ట్యాగులు

,

జనవరి 2014 పాలపిట్టలో నా కధ.

edduకొన్ని కధలు బతుకు పై పొరల్లో తచ్చాడి తేలిపోతూ ఉంటాయి. రాయటానికి, చదవటానికి అగచాట్లు పెట్టకుండా సాఫీగా తెల్లారిపోతాయి. కొన్ని జీవితాలు నాగుబాములాగా పట్టుకోవటానికి వల్ల కాకుండా ఎదురు తిరుగుతాయి. తల పట్టుకొంటే తోకతో చుట్టేస్తాయి. తోక పట్టుకొంటే పడగ విప్పి బుసలు కొడతాయి. వొడుపు చేసి పట్టక పోతే కాటేసి పోతాయి మరి. నా పాతికేళ్ళ వయసులో ముగిసిన ఈ కధ (జీవితం?) ఇప్పటికి మిడిసిపాటు తగ్గి నా చేతికి దొరికింది. అయినా దాని పొగరు చావలేదు. నేను ఆదెమ్మను కధానాయకురాలిగా చేద్దామని కధ మొదలు పెడితే ఆమె మాధవిని కధానాయకురాలిని చేసి కూర్చుంది.

నాకు పన్నెండో ఏట ఒక చిత్రమైన భయం పరిచయమయింది. మా ఒంగోలు శర్మా కళాశాల ఆటస్థలంలో పెద్ద ఊడలు దిగిన మర్రి చెట్టు జుట్టు విరబోసుకొన్నట్లు ఉండేది. ఒక సాయంకాలం నేను మా అక్కకి తోడుగా అక్కడికి నడకకు వెళ్ళాను. ఆ రాత్రే నాకు భయపెట్టే ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒంటరిగా ఆ చెట్టు కింద ఉన్నాను. ఒక నవ్వు ఒళ్ళు జలదరించేటట్లు వినిపించింది. విషాదం, ద్వేషం, కసి కలగలిసి హేళనతో కూడిన ఆ నవ్వు గుండెల్ని పిండేసింది. అది ఆడ గొంతో మగ గొంతో తెలియలేదు. నేను భయపడి పరుగులు పెట్టాను. ఎంత దూరం పరిగెత్తినా ఆ నవ్వు నా వెనుకనే వస్తుంది. ఇంతలో ఒక తెల్లటి బలిసిన ఎద్దు… …పన్నెండడుగుల ఎత్తుంది. మూరెత్తు మోపురం…. ముడతలు పడ్డ గంగడోలు మెత్తటి దూది లాగా దాని మోకాళ్ళదాక ఊగుతుంది. దాని కనుగుడ్లల్లో కందామన్నా కనికరం లేదు. రంకెలు వేస్తూ నా మీదకు వచ్చింది. కాటుక పెట్టికొన్నట్లు ఉన్న దాని కళ్ళు క్రూరంగా చూస్తున్నాయి నా వైపు. వళ్ళంతా చెమటలతో మేల్కొన్న నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకొని “సమాధుల దగ్గరకు షికారుకెందుకెళ్ళారు? పిల్ల భయపడింది.” అని అక్కని మందలించింది. ఇది జరిగాక ఏడాదికి ఆదెమ్మ యలమంద తాతతో ఓ సాయంకాలం మా ఇంటికి వచ్చింది.

ఆదెమ్మ మా తాత కూతురు. వరసకు చిన్నాన్న అయ్యే యలమంద తాత అంటే మా అమ్మకు భలే ఆపేక్ష. మా అసలు తాత చిన్నప్పుడే చచ్చిపోతే యలమంద తాతే అమ్మను సాకేడట. ఊరు వదిలి చదువుకోవటానికి ఒంగోలు వచ్చిన మా అమ్మ మంచి చెబ్బర తాతే చూసేవాడట. మా అక్క పెళ్ళి నాటికి కూడా మా అమ్మను తీసుకెళ్ళి తద్దెనోము తీర్చాడు. పండగలకు పబ్బాలకు ఆడపిల్లకు జరిపించాల్సిన సాంగేలు అన్నీ ఆయనే మా అమ్మకు జరిపేవాడు. అట్లా అని ఆయన వందెకరాల ఆసామి అనుకొనేరు. ఎడ్లబండి స్వంతదారు. తెల్లటి బుర్ర మీసాలతో మట్టసమైన ఎత్తుతో పులిలాగా నడిచేవాడు మా తాత. ఎండ్రుకలు వెనక్కి దువ్వి ముడి వేసేవాడు. తెల్లారికట్లే లేచి ఎడ్ల బండి కట్టి… కరవాది నుండి వడ్లు, కందులు, పెసలు ఒంగోలు మార్కెట్ కి చేర్చేవాడు. అప్పట్లో పాత శ్యామ్ ప్రసాద్ హాలు కాడ బండ్లు ఆపి ఎద్దలకి మేత వేసేవాళ్ళు. ఆయనకు ఆదెమ్మ మూడో ఆడపిల్ల.

