ట్యాగులు

,

47709-kaveri

అమ్మంటే కన్నతల్లి మటుకే కాదు. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.

స.వెం.రమేశ్

కధలు పదేళ్ళ క్రితం నా ఆదివారపు ఉదయాలను సమ్మోహపరిచేవి. ఆ కధన సుగంధాలను రోజంతా ఆస్వాదించి, సోమవారం కాలేజ్ లో హరిత, నేను మళ్ళీ నెమరేసుకొనే వాళ్ళం. ఆ నాలుగు నెలలు ఈ కధలు మమ్మల్ని నవ్వించి, ఏడిపించి, కోపించి, స్నేహించి, బోధించి, గాలించి, గాయపరచి, నయం చేసి, చిరునవ్వుతో మాయమయ్యాయి. పదేళ్ళ తరువాత ఆ కధలు ఈ మధ్య నన్ను వేటాడటం మొదలుపెట్టాయి. దానికి కారణం నాకు పక్షుల మీద పెరిగిన ఆశక్తి ఒక్కటే కాదు. ఆ కధల సమ్మోహనత్వాన్ని మరింత కావలించుకోగలిగిన మనః పరిణితి పెరగటం కూడా అనుకొంటాను. ఇటీవల మళ్ళీ ప్రాచుర్యం లోకి వచ్చిన శ్రీ రమణ ‘మిధునం’ కధ కూడ ఈ పుస్తకాన్ని నాకు గుర్తు చేసింది. ఈ కధలను రాసిన కాలమాన, భౌగోళిక, చారిత్రక నేపధ్యంలో ఉన్న భిన్నత్వం, ఆయన కధావస్తువుగా ఎన్నుకొన్నసామాజికవర్గం, అన్నిటికి మించి ఆయన కధాస్థలాన్ని, కధలలోని పాత్రలను ప్రేమించి రాసిన వైనం నాకు పలు సార్లు గుర్తుకు వచ్చి మళ్ళీ ఈ కధలను చదవాలనే కోరిక పెరిగింది. ప్రళయ కావేరి ప్రాంతానికే (ఇప్పటి పులికాట్) పరిమితమైన ప్రత్యేక మాండలికం, పక్క జిల్లావాసిగా నేను అర్ధం చేసుకోగలటం కూడా నన్నీ కధలలో మమేకం చేయగలిగింది .

ఈ పుస్తకం కోసం నేను ప్రయత్నం చేస్తూనే పులికాట్ కు గత డిశంబర్ లో ప్రయాణం కట్టాను. పక్షులను చూడాలనే వంక పెట్టాను కాని ప్రళయ కావేరి దీవులను చూడచ్చు అనే కోరిక కూడా ఉండింది. నేను పులికాట్ వెళుతున్నవిషయం విని మా అమ్మ “మీ తాతలు అక్కడ నుండే వలస వచ్చారట” అని చెప్పింది. అయితే పరిమితమయిన సమయం, వనరులు మమ్మల్ని శ్రీహరి కోట వరకు మాత్రమే తీసుకొని వెళ్ళ గలిగాయి. ఊరుకోలేక రోడ్డు దిగి పులికాట్ లో అడుగు పెట్టాను. అడుగు, అర అంగుళం మేర కూరుకు పోయింది. “మే బద్రం! మీ గెట్టి నేలోళ్ళు మా అడుసు నేలలో నడవటం చెతురు కాదమ్మే!” అని వెంకన్న తాత సైగ్గా నుల్చుని చెప్పినట్లనిపించింది.

