ట్యాగులు
తెలుగు వెలుగు మాస పత్రికలో వచ్చిన నా కధ (మార్పులు చేయక ముందు)
లీల కొత్త ఆఫీసుకు బదిలీ అయ్యి నెల రోజులు అయ్యింది. ఈ ఆఫీసు పరిచయం లేని అడవిలాగా ఉంది ఆమెకు. తెలిసిన కొన్ని ముఖాలు ఆ అడవిలో సేద తీరటానికి పనికి రాని సరుగుడు చెట్ల లాగా అప్పుడప్పుడు తలలూపుతున్నాయి. మనుషులందరూ పొడి పొడిగా రాలుతున్నారు. ఏసమ్మ ఒక్కతే అక్కడ కాస్త చల్లదనం ఇవ్వగలిగింది. ఆమెతో మాట్లాడటం …. చెప్పులు ఇప్పేసి తడి గడ్డిలో నడుస్తున్నట్లు ఉంటుంది. మెత్తటి గడ్డి పరకలు కాళ్ళకు గుచ్చుకొని నాడీ వైద్యం చేస్తున్నంత ఉపశమనంగా ఉంటుంది ఆమె సాంగత్యం. అరవై ఏళ్ళ ఏసమ్మకు మోకాళ్ళలో జిగురు తగ్గినా గుండె తడి మాత్రం తగ్గలేదు.
నగరం నడిబొడ్డున ఉన్న ఆ ఆవరణలో లీల పని చేస్తున్న పంచాయితీరాజ్ కార్యాలయం కాకుండా, జిల్లా పరిషత్ భవంతి కూడా ఉంది. రెండిటి మధ్య తుమ్మ ముళ్ళ చెట్లు కమ్ముకొని ఉన్నాయి. ఆ రోజు మధ్యాన్నం అన్నం తిన్న తరువాత ఆఫీసు వరండాలో కూర్చొని వేపచెట్టు మీది పేరు తెలియని పిట్ట పాట వింటూ వంత పాడుతూ ఉంది లీల. ఏసమ్మ గోడకానుకొని తొర్రి పళ్ళతో నవ్వుతూ ఈ సంవాదాన్ని ఆనందిస్తూ ఉంది.
పక్షి పాట వినబడక పోయేసరికి చెట్టు వైపు చూపు మరల్చింది లీల. దూరం నుండి తల వేలాడేసుకొని వస్తున్న ఒక రూపం కనిపించింది. కళ్ళ జోడు దగ్గర లేక పోవటంతో కళ్ళు చిట్లించింది లీల.
“మల్లేశ్వరమ్మ” చెప్పింది ఏసమ్మ. “పక్క ఆఫీసు క్లరుకు”
దగ్గరకు వచ్చేసరికి మాసి పోయిన తెలుపు రంగు మొహంతో, బిరుసెక్కిన రాగిరంగు వెంట్రుకలతో మల్లీశ్వరి కనిపించింది. వంద ఉతుకులతో అలసిపోయినట్లున్న పాలెస్టర్ చీర అక్కడక్కడ లుంగలు చుట్టుకొని పోయి ఉంది. లీలను చూసి పెదాలు సాగతీసి నవ్వింది. వాకిలి ముందు చెదిరిపోయిన ముగ్గులాగా … ఆమె నవ్వులో సంపూర్ణత్వం ఏదో లోపించినట్లు అనిపించింది లీలకు.
“చెట్టంత కొడుకు పోయాడు ఆ యమ్మకు ఈ మధ్య ” మోకాళ్ళు పట్టుకొని “ఏసయ్యా” అంటూ లేస్తూ అన్నది ఏసమ్మ. చటుక్కున తల తిప్పి దాటి పోయిన మల్లీశ్వరిని చూసింది లీల. సన్నగా, చిన్నగా అనిపించింది. “చిన్న వయసు పెళ్ళిళ్ళు మరి” అనుకొని నిట్టూర్చింది.
తరువాత రెండు మూడు సార్లు కాంటిన్ లో కనబడింది మల్లీశ్వరి. ఆమె నవ్వులో యాంత్రికత లేని విషయం కనిపెట్టింది లీల. కళ్ళ పలకరింపులు, కదలికల స్నేహ ప్రకటనలు తప్ప పెద్ద మాటలు లేవు. ఒకసారి మాత్రం లీల కట్టుకొన్న సపోటా రంగు నేతచీరను మెచ్చుకొంది. ఆ రోజే ఆఫీసు సూపరింటెండెంట్ లీలను ఏదో పని మీద పిలిచింది.