ఆదెమ్మది యలమంద తాత లాగే మట్టసమైన ఎత్తు. నీరు పట్టిన పాలరాయిరంగు వళ్ళు. సున్నిపిండి, పసుపుతో రుద్ది సుద్దంగా స్నానం చేసేది. రంగులద్దిన నైలాన్ చీరలు కట్టేది. నవ్వితే గోధుమరంగు పెదాలు విచ్చుకొని గులాబీ రంగు చిగుర్ల మధ్యన తెల్లటి పళ్ళు మెరిసేవి. గోలీకాయాల్లో కనబడే ఆకుపచ్చ రంగు కళ్ళు తనవి. ఆ కళ్ళల్లో ఒక్కోసారి ఆపాలనుకొన్నా దూకి వచ్చే నవ్వులో, ఆమె ఎవరికి తెలియకుండా భద్రంగా తాళం వేసుకొని దాచుకొన్న ఆశలు నాకు కనపడేవి. సిగ్గు పడి చెంపలు ఎరుపెక్కటం, కళ్ళతోబాటు వంట్లోకూడా ఊసులు సుడులు తిరగటం ….. నేను ఆదెమ్మ దగ్గరే మొదటసారి చూశాను. మా అక్క ఆదెమ్మ వయసుదే అయినా ఎప్పుడు చదువు గోలలో ఉండేది. మెడిసిన్ సీట్ తప్ప ఇహలోకంలో ఆమెకు ఏవి పట్టేవి కాదు. ఆదెమ్మ సావాసం నాతోనే. ఆరు బయట నా నులక మంచమే ఇద్దరం పంచుకొనే వాళ్ళం.

“అల్లూరు ఆకు తోటల్లో అత్తెసరు అన్నం వండుకొని, లేత అరటికాయలు అప్పటికప్పుడు కోసి నూనె లేకుండా కూరొండుకొని తింటే రావుడూ…..” అని నోరూరించేది. “పొలాల్లో దొంగతనం చేసిన పండని దోసకాయాల్ని ఎప్పుడైనా తిన్నావా? ఆ రుచి ఏరేలే.”

నేనింకా ఏమేమి కోల్పోయానో అని దిగులు పడుతుంటే “కోవటోల్ల వరాలు మంచిది కాదు” అని ఉన్నట్లుంది తీర్మానించేది. “మా ఊరు ఆరెంపి డాట్టర్నిచూసి ఎప్పుడూ నవ్విద్ది.” అని ముఖం చిట్లిచ్చేది.

ఆదెమ్మకు సినిమా పిచ్చి ఎక్కువ. కొత్త సినిమా వస్తే “అమ్మనడుగు సినిమాకు పోదాం” అని నన్ను ముందుకు తోసేది. ఆమెకు కమలాహాసన్ అంటే ఇష్టం. ఒంగోలు సిటీబస్లో తన వెంటబడే వాళ్ళ ఊరి టైలర్ గురించి నాకు రహస్యంగా చెప్పింది. ఒక సారి దూరం నుండి చూయించింది కూడా. గళ్ళ చొక్కా, బెల్ బాటమ్ పాంటూ, ఉంగరాల జూట్టూ …. కాస్త కమలాహాసన్ లాగే ఉన్నాడు.

………………

పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు నులుముకొంటూ ఆదెమ్మ కోసం చూశాను. అప్పటికే పేడ కళ్ళాపు చల్లి, నీళ్ళ కాగు పొయ్యి మీద పెట్టి రెండు కాళ్ళు ముడిచి మొకానికి లాక్కొని చెర్లో తామర తూడులాగ కూర్చొని ఉంది. ముఖం వాడి పోయి ఉంది.

“ఏమయింది?”

“కనకాయి పెళ్ళికి పోవాలంట నేను.” కనకాయి ఆదెమ్మ చెల్లలు.

“వెళ్ళూ” దానికంత దిగులెందుకు అన్నట్లు చూశాను.

“ అవునూ. ముందు నీ పెళ్ళి కదా అవ్వాలి?” అడిగాను.

“నా పెళ్ళి అయిపోయింది కదా “ ఎటో చూస్తూ చెప్పింది.

“ఎప్పుడు?”

“నాకప్పుడు పద్నాలుగు ఏళ్ళు. “

“అంత చిన్నపుడా? వద్దని ఏడవలా?”

“నా కంటే ముందే ఇంటో అందరు ఏడుస్తున్నారు.”

“ఎందుకు?”

“అన్నాయి చచ్చిపోయాడు కదా. “

యలమంద తాత పెద్ద కొడుకు పురుగు మందు తాగి చచ్చిపోయాడని అమ్మ, అవ్వ అనుకొంటుంటే విన్నాను.

“ అన్నాయి ఎందుకు చచ్చి పోయాడు ఆదెమ్మ?” అడిగాను.

