ట్యాగులు

IMG_3673ఒక ఇరవై ఏళ్ళు అమ్మ, నాన్నల మమకార స్పర్శ అనుభవించాడేమో అంతే! బెనారసు యూనివర్సిటీలో ఎం.ఎతో బాటు, చదువు కానిదేదో నేర్చుకొన్నాడట. అక్కడే ఏదో జరిగిందట. అప్పుడే భారతదేశంలోకి ప్రవేశించిన కమ్యూనిష్టు పార్టీ ఉత్తుంగ తరంగాలతో పరవళ్ళు తొక్కుతూ ఆయన్నివెతుక్కొంటూ వెళ్ళి నిలువెల్లా తడిపి పులకరింపచేసిందేమో! ప్రజలతో మమేకమయ్యే సూత్రాన్ని రక్త కణాల్లో వంటబట్టించిదేమో! కులం, వర్గం నుండి ఆయనను ఒత్తిగలించి…. పీడిత ప్రజల పక్షపాత దీక్షను చేపట్టించి … అరివీర సిద్ధాంత యోధుడిగా, కమ్యూనిష్టు క్రమశిక్షణా ధీరుడుగా శిక్షణ ఇచ్చి, యోగ్యతాపత్రంతో ఆంధ్ర రాష్ట్రానికి సాగనంపిందేమో! ట్రంకు పెట్టెతో ఇంటికి వెళ్ళలేదు మరిక.

ఆ తరువాత ప్రకాశం జిల్లా పల్లెలు ఆయనను పూరి గుడిసెల్లోనూ, చెట్టు చేమల్లోనూ, చెమట చుక్కల్లోనూ చూసాయట. ఎర్రటెండలో నాగజెముడు చెట్లు నీడ నిచ్చి, వాడి ముళ్ళతో పహరా కాసాయట. తెల్లతెల్లని ఈ స్ఫురద్రూపిని నల్లనల్లని దళిత వాడలు అబ్బళించుకొన్నాయట. ఆకలేళ అమ్మలయ్యాయట. గాదెల్లో, గడ్డి వాముల్లో, ఎడ్ల కొట్టాల్లో దాచుకొన్నాయట. కడలి పుత్రులు కంటి రెప్పలతో కాపు కాసారట. పల్లె తల్లులు కడుపులో పిండం మాదిరి సాకారట. అంతగా పల్లెలను పూనిన ఈ పెద్ద మనిషి వాళ్ళ కోసం ఏమి చేశాడట?

పిచ్చి మానికల కొలతలకు వ్యతిరేకంగా సొంత ఇంటి నుండే తగాదా మొదలు పెట్టాడట. మంగలి మాన్యాలు వారికే ధారాదత్తం చేయటానికి ఊరి పెత్తందారులతో తలపడ్డాడట. కూలీ రేట్ల కోసం బీదాబిక్కీ వైపు నిలబడి కామందులతో కొట్లాడాడంట. దళితులను మంచినీటి చెరువులవైపు ముందుండి నడిపించాడంటా. వారికి ఆలయ ప్రవేశం కోసం ఈ జీవితకాల నాస్తికుడు అహర్నిశలు శ్రమించాడట. ఏమి విచిత్రమమ్మ? ఎంత కమ్యూనిష్టు పార్టీ వెనక ఉంటే మాత్రం!

“భూమి ఒక ప్రకృతి వనరు. అది తరం నుండి తరంకు బదిలీ అవుతుంది కానీ దానికి బరులు గీచి సొంతం చేసుకోవటానికి హక్కెవరికి ఉంది?” ….. చివరదాక అదే ప్రశ్న ఆయన నొసటిలో, మనసులో, గొంతుకలో. ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఆయన  రాజకీయ పార్టీల గల్లా పట్టుకొన్నాడు. కండలు కరిగించి గింజను సృష్టించే మొలగోచీ దేశ మూలవాసికి గంజికి గారెంటీ ఇవ్వని భూసంస్కరణ చట్టాల్ని బూజు వదిలించమన్నాడట. అందరి గుండెలు లబ్ డబ్ అంటాయి కానీ ఆయన గుండెలు ఎప్పుడు ‘పేదలు, భూమి’ అంటాయట., ఆయన ఆత్మకు దగ్గరగా ఉండే టాన్యా అక్క మొన్న చెప్పింది.