మాటల్లో “మల్లీశ్వరి తెలుసా?” అని అడిగింది.
తెలుసన్నట్లు తల ఊపి “మీకూ తెలుసా ఆవిడా?” అడిగింది లీల
“నాకు ఇరవై ఏళ్ళుగా తెలుసావిడ. వాళ్ళాయన కూడా తెలుసు. కొడుకు చనిపోయాక ఇలా అయిపోయింది కానీ అప్పుడు అబ్బోఆవిడా!” నవ్వింది. ఆమె నవ్వినప్పుడు పై వరుస పళ్ళన్నీ చిగురులు దాకా కనబడ్డాయి. నిర్మలము, ప్రియము కానివేవో కనబడ్డాయి ఆ నవ్వులో.
“మూరెడు సన్నజాజి పూలు, జడ పొడవునా జార్చుకొని ఆఫీసుకి వచ్చేది మొగుడు చచ్చినా కూడా”
ఏదో అందుకోవడం కోసం వెనక్కు తిరిగిందావిడ. లీల అప్రయత్నంగా ఆమె జడ వైపు చూసింది. పొద్దున ఆఫీసుకు బయలుదేరినపుడు వేసిన జడ. మెలికలు తిరిగిపోయింది. జడ చివరికీ వచ్చేసరికి, రెండు వెండ్రుకలు జడలో ఉండాలా లేదా అని నిర్ణయించుకోలేక నడుం మీదకు వేలాడుతున్నాయి. ఆమె దేహం, వస్త్రం …. అమితమైన నిర్లక్ష్యానికి గురైన కాందిశీకులల్లాగా ఉన్నాయి. ఆమెలో ఏ కోశానా జీవితాన్ని సౌందర్యంగా గడపాలనే ఇచ్ఛ కనపడలేదు, రూపంలోనూ… హృదయంలోనూ…
…..
కొద్ది రోజుల తరువాత ఏదో పని మీద పక్క ఆఫీసుకి వెళ్ళాల్సి వచ్చింది లీలకు. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. మూల బల్ల దగ్గర కూర్చొని ఉంది మల్లీశ్వరి. వర్షానికి నేల నుండి మొలిచిన పిచ్చి పుట్టగొడుగు గుర్తుకు వచ్చింది లీలకు ఆమెను చూడగానే . పట్టుకొంటే ఊడి వచ్చేటంత బలహీనంగా ఉంటుందది. లీలను చూడగానే నవ్వింది. పని చెప్పి ఆమె ఎదురు కుర్చీలో కూర్చొంది లీల .
పక్క బల్ల చూపించి “ఆయన రావాలి మీ పని అవ్వాలంటే” చెప్పింది మల్లీశ్వరి.
మల్లీశ్వరి తన కేసి చూసినపుడు, విశాలమైన ఆ కళ్ళల్లో సన్నటి గులాబీ రంగు జీరలు చూసింది. ‘వ్యధ ఛాయలా ఆ జీరలు?’ అనుకోకుండా ఉండలేక పోయింది. జోరు వాన కురిసి వెలసిన తరువాత కాసిన ఎండకు ఆరిన నది ఒడ్డు లాగా ఉన్నాయి ఆ కళ్ళు. ఉబ్బిన కంటి రెప్పలతో ఆ కళ్ళు ఆ ముఖానికి ఒక విలక్షణమైన ఆకర్షణ ఇస్తున్నాయి. ఛాయ పోయిన టు బై టు జాకెట్టు ‘నేను ఉన్నా, నువ్వు ఉన్నావన్నట్లు’ లూజుగా భుజం మీద నుండి చేతుల మీదకు నిస్త్రాణంగా జారటానికి ప్రయత్నిస్తుంది. ఆమె బల్ల మీద ఒక పాతికేళ్ళ యువకుడు ఫోటోలో నవ్వుతున్నాడు.
“మీ కొడుకా? ఎలా చనిపోయాడు?” అప్రస్తుతంగా, హటాత్తుగా అడిగింది లీల. అడిగి వెంటనే నాలుక కరుచుకొనింది.
మల్లీశ్వరి మరో సారి కళ్ళెత్తి చూసింది. గులాబీ రంగు జీరలు పొంగినట్లనిపించాయి. తల వంచి కాసేపు పరధ్యానంగా ఉండి పోయింది. లీల చటుక్కున ఆమె చెయ్యి పట్టుకొంది. తల ఊపి మిన్నకుండి పోయింది మల్లీశ్వరి. ఫోటోని రెండు చేతులతో పట్టుకొని బొటన వేళ్ళతో తుడిచింది. “చాలా మంది చెప్పారు. ఈ ఫోటో ఇక్కడ వద్దు అని . కానీ ఈ బాధను ఎవరు తోడినా నాకు ఇష్టమే. నేను మర్చిపోవటానికి ప్రయత్నించటం లేదు కదా దాన్ని.”
