో ప్లాస్టిక్ మగ్గును గట్టిగా పట్టుకొని, కళ్ళు మూసుకొని మూత్ర విసర్జన చేసింది. ఆమె చాటును భగ్నం చేస్తామని భయపెడుతూ, తాత్కాలికంగా దడిగా కట్టిన ప్లాస్టిక్ బట్ట అంచులు గాలికి కదలాడాయి. ఎరుపు, బూడిద రంగు ప్లాస్టిక్ బట్ట చిరుగుల నుండి అసహనంగా బయట ఎదురుచూస్తున్న యితర స్రీలను తొంగి చూసి, ఆమె హడావుడిగా మగ్గు ఖాళీ చేసి బయటకు వచ్చింది. ఆమె కాళ్ళకు బురద అంటింది. అర్జంటుగా కాళ్ళు కడగాలి. ఇంతలో క్యూలో ఉన్న మహిళ ఆమెను తోసుకోని దడిలోకి పోయింది.

జాస్మిన్ వరండాలో ఉన్న బక్కెట్ దగ్గరకు వెళ్ళి పావు మగ్గు నీళ్ళు మాత్రమే ముంచుకొని, పాదాలను జాగ్రత్తగా తడుపుకొంది. ఆ బిల్డింగ్ లో, వేరు వేరు టైలరింగ్ షాపుల్లో పనిచేస్తున్న దాదాపు ఇరవై మంది స్త్రీలకు అది విరామం కావటం వలన, బక్కెట్ లో నీళ్ళు అందరికి రావాలి. షాపులోకి వచ్చాక మిషను పెడల్ మీద ఉన్న తన శుభ్రమైన పాదాలను చూసుకొంది. గోళ్ళకున్న ఎరుపురంగు నైల్ పాలీషు దాదాపు ఊడిపోయింది. గోళ్ళ అంచుల్లో మట్టి పట్టిన భాగాన్ని అయిష్టంగా చూసుకొంది. జాస్మిన్ కి కొద్దినిముషాలు పడుకొంటే బాగుండునని అనిపించింది. అది ఆమె బహిష్టు సమయం. తెరలు తెరలుగా నొప్పి వస్తుంది. కాని పని ఎదురుచూస్తుంది. పెళ్ళివారి ఆర్డర్ లో భాగంగా మిషన్ మీద డ్రెస్ ఎదురుచూస్తుంది. సాయంకాలానికి ఇచ్చేయాలి. మాష్టర్ అప్పటికే రెండు జాకెట్ ముక్కలు కట్ చేసి కుట్టటానికి రెడీగా ఉంచాడు. మిగిలిన వాళ్ళు అన్నంతిని అప్పటికే పనిలోకి దిగారు. బాబిన్ లోకి ఎర్రదారం ఎక్కించుకొని ఆమె మిషన్ తొక్కటం మొదలు పెట్టింది. ఆమె చేతులు మెళుకువగా బట్టను సూది గుండా పంపిస్తున్నాయి. బయట తాత్కాలికంగా కట్టిన ప్లాస్టిక్ దడిని తీసివేస్తూ ఒక ముసలామె గొణుక్కొంటుంది.

“మంత్రి ఎప్పుడు మరుగుదొడ్లు ప్రారంభోత్సవం చేస్తాడో?”

మరుగుదొడ్డి గా చెప్పబడుతున్న ఆ స్థలంలో ముసలామె కొత్త బురదజల్లి, పేడతో కళ్ళాపి వేసింది. ఆ స్థలాన్ని మళ్ళీ కొత్తగా తయారు చేసింది. తిరిగి ఆ స్థలం మరుసటి రోజు మాత్రమే మరుగుదొడ్డిగా తయారు అవుతుంది. ఆ బిల్డింగ్ యజమాని సాయంకాలాలు అదే స్థలాన్ని పార్కింగ్ ప్లేసుగా అమ్ముకొంటాడు. ముసలామె మరుగుదొడ్డి సామాగ్రిని వరండాలో ఒక మూల దాచి, ఖాళీ అయిన బకెట్ ను చూసింది.

“జస్సు, కొద్దిగా నీళ్ళు తెచ్చిపెడతావా?”