“తెలియదు రావుడు. అప్పుడు ఇంటో తగాదాలు జరిగేవి. నా కర్ధం అయ్యేవి కావు. అన్నాయి మాదిగ ఒబేసు కూతురుతో తోపుల్లో కనబడ్డాడని బాబు ఆ రోజు అన్నం కాడ అమ్మతో అంటుంటే విన్నాను. ఆ రాత్రి అన్నాయ్ కోపంగా అన్నం లో నీళ్ళు పోసి లేసి పోయాడు. తరువాత బాబు, అన్నాయి ఏదో అరుసుకొన్నారు. ” గొంతు తగ్గించి చెప్పింది.

“ అన్నాయి చనిపోయ్యాక చావు దిబ్బలదాకా కూడా బాబు పోల. ఒక్క నాటికే మనిషి పీల్చుక పోయాడు. నాకు దబ్బున లగ్గం చేయాలని పట్టు పట్టాడు. బయట నుండి రాగానే “ అమ్మాయ్ ఆదెమ్మ” అంటే పరిగెత్తుకెళ్ళి మంచి నీళ్ళు ఇచ్చే దాన్ని. ఎండ్రుకలకు ఆముదం రాసి వెనుక ముడి నేనే పెట్టేదాన్ని. నా కంట్లో కుంకుడుపులుసు పడితే ఉఫ్ ఉఫ్ అని ఊపిరిపోయేదాదా ఊదే బాబు…. నేను కూడు మానేసి పెళ్ళి వద్దని కుళ్ళి కుళ్ళి ఏడ్చినా వినలా. అన్నాయి చనిపోయిన నెల తిరగకుండానే నా లగ్గం ఊళ్ళోనే అయిపోయింది. “ ఆదెమ్మ చెప్పుకు పోతుంది.

నేను భయంతో సన్నగా వణుకుతున్నాను. ఆదెమ్మ నన్ను గమనించలేదు. సన్నని ఏడుపు నా చెవుల్లో మొదలయ్యి పెద్దదయ్యే కొద్ది నవ్వుగా మారింది. కలలో ఎద్దు రంకె వేస్తూ కాలితో దువ్వుతుంది. కళ్ళు ఇప్పార్చి గుటక మింగాను.

“మరి అమ్మమ్మ ఏమి అనలేదా?” గొంతు పెగుల్చుకొని అడిగాను.

“చేసుకోకపోతే ఇంటో నుండి పొమ్మంది. “

“పెళ్ళి కొడుకు ఎవరు?”

ఆదెమ్మ ముఖం మరింత మసక బారింది.

“బారియ చచ్చి పోయిన వెంకన్న. నా కంటే ఇరవై ఏళ్ళు పెద్ద. మొదటి నిద్రకే పారిపోయి వచ్చా. ఇక పోలె.”

“తాత, అమ్మమ్మ ఏమన్ల?’

“కొట్టారు. చస్తామని బెదిరించారు. అయినా నే పోలె.”

“ఇక పోవా?

ఆదెమ్మ ఆశ్చర్యంగా చూసింది. “ఒగదెంచుకొన్నాంగా? నీకు తెలియదా? ఓ నాడు సందకాడ నేను ఏటికాడికి నీళ్ళకెళ్ళి వస్తుంటే , నా కడ్డం వచ్చాడు. తాగి తూలతన్నాడు. తప్పుకొని పోబోతుంటే నా చేతిలో బుంగ లాగేసి బూతులు తిడతా నా పైట బట్టి లాగి, కోక ఊడపెరికాడు”

“అమ్మో!” నోటి మీద చెయ్యేసుకొన్నాను.

“మరి ఎలా వచ్చావు ఇంటికి?”

ఆదెమ్మ చెప్పలా. తూర్పున పొడుస్తున్న ఎర్రటి తట్టను చూస్తూ కూర్చుంది. అందులో ఆమెకు ఏటి వడ్డు నుండి, ఇంటి దాకా వంటి మీద వట్టి లంగా జాకెట్టుతో…. కుంగి పోతూ…భీతావహంగా పరుగులు పెడుతూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న పదిహేడేళ్ళ పడుచు పిల్ల కనబడి ఉండాలి.

“కులపోళ్ళు కూచొని ఒగతెంచారు. నేను రెండేళ్ళు ఇంట్లో నుండి బయటకు రాలా. కనకాయి పెళ్ళి చేయాలని బాబు నన్ను ఈడకు పంపాడు. కనకాయికి అయిన సంబందరమే కుదిర్చారు. మా మేనత్త కొడుకే. బాగుంటాడు. అన్నాయి చచ్చిపోకపోతే నాకూ బాబు మంచి సంబందరమే తెచ్చేవాడు. ” దిగులుగా అంది. నా చెవుల్లో హోరు వినబడకుండా చెవులు గట్టిగా మూసుకొన్నాను. “రాత్రికి ఎద్దు కలలోకి రాక పోతే బావుండు.”

…………..