“వాళ్ళ నాన్న చనిపోయేటప్పటికి పదేళ్ళు వాడికి. ఆయన శవాన్ని ఎత్తుతుంటే అందరు ఒక్కసారి ఏడ్చిన ఏడ్పులకు బెంబేలెత్తి నన్ను కరుచుకొన్నాడు. నేను ఏడుపు మాని వాడ్ని సముదాయించాల్సి వచ్చింది. అప్పుడే కాదు, ఎప్పుడూ నన్ను నాకు మిగల్చలేదు వాడు. నేను చాటుగా ఏడ్చినా పసిగట్టేసే వాడు. బిక్క మొహం వేసుకొని గుడ్ల నీరు కుక్కుకొనే వాడు. వాడికి నేను తప్ప వేరే ప్రపంచంలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అదే నన్ను కోలుకోనేటట్లు చేసింది. ఎప్పుడూ నన్ను వదిలేవాడు కాదు. వాడి కోసమే నేను అన్నట్లు బతికాను. ఎక్కడకు పోయినా ‘మీ తమ్ముడా’ అని అడిగేవారు.”
అప్పటికప్పుడు ఈ లోకంలోకి వచ్చినట్లు ఆమె కట్టుకొన్న చీరను చూసుకొనింది. “ఈ చీర పోయినేడాది సంక్రాంతికి వాడే ఎన్నిక చేశాడు. ముదురు రంగులు నాకు బాగుంటాయనేవాడు. చీర నలిగి ఉంటే ‘జ్వరం వచ్చిందా?’ అని అడిగే వాడు. ఏదైనా ఒక రోజు కాటుక పెట్టుకోక పోతే ‘ఎందుకు ఏడ్చావ్?’ అని వెంబడ పడేవాడు.” మల్లీశ్వరి పెదాలు సాగదీసి నవ్వింది.
“వాడి కోసం మొదట్లో సంతోషాన్ని నటించిన నేను, తరువాత ఆ ఆనందాన్ని పూర్తిగా నా జీవితంలోకి ఆహ్వానించాను. స్వతంగా దేన్నీ ఆస్వాదించటం, ద్వేషించటం, ప్రేమించటం మర్చిపోయాను. వాడికి బయట స్నేహితులు కూడా ఎక్కువ లేరు. నాక్కూడా…. ఎవరు ఎవరికోసం బ్రతికామో నేనిప్పుడు చెప్పలేను. బయటకు ఎక్కడకు వెళ్ళకుండానే వాడి చదువు అయిపోయింది. ఎంబియే చేశాడు. ప్రైవేట్ ఆఫీసులో పని. నేనూ వాడు ఒకే సారి ఆఫీసు నుండి వచ్చేవాళ్ళం. వాడు ముందు వస్తే టివి రిమోట్ చేతిలో పట్టుకొని నేను వచ్చే గేటు చప్పుడు కోసం చూసేవాడు. ఒక రోజు ఆఫీసు నుండి వాడే ఆలస్యంగా వచ్చాడు. ‘నా కాళ్ళు వాశాయి చూడమ్మ’ అని ఫిర్యాదు చేశాడు. “ఆవజానా పొద్దున్నుంచి కూర్చొని ఉంటే వాయక ఏం చేస్తాయి.’ అన్నాను.”
మల్లీశ్వరి ఆపి ఊపిరి తీసుకొంది. ఆ నిమిషానా ఒక విషాద అంకానికి తెర తీస్తున్నట్లు ఆమె ముఖంలో నల్లని నీడలు కమ్ముకొన్నాయి. ఇష్టం లేని వాక్యాలు పలుకుతున్నట్లు గొంతు వణికింది. “తరువాత ఏమౌతుంది? కిడ్నీలు చెడిపోయాయన్నారు. కేరాసుపత్రికి పోయాము. నా కిడ్నీ సరిపోతుందన్నారు. ప్రావిండెంట్ ఫండ్ అప్పుతీసుకొని మళ్ళీ హైదరాబాదు పరిగెత్తాను. అక్కడ కూడా నన్నువాడు జాగ్రత్తగా గమనించేవాడు. నీరసంగా ఉన్నా వాడి చూపు ఎప్పుడూ నా మీదే ఉండేది. ‘తింగర బుచ్చి! బ్యాగు ఇటు తగిలించుకో. ఎవడో కొట్టేస్తాడు’ అనే వాడు.
