ట్యాగులు

1238267_603103923084527_1342979377_n(ఈ వ్యాసం ఈ నెల అరుణతారలో వచ్చింది)

‘కధ అంటే’ అని చాలా నిర్వచనాలు, ప్రామాణికాలు, నిర్దేశకాలు… కొన్ని తలంపులూ, ఆశలు … ఇత్యాదివన్నీ ఇటీవల కాలంలో బహు విధాలుగా చర్చించబడుతున్నాయి. నా దృష్టి లో కధలు బతుకు ఆరబోతలే. కధలు ఆయా తావుల భౌగోళిక చలన చిత్రాలు. భూమి పై జీవిస్తూ ఉన్న సమస్త మానవ జాతి జీవితాల్లోని మూలలు వెదికి చూయించే దుర్భిణులు. మానవ సంబంధాల సంక్లిష్టతను అర్ధం చేయించే ఉపాధ్యాయులు.

ఇంకా కధలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఉక్కపోతపై వీచే వింజామరలు. ఈతి బాధలను సిద్దాంతీకరించి సామాజికం చేసే శాస్త్రవేత్తలు. బుసలు కొట్టే బతుకు నాగుబాములను ఒడుపుగా ఆడించే నాగ స్వరాలు. అర్ధం కోల్పోయి కూలిపోతున్న జీవితాలను నిలబెట్టగలిగిన నిట్రాడులు. పై అన్ని బాధ్యతలను ‘కధ’ కళాత్మకంగా నిర్వహించగలదు. జీవితపు పై అంచులని మాత్రమే తాకి తేలిపోయే కధలు, మనదిగాని మిధ్యాలోకంలో పాఠకుని విహరింపచేసే కధలు తాత్కాలిక ఆనందాన్నిచ్చే సురపానంతో సమానమే. కధకు వాస్తవిక సంఘటనలు, సంభాషణలు, సంఘర్షణలు కేంద్ర బిందువులుగా ఉండాలని నేను అనుకొంటాను. వాటిని కధకుడు తన ఊహా శక్తినంతా ఉపయోగించి, తనలోని సృజనను వెలికి తీసి పాఠకుడు అందుకోగలిగినంత మేర కధను అల్లగలగాలి. ఈ క్రమంలో కధకుడు తను ఎదుగుతూ పాఠకుడిని వేలు పట్టి తనతో ముందుకు తీసుకొని వెళతాడు. ఈ నడకలో కధకుడో, పాఠకుడో ఎవరు వెనక బడినా కధ తూకం తప్పినట్లే. కధకుడు వీచే సాహితీతెమ్మెరలు పాఠకుడు పీల్చుకోగలిగినంత గాఢతతోనే ఉండాలి. ఈ ప్రయాణాన్ని సమర్ధవంతగా కొనసాగించటానికి కధకుడు తప్పనిసరిగా పాఠకుడు అవ్వాలి. సమకాలీయతను సార్వజనీయం చేయగలగాలి.