జాస్మిన్ దారాన్ని నోటితో కత్తిరిస్తున్నట్లు నటిస్తూ ముఖం చిట్లించింది. బావి నుండి బకెట్ నీళ్ళు తోడటం అంటే ఆమెకు ఆ రోజు చిన్న విషయం కాదు. కడుపునొప్పి ఆమెను ఎక్కువగా బాధిస్తూ ఉంది. కాని అందరూ అసహ్యించుకొనే మరుగుదొడ్డి పని ప్రతి రోజు చేసే ముసలామె మాటను ఎలా కాదనగలదు? జాస్మిన్ చెప్పులు వెదుక్కొంటూ లేవటానికి సిద్దపడింది.

అంతలో “అవ్వా! జాస్మీన్ ను పని చేసుకోనివ్వు. పెళ్ళి బట్టలు యింకొద్దిసేపట్లో యివ్వాలి.” . మాష్టర్ అరిచాడు.

కుట్టుమిషన్ల చప్పుళ్ళ మధ్య మధ్యలో గిలక కిర్రుకిర్రు చప్పుళ్ళు, బక్కెట్ బావి కొట్టుకొన్న చప్పుడు విని, అవ్వ తనే నీళ్ళు తోడుతుందని అర్ధం అయ్యింది. కొద్ది సేపటికి అవ్వ రొప్పుతూ, తుంగ చాప మీద బొంతాల డబ్బాతో కూలబడింది. సాయం కాలపు సూర్యుడు ఆకుల మాదిరిగా చాప మీద పడుతున్నాడు. బొత్తాలు కుడుతున్న ముసలామె వేళ్ళు మొరటుగా, పాసిపట్టి ఉన్నాయి. కాని సూది, బటన్ చుట్టూ తిరిగే కొద్దీ ప్రతి కుట్టు సమంగా పడుతుంది. నీలిరంగు నరాలతో మరకలైన ఆమె చర్మం, ఆమె మెత్తబడ్డ శరీరం నుండి వేలాడుతుంది. ఆమెకు నిర్ణయించబడిన స్థలంలో కూర్చుని ముందుకు, వెనుకకు ఊగుతూ బొత్తాలు కుడుతుంది.

…………

రోడ్డు పక్కన తినుబండారాల బండ్లలో పెట్రోమాక్స్ బుసబుసలు..చింత చెట్లపై చేరిన కాకుల కలకలం…షట్టర్లు మూస్తున్న శబ్ధాలు..తాళాల క్లిక్కులు, వీడ్కోలు చెప్పుకొంటున్న గొంతుల హెచ్చుతగ్గులతో సందడిగా సూర్యాస్తమం అయ్యింది. చెమట పట్టిన లుంగీవాలాలు, నాలుక మడిచి శబ్ధాలు చేస్తూ బర్రెల వెనకాల కదం తొక్కుతూ పోతున్నారు. చీకటి వీధుల్లో పయనిస్తున్న నీడలను చూసి కుక్కలు అరుస్తున్నాయి.

జాస్మిన్, మనుషలనుండి, మృగాల నుండి దూరంగా తీసుకొని వెళ్ళే బస్సులో కిటికి పక్కన కూర్చొని ఉంది. దారిలో అవ్వ తాటాకుల ఇల్లు పరిసరాలను చూసింది. టికెట్ కలక్టర్ ఆమె భుజంపై పెన్సిల్ తో తట్టి చికాకు పెట్టే స్వరంతో అడిగాడు. “మరుగుదొడ్ల జంక్షన్ లో ఎక్కావా?” కొత్తోడి లాగా ఉన్నాడు అనుకొంటూ టికెట్ కొని వాచ్ స్ట్రాప్ లోకి తోసింది. ఆ రోజు మొత్తం మీద చేయాల్సిన అనేక విధులకు ఆమె శరీరం ఎదురుతిరుగుతుంది. ఇంతలో ఎర్రజండాలు, ఎగిసిన చేతులు అడ్డు రావటంతో బస్సు ఆగింది. ముక్కలు ముక్కలు గా నినాదాలు, బస్సు హరన్లతో సహా లోపలికి వస్తున్నాయి. ఊరేగింపు వెళ్ళేంతవరకు వీధి వేగం తగ్గింది.