తమ్ముడ్ని పోలీసులు కాల్చేసినా ఆఖరి చూపుకు కూడా రాని ఆయన … ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీ ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేయటానికి మాత్రమే రహస్య జీవితం నుండి బయటకు వచ్చాడు. మరింక ఆయనకు పల్లెలు ఉల్లం పరిచాయి. భుజాలమీద కాదు, గుండెలపై ఊరిగించాయి. కాడె పట్టిన ప్రతి చెయ్యి కంకి కొడవలిలో ఉన్న ఆయన గుర్తుకు ముద్ర గుద్దింది. కారే ప్రతి చెమట చుక్క ఆయన విజయానికి మంగళారతులు పాడింది. బక్క చిక్కిన జనుల మురికి పట్టిన వేళ్ళ ముద్రలు ఆయనను వాళ్ళ ప్రతినిధిగా చేసుకొన్నాయట. కండ పట్టిన డబ్బు దస్కంగాళ్ళు మొహాలు చాటేశారట.

అప్పుడు తీరిందట ఆయనకు పెళ్ళి చేసుకోవటానికి, 39 ఏళ్ళకు. కృష్ణా జిల్లా, కాటూరు కమ్యూనిష్టు కుంపటి నుండి వచ్చిన పదిహేడేళ్ళ సులోచనమ్మ బిక్కుబిక్కు మంటూ ప్రకాశం జిల్లా, మైనంపాడు గ్రామ, మాదాల ఇంటి ఇల్లాలు అయ్యిందట. భుజాన సంచి తగిలించుకొని వెళ్ళిన  మగడు ఆరునెల్లకొకసారి ఇంటికి వచ్చినా ఆయన ఆత్మను స్పృశించే ప్రయత్నమే కానీ ఆటంక పరిచి ఎరుగదు ఆ తల్లి ఏనాటికీ. ఆయన ప్రయాణాలకు బట్టలు సర్ది, మందులు పొట్లాలు కట్టి, జాగ్రత్తలు చెప్పి పంపే మామూలు ఇల్లాలు అనుకొనేరు మీరు. చాలా పొరపాటు మాట అది. అరవయి ఏళ్ళ సేవ చేసి చివర్లో “నేను ముందు చనిపోతే ఏమి చేస్తారు?” అని అడిగితే “ మా పార్టీ ఆఫీసుకు పోతా” అని దర్జాగా పలికిన భర్తను భరించటం మామూలు పాతివ్రత్యానికి చేతనవుతుందా? సంసారాన్ని నివాసానికే తప్ప ఐహికంగా ఎప్పుడు మదికి రానివ్వని మగనిని ధర్మంగానే సేవించిందంటే నమ్మ వచ్చా? ఏమో మరి! “పిల్లలెంత మంది?” అని ఎవరైనా అడిగితే “సులోచనా!” అని పిలిచే భర్త భార్యాధారితను, కమ్యూనిష్టు ఆత్మను అర్ధము, అంగీకారమూ చేసుకొని సంసారపు కాడిని ఒంటి భుజంపై లాగిన కనబడని సామ్యవాద స్వాప్నికురాలు ఆమె. ఈ మాట ఆమెను ఒప్పించటం ఎవరి తరము కాదులెండి. ఆమె భర్తను ప్రేమించిందో, ఆయన ఆశయాన్ని ప్రేమించిందో, ఆయన శ్రమించిన పార్టీని ప్రేమించిందో, పార్టీ తాడును పట్టుకొన్న కార్యకర్తలను ప్రేమించిందో, పార్టీ నీడన ఉన్న అశేష పీడిత ప్రజలను ప్రేమించిందో ఆమె దగ్గరి వారికి మాత్రమే తెలుసు.