ఈ పుస్తకం నాకు దొరికి, పుస్తక పరిచయం రాయాలని అనుకొన్నప్పుడు; పరిచయం కాదు ఈ కధలు మీద ఒక పరిశోధనే జరగొచ్చని అనిపించింది. నిజానికి ఈ పుస్తకం ఒక నడిచిన చరిత్ర. ఒక పర్యావరణ శాస్త్రం. పరిణామ క్రమాన్ని, సామాజిక శాస్త్రం తో కలబోసి మనకు అందించిన విజ్ఞానం. ముఖ్యంగా ఈ ప్రాంత మాండలికానికి చెందిన సొగసు చదువరులకు గిలిగింతలు పెడుతుంది. ‘ఉత్తరపొద్దు’ ప్రచురణ కాగానే మొదటి స్పందన దాశరధి రంగాచార్య నుండి వచ్చిందట. “ఉత్తరపొద్దు తెలుగు పున్నమి వెన్నెల్లో దిశాంబరంగా సాగిపోతున్న బతుకు చక్కదనం, కలుపు మొక్క లేని తెలుగు పంట” అని స్పదించారు. కలుపు మొక్కలేదు అనటం లో ఆయన అర్ధం ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడ ఈ కధల్లో వాడక పోవటం కూడా అనుకొంటాను. అంతరించిపోతున్న చాలా తెలుగు పదాలని ఈయన ఈ కధలలో నిక్షిప్తం చేసారు. ఇక సామెతలు, ఉపమానాలు, నుడికారాలు పుష్కలంగా; తెలుగు సాహిత్యాభిమానులకు మనసు నిండుగా ఉన్నాయి. అక్బర్ గారు, చిదంబరం గార్ల స్కెచ్ లు మనలను కధలలోకి నేరుగా లింక్ చేస్తాయి. ఆ మాండలికంలో మనకు అర్ధం కాని పదాలకు ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చారు.

ప్రళయ కావేరి దీవుల్లో నడిచే ఈ కధలన్నీ ఒక బాలుడి భాష్యంతో నడుస్తాయి. ఈ దీవుల్లో ఒకటైన ‘జల్లల దొరువు’లో ఉంటున్న తాతా, అవ్వల దగ్గరికి సెలవల్లో గడిపి, అక్కడి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనాన్నిరచయిత ఆకళింపు చేసుకొని పెద్దయ్యాక తన భాషాపరిజ్ఞానంతోను, సామాజిక సృహ తోనూ రాసిన కధలివి. శంకరంమంచి ‘అమరావతి కధలు’, వంశి ‘పసలపూడి కధలు’ ఖదీర్ బాబు ‘దర్గమిట్ట కధలు’, నామిని ‘పచ్చ నీకు సాక్షిగా’.. ఇవన్నీ ఒక ప్రాంతానికీ, రచయతకి ఉన్న అనుబంధానికి చెప్పిన అందమైన భాష్యాలే. కాని ప్రళయ కావేరి కధల్లో అనుబంధంతో పాటు ఆ ప్రాంత భౌసర్గిక స్వరూపం, ఆహారపు అలవాట్లు, వారి సాంస్కృతిక జీవనానందాలు ,వాళ్ళ పంటలు, పిల్లల ఆటపాటలు, స్రీల జానపదాలు, పొడుపు కధలు….వీటన్నిటి వర్ణన ఉంటుంది. ఇదంతా ఎంత హృద్యంగానంటే గుండె మార్పిడి జరిగినట్లు; రచయిత అనుభవం, అనుభూతి సంపూర్తిగా పాఠకుడికి బదిలీ అవుతుంది.

రచయత జీవితాన్ని అన్ని ముఖాల్లోంచి దర్శిస్తాడు . ప్రళయ కావేరి కధల రచయిత స.వెం.రమేశ్ అందులో పూర్తిగా సఫలీకృతం అయినట్లు నాకు అనిపించింది. ఈయన తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం పూర్తి కాలం పని చేస్తున్న కార్యకర్త. చదివిన చదువు మానవ సమాజ పరిణామ క్రమం, తెలుగులలో రెండు ఎమ్మేలు.

రచయితకు తన తాతే భోధకుడు, తాత్వికుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుభంధాన్ని పదాడంబరంతో కాకుండా సహజమైన సహవాసం, సాన్నిహిత్యంతో మనకు అర్ధం చేయిస్తాడు రచయిత. “అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.” అని నేర్పిన తాత రుణం ఈ కధలు రాసి తీర్చుకొన్నాడు రచయత.

