ట్యాగులు

,

courage1అవసరం అన్నీ నేర్పిస్తుందని అంటారు. కారు నేర్చుకొవాలనే నా కోరిక, కారు నడపక నా బతుకుక్కిక తప్పదు అనే దశకు చేరాకనే పండు అయ్యింది. అది ఏ విధంగా జరిగిందంటే…

సమైక్యాంధ్ర ఉద్యమం ‘ఉ’ అని ఇంకా అనక ముందే ఆర్.టి.సి. వాళ్ళు ఎంచక్కా బస్సులను డిపోల్లో ముచ్చటగా నిలబెట్టేసి ఇళ్లకెళ్ళి పోయిన తదనంతరం మా కాలేజి‌ ఊరికి వెళ్ళటానికి నేను ఆటోలు ఎక్కవలసి వచ్చింది. ఒంగోలు నుండి ఈతముక్కల వెళ్ళే ప్రయాణికులు ఎక్కువగా పూలమ్ముకొనే అక్కలు. ఇంతకు ముందు వాళ్ళు నన్నెరుగుదురు.

వాళ్ళు నన్ను ఆనందంగా ఆటోలోకి ఆహ్వానించారు. ఇటు ముగ్గురు, అటు ముగ్గురు కూర్చున్నాం. వాళ్ళ ఖాళీ తట్టలు వెనుక డిక్కీలో వేసేసి, ఆకు వక్క నవలతా స్త్రీ స్వాతంత్రం వచ్చినంత కుశాలంగా కబుర్లు చెప్పుకొంటున్నారు.

ఇంతలో ఇంకొక పూలమ్మి ఎక్కడానికి వచ్చింది. ఎటు వైపు వాళ్ళు సర్దుకోవాలో అనే మీమాంస వచ్చింది.

మా ముందు వరస ఆమె “మేము వళ్ళుగల మనుసులం. మీరు సర్దుకొండప్ప.” అనింది. నా పక్కనామె అందుకొంది “మేము మాత్తరం తక్కువేంటే? ఈ బాసేలు తక్కువ ఉందా? ఆ మాడమ్ ….” అంటూ నావైపు చూసింది. బిక్క చచ్చి పోయాను.

తెల్లవారి ఝామున నాలుగునుండి అర్ధరాత్రి పదకొండు దాక కాయకష్టం చేసుకొంటూ, ఊరంతా ఈగల్లా తిరుగుతూ  చువ్వల్లాగా వుండే వీళ్ళు లావయితే మరి నేను? నా ప్లేస్ లో ఇద్దరు పూలమ్ములు కూర్చోవచ్చు. ఆటో డ్రైవర్ కి ఇంకో ఇరవై వచ్చేవి.  గత రెండేళ్లు గా పెరిగిన నా వళ్ళు ఇతర ఇబ్బందులతో బాటు నేను ఇక ఆటోలు ఎక్కటానికి అనర్హురాల్ని చేసిందని ఆ క్షణాన నాకు అర్ధం చేయించేసింది పూలమ్మి.

“కారు తోలటం నేర్చుకోవాలి” అని గట్టిగా అనుకోవాలని అనుకొని …..బలహీనంగా అనుకొన్నాను. నేర్చుకోవటానికి పది సంవత్సరాల క్రితం నేను చేసిన ప్రయత్నం గుర్తుకి వచ్చింది.

డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఎంతో చమట కార్చి వాళ్ళకిచ్చిన పదిహేను వందలకు కాను…. పదిహేను రోజులకు కాను…. నాకు బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్ అనే పదాలు నేర్పించగలిగారు. తరువాత ఒక తెలిసిన డ్రైవర్ దగ్గర ప్రయత్నించాను. గడగడ వణుకుతా స్టీరింగ్ ముందు నేను కూర్చొని ఉంటే “ఒంగోల్లో పెద్ద పెద్ద మగాళ్ళే కారు తోలలేక పోతున్నారు. మీ వల్ల అవుద్దా?” లాంటి డైలాగ్స్ ఆయన నుండి విని కారు నుండి దూకేశాను.

ఈతముక్కలలో మా ఆత్మీయులు కోటిరెడ్డి గారి పాత మారుతి ఎమ్. ఎమ్ మీద నా కళ్ళు పడ్డాయి. వాళ్ళింటికి వెళ్ళి కారు నేర్పించమని కూర్చోన్నాను. ఆయన తటపటాయిస్తున్నాడు. వదిన “రమ అంతగా అడుగుతుంటే నేర్పించవే” ఆయనకు హుకుం జారీ చేసింది.

వాళ్ళది చాలా అన్యోన్య దాంపత్యంలే. ఆయన చదువుకోక పోయినా…. మెనోపాజ్ లో వచ్చే భయాలకు ఆమెను సైక్రియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళిన ఉత్తముడు ఆయన. మడనూరు తీసుకెళ్ళాడు నా డ్రైవింగ్ లో. వదిన కూడా ధైర్యంగా వెనుక కూర్చుంది.

“కారు వేగాన్ని బట్టి క్లచ్చి నొక్కి, గేరు మార్చాలి. ఎక్కువ తక్కువ గేర్లలో వెళుతుంటే కారు నడకే తెలిసి పోతుంది.” ఇలా సాగింది ఆయన పాఠం. ఉన్నట్లుండి ఎదురుగా బస్ వచ్చింది. నాకు చెమటలు పట్టి బ్రేక్ మీద కాలు గట్టిగా నొక్కి, చేస్టలు ఉడిగి ఉండిపోయాను. కారు ఆగి పోయింది. నా బుర్రకు ఏ సంకేతాలు అందలేదు. ఆర్.టి.సి. డ్రైవర్ బస్ ఆపేసి నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తున్నాడు బస్ లో నుండి.