తెరవాలి, తెరవాలి

కుట్ర నశించాలి.

నెమ్మదిగా కదులుతున్న ప్రజాసమూహం వెనుగ్గా, ఒక ఆటోరిక్షా బద్దకంగా నడుస్తుంది. రిక్షా నెత్తి మీది లౌడ్ స్పీకర్ అటూఇటూ ఊగుతున్నప్పుడు, రేపు జరగబోయే ధర్నా కారణాలు గాలిలో కలిసి పోతూ వినబడుతున్నాయి. జాస్మిన్ బాధతో రెండు తొడలు గట్టిగా ముడిచివేసింది. ఇంటికి చేరటానికి ఇంకో అరగంట పడుతుంది. బస్సు మెల్లిగా కదిలింది.

…….

మరుసటి రోజు బజారులో లౌడ్ స్పీకర్లు ఘోష పెడుతున్నాయి. చర్చలు ఏప్రెల్ ఎండలు కంటే హాట్ గా ఉన్నాయి. యువనాయకులు కేకలను ఉపన్యాసాలుగా అరుస్తున్నారు. ఒకరినొకరు తీవ్రమైన విమర్శలు చేసుకొంటూ, కొత్త ప్రపంచాన్ని తెస్తామని వాగ్ధానం చేస్తున్నారు. మాస్టర్ బయటి వేడిని పట్టించుకోవటంలేదు. చెవిలో పెన్సిల్ పెట్టుకొని, కత్తెర ఝాడిస్తూ బట్టల గుట్టల మధ్య తిరుగుతున్నాడు. పెళ్ళి నెల అంటేనే డబ్బులు. సామాజిక సంతోషాలకు దూరంగా ఉండాలి. వేడివేడి టీ తాగుతూ, పకోడీల్లాంటి రాజకీయాలు చర్చించటం పని లేని సీజన్ కి వాయిదా వేయాల్సిందే.

ఆ రోజు సాయంకాలం; ఎరుపు, బూడిద రంగుల ప్లాస్టిక్ బట్టను మడుస్తూ అవ్వ పైకే అంది. “ఇది ఎన్నో రోజులు నడవదు. నిన్న నేను యింటి దాక కూడ నడవలేక పోయాను.”

జాస్మిన్ కుట్టుమిషను నుండి పైకెత్తి చూసింది. అవ్వ అలసిపోయినట్లు ఉంది. పొట్టకొద్దిగా ఉబ్బినట్లు ఉంది.

“ఏమయ్యింది అవ్వా? మళ్ళీ జ్వరం వచ్చిందా? రేపు పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళు. ఇకడ నేను చూసుకొంటాలే.”

“జ్వరం కాదే జస్సు పిల్లా?” ఆమె మధ్యలో ఆగి జాస్మిన్ దగ్గరకు వచ్చి, గొంతు తగ్గించి “నేను ‘అక్కడి ‘ కి తరుచుగా వెళ్ళాలి. ఎక్కువసేపు ఓర్చుకోలేను.” జాస్మిన్ అనుకొంది. ” తనకూ అలా ఎన్ని సార్లు అనిపించలేదు.”

రోడ్డు అవతల ముదురు ఎరుపు ఇటికల కొత్త టాయిలెట్ భవంతి ఒంటరిగా కనిపించింది. తారురోడ్డు మీద చిరిగిన కాగితం ముక్కలు, ప్ల కార్డులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఎవరో ‘ఆడవాళ్ళ మరుగుదొడ్డి’ బోర్డు మీద చెప్పులదండ వేసారు.

మరుసటి వారం జాస్మిన్ బస్సు దిగేటప్పటికి పొడగాటి ప్ల కార్డులు పైకి లేచి ఉన్నాయి. ఎరుపు, నీలం రంగుతో రాసిన నేతగుడ్డ నోటిసు బోర్డులపై, ఆడవాళ్ళ మరుగుదొడ్డి ప్రారంభోత్సవం మినిస్టర్ గారితో జరుగుతుందని రాసి ఉంది. జాస్మిన్ ఆ తెల్ల గుడ్డల మనుషుల మధ్య నుండి నడుస్తుంటే ఒకడు “ఇకనైనా మురికి అలవాట్లు మానేస్తారా” అని వ్యంగ్యంగా అన్నాడు.