ఆదెమ్మ మా ఇంట్లోనే ఉండి కుట్టుమిషన్ నేర్చుకొంటుంది. నేను ఆదెమ్మ సావాసంతో చదువు మీద శ్రద్ద పెట్టటం లేదని అక్క నుండి చాడీలు వెళుతున్నాయి. ఎప్పుడూ లేనిది అమ్మ నా చదువు మీద నిఘా పెట్టింది. జనరంజని ఎక్కువ వింటున్నానని, రేడియో బాటరీలు కొనటం మానేసింది. సినిమాలకు అనుమతులు దొరకటం లేదు. నాకిక చదవక తప్పలా. పది పరీక్షలు దగ్గర పడే కొద్దీ ఆదెమ్మ నాతో రాత్రిళ్ళు మేల్కొని వుండేది. పరీక్షల ముందు నా హడావుడి చూసి అన్నం ముద్దలు కలిపి నోట్లో పెట్టేది. చవురు రాసి నా జుట్టు నున్నగా దువ్వి రెండు జడలు గట్టిగా బిగించి పైకి కట్టేది. చదువుతో వేడెక్కి ఉన్న నా తలకాయ ఆదెమ్మ దువ్వుతుంటే హాయిగా ఉండేది.

నేను ఇంటర్ కి వచ్చాను. నా లోకం ట్యూషన్లు, మార్కులు, కొత్త స్నేహాలూ … ఆదెమ్మతో ఒంటరి మాటలు తగ్గాయి. ఈ మధ్య ఆమె దిగులుగా ఉంటుంది. అమ్మ, తాత ఆదెమ్మకు మారు మనువు గురించి మాటలు జరుపుతున్నారు. మళ్ళీ రెండో పెళ్ళి సంబంధమే. ముందు సంబందానికి ఒక కొడుకు కూడా ఉన్నాడట.

“నీకిష్టమేనా?” అడిగాను.

“తప్పదు కదా. ఎన్ని రోజులు ఉంటాను ఈడ?” ఈ మధ్య నాయనమ్మ ఇక్కడే ఉంటుంది. ఆదెమ్మ మీద విసుర్లు ఎక్కవయ్యాయి.

“మరి కమలాహాసనూ?”

దిగాలుగా నవ్వింది. “ బాబు ఒప్పుకోడు. మన కులం కాదు, వాళ్ళు దూదేకులోళ్ళు”.

ఆదెమ్మ పెళ్ళి బొప్పాడ గుళ్ళో జరిగింది. ఏటవాలుగా ఉన్న బొప్పాడ కొండ ఎక్కటానికి భయపడుతున్న పెళ్ళికొడుక్కి కళ్ళకు గంతలు కట్టి తీసుకొని వెళుతుంటే ఆదెమ్మ నా వైపు చూసి నవ్వింది. ఏదీ దాయలేని ఆ ఆకుపచ్చని కళ్ళల్లో సైగ్గా కదిలిన మబ్బు నా చూపును దాటలేక పోయింది.

………

ఆదెమ్మ బాగానే అమరిపోయింది కాపురంలో. ఒక దెబ్బ కొట్టకుండ పిల్లాడ్ని పెంచింది. సాధించి చట్టిలో పెట్టాలనుకొన్న అత్త, ఆడబిడ్డలతో సావాసం చేసేసింది. ఆదెమ్మ వాళ్ళ ఆయన కూడా మంచోడే…. మెత్తనోడు కాకపోతే.

చిలకలూరిపేట నుండి సిటీ బస్ ఎక్కి వెళ్ళాలి వాళ్ళ ఊరికి. ఊరు పచ్చగా ఉంది. పెద్ద పెద్ద మండువాల పాత పెంకుటిళ్ళు. గొడ్డు, గోద….. కొన్ని పశువుల కోస్టాలకు కూడా సీమ పెంకు కప్పారు. ఊళ్ళోకి నడుస్తుంటే ఒక ఎద్దు తల ఊపుతూ నడుచుకొంటూ నా ఎదురు వచ్చింది. నేను భయంగా పక్కకు తప్పుకొన్నాను. ఈ ఎద్దు… ఎక్కడ చూశాను?

“అది మన ఒంగోలు ఎద్దేలే. మన పాటికి మనం పోతుంటే మనల్ని ఏమి చేయదు.” ఆదెమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది.

”దానికి ఎదురెళితే?” చిన్నగా అడిగాను. ఆదెమ్మ వినలేదు. తన కళ్ళల్లో ఇదివరకటి ఆశలు లేవు. అలసట, దానిని మించిన శాంతి కనిపిస్తున్నాయి. ఒక్క అరగంట లోనే నాకు ఆ ఇంటి సంగతి అర్ధం అయ్యింది. ఆదెమ్మ మిషన్ కుట్టి ఇంటిని నడుపుతుంది. ఇంట్లో మిగతా వాళ్ళకెవరికి స్థిరమైన ఆదాయం లేదు. అయితే వాళ్ళందరిలో ఆమె పట్ల గౌరవం కనిపిస్తుంది.