పార్టీలు చీలాయి, పంధాలు మారాయి. ఎక్కడ రాజీ పడలేదు ఆయన. “భారతదేశ విప్లవానికి ఇరుసు వ్యవసాయిక విప్లవమే.” అని నమ్మి భూమి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ …. అవి ఉప్పు రైతుల భూములు కావచ్చు, సముద్ర తీరానా ఉన్న చవుడు నేలలు కావచ్చు ….. సీలింగ్ భూములు కావచ్చు.., దేవాదాయ భూములు కావచ్చు… భూస్వాములు ఆక్రమించుకొన్న చెరువులు, కుంటలూ, వంకలు కావచ్చు…. పేదలకు ధారాదత్తం చేయమని అడుగుతూ కర్ర పోటుతో కూడా వచ్చి నిలబడ్డాడు. “ భారతదేశంలో భూసమస్య ప్రధానం కాదన్న” వారిని కంటి చూపుతో ఏవగించుకొన్నాడు.

వందేళ్ళ మర్రి మాను తుఫానులకు, ఉప్పెనలకు నిలదొక్కుకొని నేడు కూలి పోయింది. ఇక్కడ అందరూ సానుభూతి చూపిస్తుంది ఎవరికి? సులోచనమ్మకు, విద్యన్నయ్యకు, బీనక్కకు, ప్రమీలక్కకు, రఘుకు, సరితకు మాత్రమేనా? మరి ఆయన వెలిగించిన దారి దీపం సాయంతో నడక సాగిస్తున్న కార్యకర్తల మాటేమిటి? స్వామిగారికి పేద ప్రజల విముక్తి పట్ల ఉన్న నిబద్ధతపై నమ్మకంతో, ఆయన వంక ఆశగా చూస్తూ అనాధలైన మూడొంతుల శ్రామిక జనానికి సానుభూతి ఎవరూ ప్రకటించరే?

అన్నట్లు ఈ విషయాలు నేను రాశానని ఆయనకు ఎవరూ చెప్పోద్దే! పెద్దల నొప్పించి …. పురోహితుడై …. ప్రేమించిన వాడితో పెళ్ళి జరిపించినా…. ఆయన బతికి ఉండగా ఆయన గురించి కలం విదల్చటానికే కాదు, ఆయన కాలి గోరు తాకటానికి కూడా నాకు సాహసం లేదు. నేను ఎక్కడ ఉన్నా, నా విషయాలు తెలుసుకొంటూ ఆయన అదృశ్యంగా నాకిచ్చిన దన్నును…. ఆయన సంతాప సభలో ఒక మూల వంటరిగా కూర్చొని తడుముకొన్నానని చెప్పద్దు. ఆయన లేని నిజాన్ని ఆ సంతాపసభలో ఖరారు చేసుకొని …. ఎవరితో మాట్లాడాలనిపించి అనిపించక ఒంటరి ప్రయాణం చేసానని చెప్పద్దు. ఎందుకంటే ఆయనకు వ్యక్తి ఆరాధన నచ్చదు. సమూహాన్ని ప్రేమించమంటాడు. సమూహ సమిష్టి అవసరాలను ప్రేమించమంటాడు. ఒక టాన్యక్కలో, ఒక చిట్టిపాటిలో, ఒక నాంచార్లులో, ఒక మోహన్ లో , ఒక సాగర్ లో….ఇంకా వందలవేల రైతుకూలీ ఉద్యమ కార్యశీలురుల్లో తన ఛాయలు కొన్ని వదిలి పోయాడట. వెదికి చూసుకోవాలిక. ఆయన ఇంటి ముంగిట్లో పూసిన తెల్లగులాబీ గుత్తుల్లో ఎర్రెర్రని రంగుల్ని దర్శించాలిక.