“వెధవ” మనసులోనే తిట్టుకొంటూ, భుజం మీద పమిటను గట్టిగా లాక్కొని వాళ్ళ కామెంట్లను, చూపులను తట్టుకొంటూ కదిలింది. వీళ్ళ షాపున్న శిధిలావస్త బిల్డింగ్ ముందు షామియాన వేసి ఉంది. మాష్టర్ తన షాపుకు షామియానా తాళ్ళు కడుతుంటే దగ్గర ఉండి చూస్తున్నాడు. ఎరుపు, బూడిద రంగు ప్లాస్టిక్ బట్ట గుంజల మీద నిలబడి, షాపు మూలలో వంటరిగా కనిపించింది. మాష్టర్ తిరిగి వచ్చి జాస్మిన్ కి బట్టలు అందిస్తూ గుసగుసగా “అయితే ఇక ఈ దడి విముక్తి అయినట్లేగా” అన్నాడు.

జాస్మిన్ బలవంతపు నవ్వు పులుముకొని బట్టలను ఏరటం మొదలు పెట్టింది. కాని మాష్టర్ వదిలి పెట్టలేదు.

” చూడు. మీ ఆడోళ్ళు కావాల్సింది సాధిస్తారు. మాకు గోడలే గతి.”

………

రోడ్డుకు అవతల కాకి చొక్క, చేతుల్లేని కోటు వేసుకొని ఒకతను టాయిలెట్ల ముందు నిలబడి ఉన్నాడు. చేత్తో ప్లాస్టిక్ బక్కెట పట్టుకొని, చీపురు ఊపుతూ ఏదో చెబుతున్నాడు. బక్కెట్ క్రింద పెట్టి , చొక్కాలోంచి తాళం చెవులు వెదికి తీసి, మరుగుదొడ్లు అందరికి కనబడనీయకుండా కట్టిన రూము తాళాలు తీయటానికి వంగాడు. కొంత మంది అతన్ని అనుసరించటానికి ప్రయత్నించారు. అతను చీపురు మళ్ళీ ఊపటంతో తగ్గారు.

లౌడ్ స్పీకర్ల లో ప్రకటనల మధ్య సినిమా పాటలు ముక్కలు ముక్కలు వినబడుతున్నాయి. ఉన్నట్లుండి మంత్రి రాబోతున్న హడావుడి వినిపించింది.

అవ్వ చాలా సార్లు పనిలో నుండి లేచి వెళ్ళి వచ్చే పోయే వాళ్లను హడావుడిగా ” మంత్రి వచ్చాడా?” అని అడగటం జాస్మిన్ గమనించింది. అలా నాలుగోసారి జరిగాక, మాష్టర్ తన సన్నని మీసాని తిప్పి కన్నుగొడుతూ

“ఏం అవ్వా! మంత్రితో పూర్వపు అనుబంధం ఏమైనా ఉందా? ఆయనకు తెల్లటి ఆడోళ్ళు చాలా యిష్టమట. నువ్వు వయసులో ఎలా ఉండేదానివో నేను విన్నాలే” అన్నాడు.

అవ్వ మాష్టరు వంక కళ్ళప్పగించి చూసి వరండాలోకి నడవటం జాస్మిన్ ఆశ్చర్యంగా చూసింది. ఆమె ప్రతి అడుగుకి వేగం పెరగటం గమనించింది. కొద్ది నిమిషాల్లో బయటి బాణాసంచా చప్పుళ్ళు వినబడ్డాయి. మాష్టర్ కూడ హడావుడి పడుతూ,”మినిష్టర్ వచ్చినట్లు ఉంది. మీరంతా యిక్కడ నుండి చూడొచ్చు. బట్టలు వదిలేసి వెళ్ళకండి అమ్మాయిలు” అన్నాడు.