ఆపరేషను రోజు రానే వచ్చింది. మా చెల్లెలిగారి ఇంట్లో ఇద్దరం తలక బోసుకొని బయలుదేరాం. నా భుజం మీద తల వాల్చి పడుకొన్నాడు. ఆటో కుదుపులకు వాడి తడి క్రాఫు ఊగడం తెలుస్తూ ఉండింది నాకు. వత్తు జుట్టు. రెండు సార్లు ముట్టుకొని చూసుకొన్నాను. ఆసుపత్రి దగ్గరకు వచ్చాక లేపాను. నా జాకెట్టు మీద వాడి చొంగ కారి ఉంది. వాడు వెళ్ళి పోయాడు. “
మల్లీశ్వరి పెద్ద కళ్ళలో నీటి ఊట కమ్ముకొనింది. వాటిలోని జీరలు ఎరుపుకి తిరిగాయి. నీళ్ళ కళ్ళతో నిస్తేజంగా లీల వంక చూసింది. పెదవులపై చిరునవ్వును ఉగ్గబట్టి కాపాడుతున్నట్లుగా ఉంది. కళ్ళ నీళ్ళు బుగ్గలపై జారక ముందే పైటతో తుడిచేసుకొంది. ముఖం కందిపోయింది.
కడుపు కోత… దీనిని ఎలా వ్యక్తీకరించగలం? శరీరంలో ఏదైనా అంగం కోసిన బాధతోనా? గుండెను బయటకు తీసి మంట పెట్టినట్లా? ఇదేమిటి అన్నీ భౌతికమైన పోలికలే వస్తున్నాయి? దాని అగాధమెంతో? ఒడ్డున నిల్చోని నేను కొలవగలనా? ఆమె రక్తంలోని మరిగింపుకి, నాడులలో పెనవేసుకు పోయిన దుఃఖానికి నేను ఓదార్పు ఇవ్వలేను, ఉపశమనం కలిగించలేను అనుకొని వడివడిగా బయటకు అడుగులు వేసింది లీల.
“బాబు, బాబు ….. “ పలవరిస్తూ ఉంది మల్లీశ్వరి.
…..
“ఏసమ్మ! అలా నడుద్దాం రా” అని పిలిచింది లీల.
సాయంకాలం నాలుగు అయినట్లుంది. ఆ రోజు ఆఫీసులో పని వత్తిడి ఉండి కుర్చీ నుండి కదలలేక పోయింది లీల. దొరికిన కాస్త వెసులుబాటులో వళ్ళు కదిలిద్దామని బయలు దేరింది. జారాడే కుచ్చిళ్ళను బొడ్డులో దోపి, చిన్న అడుగులు వేసుకొంటూ ఏసమ్మ లీలతో నడుస్తూ ఉంది. ఎందుకో మల్లీశ్వరి గుర్తుకు వచ్చింది. గాఢమైన ఆవేదనను మోస్తూ మల్లీశ్వరి … దుఃఖానికి అత్యున్నత దశ …. గర్భ శోకానికి ప్రతీక…
“లీల గారు!” సన్నటి గొంతు విని గబుక్కున తిరిగి చూసింది లీల. పసుపుపచ్చ రంగు చీరలో మల్లీశ్వరి సాగిపోయిన బంతిదండలాగా నిల్చోని ఉంది కొద్దిగా దూరంగా. తన ప్రియమయిన దుఃఖదాయిని. లీల మొహం పొంగి పొర్లబోతున్న ఏరులాగా ఉద్వేగంతో తత్తర పడింది. “ఈమె ఎవరు? చానా ఏళ్ళ కిందట మా ఇద్దరి కుదుర్లు ఒకచోటే ఉండేవా? ఏమిటీ హృదయ స్పర్శ? మెత్తగా అంటుతుందేమిటి?” అనుకొంటూ వడిగా ఆమె దగ్గరకు నడిచింది. ఆ నడకలో ‘నిన్ను ఓదార్చే ధైర్యం నాకు వచ్చింది, అవకాశం ఇవ్వు ‘ అనే వేడికోలు ఉంది.
“సాయంత్రం ఏదైనా సినిమాకు వెళదామా? ఇంట్లో విసుగ్గా ఉంది.” అడిగింది మల్లీశ్వరి.
