ట్యాగులు

Ongoleరాత్రి పదకొండు గంటలకు ఖమ్మంలో పద్మావతి ఎక్స్ ప్రెస్ ఎక్కాను. అప్పర్ బెర్త్.  తిరుపతి కొండంత ఎత్తున కనబడింది. అది ఎక్కే సాహసం చేయలేక టి.సి. సీట్ లో కూర్చోన్నాను. జీవితంలో ఎప్పుడూ నిద్ర మొహం చూడనంతగా పెట్టెలో అందరూ దీర్ఘ నిద్రలో మునిగి ఉన్నారు. ఒక పాపతో వాళ్ళ అమ్మ తలుపు దగ్గరే నిలబడి ఉంది. ఆరు నెలల ఆ బుడతకు ట్రైన్ అంటే భయమట. మొహం ఏలాడేసి లోపలికి వస్తే బేరుమంటున్నది. నేను కాసేపు దాని నిద్ర కళ్ళను, ఏడ్చి ఏడ్చి జావగారిన బుగ్గలను చూస్తూ కూర్చోన్నాను. విజయవాడలో వేరే టి.సి ఎక్కాడు. నేను ఆయనకు ఆయన సీటు భధ్రంగా అప్పగించేసి ఇంకొకళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోన్నాను. అప్పటికి ఒంటి గంట అయ్యింది. ఇంకో రెండు గంటలకు ఆగితే ఒంగోలు వస్తుంది.

“ఏమ్మా మీ సీట్ ఎక్కడ?” టిసి అడిగాడు.

పైకి చూపించాను.

“మరి పడుకోండి”.

“నేను పైకి ఎక్కలేనండి. ఈ మధ్య కాలు దెబ్బ తింది. ఒక వేళ కష్టపడి ఎక్కినా ఒంగోలు రావటం పైన ఉంటే తెలియదు. ఆ చీకట్లో కిందకు దిగటం కూడా కష్టమే” చెప్పాను.

ఆయన తల గోక్కొని పెట్టె అంతా తిరిగారు. ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చేమోనని.

పెదవి విరుస్తూ “అందరూ నిద్ర పోతున్నారమ్మ” అంటూ వచ్చారు.

“ఫర్వాలేదు లెండి. నేను ఇక్కడే కూర్చోంటాను”.

ఆయనకు నిద్ర వస్తుంది. “మీరు ఎలాగోలా ఎక్కండి. ఒంగోలు వచ్చే పావుగంట ముందు నేను మిమ్మల్ని లేపుతాను. మెల్లిగా దిగవచ్చు.” బతిమాడుతున్నట్లు చెప్పారు.

ఆయనలా బతిమలాడటంలో “మీరలా దెయ్యంలా కూర్చొని వుంటే నేను ఎలా పడుకోవాలి?” అని ధ్వనించింది.

మొత్తానికి టిసి, అటెండర్, పాప తల్లి పర్యవేక్షణలో నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లు బెర్త్ అధిరోహించాను.

అయితే నిద్ర పోతే వట్టు. టైమ్ చూసుకొంటూనే ఉన్నాను. ఎంతకూ టిసి నుండి పిలుపు రాలేదు. దిగితే “నేను లేపుతానని అన్నాను కదా” అంటాడేమోనని భయం. ధైర్యం చేసి మెల్లిగా క్రిందకు జారాను. బాగ్ తీసుకొని గేట్ దగ్గరకు వచ్చాను. చల్లని గాలి మొహానికి తగిలి హాయిగా అనిపించింది. టైమ్ చూస్తే మూడుంపావు. “ఒంగోలు స్టేషనుకు స్వాగతం” అని ఎంత సేపటికి వినబడటం లేదు. అనుమానం వచ్చి బయటకు చూశాను. ఎదురుగా హై వే మీద కార్లు పోతున్నాయి. ఒంగోలు దాటి పోయిందని అర్ధం అయ్యింది. కంగారుగా పర్స్ చూసుకొన్నాను. చిల్లరంతా లెక్క పెడితే యాబ్భై రూపాయిలే ఉన్నాయి. డెబిట్ కార్డులు, ఆన్ లైన్ రిజర్వేషన్ల పొగరుతో నేను డబ్బులు ఉంచుకోవటం మానేశాను. ఈ ట్రైన్ ఎక్కడ ఆగుతుందో తెలియదు. అక్కడ నుండి ఇంత రాత్రి వెనక్కి ఎలా రావాలి? మధ్యలో చెకింగ్ వస్తే ఎలా?

చివరకు రైలు కావలి లో ఆగింది. దిగుతూ టిసి సీట్ వంక చూశాను. గుండెల మీద చెయ్యి పెట్టుకొని హాయిగా నిద్ర పోతున్నాడు. “ఈయన నేను ఒంగోల్లో దిగిపోయాను అనుకొంటే బాగుండు.” అనుకొంటూ కాలు సాగించాను. కావలి టిక్కెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి “ఒంగోలుకు ఏదైనా ట్రైన్ ఉందా?” అని అడిగాను. ఆయనకు నాలాంటి వాళ్ళు అలవాటే అనుకొంటాను. “నాలుగుంబావుకి పాసెంజర్” అని అరిచాడు. నా దగ్గర డబ్బులు అన్నీ ఆయన ముందు పోసి “ఒంగోలు” అన్నాను బిక్కు బిక్కుమంటూ. ఆయన దయతో నన్ను చూసి ఒక్క పదిహేను రూపాయలే తీసుకొని టిక్కెట్ ఇచ్చాడు.

రైలు రాగానే ఒక గుంపుతో బాటు ఎక్కాను. వాళ్ళ దగ్గరే కూర్చోన్నాను ఎందుకైనా మంచిదని. “ఏడకు బోవాలా?” యానాదులు లాగున్నారు. బియ్యం మూటలు, పిల్లా పాపలతో ఎక్కడికో వెళుతున్నారు. “ఒంగోలు” చెప్పాను. నన్ను ఆనుకొని వాళ్ళ అమ్మాయే, ఒక ఐదేళ్ళ పిల్ల కూర్చొని ఉంది. దాని మెత్తటి పొట్ట నాకు తగులుతున్నది. ఎర్రటి జుట్టు. బొందెల, చిన్న జాకెట్టు వేసుకొంది. ఆమె కళ్ళు నీలంగా నన్ను నిర్వికారంగా గమనిస్తున్నాయి. ఆ కళ్ళు చూస్తూనే ఉన్నాను … నా కళ్ళు మూతలు పడ్డాయి.

“మే! ఆ యమ్మను లేపండే. ఒంగోలు వచ్చినాది.” ఏదో గొంతు అరుస్తూ వినబడుతున్నది. మెత్తటి పొట్ట ఏదో నా మీద పడి కుమ్ముతూ ఉంది. ఉలిక్కి పడి లేచాను. “ఒంగోలు స్టేషన్ కు స్వాగతం.” బయట కేకలు. బాగ్ తీసుకొని ఒక్క ఉదుటున కిందకు దూకాను. నన్ను నిద్ర బుచ్చి,మళ్ళీ నిద్ర లేపిన ఆ నీలి కళ్ళు కిటికీలో నుండి నవ్వుతున్నాయి.