సాయంకాలం గుడికని వంక పెట్టి బయటకు తీసుకొని వెళ్ళింది. అప్పుడే చూశాను…ఆ ఇంటిని. ఒక వీధి నుండి ఇంకొక వీధి దాకా విస్తరేసినట్లు ఉంది. బర్మా టేకుతో చేసిన ఇంటి తలుపు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. దాని మీద రాధాకృష్ణులు అల్లుకొని ఉన్నారు.

“ ఆ ఇల్లు ఎవరిది?” అడిగాను.

“పెదనరసయ్య గారిది.”

“చిననరసయ్య ఎవరు మరి?” అడిగాను.

ఆదెమ్మ మురిపంగా నవ్వింది. “ నీ ప్రశ్నలు మాత్రం మారలేదు రావుడు.” ఆగి చెప్పింది. “ పెద నరసయ్య బావమరిది చిననరసయ్య. పక్క ఇల్లే. ఆయన చెల్లెల్ని చేసుకొన్నాడు. పెదనరసయ్యకు ఇద్దరు కొడుకులు. చిననరసయ్యకు ఒకటే కూతురు. మాధవి. భలే ఉంటుంది. జుట్టు ఎంత వత్తు అంటే ఒక్క జడ వేస్తే అరచేతి మందాన వెడల్పు వచ్చేది. మోకాళ్ళ కింద దాకా జడ. మాధవి నవ్వితే కళ్ళూ బుగ్గలు రెండూ ఎలుగుతాయి. నడుస్తుంటే మన దొడ్లో గుమ్మడి తీగ గాలికి కదలాడినట్లు ఉంటుంది.

“పెళ్ళైయిందా?”

“మాధవికి పెదనరసయ్య చిన్న కొడుకు నరేష్ తో చిన్నతనం నుండి మాలిమి. నేను వాళ్ళింటికి జాకెట్లు ఇవ్వటానికి వెళ్ళేదాన్ని. ఒక రోజు బావకు గోరింటాకు పెడుతుంది మాధవి. నాకు రెండు కళ్ళు చాలా లేదు వాళ్ళిద్దర్ని అట్టా చూస్తే.” ఆదెమ్మ కళ్ళల్లో మెరుపు నా గమనిక నుండి తప్పుకోలేక పోయింది. నన్ను చూసి వెంటనే కళ్ళు తిప్పుకొంది.

“మరి వాళ్ళిద్దరికి పెళ్ళైయిందా” అడిగాను.

“అవలేదు” దిగులుగా అంది.

“పెదనరసయ్య పెద్ద కొడుకు ఎంగటేశర్లు ఎగసాయం చేస్తాడు. మాధవిని తను చేసుకొంటానని అన్నాడు.

“మాధవి ఏమంది?” ఆత్రంగా అడిగాను.

“పెళ్ళంటూ చేసుకొంటే చినబావనే చేసుకొంటానని పట్టు బట్టింది.”

“అపుడూ?

“పొలానికి వెళ్ళిన ఎంకటేశర్లు ఏపచెట్టుకు ఉరేసుకోని చచ్చిపోయాడు.”

“మాధవి అంటే అంత ఇష్టమా?” బలహీనంగా వచ్చింది నా గొంతు.

“అదేమీ కాదు. అగమాన పడ్డాడు. మాధవి చేసుకోను అనేసరికి.”

మళ్ళీ నా చెవులో అదే నవ్వు మొదలైంది. ఈ సారి నవ్వు ఇంకా భీతికొలిపేటట్లు… ఎకెసెక్కం చేస్తున్నట్లు.. హెచ్చరిస్తున్నట్లు… ఇందాకటి ఎద్దు… ఎక్కడ చూశాను దాన్ని? సింధూ నాగరికత కుదురు చిహ్నాలలోనా? ఆర్యుల పశుగణాల్లోనా? ఈజిప్ట్ కోటలమీద మిగిలి ఉన్న లిపిలోనా? ఎక్కడ పుట్టి ఉంటుందది?

“రెండు కుటుంబరాలు అల్లాకొల్ల మయ్యాయి. గుంటూర్లో చదువుతున్న నరేశు చానా రోజులు ఊరి మొగం చూడలేదు. పెదనరసయ్య భార్య పిచ్చమ్మ మంచాన బడింది. చిన్నప్పటి నుండి తన చేతలతో సాకిన మాధవి మొగం చూడటానికే ఇస్టపడలేదు. మాధవి అత్త మంచం కాళ్ళకట్ట కాడ కూర్చొని కంటికి మంటికి ఏకంగా ఏడవటం నేను చూశాను. అయినా పిచ్చమ్మ కరగలేదు. నెల రోజుల్లోనే మాధవికి వేరే సంబందరం చూసి పెళ్ళి చేసేశారు. పెళ్ళిలో మాధవి కళ్ళు మన ఈతముక్కాలమ్మ కళ్ళు లాగా ఎర్రగా ఉన్నాయి. పెళ్ళి కూతురు కంటికి కలక వచ్చిందని చుట్టాలకి చెప్పుకొన్నారు.” ఆదెమ్మ చెప్పుకుపోతుంది.

