ట్యాగులు

2అప్పుడు నాకు పాతికేళ్ళు, ఆమెకో ముప్పై ఏళ్ళు ఉంటాయేమో. హైదరబాద్ ఇమ్లీబన్ బస్టాండ్ లో కలిసింది ఆమె. నాతో ఉన్న కుర్రాడు ‘రంగవల్లి అక్క’ అని స్వరంలో ప్రేమను జోడించి చెప్పినపుడు ఆమె ఎవరో ముఖ్యమైన వ్యక్తి అని మాత్రమే అర్ధం అయ్యింది. ‘రాజన్న భార్య’ గొంతు తగ్గించి, ఎక్కడో చూస్తున్నట్లు నటిస్తూ వాడు చెప్పినప్పుడు మాత్రం కుతూహలంగా ఆమెను గమనించాను. కృత్రిమ సమాజపు విసిగింపు తలభారంగా మారి, నన్ను నన్నుగా అంగీకరించే ఒప్పుకోలుకై ఆశించే వయసది. తల్లకిందులగా వేలాడుతున్నవిలువల హేతుబద్దతని ప్రశ్నించే మొదటి దశ అది. వి‌ప్లవ రాజకీయాల వైపు తలపంకిస్తున్న తొలి రోజులవి. విప్లకారుల త్యాగాల పట్ల, నిబద్దత పట్ల గౌరవం … రహస్య జీవితం గడుపుతున్న వ్యక్తుల పట్ల ఆరాధన ప్రారంభం అయ్యి ఆ దారి గరుకుగా కనిపిస్తున్నా, చూపు అటే లాగుతుండేది.

నన్ను చూసి స్నేహపూరితంగా నవ్వింది రంగవల్లి. వేరే వాళ్ళను రిక్వెస్టు చేసి పక్క పక్క సీట్లలో కూర్చోన్నాము. నా గురించి కొన్ని ప్రశ్నలు వేసింది. నా చదువు, మా కుటుంబ వర్గము, స్వభావం గురించి అడిగింది (అప్పటికింకా పెళ్ళి కాలేదు). హైదారాబాద్ లో జరిగిన పి.డి.ఎస్.యూ మాహాసభల (1989) నుండి వస్తున్నానని విని మీటింగ్ విశేషాలు అడిగింది. జస్టిస్ చిన్నపు రెడ్డి ఉపన్యాసం గురించి ఉత్సాహంగా చెప్పాను. “ఏమి నచ్చింది నీకందులో?” నవ్వుతూ అడిగింది. “కరెంటు కూడా లేని గిరిజన గూడాల నుండి ఆకలి కడుపులతో మైళ్ళు నడిచి చదువుకొనే కుర్రాడికి …. మైదాన ప్రాంతంలో తిండికి కొరత లేకుండా సకల సౌకర్యాలతో, ట్యూషన్ మాష్టర్ల స్పూన్ ఫీడింగ్ తో చదువు ‘కొనుక్కోనే’ కుర్రాడికి పోటీ పెట్టకూడదు.“ ఆవేశంగా అన్నాను.

“గిరిజన గూడెం ఎప్పుడైనా చూశావా?” అడిగింది.

“లేదు” బిక్క మొహం వేసాను.

“వెళ్ళు. ఆకలి, అనారోగ్యం, అవిద్యలాంటి పదాలకు అసలైన అర్ధాలు తెలుసుకోవాలంటే వెళ్ళు. ఈ దేశంలో పుట్టి కూడా …. వారు నివశిస్తున్న నాలుగు అడుగుల గుడిసెపైన… తిండి గింజలు పండించుకొంటున్న చారెడు నేల పైన, శ్వాసిస్తున్న గాలి పైన కూడా అభద్రతా భావం కలగచేయగల దుర్మార్గపు వ్యవస్థను నువ్వక్కడ చూడగలవు. వాళ్ళ చెమటను అచ్చంగా దోపిడీ చేయగల దళారీలను నువ్వక్కడ చూడొచ్చు. నువ్వు చదివిన ఇంజనీరింగ్ చదువు ఆ ఆదివాసీల దరిదాపులకైనా చేరిందేమో సర్వే చేయటానికైనా వెళ్ళు.” చెప్పింది.

