ట్యాగులు

జడలు వేసుకొనే మట్టి మనుషుల వీరోచిత విప్లవగాధలు – చైనా విప్లవ పోరాట సాంప్రదాయాలు

China-Long-Marchచరిత్ర అధ్యయనం ఎప్పుడూ ఆసక్తికరంగాగానే ఉంటుంది. ఆ చరిత్ర ఒక విప్లవోద్యమ చరిత్ర అయితే ఇంక పుస్తకం పూర్తి అయ్యే నాటికి రక్తంలో ఆమ్లజని శాతం పెరుగుతుంది. శరీరంలో పాజిటివ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. చేతులు చాచి మైదానాల్లో పరిగెత్తాలనిపిస్తుంది. గొంతెత్తి ఉత్తేజగీతాలు ఆలపించాలనిపిస్తుంది. నడుం బిగించి కార్యరంగంలో దూకాలనిపిస్తుంది. పై చేష్టల్లన్నింటినీ ప్రేరేపించే గుణగణాలున్న పుస్తకం “చైనా వి‌ప్లవ పోరాట సాంప్రదాయాలు.”

వామపక్ష సాహిత్యానికి ‘చదివించలేని’ తత్వం ఉంటుందనే విమర్శ పూర్తిగా కొట్టి వేయాల్సింది కాదు. కఠినమైన, అర్ధం కాని (అనువాదాల నుండి దిగుమతి చేసుకొన్న) పిడి పదాలు …. క్లిష్టమైన వాక్యాలు …. వెరసి ఆ సాహిత్యం పట్ల అంతులేని అనురాగం ఉంటే తప్ప చదవలేని పరిస్థితి చాలా పుస్తకాలు కల్పిస్తాయి. కానీ ఈ పుస్తకం అందుకు భిన్నంగా చదువరి పుస్తకాన్ని ప్రేమిస్తూ ముందుకు జరుగేటట్లు చేస్తుంది. ఇందులోని వస్తువే కాదు … శైలి, పదాల ఎన్నికలోని సరళత, సహజత …. పూర్తిగా చదివిందాకా వదల బుద్ది కాని పరిస్థితిని కల్పిస్తుంది.

చైనాకు, భారత దేశానికి మధ్య భౌగోళిక, నైసర్గిక దగ్గరితనం ఉంది. రెండూ వ్యవసాయ ఆధారిత దేశాలే. భారతదేశంలో విప్లవం రావాలని కోరుకొనే వాళ్ళు, ఆ కృషిలో పాలు పంచుకోవాలనుకొనే వాళ్ళు మనకంటే ముందు ఆ లక్ష్యాన్ని చేరుకొన్న చరిత్ర తప్పక చదవాలి. ఆ విజయం వెనుక ఒడ్డిన ప్రాణాలను లెక్క పెట్టుకోవాలి. చేసిన త్యాగాలను కళ్ల కద్దుకోవాలి.. దానికై పన్నిన వ్యూహాలను గుర్తెరగాలి. పునాదిగా వేసిన సిద్ధాంత పటుత్వాన్ని తట్టి చూడాలి. ఆ పునాదిపై నిర్మాణానికి చేసిన కఠోరమైన పరిశ్రమను పరికించాలి. చివరగా ఈ సాంప్రదాయాలు మన దేశ పరిస్థితులకు ఎలా అన్వయించాలో అధ్యయనం చేయాలి. చంద్రంగారు ఈ పుస్తకం రాసి విప్లవ కార్యశీలురకు, విప్లవ స్వాప్నికులకు పని సులువు చేశారు.

కొన్ని పుస్తకాలు అధ్యయనానికి దారులు వేస్తాయి. ఆయా పుస్తకాలలో ప్రస్తావించిన అనేక అంశాలపై ఆపేక్ష పెరిగి లోతులకు వెళ్ళి చదవాలనే కోరిక పెరుగుతుంది. పాఠకుని జ్ఞానతృష్ణను పెంచి … అతడు లేక ఆమె ప్రాపంచిక దృక్పధాన్ని ప్రభావితం చేసే సత్తా కలిగి ఉంటాయి అవి. వారు నడిచేటపుడు దారి దీపాలవుతాయి. “చైనా విప్లవ సాంప్రదాయాలు” పుస్తకం ఆ విధంగా చదువరులకు ఉద్దీపనము, ఉత్తేజితము అవుతుంది. 1989లో ఈ పుస్తకం మొదట ప్రచురితం అయినపుడు చదివాను. విప్లవ రాజకీయ నవలలు కొత్తగా ఆ బాటలో వచ్చిన వారికి ఉత్సాహానిస్తాయి. తరువాత సిద్దాంతం ప్రాతిపాదికగా ఉన్న ఇలాంటి విప్లవ చరిత్రలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పుస్తకం 2010 దాకా మళ్ళీ ప్రచురణకు నోచుకోక పోవటం శోచనీయం. విప్లవ శ్రేణుల రాజకీయ ఎదుగుదల అవసరరీత్యా చూస్తే బాధ్యతారాహిత్యం కూడా.