“అన్నాయి సావు నా బతుకును ఇటు తిప్పింది. ఎంగటేశర్లు సావు మాధవి బతుకును ఇంకో వైపు తిప్పింది.” కొబ్బరి చిప్ప నేలకేసి కొడుతూ అంది.

“వీటికన్నిటికి కారణం చావులేనంటావా? కాదు. చావు దేవర ఎవరో ఉన్నారని అనిపిస్తుంది.”

“ఏమిటి?” అంది ఆదెమ్మ అర్ధం కాక.

“ఎద్దు.” దూరంగా మేస్తూ కనబడింది. కంటి కొనకల్లోంచి నన్ను చూస్తున్నట్లు ఉంది.

“ ఏమిటీ?” అర్ధం కాక మళ్ళీ అడిగింది ఆదెమ్మ.

“ఏమి లేదు. నువ్విప్పుడు బాగానే ఉన్నావు కదా.”

“ఆ. ‘సవతితల్లి సవతితల్లే ‘ అనే ఇరుగు పొరుగు మాటలు పడ్డాను. నా అడుగడుగు కళ్ళతో పొటో తీసిన అత్త, ఆడబిడ్డ …… పర్వాలేదు. అయితే రావుడూ… ఇంట్లో ఎవరూ లేనపుడు ‘ నా ఈపు మీద ఏదో పారకాడుతుంది సూడు’ అని పిలిచిన మావను మాత్రం బరాయించలేక పోయాను. ఈయనకు చెప్పాను.”

“ఏమన్నాడు మరి?”

“కొన్నాళ్ళు జాగరత్తగా ఉండు, ఏరు పోదామని” అన్నాడు. ఆ కొన్నాళ్ళు గడవక ముందే మావే పోయాడులే పసికర్లతో . ఎవ్వరూ జాలి చూపని నా బతుక్కి దేవుడే జాలి చూపాడు.“ వెనక్కి తిరిగి మరో సారి గుడికి దండం పెట్టింది.

……………..

పెళ్ళైయిన ఆరేళ్ళకు ఆదెమ్మ నీళ్ళు పోసుకొందని తెలిసింది. కాన్పుకి కరవాది వచ్చింది. అప్పుడు సెలవల్లో ఉన్నాను నేను. పిల్లాడ్ని చూడటానికి వెళ్ళాను. తలకు గుడ్డ కట్టుకొని పిల్లాడి పక్కన పడుకొని ఉంది.

“నీ గోళి కళ్ళు రాలేదు”. పిల్లాడ్ని పరికించి చూస్తూ అన్నాను.

నవ్వింది.

“మీ ఊరు మాధవి బాగుందా?” గుర్తుకు వచ్చి అడిగాను.

“మాధవికి ఇద్దరు పిల్లలు. నరేశుకి కూడా.” దోమలు రాకుండా పిల్లాడ్ని విసురుతూ అంది.

“మాధవి కూడా నీలాగే బతుకు చూయించిన దార్నే నడిచింది లే. ఎదురెళ్ళ లేదు.”

“ఈ మధ్య వాళ్ళ ఇళ్ళళ్ళో తగాదాలు జరిగాయి. “ చెప్పింది.

“నరేశు పెద్ద ఆఫీసర్ కదా గుంటూర్లో. ఆయన బారియ మొన్న పండక్కి ఊరికొచ్చినపుడు మాధవి వాళ్ళ అమ్మను నానా మాటలు అందట. నీ కూతురు మా ఆయనకు పద్దాక ఫోన్లు ఎందుకు చేస్తుంది అని కొట్టాడిందట. పెద్దోళ్ళ ఇళ్ళల్లో విషయాలు దాగవుగా. అయినోళ్ళు,,,, పైగా చిన్నప్పటి నుండి ఒక దగ్గర పెరిగినోళ్ళు. మాట్లాడుకొంటే తప్పేంటి? వాళ్ళిద్దరూ ప్రేమించుకొన్న సంగతి నరేశు భార్యకు పెళ్ళికి ముందే తెలుసు. అందుకని అనుమానమేమో” తనలో తను చెప్పుకొన్నట్లు చెబుతుంది.

“అయ్యుండచ్చు. “ ఆలోచిస్తూ అన్నాను.

“నరేశు బార్య ఎప్పుడు చిటపటలాడతా ఉంటది.”

“పెళ్ళప్పుడు ఎలా ఉండింది ? “ అడిగాను.

“అప్పుడు బాగానే ఉండేది. ఈ ఐదారేళ్ళ నుండే ఇట్టా.”

………

“సువ్వీ కస్తూరి రంగా… సువ్వీ కావేటి రంగా…. సువ్వీ రామాభిరామా సువ్వీ లాలి….” టేప్ రికార్డర్ లో జానకి గొంతు తియ్యగా….నా గొంతులోకి జారుతున్న డికాషన్ కాఫీ కమ్మగా……” ఈ పాటలు స్వేచ్ఛగా వినడానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది. చిన్నప్పుడు చదవటం లేదని జనరంజని విననివ్వని అమ్మ …. తరువాత ఆదెమ్మ గుర్తుకు వచ్చారు. నాలుగేళ్ళు అయ్యిందా తనను కలిసి?