“మీకు స్టడీ సర్కిల్స్ జరుగుతాయా?” అడిగింది

“అవుతాయి. రంగనాయకమ్మగారు పరిచయం చేసిన పెట్టుబడి గురించి మాట్లాడుకొంటున్నాము.”

“అందులో చెప్పిన వర్గాలు, శ్రమ దోపిడి నువ్వెక్కడైనా ప్రత్యక్షంగా చూశావా?”

పల్లెటూర్లలో అస్థిత్వాన్ని కోల్పోయిన మధ్య తరగతి ఉద్యోగ బతుకులు మా తల్లితండ్రులవి. నా మౌనం ఒక క్షణం భరించి చెప్పింది. “గ్రామాల్లో కనబడతాయి అవి., నువ్వు చూడగలిగితే. అక్కడ నువ్వు పొద్దుగాలం గొడ్లలాగా పని చేసి తిండిగింజల కోసం రైతుల దగ్గర పడిగాపులు పడే కూలీల దైన్యం, వాళ్ళ శ్రమ దోపిడి చేసి అరకొరగా భత్యాలు ఇచ్చే మోసం చూడొచ్చు. ఇంకా ప్రపంచంలో ఎక్కడా చూడని అంటరానితనాన్ని, కుల దొంతరలనూ నువ్వు చూడాలనుకొంటే పల్లెలకు బో. “ చెప్పింది. “భూమి సంబంధాలు సామాజిక బంధాలను ఎలా కట్టడి చేస్తాయో తెలుస్తుంది. స్త్రీలు, దళితులు ఈ దేశంలో ఏ స్థానంలో ఉన్నారో తెలుస్తుంది. శ్రమ జీవన సౌందర్యం చూడాలన్న అక్కడికే పోవాల.”

అర్ధరాత్రి దాటి ఉంటుంది. నాకు నిద్ర రాలేదు. ఆమె తల నిద్రలో నా భుజం పై వాలుతూ ఉంది. అప్పుడు నాకు తెలియలేదే … పాపలాగా నోరు తెరుచుకొని నిద్ర బోయిన ఈ తల్లి చెప్పేదానికి, చేసేదానికి రవ్వంత కూడా అంతరం ఉండదని. తను నమ్మిన రాజకీయాలు, సిద్ధాంతాలు ఆమెను ఎక్కడకు తీసుకొని వెళితే అక్కడకు నిర్భీతిగా వెళ్ళిందని… అవి ఆనాటి ఫాక్షనిస్టు పల్నాడు గ్రామాలైన, పోలీసు పహరాలో ఉన్న వరంగల్ గిరిజన గూడేలయినా సరే. పిందెలో కనబడకుండా వచ్చే తీపి లాగా, మానవ హృదయంలోకి ఒక్కోసారి ప్రవేశించే తెలియని ఆనందంలాగా ఆమె ప్రజల జీవితాలలోకి అంతర్వాహిని గా ప్రవేశించగలదని నాకప్పుడు తెలియదు. వెఱపు ఎరుగని యోధురాలని కానీ, పనిలో పడితే రాక్షసి అని కానీ, కేడర్ తో మృదువుగా సంభాషించే బహు ఓరుపరి అని కానీ తెలియదు. కాని అప్పుడెందుకో ‘రాజన్న భార్య’ అని చెప్పిన కుర్రాడి మీద మాత్రం కోపం వచ్చింది.