ఈ కధల నాయకుడు వెంకయ్య తాత మన రచయితను తన భుజాలమీద ఎక్కుంచుకొని లెక్కలు నేర్పాడు. “అబ్బయా! సేరుకి రెండు అచ్చేర్లు. ఒక అచ్చేరుకి రెండు పావుసేర్లు. పావుసేరుకి రెండు చిట్లు. రెండు బళిగలయితే ఒక చిట్టి. దాని కన్న చిన్నది ముబ్బళిక. అన్నింటి కన్న చిన్న కొలత పాలాడ. మూడన్నర సేరు ఒక ముంత. నాలుగు ముంతలు ఒక కుంచాము. రెండు కుంచాలు ఒక ఇరస. రెండు యిరసలయితే ఒక తూము. ఇరవై తూములు ఒక పుట్టి. రెండు తూములయితే యిద్దుము. మూడు తూములయితే ముత్తుము….పది తూములయితే పందుము.” (పుబ్బ చినుకుల్లో)

” ముక్కు కింద సంచి మాదిరి యాలాడతుండాదే అది గూడబాతు. బార్లు దీరి నిలబడుండేటివి కాళ్ళ ఉల్లంకులు, వోటి పక్కన గుంపుగా యీదతావుండేటియి గుండు పుల్లంకులు. అద్దో! ఆ జత తెడ్డుమూతి కొంగలు. ఆ బూడిద వన్నె రెక్కలది నారాయణ కొంగ. దాని పక్కన మూరెడు ముక్కుతో, పసురువన్నె రెక్కతో సొగసుగా వుండేది ఎర్రకాళ్ళ కొంగ…….” ఇలా పక్షిశాస్త్రాన్ని భోదిస్తాడు. (కొత్త సావాసగాడు)

ఇక చేపల రకాల గురించి చెబుతూ “ఆ తట్టు యెండి మాదిరి మెరుస్తుండాయే, అయ్యి వంజరం చేపలు. అల్లా సప్పిటి మూతియి వాలగలు. వాలగ బలే వాతపు చేప. నాలుగునాళ్ళు వరుసగా తిన్నామంటే, కాళ్ళు, కీళ్ళు కదలవు. వుల్లంకుల వన్నెవి కానాగంతలు. తెడ్డు అమ్మిడ మూరెడు పొడుగు ఉండాయే, అవే మాగ చేపలు. సముద్ర చేపల్లో మాగంత రుసి యింకేది వుండదు. అయి తుళ్ళు సేపలు. వొట్టి ముళ్ళ కంపలు. పాము మాదిరి సన్నంగా వుండేటివి మొలుగులు, నోట్లో యేసుకొంటే యెన్న మాదిరి కదిరి పోతాయి.” (సందమామ యింట్లో సుట్టం)

కోస్తా తీరం వెంబట పెరిగిన నేను ఈ చేపలన్ని రుచి చూసాను.

