ట్యాగులు

old-trees-wallpapers_27541_1920x1080

అడ్డరోడ్డు దాటి మా పుట్టింటి అర సందులోకి వచ్చాను. ఆ వీధి ఇళ్ళ ముందర కుర్చీల్లో వృద్ద వృక్షాలు చాలా కనిపిస్తాయి. మందపాటి కళ్ళజోడు సరి చేసుకొని కంటి గుడ్డుకి దగ్గరగా దర్పణాన్ని లాక్కొని అందులో నుండి నా రూపుని పసి కట్టింది ఎనబ్భై ఏళ్ళ సులోచనమ్మ. “అమ్మా రావుడు నువ్వా!” అంటూ కళ్ళతోటే వాటేసుకొంది. కాఠిన్యం, నిర్వేదం తప్ప ఏది పలికించటానికి అస్సహాయ అయిన ఆ ముసలి ముఖంలో భోళాతనంతో కూడిన ఆనందం మూతి దాకా పాకి … బిగిసిన ఆ ముఖకండరాలు ఆ సంతోష ప్రదర్శనకు సహకరించకపోతే అయిష్టంగా అదృశ్యమయ్యింది. దౌర్జన్యంగా నా చేతిని లాక్కొని అరచేతి మెత్తదనాన్ని నొక్కింది. ఆ క్షణకాలంలోనే మా ప్రాచీన సంబంధాన్ని నాలో ప్రవహింప చేసింది. గొప్ప ఘనత లేని తన పురాతన కుటుంబాన్ని సంఘ ఆమోదానికి, సాహచర్యానికి లాక్కు రావటానికి ఆమె చేసిన సేద్యపు చాళ్ళు నుదిటి గీతల్లో ప్రక్షిప్తం చేసుకొంది. తను కన్న పది మంది పిల్లల వెన్నునిలపటానికి రేపగలు చెయ్యి తిరిగిన సరంగు లాగా ఆమె చేసిన ప్రయాణానికి సాక్షీగా నన్ను భావించిట్లుంది. నా చేతిపై ఆమె మనసును ఆనించి ఆ క్షణ కాలం విశ్రాంతి పొందింది. ఆమె పిల్లలతో సమాంతరంగా సాగిన మా పయనాన్ని గమనం చేసుకొని ఎవరెక్కువ ఫలితాలు పొందారో బేరీజు వేసుకొని ఓదార్పు పొందింది. ఆ నిమిషాన ఆమె ఇంటి ఎదురుగా ఉండే భూత్ బంగ్లా మాయమయి, రెండంతస్తుల మేడ ప్రత్యక్షం అయినట్లు… తన గతాన్ని మాయం చేయని జ్ఞాపకాల కుదుళ్ళతోనే సావాసం చేస్తున్నానని చెప్పకనే చెప్పింది. “పిల్లలు బాగుండారా?” అనే ప్రశ్న వేసి, ఆ ప్రశ్నలో మా రెండు కుటుంబాల వర్తమానానికి, గతానికి ఉన్నగొలుసుని తడిమి చూసుకొంది.

రెండడుగులు వేయగానే ఇంకో కుర్చీలో వెంకటేశ్వరులు ఆరు బయట కూర్చొని ఉన్నాడు. ఆ ఇంటి మామగారు. తను పుట్టి పెరిగిన పల్లెను విడిచి పెట్టి ముసలి ముంపున కోడలికి దొరికిపోయాడు. కళ్ళల్లో పెట్టుకొని చూసే కొడుకు, కోడలు ఉన్నా పరాధారమైన మిగులు జీవితం అతనిని భయపెడుతుందని ఆ చూపులో శాశ్వతంగా కుదురుకొని ఉన్న అభద్రత, దిగులు చెబుతున్నాయి. “నువ్వు పదేళ్ళ క్రితం మా వూరు వచ్చావు కదా? అప్పుడెట్టా ఉండేది అక్కడ?” అడిగాడు. నిజమే. ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నా ఊరంతా వాళ్ళింట్లోనే ఉన్నట్లు ఉండింది. ఆయన చేసే హోమియో వైద్యానికి పల్లంతా దాసోహం అనేది. కొద్ది రోజుల తరువాత ఆయన భార్య చనిపోయింది. ఊరు ఆయన్ని కొన్నాళ్ళు సాకింది కానీ, ఎల్లకాలం సాగలేదు అది. “ఒక్క మనిషి పోతే ఎంత మార్పో చూడు!” ఎంతో దుఃఖంతో అన్నాడు.