ఒంగోలు వచ్చాక “ వెళ్ళి వస్తాను కామ్రేడ్” అని చెయ్యి కలిపి మాయమయ్యింది. అదే మొదలు, చివరా ఆమెను చూడటం. తరువాత కొన్ని సంవత్సరాలకు ఆమె రూపం నా మనసులో రూపు మాసింది కానీ, ఆ స్పర్శ మాత్రం నాలో నిక్షిప్తమైనది. సకల పీడిత జనుల విముక్తి కోరమన్న హృదయ స్పర్శ అది. దానికోసం ప్రాణాలని తృణప్రాయంగా విసర్జించగల తెగువని నాకు బదిలీచేయ ప్రయత్నించించిన స్నేహస్పర్శ. సమాజపు కింద దొంతరలలో ఉన్న జనరాశుల వైపు నిలబడమనే ప్రేమ స్పర్శ. మనిషిగా నిలబడాలంటే ఇలాంటి ఎన్నో స్పర్శలు ప్రేరేపించి, ఊతమిచ్చి, సముదాయించి నిలబెడతాయేమో!

తరువాత కొంతకాలానికి మెడకు, నడుముకు బెల్టులు వేసుకొని, టీచర్నీ అని చెప్పుకొంటూ ఒక స్త్రీ గుంటూరుజిల్లా గ్రామాల్లో తిరిగిందట. ‘మాలతి’గా పిలవబడుతూ వాళ్ళ తలలో నాలిక అయ్యిందని విన్నాను. ఆమే రంగవల్లి అని చాలా మందికి ఆమె చనిపోయిందాక తెలియదు. రంగవల్లి ఎంకౌంటర్ ముందు, 1992 నుండి 1995 వరకు ఆమె గుంటూరుజిల్లా జనశక్తి కార్యదర్శిగా ఉండింది.

“మా ఇంట్లో ఉండేది. మా అమ్మావాళ్ళతో గ్రేడింగ్ కి వెళ్ళేది. గ్రేడింగ్ ఆడవాళ్ళతో కలిసి పాటలు పాడేది.” ఒక చెల్లి కళ్ళ చెమరింపు.

“మా ఇంటికి వస్తే మాతో కలిసి పోయేది. ‘అన్నం ఏసకరా’ అనేది” ఒక దళిత తమ్ముడి తీపి జ్ఞాపకం.

పై వర్గాల నుండి వచ్చిన ఒక స్త్రీ గ్రామాల్లో ప్రజల సమస్యల మీద పని చేయటం చిన్న విషయం కాదు. పెత్తందారులే కాదు, ఒక్కోసారి నిరాశ నిసృహలు కూడా బెదిరిస్తాయి. మహిళగా అవమానాలూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం ఎవరికోసం అయితే పని చేస్తున్నామో వాళ్ళ నుండే నిరసనలు ఉంటాయి. ఇక్కడ నాదో చేదు జ్ఞాపకం చెప్పటం సమయోచితమే అనుకొంటాను. గుంటూర్లో నేనో ప్రాంతంలో పని చేస్తున్నప్పుడు ఒక స్త్రీ పెట్టుకొన్న రెండు బొట్లను నవ్వుతూ ఎగతాళి చేశాను. ఆమె మధనపడి ఆ ప్రాంత పార్టీ బాధ్యుడికి చెప్పింది. ఒక రోజు అతను నన్ను అందరిలో తిట్టేసాడు. పెద్ద షాకు నాకది. మళ్ళీ ఎంతమంది చెప్పిన నేనా ప్రాంతానికి వెళ్ళలేక పోయాను. నా మధ్య తరగతి మనస్తత్వాన్ని అక్కడ నేను వదులుకోలేక పోయాను. రంగవల్లి గుంటూరు జిల్లాలో నడిపిన పోరాటాలు, వచ్చిన విజయాల గురించి వింటుంటే ఎంతో స్థైర్యం, పేదప్రజల పట్ల నిబద్ధత అర్ధం అవుతుంది. తను నమ్ముకొన్న వర్గ రాజకీయ సిద్ధాంతం పట్ల అచంచలమైన విశ్వాసం, ప్రేమ లేక పోతే అది సాధ్య పడదు.