ఈ కధలలో ప్రధాన పాత్రలను పక్కన బెడితే, కొద్ది సేపున్నా నన్ను అత్యంత ప్రభావితం చేసిన పాత్ర గేణమ్మ. (కత్తిరి గాలి) వెంకన్న తాత అక్క కాశెమ్మవ్వ కూతురు. “గేణమ్మవ్వ మంచిది” అని తనలోని బాలుడి చేత చెప్పించి, గేణమ్మ ఎంత పని చేసేదో రచయత తన ఎదిగిన మెదడుతో చెబుతాడు. “ఇల్లంతా బూజులు గొట్టి చిమ్మింది. పాలవెల్లి దించి శుద్దం చేసింది. పరంటింట్లో, సుట్టింట్లో యాడన్న గుంటలు పడుంటే బంకమట్టి పూసి సదరం చేసింది. పేడేసి యిసిరంగా అలికింది. పరంటింటికి సున్నం గొట్టి యెర్రమట్టి వోరు తీసింది. బొట్టల క్రింద కలుకుల్లో పొగపెట్టి యెలికల్ని తరిమింది. మునగ చెట్టుకు పట్టిన కమ్మిటి పురుగుల్ని యెదురు కర్రకు మసేలిక సుట్టి గబ్బుసమురుతో ముంచి మంట కాల్చి చంపింది. మల్లి గుబురుకి పాది చేసి, ఆకు దూసి నీళ్ళు పోసింది. ” ఇలా రెండు పేరాలు రాసి చివర్లో “ఇరవై కాళ్ళు, ఇరవై చేతుల్తో వొంటి మనిషి వొకటే మాపన కత్తిరి యెండల్ని లెక్కబెట్టకుండా పన్లన్నీ చేసింది గేణత్త” అంటూ ముగిస్తాడు. ఈమెలో మనకు మానవపరిణామక్రమంలో నాగరికత అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆదిమకాలంనాటి స్త్రీ మూర్తి ఆవిష్కరిస్తుంది. ఒక్క గేణమ్మే కాదు, మండుటెండలో దాహంతో అల్లాడుతున్న బాలుడికి తన చనుబాలుతో బతికించిన వసంతక్కలో కాని, దిగులుతిప్పలో కూరుకుపోయిన బాలుడ్ని రక్షించటానికి తన ఎనిమిది గజాల కోకను ఇప్పేసి బిత్తలిగా నిలబడిన సుబ్బమ్మవ్వలో కాని; భుజానికి బిడ్డలను కట్టుకొని వేటాడి కడుపులు నింపిన మాతృసామ్య మహిళలే కనబడతారు కాని, అనుక్షణం స్త్రీత్వం ఆపాదించి రొమాంటైజ్ చేయబడిన నేటి సాహిత్యంలోని దౌర్భాగ్య స్త్రీ పాత్రలు కనబడవు.

ఇంకొక ఆసక్తికరమైన పాత్ర వసంతక్క. అడవిలో నల్లబావతో కలిసి రాత్రంతా కాపలాకాసి పట్టిన చెవుల పిల్లులను (కుందేళ్ళు) నల్లబావ భోంచేస్తాడని “అకా! ఇంత కష్టపడి పట్టుకొనింది సంపేసేదానికా” అని బాలుడు కన్నీళ్ళు పెట్టుకోగానే వాటిని వదిలిపెట్టి నల్లబావకు “సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, సూసేసొస్తాము అంటే కట్టుముళ్ళు యిప్పినాము. అమావస కాలం కదా సందమామను యెదుకుతా యెట్నో పోయినట్లు ఉండాయి.” అని ముసిముసిగా నవ్వుతూ జవాబు చెబుతుంది. (సందమామ యింట్లో సుట్టం)

ఈ కధా కాలం ఎనభైవ దశకం అనుకొంటాను. అప్పటికీ ప్రళయకావేరి దీవుల్లో భాగాతాలు, నాటకాలు, వాటిని చూడటానికి పక్క దీవుల నుండి చుట్టాలు బండ్లెక్కి రావాటాలు ఇవన్నీ ఉండేవి. పల్లెల్లో సాంస్కృతిక కాలుష్యం గురించి రచయత తన ఆవేదనను కధలో జొప్పించాడు. “మా కడగళ్ళు దేనికి అడగతావులే సోమి! పేటలో సినిమా ఆటంట, పెద్ద కొట్టాం కట్టి , దాంట్లో దినానికి రొండాట్లు ఆడతా వుండారు. పేట చుట్టు పక్కల వూళ్ళల్లో యిప్పుడు భోగాతాలు సూసే వాళ్ళే లేరు. నెమిలాటలు లేవు. పామాటలు లేవు. కీలు గుర్రాలు లేవు. మరగాళ్ళు లేవు. యీరదాళ్ళు లేవు, పంబజోళ్ళు లేవు.యానాది చిందుల్లేవు, యీరబద్ర పూనకాలు లేవు.” (కాశెవ్వభోగోతం) ఇక్కడ ఒక సమాజంగా బ్రతికిన కులాలు పెద్దీటి గొల్లలు, యానాదులు, తూరుపు రెడ్లు, వెలమలు, బేరిశేట్లు, పట్టపు కాపులు, దేశూరి రెడ్లు.

రచయితలోని భావుకుడు కధకొక సారైనా తొంగి చూస్తాడు.