‘తొండనాడు కధలు’ నా తలపోతకు అత్యంత సన్నిహితంగా ఉన్నాయి. ఈ కధల్లోని పాత్రల మనో భావోద్వేగాలను ఒప్పించటానికి రచయితలు రకరకాల కధా ప్రక్రియలను ఎన్నుకొన్నారు. తాము మోసే భావాలను, ఊహలను అలవోకగా చదువరులకు బదిలీ చేసారు. అవి నడుం విరిగిన రైతన్నల దిగుళ్ళు కావచ్చు, వృత్తి పనివారల వెతలు కావచ్చు, స్త్రీల అంతరంగ మధనాలు,కడగండ్లు కావచ్చు… రచయితలు,రచయిత్రులు అది ఇదనీ కాకుండా తాము శోధించి, సుపరిచితం చేసుకొన్న జీవితాలను సుస్సంపన్నంగా పాఠకుని ఉల్లానికి బదిలీ చేశారు. కధకులు దర్శించిన జీవిత సత్యాలు కఠినంగా… చేదుగా గొంతుకడ్డం పడినా వివేచన కలిగిన చదువరులు అందులో వున్న వాస్తవికత, నిజాయితీలను గ్రహించి తీపినే స్వీకరిస్తారు. జీవన వాస్తవాల తాలూకు బీభత్యాన్ని విశ్లేషించి, కారణాలు విశదీకరించి…. పాఠకులు వారు ఎదుర్కొనే సమస్యల పట్ల సరైన చూపుని, ఆ చూపుకు కావాల్సిన వెలుగును ప్రసరించేవే మంచి కధలు. ఆ మాటకొస్తే ఏ రకమైన సాహిత్య ప్రక్రియకైనా కర్తవ్యం అదే. కేవలం మానసిక ఉల్లాసానికే పీట వేసి, మనది కాని జీవితాల వెంట మనల్ని తిప్ప ప్రయత్నించే కధల కంటే ఇవి వెయ్యింతలు ఆరోగ్యకరమైనవి. .. ఆహ్వానింపదగినవి.

ఒకే తావుకి చెందిన రచయితల కధల కూర్పులు గతంలో కూడా చాలా వచ్చాయి. తమిళనాడుకి ఉత్తర కొసనా, ఇప్పటి ఆంధ్రనాడుకి దక్షిణ చివరా…. ఎనిమిది జిల్లాల్లో విస్తరించి ఉన్న ‘తొండనాడు’ ఇదివరకు రాష్ట్రాల కతీతంగా ఒకే నుడి, నెనరుతో ఉండేది. ఈ ప్రాంత భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వం అటు తెలుగు కధలకు, ఇటు అరవ కధలకు జోడుగా ఒకే రకమైన సువాసనలు అందించింది.

భాషా సంయుక్త రాష్ట్రాల పేరుతో గీచిన ఎల్లకు ఆవల ఉన్న తెలుగు బతుకులను బలవంతగా తమ భాష నుండి వెళ్ళ గొట్టినా… వారు అరవ కధల రూపంతో వారికి, మనకు ప్రాంతీయతలో ఉన్న సామ్యాన్ని చాటారు. ఈ నోయిలో ఉన్న ఇరవై అరవ అనువాద కధలు… తీసుకొన్న వస్తువు రీత్యా కానీ, ఎంచుకొన్న కధన పరంగా కానీ విభిన్నమైనవి. ఎంతో గాఢత కలిగినవి. తమిళ సంస్కృతి లో ఉండే భౌతికవాద ధోరణి ఈ కధల్లో స్పష్టంగా గోచరిస్తుంది. అనువాదాలు చేసినవారు తమిళ నుడి చెక్కుచెదరకుండా కాశారు. (ఓట్ర పురుసోత్తం, స.వెం.రమేశు, కీ.శే. మధురాంతకం రాజారాం, రావూరి చంద్రశేఖర్, కె. శరవరణ్). అనువాదకులు పల్లె జనాల నోటి భాషని ఉపయోగించుకోవటం ఒక విశేషమైతే, ఆంగ్లపదాల తెలుగీకరణకు ఒక నూతనరీతిలో ప్రయోగం చేయటం ఇంకో విశేషం. తమిళ రచయితలు ఎక్కువ దళితులు ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఈ రచయితలు ‘అరసం’ నుండి వచ్చారని తెలిసింది.