బయట సందడి క్రమంగా వందల సంఖ్యలో జనంగా మారి, లౌడ్ స్పీకర్లు మళ్ళీ జీవం పొందాయి. మినిష్టరు ఒక లావైన తెల్లటి బాతులాగా జనాల్లో నడుస్తూ తాత్కాలికంగా నిర్మించిన స్టేజి ఎక్కాడు. చేతులు మడచి ఎత్తి , ఒక హై వోల్టేజి నవ్వును జనం మీదకు రువ్వాడు. అతని గన్ మేన్లు ప్రజలను గద్దలలాగా పరిశీలిస్తున్నారు. జాస్మిన్ యింకా మిషన్ దగ్గరే ఉంది. ఆమె దృష్టి కి వరండాలో ఉన్న మనుషుల తలలు అడ్డం వస్తున్నాయి. కాని ఆ జనసందోహం మధ్యలో నుండి ,రోడ్డుకి అవతల కొత్త బిల్డింగ్ దగ్గర అవ్వ నిలబడి ఉండటం జాస్మిన్ చూసింది.

ప్రారంభోత్సవ సమావేశం మొదలయ్యింది. ఎంత బిజీ గా ఉన్నా ఈ మరుగుదొడ్ల ప్రారంభోత్సవానికి మినిష్టరుగారు చూపించిన ఆసక్తిని ఒక స్థానిక నాయకుడు పొగిడాడు. మిగతా వక్తలు కూడ ఆయనను అనుసరించి తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇది చాలా సేపు సాగింది. ఎట్టకేలకు ప్రారంభోత్సవం మొదలయ్యింది . జనమంతా వెంట రాగా మినిస్టర్ గారు రిబ్బన్ వద్దకు కదిలారు. రోడ్డు మీద ఒక బస్సు, లారి ఆ మహత్తర సంఘటన చూడటాని కా అన్నట్లు ఆగివున్నాయి.

జాస్మిన్ మాష్టర్ పక్కన, ఆ నాటి గౌరవ అతిధికి కొద్ది దూరంలో నిలబడింది. మినిష్టరు గారు చిరునవ్వుతో ఆయనకు అందించిన పళ్ళెం నుండి కత్తెర తీసుకొని గులాబి రంగు రిబ్బను కత్తిరించటం చూసింది. మళ్ళీ బాణాసంచా పేలింది. చప్పట్లు, నినాదాలు మార్మోగాయి.

మినిష్టరు గారు ఒకడుగు ముందుకు వేసి మరుగుదొడ్డి తలుపును గట్టిగా తోసాడు. జనం హర్షాతిశయాన్ని చప్పట్ల ద్వారా ప్రకటించారు. అప్పుడే మినిష్టరు గారు తత్తర పడుతూ వెనుకడుగు వేయటం, అవ్వ మరుగుదొడ్డి లో నుండి బయటకు రావటం జాస్మిన్ చూసింది.

మళయాళీ అయిన సునీత బాలక్రిష్ణన్ స్వతంత్ర జర్నలిష్టు, రచయిత్రి , అనువాదకురాలు కూడ. ఆమె రచనలు ఇంగ్లీషు, మళయాళంలోనూ ఉన్నాయి. ఆమె హిందు మెట్రో, హిందు లిటరరీ రివ్యూ, ది బిజినెస్ స్టాండర్డ్, ది ఎకనమిక్ టైమ్స్, కేరవాన్, మ్యూజ్ ఇండియా లకు రాసారు. సునీత ఆంగ్లంలోను, మళయాళంలోను కాల్పనిక సాహిత్యం, కవిత్వం రాసారు. ఆమె చిన్న కధలు ఇండియాలోను, విదేశాలలోను సాహిత్య కళాఖండాలలో చేర్చబడ్డాయి. మధ్య జుంపా లాహిరి పులిట్జర్ విన్నర్ బుక్ఇన్ టెర్ ప్రెటర్ ఆఫ్ మాల్ దీవ్స్ని (2012) మళయాళం లోకి అనువాదం చేసారు. ఆమె మొదటి నవల పూర్తి కావస్తుంది.

పై కధకు (Inauguration, english) ఆమెకు దేసి రైటర్స్ లాంజ్ అవార్డ్ వచ్చింది. దేసి రైటర్స్ లాంజ్ 24/7, 365 రోజులు, రచయితలకు వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటుంది. అక్కడ వారి రచనలపై గాఢమైన విమర్శ, విశ్లేషణ జరుగుతుంది.

katha1

katha2