jadoo--621x414“ఏంటీ? మెత్తగా ఉన్నావు?”

“నీకేలా తెలిసింది ఫోన్ లో?”

“తెలుస్తుందిలే. నీ గొంతులో తేడా ఉండదూ? ఆ మాత్రం అర్ధం కాక పోతే మన ముప్పై ఏళ్ళ స్నేహానికి పక్వం తగ్గినట్లు అవదూ? కౌశిక్ నేనిక చదవను. ఫుట్ బాల్ ప్లేయర్ నవుతానని మళ్ళీ అన్నాడా ఏమిటి? ”

“లేదులే. వాడు దారిలోకి వచ్చాడు. మొన్నా మధ్య నీకు చెప్పాను కదా మా కొలీగ్ సీత విషయం?”

“అవును. వాళ్ళాయన హింసిస్తుంటే నీ దగ్గరకు వచ్చి ఏడ్చిందనీ, పోలీస్ కేస్ పెట్టటానికి నిన్ను తోడు రమ్మనిందని అన్నావు. ఏమయింది ఆ విషయం?”

“ఒకనాడు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి అర్జంటుగా రమ్మనమని అంటే పరిగెత్తుకెళ్ళాను. వంటి నిండా దెబ్బలు. కడుపు రగిలి పోయింది. స్టేషన్ కి వెళ్ళి కంప్లైన్ చేశాము. పోలీసులు అతన్ని పిలిపించి తిట్టారు. కేస్ కూడా ఫైల్ చేశారు. తరువాత కొన్ని రోజులు ఆమె నన్ను కాంటాక్ట్ చేయలేదు. ఈ రోజు తెలిసింది. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసే ఉన్నారని. కేస్ విత్ డ్రా చేసుకొందట ”

“దానికి నువ్వు ఆలోచించటం ఎందుకు? ఈ సారి పిలిస్తే పోకు. ఆమె సమస్యను ఆమే పరిష్కరించుకొనీ.”

“అదికాదు. ఆమె రాజీ పడటానికి కారణం భర్త మారాడని కాదు. భర్త ద్వారా వచ్చే కొన్ని సౌకర్యాలు వదులుకోలేక. ఆయన ఉద్యోగం హోదా, ఆయన చేసిపెట్టే చిన్న చిన్న పిల్లల పనులు … వీటి కోసం.”

“కొంత మంది చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళకు అన్నీ తెలుసు. లౌకిక విషయాల పట్ల మనకంటే ఎరుకతో ఉంటారు. వాళ్ళు చెప్పే విషయాలు విని మనం రక్తం మరిగించుకొంటాం. నీకు చెప్పాను కదా మా పక్కింటి లలిత, ఆమె కొలీగ్ తనను ఫోన్ లో ఇబ్బంది పెడుతున్నాడని, నన్ను వాళ్ళింటి డాబా మీదకు తీసుకొని వెళ్ళి చెప్పిందని.”

“అవును. అప్పుడు చెప్పావు. కొన్ని రోజులు ఆమె ఫోన్ కూడా నీ దగ్గర పెట్టుకొని నువ్వే లిఫ్ట్ చేసేదానివి. ఆమె తోడుగా నువ్వు ఒకరోజు ఆమె ఆఫీసు వరకు వెళ్ళావు. వాడు దొరికితే కొడతానని కూడా అన్నావు నాతో.”

“ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా స్నేహంగా ఉంటుంన్నారట. మొన్న నన్ను చూసి తల వంచుకొని మౌనంగా వెళ్ళి పోయింది. నేనిప్పుడు తనతో మాట్లాడటం లేదులే.”

“అవునా?!”

“అవును. ఆమెకు ఆయన స్నేహం వలన ఆఫీసులో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఆయనకా మధ్య ప్రమోషన్ వచ్చి ఒక కీలక పోస్ట్ లోకి వెళ్ళాడు.”

“అయితే మాత్రం. మరి నీతో ఆయన బాధిస్తున్నట్లు ఎందుకు చెప్పాలి?”

“అదంతే. లోకజ్ఞానం లేకుండా ఎవరేమీ చెప్పినా నమ్మటం, ఉద్రేకపడటం మన బలహీనత. వాళ్ళకేమి కావాలో వాళ్ళకు తెలుసు. ఇకనైనా తెలివిగా ఉందాం.“

“నిజమే.”

…….

“ఏమిటి అర్జంట్ గా ఫోన్ చెయ్యమన్నావు.”

“నువ్వు నన్ను తిట్టకూడదు.”

“ఏమైయ్యింది?”

“సీత రాత్రి పిల్లలతో మా ఇంటికి వచ్చేసింది. వేరుగా ఉంటానూ, నీ సాయం కావాలంది. కాదనలేక పోయాను ఆమె మొహం చూసి. పాపం! భర్తను వదిలేసి ఒక్కసారిగా బయట పడటానికి ఆత్మస్థైర్యం చాలా వద్దూ! పైగా ఆమె తల్లిద్రండులు సపరేషన్ వద్దంటున్నారట. ఎలాగోలా సర్దుకు పొమ్మన్నారట. మనం సాయం చేయక పోతే ఎలా? నువ్వు నన్ను తిట్టద్దు”

“ ….. “

“ఏమిటి కోపమా? అంత ప్రాక్టికల్ గా ఉండలేమబ్బా. నీకు బాలాన్స్ చేయటం వచ్చుననుకో. ఎక్కడ ఉన్నావు గోల వినబడుతుంది?”

“ హాస్పిటల్ కారిడార్ లో.”

“ఏమయ్యింది?”

“లలితకు బాగా లేదు. డెంగ్యూ అంటున్నారు. చూడలేకుండా ఉండలేక పోయాను. నన్ను చూడగానే మొహం వెలిగి పోయింది. చాలా చిక్కి పోయిందిలే పాపం. అయినా ఆయనతో తన స్నేహం తన ఇష్టం కదా. ఒక సారి నాకేదో చెప్పిందనీ, దానికి తను కట్టుబడి ఉండలేదని నేనెందుకు అనుకోవాలి? తన ఇబ్బందులు తనవి. స్నేహానికి కండిషన్స్ పెట్టటం తప్పు కదా. ఏ బంధం కూడా అవతల వాళ్ళను కబ్జా చేయటానికి ప్రయత్నించకూడదోయ్. ఏమంటావు? ”