ట్యాగులు

,

628-141x150మనిషికి  ఏదో ఒక ప్రాపంచిక దృక్పథం ఏర్పడటానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. గొప్ప వ్యక్తుల సాన్నిహిత్యం సహాయం  చేస్తుంది. ఈ ప్రభావంతో సమాజాన్ని చూసే చూపు, దానితో నెరిపే సాహచర్యం కొత్తపుంతలు తొక్కుతుంది. మారిన చూపుతో తను అనుభవించిన సమూహాల సాంగత్యాన్ని అక్షర రూపంలో పెట్టగలిగితే గొప్ప రచనలు పుడతాయి. దినవారీ బతుకులో కలిసిన వ్యక్తులు, జరిగే మామూలు ఘటనలకు తాను స్థిరపరుచుకొన్న భావాల ఊతంతో భాష్యం చెప్పటానికి ప్రయత్నిస్తారు మంచి రచయితలు. ఈ భాష్యం ఎంత సరళంగా ఉంటే అంత సులువుగా పాఠకులను ఒప్పించగలరు. వంద పుస్తకాల సారాన్ని ఒక చిన్న కథ లో కుదించి చెప్పగలరు. ప్రబోధపు ఛాయలు కనపడనీయకుండా కథనాన్ని నడిపి ముగింపునివ్వగలరు.

కొన్ని కథలు చదివాక గుండె భారంగా అనిపించి పాఠకుడు పొడుగాటి నిట్టూర్పు విడుస్తాడు. లేదంటే “ఔరా! ఇంత గందరగోళమైన విషయాన్ని గమ్మత్తుగా చెప్పిందే ఈ కథ” అని ముక్కు మీద వేలేసుకొంటాడు. తనలోని కపటత్వం, కుటిలత్వం, కలవరం, తత్తరపాటు …. వీటన్నింటినీ బొత్తాలు విప్పికథ చూపించినపుడు ….  ఆ ఎరుకతో కలిగిన సృహతో పాఠకుడు ఆనందంలో తేలిపోతాడు. ఆర్. వసుంధర దేవి కథలు ఈ రకమైన కోవలోకి వస్తాయి. ఒక్కో కథలో ఆమె పరిచిన జీవితాలు మనకు తెలియనివి కావు. మన మధ్య తిరుగాడే మనుషుల సహజ ప్రవర్తనను ఆమె తేటతెల్లంగా … ఎటువంటి రంగులు అద్దకుండా కనబరుస్తారు. గాలం వేసి, నీటిలో ఈదాడే చేపను నైపుణ్యంతో బయటకు లాగినట్లు సంక్లిష్ట మానవ ప్రవృత్తిని తోడి పాఠకలోకానికి ప్రదర్శించగలరు ఆమె. ఒక పెద్ద డిబేట్ ను ఒక్క వాక్యంలో సంక్షిప్తం చేయగలరు ఆమె. ఒక బతుకు మొత్తాన్ని ఒకే ఒక పదంలో చూపెట్టగలరు. సమాజం, విలువలు ఎలా ఉన్నాయో యధాతధంగా చేసే ఆవిష్కరణలోనే ఎలా ఉండకూడదో అనే స్పష్టతను కూడా ఇస్తారు.

అలాంటి కధే ‘ఇంతేలే పేదల ఆశలు’. పేరు సాదాసీదాగా అనిపించినా లోతైన ఆమె తాత్విక చింతన ఈ కథలో వ్యక్తం అవుతుంది. కథలో గౌరి సొంత ఇల్లు, పూరిల్లు అయినా సరే, కావాలని అనుకొంటుంది. “ఒక మనిషి కడుపు నిండా తింటున్నాడో లేదో అసలు పస్తే ఉంటున్నాడో ఇంటి లోపల ఏమి చేసుకుంటున్నాడో ఎవరికి అక్కర్లేదు. వాళ్ళకు సొంత ఇల్లు ఉన్నదా లేదా అన్నదే కావాలి. కనుక సొంత ఇల్లొకటి ఏర్పరుచుకోవాలి. అందులో పేము మంచము, ఉప్పులు పప్పుల డబ్బాలు పెట్టుకొనే చిన్న అలమారా కావాలి. మప్పితంగా సంసారం చేసుకుంటూ ఒకరి పెత్తనం క్రింద ఉండకుండా …..”

దాని కోసం వళ్ళిరగ  చాకిరీ చేస్తుంది. ఎప్పటికప్పుడు వచ్చి పడే తప్పనిసరి ఖర్చులు, బాధ్యతలు ఆమె కోరికను తీర్చటానికి  అడ్డంకి అవుతాయి. ఆమె ఆశకు, వాస్తవ పరిస్థితికి ఉన్న అగాథం అంతకంతకు పెరిగి పోయి ఆమెను తీవ్రమైన నిరాశ నిసృహలకు గురి చేస్తుంది. ఆమె కోరుకొన్నది పొందలేని ఆశాభంగం, నైరాశ్యం ఆమెను గాఢమైన మనో వేదనకు గురి చేసి మానసిక వ్యాధిగ్రస్తురాలిని చేస్తాయి. చివరకు ఒక “అమ్మవారి” ఓదార్పుతో సాంత్వన పొంది ఆమె భక్తురాలు అవుతుంది. ఆమె ఇక సొంత ఇంటి  గురించి ఆలోచించదు.

