ట్యాగులు

,

20140406_210332-1‘తెగిపడ్డ ఆ చెయ్యి’ పుస్తకం గురించిన పరిచయం కినిగే పత్రికలో వచ్చింది.

పుస్తక ఆవిష్కరణలు రాజధాని నడిబొడ్డున అద్దెకు తీసుకొన్న హాలుల్లో, మేధావుల సమక్షంలోనే జరగనవసరలేదు. ఆ పుస్తకంలో పాత్రలు కాల్పనికాలు కాకుండా రక్త మాంసాలతో జవజవలాడే మనుషులు అయితే, సంఘటనలు అభూతకల్పనలు కాకుండా జీవితాల తాలూకు వాస్తవాలు అయితే ఆ పుస్తక ఆవిష్కరణ ఒక మారుమూల పల్లెలో జరిగినా చీమల బారుల్లా ప్రజలు తరలి వస్తారు. మేధావులు వినమ్రతతో ఆ ఊరి గతుకుల బాట పడతారు. అదే జరిగింది ఇక్కడ. ప్రకాశం జిల్లా ఒంగోలుకి పాతిక కిలోమీటర్ల దూరంలో కారుమంచి గ్రామంలోని ప్రజలు, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన పూర్వ వాసులు తమ పూర్వీకుల చరిత్రను గుండెకు హత్తుకొన్నారు. తమ మూల వాసులు చేసిన యుద్ధాల తాలూకు నెత్తుటి వాసనలు తనివి తీరా పీల్చారు. ఇప్పటి తమ సౌకర్యవంతమైన జీవితానికి దారులు వేసిన మూల విరాట్టుల త్యాగాలను స్పర్శించారు. చదువు రాని ముసలోళ్ళు కూడా పులగర సుబ్బయ్య ముఖచిత్రంతో ఉన్న ఈ పుస్తకాన్ని కొనుక్కొన్నారు. మరికొందరు తమ పెద్దల అమానవీయ కులహంకార ప్రవృత్తిని చదివి తలలు వంచుకొన్నారు. ఇంకొందరు తలలు ఎగరేస్తూ, ఆ దారిని తప్పించుకొని కూడా పోయి ఉంటారు. తన వడ్డున జరుగుతున్న ఈ బాగోతాన్ని చూస్తున్న ఊరి చెరువు, మానిన తన గాయం తాలూకూ మచ్చని తడుముకొంటూ గత స్మృతులలోకి పోయింది. జ్ఞాపకాలు అలలుగా చెరువులో గంభీరంగా సాగాయి. విజయాల తాలూకు చిరునవ్వులు చెరువులోని కలువలుగా పూసాయి.

“తెగిపడ్డ ఆ చెయ్యి” పుస్తకంలో సాగర్ రాసిన దళితాచ్చరాలు తేటగా ఉన్నాయి. గతం తాలూకూ అమానుషత్వాన్ని చెబుతూ ఇవి కన్నీరు పెడతాయి. మాలవాడ చేసిన ఆత్మ గౌరవ పోరాటాలు వర్ణించేటపుడు ఒక్కోసారి అవి కత్తులలాగా కణకణమన్నాయి. ఈ అక్షరాలు గత కాలంలో కొనసాగిన ఉత్పత్తి, భూమి సంబంధాలు కొసాంబి కళ్ళద్దాలతో సూష్మ పరిశీలన గావింపబడి యధార్ధతను ఆపాదించుకొన్నాయి. నీటి దొంగలు, కూటి దొంగలుగా నాగరికుల చేత ముద్ర వేయించుకోబడి తెగబడ్డ కారుమంచి మాలల యుద్ధం వెనుక, వేయికాళ్ళ అగ్రకుల తొక్కివేతను ప్రతిఘటించిన పరాక్రమం … ఈ అక్షరాలు కళ్ళు జిగేల్మనిపించేటట్లు ప్రతిఫలించాయి. ఇంకా ఈ అక్షరాలు వందల ఎకరాలకు బ్రాహ్మలు, రెడ్లు ఎలా యజమానులు ఎలా కాగలిగారో…. దళితులు, బహుజనులు సెంటు చెక్క అనుభవించనివ్వని దుస్థితికి ఎలా నెట్టబడ్డారో నేర్పుగా వివరించాయి. ఈ అక్షరాలు ఏళ్ళ తరబడి ఎట్టి చేయించుకొని చాకళ్ళకు, మంగళ్ళకు విదిల్చిన సంగటి ముద్దల్లాగా ఒక్కోసారి బావురుమంటాయి. కుమ్మర్లను అనుభవించనివ్వని మాన్యం గురించి చెబుతూ తీక్షణతను సంతరించుకొన్నాయి. ‘కూటికి పేదలం అయినా కులానికి కాదు’ లాంటి దుర్మార్గపు వాడుకలను పుట్టించిన మనువు మనవళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాలాన్ని దృశ్యీకరిస్తాయి ఈ అక్షరాలు. ఒక కాలంలో … ఒక గ్రామం కధగా రాసినా, ఈ వస్తువుకి సార్వజనీయత, సార్వకాలీనత రెండూ ఉన్నాయి. ఆర్ధిక దోపిడీ మూలాలు చూయించిన విసృతత్వం ఈ అక్షరాలకు ఉంది. అంతరానితనాన్ని చీల్చి చెండాడిన కర్కశత్వం ఈ పుస్తకానికి ఉంది.