1990 నుండి 1994 వరకు గుంటూరు జిల్లా పల్నాడు, రేపల్లె మండలం, బాపట్ల మండలం లో ఆమె నడిపించిన ఉద్యమాలు వింటుంటే వళ్ళు గగుర్పొడిచేది. పల్నాడులోని దాచేపల్లి, పిన్నెల్లి, పెదగార్లపాడు గ్రామాల్లో స్థానిక దాడుల నెదుర్కొని భూమిని పేదలకు పంచారు. వందల ఎకరాలను ఆ పేదలు సాగుబడి లోకి తెచ్చారు. అలాగే పెదగార్లపాడు గ్రామంలో ఇళ్ళు వేయించారు.

ఆమె ఆధ్వర్యం లో నడిచిన ఉద్యమాలలో ఉత్కృష్టమైనది పిడుగురాళ్ళ జానపాడు గ్రామంలోని ఆంబోతు మాన్యం ఉద్యమం. మనిషి చనిపోయినపుడు, దినం(తద్దినం) రోజు ఒక ఆంబోతును వదలటం కోస్తా జిల్లాల్లో ఆనవాయితీగా ఉండేది. అలాంటి ఆంబోతులు మేయటానికి కొంత పొలాన్ని వదిలేవారు. అలా ఆ గ్రామంలో 300 ఎకరాలు, ఆంబోతు మాన్యంగా ఉండేది. తరువాత ఫారెస్టు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ భూమిని స్వాధీనపరుచుకొన్నారు. పిడుగరాళ్ళలో బట్టీల్లోనూ, క్వారీలలోనూ పని చేసే కార్మికులను కదిలించి ఆ భూమిని సాగుబడిలోకి తెచ్చారు. దాని కోసం పేదలు రిజర్వ్ ఫారెస్ట్ లోని చెట్లను కొట్టి చెమటోడ్చారు. ఫారెస్ట్ వాళ్ళతో చాలా సార్లు తగాదా పడాల్సి వచ్చింది.

భారతదేశంలో విస్తారంగా భూవనరులు ఉన్నా, సెంటు భూమి అయినా పేదల ఆక్రమణకు రావాలంటే భూస్వామ్యులతో, పెత్తందారులతో, వాళ్ళ గూండాలతో తలపడాలి. వాళ్ళను మోసే రాజ్య శక్తులతో కూడా పోరాటం చేయాలి. మాటల్లో చెప్పినంత, రాతల్లో రాసినంత సులభం కాదు ఈ విషయం. రంగవల్లి నాయకత్వంలో ఈ పని అత్యంత కష్టభరితంగా సాగింది. పోలీసులకు మాత్రమే ఆమె రహస్యజీవి. ఆ ప్రాంత పీడిత ప్రజలందరికి ఆమె సుపరిచితురాలే. విసృతంగా సమావేశాలు వేసి వాళ్ళతో మాట్లాడేది రంగవల్లి. భూమిపై వారికి వుండే ఆపేక్షను పొదివి … నిప్పు రాజేసి … భూయుద్ధానికి వారిని సమాయత్తం చేసింది. భూ ఆక్రమణలో ఉండే యావత్తు కష్టనిష్టూరాలను వారికి కరతలామలకం చేసింది.

రేపల్లె మండలంలో ముత్తి రెడ్డి శ్రీరాములు అనే పెద్దాయన సాగుచేసుకొంటున్న భూమిపై స్థానిక పెత్తందారు దేవినేని మల్లికార్జున్ కళ్ళు బడ్డాయి. (అతగాడు తరువాత కాంగ్రెసు ఎమ్మెల్లే అయ్యాడు) రంగవల్లి ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది. అదే సమయంలో డంకెల్ డ్రాఫ్ట్ రావటంతో …. గ్రామంలోని యువకులు టోపీలు పెట్టుకొని కర్రకవాతు చేశారు. రేపల్లె బందు చేశారు. ప్రజల ఆగ్రహానికి భయపడి అతను ఊరినుండి బిచాణ ఎత్తేశాడు.