కోటి రెడ్డి గారు తరువాత డ్రైవింగ్ సీట్ లోకి రావటం లీల గా గుర్తు ఉంది. మరుసటి రోజు బస్ ఎక్కినపుడు ఆ డ్రైవర్ “భలే వారే మేడం. నాకు బ్రేక్ పడక పోతే ఏమయ్యేది?” అని ఇంకా భయపెట్టాడు దుర్మార్గుడు. ఇక కారు తోలుడు వద్దని ప్రతిజ్ఞ చేసుకున్నాను.

నెల తరువాత అక్క, రఘు వచ్చారు. “నేను నేర్పుతానని” రఘు అన్నాడు. అక్క “వద్దు వద్దు” అని సైగలు చేస్తుంది.

ఇక్కడ మా బావ హైదారాబాద్ డ్రైవింగ్ గురించి చెప్పాలి. ఆయన కారు తోలుతుంటే కారులో వాళ్ళు ఎవరూ మాట్లాడ కూడదు. పొద్దున ఆరు నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే కారు తీస్తాడు. అక్కకి తొమ్మిది గంటలకు హాస్పిటల్ అయితే ఎనిమిదికే అక్కడ వదిలేసి వెళ్ళి పోతాడు. తన రూమ్ తాళాలు తెరిసిందాకా అక్క బిక్కు బిక్కు మంటూ బయటే ఉంటుంది. అయినా నా డ్రైవింగ్ మోజుతో ఆయనతో కారులో వెళ్ళాను. ఆయన ముందు జాగ్రత్తగా కారుకు పెద్ద ఎల్ స్టిక్కర్ అంటించాడు. బాగానే నడిపాను. కారు ఇంటి గేటు దాకా వచ్చింది. ఆయనకు ఎందుకో సడన్ గా బి.పి వచ్చింది. నేను గేటుని ఢీ కొడతానని ఆయనకు అనిపించి ఉంటుంది. ఆయన బ్రేక్, బ్రేక్ అని అరవటం, నేను నేరుగా గేటుకు కొట్టటం లిప్తకాలంలో జరిగి పోయాయి. అది మా అమ్మా, నాన్నలకు వాళ్ళ ముద్దుల అమెరికా కొడుకు కొనిచ్చిన కొత్త కారు. ముందంతా సొట్టలు పడి ముద్దు వచ్చేసింది. ఇక ఆ తరువాత నన్ను ఎవరు కారు ముట్టుకోనివ్వలేదు.

ఇప్పుడు కారు నేర్చుకోటానికి ఎవరిని ఎన్నుకోవాలి? అని గాలించాను. హనుమంతు ముందుకు వచ్చాడు. ఇతను ఇంతకు ముందు అమ్మ వాళ్ళకు కార్ డ్రైవర్. “నీకు కారు తోలటం వచ్చక్కా” అంటూ మొదలు పెట్టాడు పాఠం. మొదటి రోజు గ్రౌండ్, రెండవరోజు ఇంటి దగ్గర రోడ్, మూడో రోజు హైవే. నాల్గవ రోజు టౌన్ లోకి. ఐదవ రోజు మా ఈతముక్కల గుంటల రోడ్డులోకి. మా సంభాషణ ఇలా సాగేది.

“ఎదురుగా లారీ ఆగి ఉంది? ఏమి చేయాలి?”

“దగ్గరకు వచ్చాక స్లో చేసి గేర్ మార్చి పక్క నుండి పో”

“ఆ మనిషి దూరం నుండి వస్తున్నాడు. ఏమి చేయాలి?”

అతను వెళ్ళి పోతాడు. నడిచేవాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు.”

“ఉండక పోతే?’

“బ్రేక్ నీ కాలి లోనే ఉంది. టక్కున ఆపచ్చు”

నేను ఠక్కున బ్రేక్ వేసి టెస్ట్ చేసుకొన్నాను.

వెనక వస్తున్న లారీ గీమని అరిసి సడన్ బ్రేక్ వేసింది. లారీ డ్రైవర్ తిడుతున్నాడు. నన్ను కాదన్నట్లు యాక్షన్ చేసేశాను.

“ఒక వేళ వెనుక లారీ వచ్చి గుద్దుకొని వుంటే?”

“ఏమి కాదు. కారు డామేజ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఉంది కదా!”

“యాక్సిడెంట్స్ ఎక్కువ ఎందుకు అవుతాయి?”

“తాగుడు వలన, మితిమీరిన వేగం వలన అవుతాయి అక్క. మన కేమి కాదు.”

వాళ్ళు తాగి, వేగంగా నడిపి మన బండి మీదకు వస్తే?”

“ఆ ఛాన్స్ తక్కువ ఉంటుంది. లారీ డ్రైవర్లు వాళ్ళ లైన్ లోనే పోతారు. మనం మన లైన్ లో పోతే ఏమి కాదు.”

“ఈ గుంట వచ్చినపుడు ఏమి చేయాలి?”

“టైర్ ఒకటి ఆ గుంటలోకి దించి మొదటి గేర్ లో మెల్లిగా పోనివ్వాలి?”

“రెండు వైపులా గుంటలు వస్తే?”

“ఒక గుంటనే సెలెక్ట్ చేసుకోవాలి.”

ఒక వేళ ఎడ్జి లో దిగి కారు పక్కకు పడి పోతే?”

“ఏమి కాదు. బెల్ట్ వేసుకొని ఉంటావు కదా. ఎవరో ఒకరు రక్షిస్తారు. “

అలా నేను తోలరిని అయ్యాను. ఇప్పుడు హైవే మీద నలభై, గుంటల రోడ్డులో ఇరవై మీద పోతున్నాను.