“ ఎవరా మనిసి?” చినసీతమ్మ రౌడీ ప్రశ్నను దాటుకొని వెళ్ళటం కష్టమే. పక్షవాతం వచ్చిన ఇంటాయనికి అయిదేళ్ళు మంచం మీదే అన్నీ చేసి ఇటీవలనే ఆయన్ను సాగనంపి ఇప్పుడు ఉపశమనంగా కాళ్ళు బారా చాపుకొని కూర్చొని ఉంది. నాకు తెలిసి ఆమె కాళ్ళు రెండూ ఒక దగ్గర పెట్టి కూర్చోవటం చూడలేదు. బ్రతుకంతా ఆయన అదుపాజ్ఞలలో బతికినా ఆయన చివరి రోజుల్లో పడిన బాధలు అంతా ఇంతా కావు. చనిపోయిందాకా తొంభై కేజీల బరువున్న ఆయన్ని లేపటానికి పిట్టలాంటి సీతమ్మ ఎన్ని అవస్థలు పడేదో. మగపిల్లలతో బాటు బండబారిన మగస్వామ్యం కూడా వారిలో పెరిగింది. ఆడ పిల్లలు చినసీతమ్మకి నిజ అర్ధంలో కూతుళ్ళు. చెప్పిన మేనరికాలు చేసుకొని ఇంటి ముందర, పక్కన కుదురుకొని తల్లికి చేతి సాయం చేశారు. “ఎలా ఉంది ఆరోగ్యం?” అనే నా యధాలాప ప్రశ్న కు “ఏడ రావుడూ! సుగరు వచ్చిందిగా” అంటది గాని ఉత్తిదే. ఆమెను నేను సంతోషంగా చూడటం ఈ మధ్యనే.

“ఏమి రావుడూ! కనబడటమే లేదూ?” వెంకాయమ్మ మాటకు జవాబు ఇవ్వకుండా నా పుట్టింటి గేటు దాటటం బో కష్టం. తొంభై రెండేళ్ళ భర్తకు అన్నం టయానికి వండి పెడుతూ టీవి కార్యక్రమాలతో పొద్దు గడుపుతుంది వెంకాయమ్మ. కొడుకులు అమెరికాలో, దుబాయ్ లలో కుదురుకొన్నా ఈ వృద్ధ దంపతులు ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటూ పనిమనిషి రాలేదనో, పాలు విరిగి పోయాయనో నిత్యం ఆందోళనతో గడుపుతుంటారు. ఈ వయసులో కూడా మండుటెండలో నెత్తి మీద గుడ్డ వేసుకొని రామయ్య కరెంటు ఆఫీసుకు వెళ్ళి బిల్లు కట్టుకొని వస్తాడు.

ఇక మేడ ఎక్కి కాలింగు బెల్లు నొక్కగానే, మండుతున్న మోకాళ్ళు సరిచేసుకొంటూ .. చిన్న చిన్న అడుగులు వేసుకొంటూ.. తలుపు తీసి … కళ్ళు చిట్లించి చూసి “నువ్వా” అని పసి పాపలాగా నవ్వే ఆ ఆడమనిషి మా అమ్మ. హిందూ పేపర్ పట్టుకొని మంచం మీద నోరు తెరుచుకొని నిద్ర పోతుండే ఆ మగమనిషి మా నాన్న.