కథలో గౌరికి  వివిధ సందర్భాలలో వచ్చి పడే ఆర్ధిక సమస్యలు … పేద, మధ్యతరగతి ప్రజలకు సుపరిచితాలే. అయితే వాటిని ఆమె చిత్రించిన తీరు అత్యంత సహజంగా ఉంటుంది. ఇంటికోసం అనుకొన్న డబ్బులు సమకూరుతాయి అనుకొనే లోపలే పిల్లాడు పుట్టి మందులకు, మాకులకు ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడు ఆమె కలలో దృశ్యం మారింది. కొడుకు సుబ్బడు బాగా చదువుకొని కాలు మీద కాలు వేసుకొని తాము కట్టుకోబోయే ఇంట్లో దర్జాగా కూర్చోన్న చిత్తరువు ఆమెను కొత్తగా అలరిస్తుంటుంది.

కడుపు కట్టుకొని పైసా పైసా కూడగట్టుకుంటున్న సమయంలో …..  ఆకలితో కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని బావ కుటుంబం నుండి వచ్చిన అత్తను కాదనలేక పోతుంది. అయితే భార్యకు, కొడుకుకు జబ్బు చేసిందని వంద రూపాయలు అప్పుగా పంపించమని బావ నుండి వచ్చిన ఉత్తరం చూసి “వాళ్ళ కష్టాలు మనం తీర్చలేము. వాళ్ళను మెడకు కట్టుకొంటే  మనమూ మునిగి పోతాం” అని కఠినంగా అనగలుగుతుంది. భర్తను పెంచి పెద్ద చేయకపోయినా, అత్త పట్ల గౌరి ప్రకటించిన బాధ్యత ఒక సహజసిద్దమైన ఔదార్యానికి  గుర్తుగా అనిపిస్తే, బావ కుటుంబం పట్ల ఆమె నిరాదరణ … తన ఆశలు తీరుచుకోవాలనుకొనే తపనలో నుండి పుట్టుకు వచ్చిందే కానీ ఆమె స్వభావానికి అతికే విషయం కాదు. గౌరికి తెలియకుండా ఆమె భర్త పంపిన ఇరవై రూపాయలతో బావ కుటుంబంలో పిల్లవాడు చనిపోయి, భార్య బతికి పేదరికానికి లెక్కలు సరిగ్గానే ఉంటాయని రుజువు చేస్తుంది. అత్తకు కాన్సర్ వచ్చిందని తెలిసినా వైద్యం చేయించలేని అసహాయత పేదరికంలో ఒక అనివార్యతే.

గౌరి కన్న కలలు దేశంలో సగటు మానవుడు కనే కలల కన్న గొప్పవేమీ కావు. అత్యాశతో కూడుకొన్నవీ కావు. ఉండటానికి నీడ, పిల్లాడికి చదువు రాజ్యాంగం ప్రజలకు దాఖలు పరిచిన హక్కులే. ఆ చిన్ని ఆశలు కూడా తీరని మనిషి తన యొక్క బాధ వ్యక్తీకరణకు మతాన్ని ఆశ్రయిస్తాడు. “దేవుడు లేక పోతే ఇంత ప్రపంచాన్ని ఎవరు చేశారు? మనిషిని ఎవరు చేశారు?” అని మాత్రమే అనుకొనే గౌరి, దేవుడ్ని పూజించటం కథలో చివరివరకూ ఉండదు. తన ధర్మమైన కోరికలు తీర్చలేని హృదయరహిత సమాజం నుండి ఊరట కోసం ఆమె మతాన్ని ఆశ్రయిస్తుంది. దాని కోసం తను దాచుకొన్న డబ్బులు వెచ్చించటానికి, అప్పులు పాలవటానికి కూడా సందేహించదు. “మతపరమైన దుఃఖం అన్నది వాస్తవ బాధల వ్యక్తీకరణే కాక ఆ వాస్తవ బాధలకి వ్యతిరేకంగా వ్యక్తమయ్యే నిరసన కూడా. మతం, అణచివేతకు గురవుతున్న ఒక జీవి విడిచే నిట్టూర్పు.”అన్న కారల్ మార్క్స్ మాటలు గుర్తుకు వస్తాయి ఇక్కడ.
పేదరికంలో బతికే వారంతా సోమరిపోతులని, బడుగుజీవులు కష్టపడకనే పైకి రావటం లేదని  చేసే వాదనలకు, భావజాలానికి చెంపపెట్టుగా ఉంటుంది ఈ కధ. చారెడు నీడకోసం …..  తినే మెతుకులనూ, కట్టే గుడ్డను తప్ప త్యాగం చేయటానికి మరేమీ వీళ్ళ వద్ద ఉండవు. సంపద కూడపెట్టటానికి రెక్కలు తప్ప పెట్టుబడి ఉండదు. జీవిత కనీస అవసరాల కోసం చేసే శ్రమ, పెట్టాల్సిన ఖర్చు మధ్య గుడిగుడి గుంజం ఆడటం తప్ప ఆ వృత్తాన్ని దాటి ముందుకు పోవటం ఉండదు. ‘సాఫీగా, ఘర్షణ లేకుండా మనిషి జీవన పరిస్థితులు మారతాయి’ అనే వాదనలోని ఔచిత్వాన్ని ప్రశ్నిస్తుంది ఈ కథ.

విహంగా లో ఈ పరిచయం ఇక్కడ