కోరలు ఊడని కుల వివక్ష, అంటరానితనాన్ని కళ్ళకు కట్టించిన కధ “దిక్కులంతా గోడలున్న పల్లె”( అళగియ పెరియవన్). రెండు అగ్రకులాల పల్లెల మధ్య ఇరుక్కుపోయినా ఆది ఆంధ్రులు ‘నేరు దోవ’ కోసం పై అధికారులకు పెట్టుకొన్న అర్జీ బుట్ట దాఖలు అవుతుంది. ఇంటికి చేరే దోవలో ఆడవాళ్ళు అఘాయిత్యాల పాలవుతుంటే మాదిగ యువకుల తిరుగుబాటే ఈ కధ. వర్ణ వ్యవస్థకు కావలి కుక్కలుగా పోలీసులు, చట్టం, సమస్త జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తే…. మాదిగ పల్లెకు దన్నుగా నిలిచిన దళిత మహిళల స్థైర్యం, పల్లెను కాపాడుకొన్న వైనం వెన్ను జలదరింపచేస్తుంది. కుల రసిక కారుతున్న వ్యవస్థపై వారు ఖాండ్రించి ఊసిన ఉమ్ము తాలూకు చుక్కలు మన మొగాన కూడా పడ్డాయేమోనని కధ ముగిసే సమయానికి ముఖం తుడుచుకొనేటంతటి సూటితనం ఉన్న కధ ఇది. ఇదే కులం నేపధ్యంలో రాసిన మరో కధ “ కడుపు తీపి” (ఇమైయం). పరువు హత్యలు పౌడరద్దుకొన్నంత సహజమైన కొన్ని తమిళనాడు తావుల్లో, అంటరాని కులం వాడిన ప్రేమించిన అమ్మాయిని ఎన్ని రకాలుగా చంపవచ్చో తండ్రికి గ్రామస్తులు బోధింస్తుటే కధ మొదలౌతుంది. దుక్కి దున్నటానికి, వడ్లు దంచటానికి అవలంబించేలాంటి సులువులు… మనిషిని చంపటానికి కూడా చెబుతుంటే విని తల ఊపిన తండ్రి తీసుకొన్న నిర్ణయం ఈ కధకు కీలకమైన మలుపు. లేత మనసు ఎంచుకొన్న సాహచర్యాన్ని కులం పేరుతో తిరస్కరించి ‘దీని కోసమే కదా అల్లాడుతున్నావు. ఎన్ని కావాల? తీసుకో.” అంటూ పంచలు విప్పి చూపించిన పితృస్వామిక దౌష్ట్యం కాల్పనికం అనుకోవాలా? భీభత్యం అనాలా? మరయితే దేశమంతా జరుగుతున్నా ఖాప్ పంచాయితులను, కళ్ళు మూసుకొన్నపితృ రాజ్యాలను కూడా అదే అనగలమా… అదే వ్యవస్థలో జీవిస్తూ కూడా?

‘పియ్య సాహిత్యం’ పేరుతో తమిళ నాడు పాకి పనివారలకు (ఆంద్రప్రదేశ్ కు చెందిన మాదిగలు, తమిళనాడుకు చెందిన కాట్నాయకర్స్ ఈ వృత్తిలో ఉన్నారు) సంబంధించిన సాహిత్యంలో గత పదేళ్లుగా కృషి జరుగుతుంది. ఆ పరంపరలో వచ్చిన కధే “పియ్య” (అ. ఎక్బర్డ్ సచ్చిదానందం). తన శరీరాన్ని కోరి వచ్చిన ఫాస్టర్ కు పరీక్ష పెట్టింది పాకీపని చేసే గ్రేస్. ఒక పూట ఆయన ఇంట్లో పియ్య ఆయనే ఎత్తాలని. ఆమె పై వ్యామోహంతో ఒప్పుకొని ఆ పనికి ప్రయత్నించిన ఫాస్టర్ మనశ్శరీరాలు సహకరించక మానసిక వైకల్యానికి గురై ఓటమిని అంగీకరిస్తాడు. ఆమెకు అతను ఓడిపోతాడని తెలుసు. తన జీవితంలోని వాస్తవికత ఈ మర్యాదస్తుల, పరిశుభ్ర ప్రాణులను వణికిస్తుందని తెలుసు. తనకు తెలిసిన విషయం నిరూపితమైనందుకు పగలపడి నవ్వి (తొడకొట్టి నవ్వినట్లు అనిపిస్తుంది మనకు) అతని మనసు వాకిలి నుండి ‘గ్రేస్ ఫుల్ ‘గా నిష్క్రమిస్తుంది గ్రేస్. అమానవీయ వృత్తులను సౌలభ్యానికో, సౌకర్యానికో కొనసాగిస్తున్న సమాజాన్ని అంగీకరిస్తున్న మనం …. ఫాస్టర్ తో బాటు తల వంచుకొంటాము.