“సలికాలం సాయబోయిన అమ్మ నేతకోక, వానాకాలం చిక్కంగా అల్లిన జమ్ముగూడ, యెండాకాలం సల్లని కానగమాను నీడ; యీటిల్లోమునిగి, ముదుక్కొని, వొదిగి, వొళ్ళిరుసుకోని బతుకు దేనికి?”

“ఆకాసం నుండే సుక్కలన్నీ అడివిలోకి వొచ్చేసినుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకు మిస మిస మెరిసి పోతుండాది. అడివమ్మ ఒల్లంత తళుకులు అంటుకొనీ తళతళమంటా వుండాయి.” (మిణిగురు పురుగుల వర్ణన).

“నీలమంటే అట్టాంటిట్టాంటి నీలం కాదు, కావేరమ్మను పలకరించను మిన్ను దిగొచ్చినట్లు, మిన్నువన్నె మన్నువన్నె కలిపి మిసమిస లాడే నీలం”.

“సడీ, సందటి లేకుండా సందకాడ సల్లంగా కురిసి పోయ్యింది వాన. తల్లాకిట అవ్వేసిన సంద ముక్కర్ర, వానతో పాటు వీధి పెత్తనానికి పొయ్యింది. దడి పక్కన ముడుసుకొని కూసున్న మల్లి గుబురు, పుట పుట చినుకులు రాలతోనే వొళ్ళు ఇరుసుకొని, తెల్ల పూల కోక కట్టుకొనింది. మల్లె గుబురు పైనుంచి వొచ్చిన వానగాలి, సల్లటి వాసనతో నాకు సక్కలిగిల్లి పెట్టి, పరమటింట్లో పటాలకు మొక్కను పొయ్యింది.”

ఇలాంటి గిలిగింతలు పెట్టే పదలాలిత్యం పుస్తకమంతా తొణికిసలాడుతూ ఉంటుంది.

అక్షరాలతో నోరూరించగలిగాడు ఈ కధకుడు.

“వొంగొగురు, యిసిక మెత్తాళ్ళు. కలిపి యెగరేసుకొంటే, సట్టిడు కూడు సడీ సప్పుడు లేకుండా లోపలికి ఎల్తాది.”

“అటికి మామిడాకులో పెసల పప్పేసి యెణిపినబయా”

“ పెసర పొప్పులో పుట్ట కూడేసి యిగరేసుకొంటే, ఆ రుసి చెప్పబళ్ళే!”

ఇక అవ్వ చేతి చిరుతిళ్ళు చూడండి. “తంపటేసిన గెణుసు గడ్డలు, యేంచిన చెనక్కాయలు, సద్దనిప్పట్లు, ఉడకేసిన బెండలం గెడ్డలు. నిప్పట్లు, మణుగుబూలు, పులుసన్నం, రవ్వుంటలు, చెనగుంటలు, బొరుగుంటలు, మూసుంటలు, చిమ్మిరుంటలు, తైదుంటలు, పెసలుంటలు, నువ్వుంటలు, సాపట్లు, దూపట్లు, దిబ్బట్లు, చీపిరొట్లు, తెదురొట్లు, పాకం పోరలు, కమ్మరట్లు, అలసందొడలు, పులిబంగరాలు, సియ్యాళ్ళు, కారామణి గుగ్గిళ్ళు”