భారదేశ విప్లవానికి వ్యవసాయ విప్లవం ఇరుసు. ఈ దశలో గ్రామాల్లో భూస్వాములకు, వాళ్ళ గూండాలకు వ్యతిరేకంగా చిన్నకారు, మధ్య తరగతి రైతులు, రైతుకూలీలు చేసే కొన్ని చట్టబద్ద, చట్టవ్యతిరేక పోరాటాలు అంతిమంగా వాళ్ళ భూముల స్వాధీన దశకు చేరుకొంటాయి. ఈ క్రమంలో ఏర్పడే ఘర్షణలను ఎదుర్కోవటానికి అవసరం అయ్యే ఆయుధాలు … ప్రజలు, వారికి దన్నుగా నిలబడ్డ విప్లవ కార్యకర్తలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రతిఘటన స్థాయిలోనే ఉంటుంది. సాయుధ విప్లవానికి సన్నాహక దశ అయినా ఈ ప్రతిఘటనోద్యమం యొక్క విశిష్ట ఆవశ్యకత గురించి చర్చనీయం అయిన ఈ సందర్భంలో ఈ పుస్తకం మరొకసారి అందరూ చదవాల్సిన అవసరం ఉంది. చైనా వి‌ప్లవ ప్రారంభం నుండి మావో నాయకత్వంలో వారు ఆయా పరిస్థితులకు అనుగుణంగా తీసుకొన్న పోరాట రూపాలను ఇప్పుడు మననం చేసుకోవటం సందర్భోచితం అవుతుంది. అలాగే విముక్తి కోసం చైనా కమ్యూనిష్టు పార్టీ కేడరు, ప్రజలు చేసిన త్యాగాలు మోయటం ఈ నాటి వి‌ప్లవ సంస్థలకు ఆవశ్యకమే కాదు అనివార్యం కూడా.

ఈ పుస్తకంలో చైనా వి‌ప్లవ గతి ఎలా సాగిందో కళ్ళకు కట్టినట్లు వర్ణనతో బాటు కొన్ని ముఖ్యమైన సంగతులు వక్కాణించి చెప్పారు. చైనా కమ్యూనిష్టు పార్టీలో తలయెత్తిన అతివాద, మితవాద ధోరణులు విప్లవ గమనానికి చేసిన నష్టాలు …. మావో వాటిన ఓపిగ్గా సరిచేసిన వైనం బాగా వివరించారు. చైనా కమ్యూనిష్టు పార్టీ బాల్యావస్థ నుండి తన కనుమరుగు వరకు సిద్దాంత సమతుల్యానికి ఆయన అలుపెరుగని పోరాటం చేసారు. పార్టీ ప్రాధమిక దశలో, పోరాటాలను చట్టబద్దం చేసి సిద్ధాంతాన్ని మేధావి వర్గానికే పరిమితం చేయాలనే మితవాద ధోరణి నుండి చైనాలో బూర్జువా ప్రజాస్వామిక విప్లవకర్తవ్యాలను నిర్వహించనవసరం లేదనే అతివాద ధోరణి వరకు తిరస్కరించగలిగారు. బూర్జువా ప్రజా స్వామిక విప్లవం విజయవంతం అయ్యి, పెట్టుబడీ దారి విధానం అభివృద్ధి చెందేదాక కార్మిక వర్గం వేచి ఉండాలనే చెంటూషి వాదనను కూడా పార్టీ మూడవ జాతీయ మహా సభలో తిప్పి గొట్టారు. అతివాద పంధా వలన ప్రజాస్వామిక ప్రభుత్వానికి, సోషలిష్టు ప్రభుత్వానికి గల వ్యత్యాసం గందరగోళం అయ్యింది. చైనాలో తిరుగుబాట్లు విఫలం అవటానికి కారణాలు ప్రజల సంసిద్దత లేక పోవటం కాదు, నాయకులు అనుసరించిన తప్పుడు ధోరణులే. ఈ తప్పుడు ధోరణుల మూల్యం ఒక్కోసారి వేల ప్రాణాలతో చెల్లించాల్సి వచ్చింది. కానీ మావో ప్రతి మూల మలుపులో చైనా పరిస్థితులను ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ సరైన ఉద్యమ పంధాను నిర్వచిస్తూ, చిన్న నిప్పురవ్వని దావానలంగా మార్చగలిగాడు.