ఊరుమ్మడి తలపని చేసే కుటుంబీకుల నుండి బయట పడి, చీలుబాటలో కొట్టు పెట్టుకొని పళని గౌరవ జీవనం సాగించాలనుకొంటే అక్కడ కూడా ప్రత్యక్షమయ్యేది ఊరి ప్రజలే, వారి ఆధిపత్యమే. పారంపర్యంగా వస్తున్న లొంగుబాటు, కుంగుబాటు తప్పక పోయినా, కుల వృత్తి పట్ల ఉన్న ప్రేమను వదులుకోలేక పోతాడు. ‘నాకు బువ్వ పెట్టే మాట’ అంటూ వెండ్రుకల పేరు ఉచ్చరించటానికే ఇష్ట పడని పళని అంతిమ ధిక్కారం సంభ్రమం కలిగిస్తుంది. (“బొచ్చు”, రచయిత ము. మురుగేశ్). అలాంటి ఊరుమ్మడి మంగలి తెలుగు కధే “పనసపండు” (గూళూరు బాలకృష్ణమూర్తి). పనసపండుకోసం ఒక దళితుడికి తలపని చేసి… ఊరి పని పోగొట్టుకొని పండుని మాత్రం మిగుల్చుకొంటాడు. అంటరానితనానికి ఉన్న బహుముఖ రాక్షసత్వం ఒక వెనుకబడిన కులం వైపు నుండి చెప్పటం ఈ కధ వైవిధ్యత.

తమిళకధల్లో మరో దీటైన కధ వెణ్ణిల రాసిన ‘బయటికి’. నీరు, గాలి, భూమి …. ప్రకృతి వనరులన్నీ మార్కెట్ చేయగల అవకాశం ఉన్న దేశంలో …. ఆడవాళ్ళ ప్రకృతి అవసరాలకి కావాల్సిన ఏకాంతంకై నిత్యం జరిగే పోరాటం ఏ బ్రతుకు పోరాటానికి తీసిపోదు. ఇది గుర్తించటానికీ, మాట్లాడుకోవటానికీ సభ్యత అంగీకరించని అగౌరవ పోరాటం, అవిశ్రాంత పోరాటం. వెణ్ణిల గారు ఈ పోరాటానికి తన ఆత్మను ఇచ్చి కధ రాశారు. మనం చూడని ఈ రచయిత్రి ఆసాంతం మన మనిషి అని కౌగలించుకో బుద్ధి వేస్తుంది. “ఆడపిల్లల్ని పట్టే బండి” (కాంచి శాంతన్) పెళ్ళి కాని ఆడపిల్లల శ్రమ దోపిడిని వివరించే కధ. కీ.శే. సి.ఎన్ అణ్ణాదొరై రాసిన “కొక్కరకో”, పడుదళం సుకుమారన్ రాసిన “మైనావతి”… తమిళ కధలన్నింటిలో కొంత హాస్యం కలగలిసిన కధలు.

