ట్యాగులు

 

rama“ఏంటీ చాలా రోజులకు గుర్తుకు వచ్చాను? ఆ గయ్యాళి మొహమేంటి?”

“రాత్రి మా అమ్మా నాన్నలతో గొడవ పడ్డాను. ఆస్తి మొత్తం తమ్ముడి పేరా వీలునామా రాసేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే కొడుకు మీద ఉన్న ప్రేమ, కళ్ళెదురుగా నెలాఖరు బాధలు పడుతున్న టీచరు కూతురు మీద లేక పోవటం విడ్డూరంగా లేదూ?”

“ఊరుకో. బాధ పడకు.”

“అదేమని అడిగితే నా కూతురు పెళ్ళికి ఒక లక్ష రూపాయలు ఇస్తామని ఉదారంగా ప్రకటించారు. కోట్ల ఆస్తి కొడుకు పరం చేసి, పేదింటి పిల్ల పెళ్ళికి సాయం చేసినట్లు లక్ష ఇస్తారట. నాకు ఎంత అవమానం వేసిందో తెలుసా? నేను ఆ ఇంట్లో పుట్టలేదా? అమ్మ పేగుతో నాకు బంధం, నాన్న జీన్స్ లో నాకు భాగం ఉన్నప్పుడు … వాళ్ళ ఆస్తిలో బంధం, భాగం ఉండదా? ‘ఆస్తి ఎందుకు? మమకారాలు చాలు’ అని ముష్టి కబుర్లు చెప్పకు. నేను ఇంకొంచం సౌకర్యంగా ఉండే మార్గం వాళ్ళకు తెలిసీ నన్ను నిర్లక్ష్యం చేసారంటే నా మీద ఏమి మమకారం ఉన్నట్లు?”

“నీ గొంతు జీర పోయింది. బాగా ఏడ్చినట్లున్నావు. సంభాళించుకో.”

“అర్ధరాత్రి ఫోన్ చేసి, వంద గ్రాముల పచ్చి మిరపకాయలు కావాలంటే … ఓపిక లేకపోయినా అప్పటి కప్పుడు పట్టుకెళ్ళేదాన్ని. అన్ని అవసరాలకూ ఆ అని పలికాను…… “

“అయినా ఆస్తులు ఉండకూడదు అనే సంఘంలో కదా నువ్వు పని చేస్తున్నావు? ఆస్తుల కోసం అమ్మా నాన్నలతో గొడవ పడటం ఏమిటి?”

“ఆస్తి కోసమా నేను గొడవపడుతుంది?”

……

అక్క! ఎలా ఉన్నావు?”

“మునిరాజు! బాగానే ఉన్నాను. మన పల్లెలో అందరు బాగుండారా? మనమనుకొన్న పనులు అవుతున్నాయా?”

“నీ గొంతు ఏడ్చినట్లు ఉంది. ఏమయ్యిందక్క?”

“బెంగటిల్లిన గుండెకాయను పట్టుకొని, ఊరడిస్తారని అయిన వాళ్ళ దగ్గరికి వెళితే ఇంకాస్త నలిపి పంపారు. సరేలే, ఇంకేమిటి సంగతులు? ఊళ్ళో ఏవో గొడవలు జరుగుతున్నాయని విన్నాను?”

“అవునక్క, ఊళ్ళో కొత్త గుడి కడుతున్నారు కదా. దానికి మా పల్లె నుండి ఒక లక్ష డబ్బులు వసూలు చేసి ఇచ్చాము. చుట్టుగోడకి శ్రమ దానం కూడా చేశాము. ఆ మజ్జిన నాకెందుకో సందేహం వచ్చి ఊరి పెద్దను అడిగాను. ‘అన్నా! కొత్త గుడిలోనయినా మేము లోపలికి రావచ్చా?’ అని. ‘అదెట్ట? పారంపర్యంగా వచ్చిన సాంప్రదాయకం ఏడకి పోద్ది? మీరు బయట నుండి దండం పెట్టుకొని పోవచ్చును.’ అన్నాడు. ఆ ఊరి గాలి పీలుస్తూ, ఆ మట్టి మీద మా చెమట దారబోస్తూ బతికేటోళ్ళకి గుళ్ళో మాత్రం ప్రవేశికం లేదట. కడుపు మండి నాలుగు మాటలు కడిగేశాను. ఊరోళ్ళు ఆ కోపంతో నలుగురు పొరుగూరు పిల్లగాండ్లను నా మీదకు పంపారు.”

“అయ్యో దెబ్బలు తగిలాయా?”

“అయ్యేం దెబ్బలక్క. అంతకన్నా పెద్ద దెబ్బే తగిలింది. నా సావాసగాడు వాసు నీకు తెలుసు కదా? వాడు ఊర్లో పుట్టినా కంచం, మంచం స్నేహం మాది. వాడు నాకు పొద్దున బస్ లో కలిసి ‘ఎందుకు మునిరాజు తగాదాలు. మీ లక్ష మా వాళ్ళు తిరిగి ఇస్తారట. కావాలంటే ఇంకో లక్ష కూడా ఇస్తారంటా. పల్లెలో చర్చి కట్టుకోగూడదా?’ అన్నాడు.”

“అవును. వాళ్ళు వద్దన్న గుడికి మీరెందుకు పోవాలా? మీ డబ్బులు మీరు తీసుకోండి. ఎటూ పల్లెలో చర్చీకేగా పోతున్నారు జనాలు?”

“గుడి కోసమా అక్కా నేను దెబ్బలు తినింది?”

భూమికలో మోదుగుపూలు కాలమ్ లో ఇక్కడ