వైరుధ్యాలను అర్ధం చేసుకోవటంలో మావో నిష్ణాతుడు. సామ్రాజ్యవాదల మధ్య వైరుధ్యాలని అర్ధం చేసుకొని, జాతీయ బూర్జువాలతో కలిసి విశాల ఐక్య సంఘటన అవసరాన్ని ఆయన పదే పదే నొక్కి చెప్పాడు. ఆ దిశగా అంతర్గతంగా పార్టీనూ, బయట చాంకై షేక్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. చాంకై షేక్ బ్రిటన్, ఫ్రాన్స్ అనుకూల నైజాన్ని జపాన్ సామ్రాజ్యవాదాన్ని జయించటానికి సోపానంగా మార్చుకోవటానికి ఆయన చేసిన ప్రయత్నం ఈ పుస్తకంలో విస్తృతంగా చాలా చోట్ల చర్చించబడింది. ఒకానొక కీలక సమయంలో భూస్వాముల భూముల స్వాధీనం కూడా వాయిదా వేయటానికి సిద్దపడింది చైనా కమ్యూనిష్టు పార్టీ.

మావో యుద్ద వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు చైనా విప్లవం సఫలీకృతం కావటానికి కీలకమైనవి. గెరిల్లాలు, రెడ్ గార్డ్స్, వలంటీరు దళాలు… అవసరాన్ని బట్టి వారు సాగించిన మొబైల్ యుద్దాలు, శత్రువుని చికాకు పెట్టే గిరిల్లా యుద్దాలు, అంతిమంగా సాయుధ దళాల విముక్తి పోరాటాల వర్ణన వళ్ళు గగుడ్పొడిచేటట్లు వర్ణించారు. లాంగ్ మార్చ్ ప్రారంభం కావటానికి దోహదం చేసిన పరిస్థితులు ఇందులో మనకు బాగా అర్ధం అవుతాయి. లెక్క లేనన్ని ఆర్ధిక, రాజకీయ, పాకృతిక, మానసిక కష్టాలను సహించి షెన్సీలోని విముక్త ప్రాంతానికి చేరిన తీరు మరికొంత విపులీకరిస్తే బాగుండేదనిపించింది.

చైనా విప్లవోద్యవంలో సాహితీ రంగంలో కళాకారుల, రచయితల పాత్ర ఎన్నదగినది. కొమిటాంగ్ ప్రభుత్వం వారిపై మోపిన ఉక్కుపాదానికి మూడు లక్షలమంది హత్యగావింప బడ్డారు. లూసన్ మాహాయోధుడిగా నిలబడి వి‌ప్లవ సంస్కృతిని భుజాన మోసి కాపాడాడు. అలాగే చైనా కమ్యూనిష్టు పార్టీ ఆధ్వర్యాన పెకింగ్ లో ఏర్పడిన విధ్యార్ధి సంఘ కార్యాకలాపాలు, వారు చేసిన త్యాగాల గురించి ఈ పుస్తకం దృష్టి పెట్టి వివరించింది. చైనా విముక్తి సాధించిన తరువాత కూడా సాంస్కృతిక విప్లవంలో వారి పాత్ర అనన్యమైనది. చైనా ప్రజల వీరోచిత ప్రతిఘటనకు దోహద పడిన అంతర్జాతీయ పరిస్థితుల గురించి కూడా రాసారీ పుస్తకంలో. జపాన్ సామ్రాజ్యవాద యుద్దంలో మానవ జాతి చరిత్రలో మాయని మచ్చగా మిగిలి పోయిన మారణకాండ కళ్ళకు కట్టినట్టు వర్ణించబడింది.

మహత్తర సాయుధ పోరాటం చేసి సాధించుకొన్న విప్లవ ఫలాలని పూర్తిగా అనుభవించకుండానే రివిజనిజం జడలు విప్పి మింగేసింది. చైనా ప్రజల అసమాన త్యాగాల మీద నిర్మించుకొన్న చైనా నవ నిర్మాణం అవకాశవాదుల కబంధ హస్తాల బలిమికి కూలిపోతుంది. మావో అనంతర చరిత్ర చదువుతుంటే ఇవే భావాలు కలుగుతాయి. అయినా, నాగరికత అని చెప్పబడ్డ ప్రపంచానికి దూరంగా బ్రతికిన చైనా మూల వాసులూ, జడలు వేసుకొనే మట్టి మనుషులూ సామ్రాజ్యవాద రాక్షసిని ఎదురొడ్డిన సాహసం నభూతో న భవిష్యత్తు. పీడిత ప్రజల విముక్తి యుద్దాలకు కావలసిన ముడి సరుకులు తెగువ, త్యాగం అనీ …. సిద్దాంతం, నాయకత్వం వాటిని ముందుకు నడిపించే కరదీపికలు అని “చైనా పోరాట సాంప్రదాయాలు” పూర్తిగా చదివాక నిర్ధారణకు వచ్చి పుస్తకం మూస్తాము.

అక్షర దోషాలను సరి చేసి, నూతన పరిణామాల్ని జోడించి మళ్ళీ మళ్ళీ ముద్రణ పొందాల్సిన పుస్తకం ఇది.