1992లో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమంలో కర్రపాలెం, బాపట్ల, నిజాంపట్నం, కూచినపూడి, రేపల్లె, నగరం మండలాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. అవసరం అయిన చోట స్త్రీలు షాపుల మీద దాడి చేశారు. దీని వెనుక నాయకత్వం రంగవల్లి ఉందని అని చెప్పనక్కరలేదు. అలాగే తీరప్రాంతంలో అప్పుడప్పుడే మాగాణి భూములను రైతులు రొయ్యల చెరువులుగా మార్చే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పర్యావరణాన్ని తల్లికిందులు చేసే ఈ రొయ్యల చెరువుల ఏర్పాటు, అగ్రదేశాల మార్కెట్ ప్రయోజానాలకే అని రంగవల్లి సూచనలతో పెద్ద ఎత్తున కాంపెయినింగ్ జరిగింది. 90 నుండి 92 వరకు ఒక్క రోజు కూడా షెడ్యూల్ ఖాళీ లేకుండా కామాఫులుస్టాపూలు లేకుండా ఉద్యమాలు ఈ మండలాల్లో జరిగేవంటే అతిశయోక్తి కాదు.

రంగవల్లి గురించి గత విద్యార్ధి నాయకులు మమతానుబంధంతో గుర్తు చేసుకొంటున్నారు. పిడియస్యూ మూడు జిల్లాల క్లాసులు పది రోజులు జరిగితే ఆమె అన్ని రోజులు అక్కడే ఉండేదట. నిర్మాణం గురించి బోధించిందట. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కాపీటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమాలని ప్రోత్సహించిందట. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికి లెక్క చేయకుండా ఒంటరి ప్రయాణాలు చేస్తూ తిరిగేదని ప్రేమగా గుర్తుకు తెచ్చుకొంటున్నారు.

1999 నవంబర్ లో ఆమె మరణ వార్త విని గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా … కేడరు, ప్రజలు నిశ్చేష్టులయ్యారు. ఆమె పని, నిరాడంబరత, నిబద్ధత ఎరిగిన అన్ని ఎం. ఎల్ పార్టీలు నివాళులర్పించాయి. గుంటూరు న్యూడెమోక్రసీ మీటింగ్ లో ఈ వార్త వినగానే, మీటింగ్ ఆపి మౌనం పాటించారు. తరువాత పీవోడబ్లూ తరఫున, విష్ణు నాయకత్వాన గుంటూర్లో ఆమె సంస్మరణ సభ జరిగింది.

రంగవల్లి చనిపోయి పధ్నాలుగు ఏళ్ళు గడిచిపోయినా ఆమె ఇక్కడ ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆంబోతు మాన్యం ద్వారా పండించుకొంటున్న ప్రతి కుటుంబం అన్నం వేళ ఆమెను జ్ఞప్తికి తెచ్చుకొంటుంది. పెదగార్లపాడు ఇళ్ళళ్ళో వెలిగే సందె దీపం ‘మాలతక్క’ను స్మరించుకొంటుంది.

రంగవల్లి అణువణువున ఉద్యమస్ఫూర్తిని రంగరించుకొన్న ఒక ప్రత్యేక రూపం. మూడు దశాబ్ధాల విప్లవోద్యమం తాను తీర్చిదిద్దుకొన్న ఒక విశేష వ్యక్తిత్వం. అణగారిన జన జీవనంలో ప్రవహించిన ఒక నిశ్శభ్ధ ఉత్తేజ గీతం. ఆ నాటి పేదల గుండెల్లో వెల్లివిరిసిన ఒక నవ్యోత్సాహం. ఆమె ఒక దళితుని చారెడు భూకాంక్ష. ఆమె ఒక స్త్రీ కోరుకొన్న సమానత్వం. ఆమె బద్దలవుతున్న ఒక అడివి. ఆమె తను ఒక సమరమై…. మరణమై… అమరమై … పీడిత ప్రజలను రగిలిస్తున్న విప్లవ కాగడా.