ట్యాగులు

1390604_166192356922256_536091794_n

 

బడికెళ్ళనన్న పిల్లని

చెవులు పట్టి లాక్కొచ్చినట్ట్లు

నిన్ను తీస్కొచ్చి

ఈడ కూలదోసానా!

గడియారం చూపించి

సుద్దులు, బుద్దులు చెప్పానా!

అటు ఇటు చూసి

కన్ను గీటి, కొంటెగా మళ్ళీ పారిపోతావు.

ఎక్కడ వెదకను నిన్ను?

ఒక సారి

ఊరిలోని గుడి గోడలను కౌగలించుకు రానంటావు.

ఇంకొక సారి

దోస పొలాల్లో దొంగతనం చేస్తూ ఆనందిస్తుంటావు.

ఇదిగో ఇక్కడ

ముసలి దర్జీ ముందు

మఠమేసుకొని కూర్చుని

ముచ్చట్లు చెబుతున్నావు.

కోటప్పకొండ తిరనాళ్ళలో

గౌనేసుకొని గెంతుతున్న పిల్లవు నువ్వేకదూ!

తోపంతా టైర్ చక్రం తిప్పుతూ

నాకు టాటా చెప్పింది నువ్వేలే!

పడుచుదనపు పొగరుతో జడలు

ఎగరేసుకు తిరుగుతున్నవ్ అక్కడ కాలేజీలో!

బ్రిటీష్ నాటి బిల్డింగుల మధ్య

చదువుకానిదేదో చదువుతున్నావ్ దొంగా!

హోరెత్తే ఊరేగింపులో ఉరుకుతున్నవ్ కదా!

పోటెత్తిన సింహంలా పోట్లాడుతున్నావ్ ఎవరితో?

కారు దిగిన మంత్రి కాలరు పట్టుకొన్నావా, హవ్వా!

అబ్బ బరితెగించిన దానివి

బరిలోకి తేలేను.

సావు! నీకిష్టమైన జగానా!