చరిత్ర చెప్పగలుచుకొన్న వాళ్ళు లైబ్రరీలతో, రికార్డులతో సంప్రదింపులు జరిపితే సరిపోదు. నులక మంచాల్లో ముడుచుకొని ఉన్న ముసలవ్వలను, తాతలను కదిలించాలి. వారి హృదయపు తలుపులను మెత్తగా తట్టాలి. వాళ్ళు కొన్ని జీవిత కాలాల్ని ఏకరువు పెట్టగలరు. వాటిలోని ముత్యాలను ఏరుకొని సరైన చూపుతో పరిశీలిస్తే గత సమాజ గమనం బయట పడుతుంది. అదే పని సాగర్ చేశాడు. 1937లో చెరువు నీటి కోసం జరిగిన యుద్దానికి సాక్షీభూతులుగా ఉన్న తొంభై ఏళ్ళ ముసలాళ్ళ దగ్గర కూర్చొని విని చరిత్ర నడకను గమనించాడు. ఆనాటి సామాజిక పరిస్థితులను తన అనుభవంతో, ప్రాపంచిక దృక్పధంతో అంచనా వేశాడు. షుమారు నలభై మంది వృద్ధుల జ్ఞాపకాలను ప్రక్షిప్తం చేశాడు.

ఊరి చెరువుకి ‘జంధ్యం నాగు’ ని చుట్టి దళితులకు నిషిద్దం చేసిన చరితలు ఆ నాడు భారతదేశంలోని గ్రామ గ్రామాన సహజం అయి ఉండొచ్చు. కానీ కారుమంచి మాలలు ఆ జంధ్యాన్ని తునాతునకలు చేసిన ధీర యుద్ధం మాత్రం అరుదైనది. వారి పల్లె వడ్డునే ఉన్న చెరువులో నీళ్ళు ముంచుకోనివ్వని కర్కశ కుల దౌష్ట్యాన్ని ఎదురొడ్డి, గ్రామ బహిష్కరణకు గురైనా తలవంచక చేసిన ఆత్మ గౌరవ పోరాటం మాత్రం ఉన్నతమైనది. ఆకలిని ఆయుధంగా మలుచుకొని లొంగదీయటానికి ప్రయత్నించిన పెత్తందారీతనాన్ని సవాలుగా తీసుకొన్న సాహసం అపురూపమైనది. అవసరాల కోసం తమ మాల, మాదిగ వాడలను అనుమతించేరే కానీ అగ్రకుల పెత్తందారుల హృదయాంతరంగాలలో తామెప్పుడూ బహిష్కరణలోనే ఉన్నామని అనుకొన్నారేమో! ఆకలితో నిత్యం కాపురం చేసే తాము కొత్తగా పోగొట్టుకొనేదేమీ లేదని గుర్తించారేమో. ఆకలికి ఏడ్చే పసిపిల్లలను గుండెల కద్దుకొని ఓదార్చారే కానీ, కండ్ల నీళ్ళు బయటకు జారనివ్వలేదు. కడుపు మంటను కసిగా మలుచుకొని అంతిమ యుద్ధానికి సమాయత్తం అయ్యారు. రెడ్ల కులహంకారం, మాలల ఆత్మాభిమాన తెంపు ముందు ఓడిపోయింది. మాలలు పోగొట్టుకొన్నది ఒక చెయ్యే. ఒక బొటనవేలే. రెడ్లు తరతరాలు తాము పెంచి పోషించుకొన్న ఆధిపత్యం, అహంకారం బీటలు వారి పగిలిపోతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. అరెస్టులకు, కోర్టులకు, జైళ్ళకు బెదరని మాలల తెగువ అగ్రకులాలన్నింటినీ వంచింది.