మల్లీశ్వరి వంక తెరిపారా చూసింది లీల. మొహం తేట తేలింది. పిన్నులు పెట్టి కట్టుకొన్న గళ్ళ చీర ఒద్దికగా ఒదిగి ఉంది. బలహీనంగా ఉన్న వంటిని అంటుకొన్న జాకెట్టు నిబ్బరంగా ఉంది. జడలో గుచ్చిన తెల్ల గులాబీ పువ్వు తాజాగా ఉంది. ఏదో అయిష్టత వెన్నులో నుండి జర్రున పాకుతూ మెదడుకు సోకింది లీలకు. కలిసి ఉన్న వేర్లు నిలువునా చీలినట్లు… లోలోపల ఇష్టంగా గీసుకొన్న నమూనా ఛిద్రమయినట్లు … సుడులు తిరుగుతున్న ఆలోచనలతో సంబంధం లేని నవ్వు పెదవులమీదకు తెచ్చుకొని “నాకీవేళ చుట్టాలొస్తారండి. “ అంది.
…….
లీలకు తన స్వంత ఊరికి బదిలీ అయ్యింది. మల్లీశ్వరిని మళ్ళీ కలవటం కుదరలేదు.
ఒక సంవత్సరం తరువాత మల్లీశ్వరి నుండి ఫోను. జ్ఞాపకాలు మాసిపోయి, ప్రాముఖ్యత కోల్పోయిన నగరాన్ని చూసినట్లు అనిపించింది ఆమె గొంతు వింటుంటే.
“ఎలా ఉన్నారు?”
“చాలా బాగున్నాను మేడం, మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. నేను పెళ్ళి చేసుకోబోతున్నాను. ‘ఆయన’ అడిగి నెల అయ్యింది. అన్నీ ఆలోచించి ఒప్పుకొన్నాను. ముందు మీకు చెప్పాలనిపించింది.” చెప్పుకు పోతూ ఉంది. మల్లీశ్వరి గొంతులో ఉత్సాహం, ఆనందాన్ని ఫోను మోస్తూ ఉంది.
లైను ఆటంకం అయ్యిందో, లీలే ఫోనుని ఆపేసిందో తెలియదు. మల్లీశ్వరి గొంతు ఆగి పోయింది. ఆమె పెళ్ళికి ఆ రెండు ఆఫీసుల నుండి ఏసమ్మ ఒక్కతే వెళ్ళినట్లు తరువాత విన్నది.
ఇప్పుడు ఎవరైనా ‘మల్లీశ్వరి నీకు తెలుసా’ అని అడిగితే ‘అబ్బో ఆవిడా?’ అంటూ నొసలు చిట్లిస్తుంది లీల.
తెలుగువెలుగు మార్చి2014లో ఈ కధ ఇక్కడ
చదవడం పూర్తయ్యాక కూడా పాఠకుల ఆలోచననను తనతోనే కట్టివేసుకోగల అనిర్వచనీయమైన సహానుభూతిని పాఠకుల్లో కలిగించే కథలు అరుదు. ఈ కథ ఆ కోవకే చెందుతుంది.
కథలో సూటిదనం, క్లుప్తత, భావుకత అద్భుతంగా ఉన్నయ్. పాత్రల మనసుల్లో చెలరేగే సున్నితమైన భావాలను చాలా నైపుణ్యంతో వ్యక్తీకరించారు. శైలి చాల బాగుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
చాలా బాగుందండి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
చాలా బావుంది మీ కధ.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Brilliant narration. There are few loose points here and there, but negligible. Very well done.
మెచ్చుకోండిమెచ్చుకోండి
కథ చాలా బాగుందండి. ఆ మార్చిన కథా చదవాలని కుతూహలంగా వుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Fantastic !
మెచ్చుకోండిమెచ్చుకోండి
నారాయణస్వామి గారు, తప్పకుండ మీరు ఆ విషయాలు చెప్పాలి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
తెలుగువెలుగు (మార్చి) లో మారిన కధ వచ్చింది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
శారదగారు, మప్పిదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
మప్పిదాలు మీకు 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
స్పందనగారు, థాంక్స్
మెచ్చుకోండిమెచ్చుకోండి
అవినాష్ గారు, థాంక్స్
మెచ్చుకోండిమెచ్చుకోండి
మానవ స్వభావాలను,సహజాతాలను,హిపోక్రసిని చాలా చక్కగా ఆవిష్కరించారండి
మెచ్చుకోండిమెచ్చుకోండి
చంద్రమోహన్ గారు, థాంక్యూ.
మెచ్చుకోండిమెచ్చుకోండి
కథ చాలా బాగుంది, ముఖ్యంగా మీరు వాడిన ఉపమానాలు మనసులో నాటుకుని పోయాయి – ఇంకా ఏవేవో కథల్ని మౌనంగా వినిపిస్తున్నాయి.
మెచ్చుకోండిమెచ్చుకోండి