ఆలోచిస్తూ పేపర్ తెరిచాను. ఆదెమ్మ వాళ్ళ ఊరి పేరు కనబడింది. “పెద్ద కర్మ“ హెడ్డింగుతో పెట్టె కట్టి ఉంది. “ప్రకాశం జిల్లా ఇంజనంపాడుకి చెందిన పెదనరసయ్య గారి చిన్న పుత్రుడు నరేశ్ కుమార్ …. “ ఇక చదవలేక పోయాను. పరుగున వెళ్ళి ఆదెమ్మకు ఫోన్ చేశాను. అవతలి వైపు లాండ్ లైన్ ఫోన్ ఎత్త లేదు.

………

“హైదరాబాద్ నుండి కారులో ఒక్కదానివే వచ్చావా? అంజప్ప అంటూనే ఉంది. ఉద్యోగం వచ్చాక నీకు బొత్తిగా భయం లేకుండా పోయిందని.” కారు దగ్గరకు వచ్చింది ఆదెమ్మ.

కానీ నేను వచ్చిన కారణం ఆదెమ్మకు తెలుసు.

“నరేశ్… ?” మంచి నీళ్ళ గ్లాసు అందుకొంటూ ఆగలేక అడిగాను.

“మాధవి విషయం తెలుసా?” ఎదురు ప్రశ్న వేసింది.

“మాధవికి ఏమయ్యింది? “ నా గుండె కొట్టుకోవటం నాకు వినిపించింది.

“మాధవి కూడా చచ్చి పోయింది.”

కళ్ళప్పగించి చూస్తున్నాను. అదిగో అదే నవ్వు. పగలబడి వినిపిస్తుంది. ఈ సారి మరింత పదునుగా, సూటిగా నా మొఖంలోకి మొఖం పెట్టి గార పళ్ళతో గేలీ చేస్తున్నట్లు… వెకిలిగా మొహం తిప్పుతున్నట్లు … భయం కంటే నన్ను సవాల్ చేస్తున్నట్లు… ఆ ఎద్దు? తల తిప్పి చూశాను. అది గేటు దగ్గర కనబడింది. నేను చూస్తున్న వైపు చూసింది ఆదెమ్మ.

“ఏంటా బిత్తర చూపు? అన్నం తిను ముందు. ఎండన పడి వచ్చావు.“ పోబోయింది.

“వద్దు. ముందు చెప్పు. “ చెయ్యి పట్టుకొని ఆపాను. నా చెయ్యి వణుకు నాకు తెలుస్తుంది.

ఆదెమ్మ నా మంచం పక్కనే నేలమీద కూల పడింది.

“నరేశు పెళ్ళాం అప్పుడు గొడవ చేసిందని చెప్పాకదా. తరువాత ఒక రోజు ఏమయ్యిందో ఏమో మాధవి వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి చెప్పిందట ‘మీ ఆవిడను అదుపులో పెట్టుకో’ అని. ఆయన కాస్త మెతక మనిషి. మరెందుకో మాట్లాడలేదంట. ‘చేతకాని చవట’ అని ఇక్కడకు వచ్చి చిననరసయ్య ఇంటి ముందు తిట్టి వెళ్లింది.

“తరువాత?”

ఒక రోజు ఆమే మాధవి వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి ‘ నీ పెళ్ళాం రాజమండ్రి లో మా ఆయనతో లాడ్జి లో ఉంది. వెళ్ళి తెచ్చుకో పో’ అని చెప్పిందట.

“ఆ మాట నిజమేనా?” ఆపి అడిగాను.

ఆదెమ్మ నింపాదిగా నా వైపు చూసింది.

“నిజమే.”

తను ఊహించిన ఆశ్చర్యం నా కళ్ళలో కనబడలేదేమో బహుశ, ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలు పెట్టింది.

“మాధవి వాళ్ళ ఆయన వెళ్ళి భార్యను తెచ్చుకొన్నాడు. నరేశు మాములుగానే ఇంటికి వెళ్ళాడు. ఒక నెల తరువాత ఒక రోజు పొద్దున్నే ఊర్లో గగ్గోలు. నేను పొయ్యిలో పొట్టు కూరుతున్నాను. పిల్లాడు ఇంకా లేవలేదు. చాకలి వెంకాయ్ పరిగెత్తుకొని వచ్చి చెప్పింది. ఊరి అడ్డ రోడ్డు దగ్గర ఆగి ఉన్న కారులో నరేశు, మాధవి చనిపోయి ఉన్నారని. ఇక చూడు రావుడు! ఊరు ఊరంతా వెళ్ళి చూసింది. నేనూ వెళ్ళాను. మాధవి నరేశు ఒడిలో పడుకొని నిద్ర పోతున్నట్లే ఉంది. ఆమె బారెడు జడని నరేశు భుజం మీద వేసుకొని ఉన్నాడు. నరేశు భార్య ఊళ్ళోనే ఉంది అపుడు. పెదనరసయ్య మంచాన ఉన్నాడు. చిన నరసయ్య నెత్తిమీద గుడ్డ వేసుకొని లేవలేదు. ఇగ ఊళ్ళో పెద్ద మనుషులు తలుచుకొని మాధవి వాళ్ళాయనకు కబురు చేశారు. అతను వచ్చే లోపు ఇద్దర్నీ విడదీసి విడిగా కూర్చో బెట్టారు. చానా కస్టమైంది అట్టా విడదీయటం.