“ఐరావతమైనా గంగలో కొట్టుకు పోవాల్సిందే “ (వై. శేషాచలం) కధ, చారెడు చెక్క కోసం రైతు త్యాగం చేయాల్సిన అభిరుచుల గురించి ఒక బాలుడి కోణం నుండి చెబుతుంది. నాయన “అరువంగా” చేయించుకొన్న ఇంటి బండి కారుతాత ఇంటికి బదిలీ అయిపోతుంటే “ఆడబిడ్డ మాదిరి” గా బాలుడు కన్నీరు కారుస్తాడు. ఇంకో బాలుడు చెప్పిన కధ “సిపాయ్ గణేశన్” (కవి పిత్తన్). మిలటరీ తండ్రి, బహుమతులతో బాటు కుటుంబానికి, గ్రామానికి తెచ్చే శాంతి సంతోషాల కోసం ఏడాదంతా ఎదురు చూసే బాలుడు తండ్రి శవాన్ని… ఆ తరువాత తల్లి ఆత్మ గౌరవ పోరాటాన్నితనదైన గొంతుతో చెబుతాడు.

బ్రాహ్మణ కులం ప్రశస్తమైనదా? మరి అందులోని పేదరికం మాటేమిటి? మంత్రాలకు అర్ధం తెలియని అజ్ఞానం మాటేమిటి? కులం ఇచ్చిన హోదా ఒక్కటే ఉన్నత జీవితం ఇస్తుందా? ముమ్మాటికి కాదు అని వెలుగెత్తి చెప్పిన కధ జయకాంతన్ “ఆత్మ దర్శనం”. తన సహజ స్వభావానికి సవాల్ గా నిలిచిన బ్రాహ్మణత్వానికి చిహ్నంగా ఉన్న జంధ్యాన్ని త్యజించి, తనకు మర్యాద దొరకని బ్రాహ్మణ సమాజాన్ని వీడి వెళ్ళి పోతాడు గణపతి శాస్త్రి. చెప్పుల కొట్టులో పనికి కుదిరిన చిన్న కొడుకు మాత్రమే “వెల్ డన్ ఫాదర్” అనగలుగుతాడు. అయితే బ్రాహణత్వానికి తాను అనర్హుడు అని అనుకోగలుతాడు కాని దాని ఆధిపత్యం మీద ప్రశ్నలు ఉండవు గణపతి శాస్త్రి దగ్గర.

శివశంకరి “గోధుమ నాగు” ఇంకో తాత్వికమైన కధ. నాగుబాముని సజీవంగా కాలుస్తున్న దృశ్యాన్ని చూస్తే కరుణ పొంగుతుంది మనుషులకు. మరి అదే నాగుబాము చంపిన పసిబిడ్డను చూస్తే ఆ పాముకు ఆ చావు తక్కువని అనిపిస్తుంది. నిత్యం మనం చూస్తున్న హింస, ప్రతి హింసల కలవరానికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది.

తన తండ్రి దేవుడు లేడని అన్నందుకు చూపించిన పరిష్కారం సంహారమేనా? ప్రహ్లాదుడి ప్రశ్నించే తత్వం హిరణ్య కసుపుడినే కాదు నరసింహుడ్ని కూడా ఆగ్రహ పెట్టింది. హిరణ్య కసుపుని వారసుడిగా సింహాసనం ఎక్కబోతున్న ప్రహ్లాదుడు తన తండ్రి చావుకు దేవుడి లాగే ప్రతీకారం తీర్చుకొని, ఆశీర్వాదం కోసం నిస్సంకోచంగా తల్లి దగ్గరకు వెళ్లగలుగుతాడు. సారవాగన్ కధ “ప్రాయచిత్తం”

ఈ పుస్తకంలో ఉన్న తమిళ కధలన్నీ వాస్తవ పునాదిపై నిలబడి… నకిలీ విలువలపై ఒక గ్రేస్ లాగా, ఒక గణపతి శాస్త్రి లాగా, ఒక పళని లాగా, ఒక ప్రహ్లాదుడిలాగా ధిక్కారాన్ని ప్రకటిస్తాయి. ఇంత మంచి కధలను ఏరుకొచ్చిన సంపాదకులు స.వెం. రమేశు, ఓట్ల పురుసోత్తంలకు నిండుగుండెల మప్పిదాలు.

అరుణతారలో ఈ వ్యాసం  క్రింద పిడియఫ్ లో ఉంది.

Pages from Arunatara