ప్రళయ కావేరి వాసుల ప్రధాన పంట తమదలు (రాగులు). (ఏడాదికి రెండు వానలు పడితే పండే తమదలను వదిలేసి దండిగా నీరు కావాల్సిన వరిపంటను పండించటం గురించి రచయత బాధ పడ్డాడు.) చిక్కని మజ్జిగ కలిపిన అంబలి చిన్నతపీలుడు తాగటం, నెల్లి చెట్టు కింద కూసోని దోసిట్లో వేసిన సద్ది కూడు కిచ్చరగాయ(నారింజ కాయ) ఊరగాయతో తినటం,,,నా ఊహ తెలిసాక మా అమ్మమ్మ చెబుతుంటే యిలాంటివి విన్నాను. ఇక అవ్వ “యాడ్నించి తెస్తాదోగానీ, అటిక మావుడాకు, నాసరజంగాకు, పొప్పాకు, యెన్నముద్దాకు, చెంచులాకు, బచ్చలాకు, కోడి జుట్టాకు, ముళ్ళ తోటాకు, చామాకు, బొక్కినాకు, దొగ్గిలాకు, కాశాకు, తుమ్మాకు, మునగాకు, అవిశాకు,….యిట్టా ఎన్నో రకాల ఆకులు తెచ్చి కూరలు చేస్తుంటాదవ్వ. ఆ పొద్దు కూడ చెంచలాకు కూర చేసుండాది.” ప్రళయ కావేరి దీవుల్లో ఫల సంపద పాలపండ్లు, కలిగి పండ్లు, బీర పండ్లు, బిక్కిపండ్లు, నిమ్మటాయలు, ఊటి పండ్లు, గొంజి పండ్లు, బలిజ పండ్లు, ఎలిక చెవులు, పిల్లొట్టాలు, చిట్టీతకాయలు, అత్తిపొండ్లు, నుంజలు (ముంజలు). ఈ ఆహారాలతో పెరిగిన మన రచయత అంత ఆరోగ్యమైన రచనలను మనకందించాడు.

ఈ పిట్టల పేర్లు మీరెప్పుడైనా విన్నారా! “చిలుకలు, గోరింకలు, బెళవాయిలు, జీని వాయలు, గోరింకలు, చిలవలు, చింతొక్కులు, టకు టకు పిట్టలు, జిట్టి వాయిలు, పాల పిట్టలు, వూరికాకులు, జెముడుకాకులు, పందిట్లో పిచుకలు, యింట్లో కోళ్ళు, గిన్నె కోళ్ళు. యింటి ఆవరణంతా ఒక తూరి తిరిగితే, యెన్ని వన్నెల యీకలు దొరకతాయో చెప్పలేము.”

ప్రళయ కావేరి పిల్లల బాల్యాన్ని పండిచిన ఆటలు: మగపిల్లల ఆటలు కోతికొమ్మచ్చి, కోడుంబిళ్ళ, వుప్పరపిండి, పిళ్ళారాట, వొంటి బద్దాట, రెండు బద్దీలాట. ఆడపిల్లల ఆటలు వామన గుంటలు, అచ్చంగాయలు, గెసిక పుల్లలు, గుడుగుడు గుంజెం, చికు చికు పుల్ల, బుజ్జిల గూడు, బుడిగీలాట, కుందాట, కుర్రాట, మిట్టాపల్లం, వొత్తిత్తి సురొత్తి. (ప్చ్. మన పిల్లలు ఎంత దురదృష్టవంతులో!)

రచయితకి ప్రాచుర్యం అవార్డుల ద్వారా రాదు. ఆయన సృష్టించిన పాత్రలలో పాఠకులు ఎంత మమేకం అయ్యారో అనే దాని మీదే వస్తుంది . ఆ రకంగా ఈ రచయత ధన్యత చెందినట్లే. ఒక పాఠకుడు కధలోని పాత్రలు నిష్క్రమించటం మీద కోపం ప్రకటిస్తూ ఉత్తరం రాసారు. ఎప్పుడైనా ‘జల్లల దొరువు ‘ వెళితే ఆ పాత్రలు తమను ఆహ్వనించాలట. ఒక పాఠకుడు “నేను తప్పిపోయిన లోలాకులగాడ్ని” అంటూ ఉత్తరం రాసారు. ఒక పాఠకురాలు “నేను గుండుపద్నను రా” అంటూ. అంతగా పాఠకులు ఈ కధలలో ఇన్వాల్వు అయ్యారు. పాఠకులందరూ కోరుకొన్నట్లుగా స.వెం.రమేశ్ గారు నుంచి ఇంకా ఎంతో మంచి సాహిత్యాన్ని నేనూ కోరుకొంటున్నాను.

సారంగా లో ఈ సమీక్ష ఇక్కడ