పోలీసులు వచ్చేలోపల అందరు మాట్లాడుకొని కారును ఊరి వైపుకు తోసారు. సగం రోడ్డు అటు గుంటూరు జిల్లా అవుతుందట కదా. ఆ పోలీసోళ్ళు మంచోళ్ళు కాదట. ఇటేపు ప్రకాశం జిల్లాకు వస్తుంది.“ ఆదెమ్మ చెప్పుకు పోతుంది.

“తరవాత జరగాల్సినవి అన్నీ జరిగి పోయాయి. మాధవి కర్మాంతరాలు ఆమె అత్తారి ఊళ్ళో జరిపారు. నరేశువి ఇక్కడే.”

నేనేమీ మాట్లాడలేదు. గుండెని దబ్బకారుతో కుడుతున్న బాధ. గోడకు చేరిగలబడ్డ ఆదెమ్మ గోళీ కళ్ళల్లో సన్నటి నీటి పొర.

“నీకో సంగతి తెలుసా?” ఉన్నట్లుంది మళ్ళీ మాట్లాడింది. “నరేశు భార్య పసుపు, కుంకమ తీయనని చెప్పింది. ఎంతమంది చెప్పినా వినట్లేదు. కుటుంబరానికి అరిష్టం అని వాళ్ళ అమ్మ మొత్తుకొన్నఒప్పుకోలేదు. ఊరంతా ఏడ్చారు.ఆమె కంట ఒక చుక్క నీళ్ళు కారితే వట్టు. నా కోసం, నా పిల్లల కోసం చచ్చిపోయాడా? అని అడిగిందట”

నేను నిట్టూర్చి లేచాను, వెళతానని. నేనిక ఆగనని తనకు తెలుసు.

“పెళ్ళి గురించి ఏమి ఆలోచించావు? అప్పకి , బావకి నీ గురించి మనియాద.” సాగనంపటానికి వస్తూ అడిగింది.

నేను మాట్లాడకుండా వడి వడిగా నడిచాను. కారు అడ్డరోడ్డు పట్టింది. “ఇక్కడేనా, కారు ఆపుకొని …. ఎలా చచ్చిపోయారో అడగలేదే! ఒకరికొకరు పురుగుమందు తాపుకొని….. లేక నిద్రమాత్రలు మింగి. …. ఎవరు ముందు చనిపోయి ఉంటారు?”

· ఉన్నట్లుండి కారు ఆపాను. ఎద్దు… కదలకుండా ఎదురుగా నిల్చోని ఉంది. బుసలు కొడుతుంది. దాని కళ్ళల్లో పశుత్వం… కాదు కాదు మృగత్వం.. ..క్రూరత్వం… రాక్షత్వం. కాలు దువ్వుతూ నామీదకు దూకటానికి సిద్దంగా ఉంది. సన్నటి నవ్వు నా చెవుల్లో అలలు అలలు గా మొదలైయ్యింది. ఎద్దును తప్పించి యాక్సిలేటర్ మీద కాలు నొక్కాను. కారు వంద మీద పోతుంది. నవ్వు హోరు పెరిగింది. గుబులుగా, ఏడుపులా మొదలైన నవ్వు ఇప్పుడు చావు డప్పులా రిథమిక్ గా, నాట్యం చేస్తున్నట్లూ…. కాదు కాదు …పూనకం వచ్చి ఊగుతున్నట్లు … నాలుగు వైపులా నుండి వినిపిస్తుంది. ఎంత వేగంగా వెళుతున్నా ఎద్దు ఎదురుగా కనబడుతూనే ఉంది. సడన్ బ్రేక్ వేశాను. కళ్ళూ, చెవులు గట్టిగా మూసుకొని స్టీరింగ్ మీద వాలి పోయాను. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని మెల్లిగా కళ్ళు తెరిచాను. నవ్వు మాయమయ్యింది. ఎదురుగా ఎద్దు నిల్చోని ఉంది…. ఈసారి సాధువు లాగా.. మొహం ఏలాడేసుకోని.. శాంతం నటిస్తూ… నా వేళ్ళు స్టీరింగ్ మీద స్థిరపడ్డాయి. ” లెక్క చెయ్య నిన్ను. పడి ఉండు అట్టాగే” స్థిరంగా అనుకొన్నాను. ఎద్దును ఢీ కొట్టి నా కారు ముందుకి హుషారుగా కదిలింది.