తెగి పడిన పులగర సుబ్బయ్య చెయ్యి మాలల గెలుపుకి ప్రతీకగా నిలిచింది. ఆ చెయ్యి తరువాత మళ్ళీ మళ్ళీ మొలిచింది. కూలీ రేట్ల పెంపు కోసం లేచింది. చాకలోళ్ళకు సహానుభూతిగా లేచింది. తెప్ప తిరునాళ్ళలో మాలలను దేవుడికి టెంకాయ కొట్టనివ్వని అధికారానికి ప్రశ్నగా మొలిచింది. గ్రామంలో జరిగిన కులాంతర వివాహాలకు మద్దతుగా భుజం తట్టింది. 1940లో గ్రామంలోకి ప్రవేశించిన కమ్యూనిష్టు పార్టీని ఆహ్వానిస్తూ స్వాగతం పలికింది. విప్లవ రాజకీయాలకు పల్లెలో నార్లు పోసింది. శ్రీకాకుళ పోరాటానికి గ్రామ యువకుడు సంగీతరావుని వెన్ను తట్టి సాగనంపింది. అంబేడ్కర్ ఆలోచనలకు సానుకూలంగా స్పందించింది. అస్థిత్వ ఉద్యమాలకు పల్లెలో పురుడు పోసింది. ‘కులం కోరలు చిగురించినపుడు’ వాటిని మొగ్గలోనే తుంచి వేసింది. గడ్డ కట్టని ప్రవాహంలాగా సాగి పొమ్మని పల్లెను కోరింది.

ఈ సంఘటన జరిగి ఏడు దశాబ్ధాలు దాటింది. మూడు తరాలు గడిచిపోయాయి. చదువు ప్రాముఖ్యత అర్ధం చేసుకొన్న దళితులు రిజర్వేషన్లను ఉపయోగించుకొని కొంత మెరుగైన జీవితం పొందారు. అక్షరం ముక్క రాని మట్టి మనుషులు, తమ ముత్తాతలు చేసిన ఆత్మగౌరవ నీటి యుద్ధం తాలూకు చల్లని ఫలితాలు తమ పై ప్రసరిస్తున్నాయనే వాస్తవాన్నిమోసుకొని పోవాల్సిన కర్తవ్యాన్ని ఈ పుస్తకం ముందుకు తెచ్చింది. మానవ నాగరికత అభివృద్ధి సాఫీగా సాగలేదని, మిట్ట పల్లాలను చదును చేసుకొంటూ… మొరటు యుద్దాలు చేసుకోంటూ … రక్త తర్పణాలకు వెరవకుండా పురోగమించిందనే వాస్తవాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. భారదేశంలో లక్షలాది గ్రామాల నుండి ఇలాంటి చరిత్రలు వెలుగులోకి రావాలని …. ఆధిపత్య వర్గాల అవాస్తవ చిత్రీకరణలకు ఈ పుస్తక జీవితాలు తిరుగులేని సమాధానం ఇవ్వాలని కోరుకొందాము.

పుస్తకం: తెగిపడ్డ ఆ చెయ్యి

రచయిత: సి.ఎస్. సాగర్

ప్రచురణ కర్తలు : సి.పి. ఎం.ఎల్ (న్యూ డెమోక్రసీ)

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

కినిగె లో ఈ పరిచయం ఇక్కడ