ట్యాగులు

,

IMG_6401

పలుకూరు అంటే గుర్తుకు వచ్చేది మాలపల్లెలో తెల్లవారు ఝాము వరకు సమావేశాలు. అవి అయ్యాకో ఎక్కడో … ఎవరి నులక మంచం మీదో కాసేపు ముడుక్కొని పడుకొని తెల్లారి పాచి ముఖాలతో గుంపుగా బయలుదేరి … దారిలో ఎవరైనా వేప మండలు తెంచి ఇస్తే నములతా … పొలాలమ్మట బడి మూడు కిలో మీటర్లు నడిచి కందుకూరు రోడ్డు ఎక్కడం. ఎన్ని సార్లు ఆలోచించినా అదే దృశ్యం గుర్తుకు వస్తుంది. బహుశ ఆ దృశ్యం అనేక సంఘటనల సమాహారం అయి ఉండొచ్చు. చాలా సార్లు జరిగిన వాటిల్లో నాకు ఇష్టమయినవి కొన్ని మాత్రమే గుర్తు ఉండి ఆ దృశ్యంగా మారి ఉండచ్చు. నేను గుర్తుకు తెచ్చుకొంటే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉండే ఉంటాయి. అవి ఇష్టంగా మర్చిపోయి ఉంటాను. అయితే ఈ దృశ్యంలో ఒక కోటేరు ముక్కు వ్యక్తి … చురుకు చూపులతో, స్పష్టమైన గొంతుతో ఆజ్ఞలు ఇస్తూ హడావుడి పడటం కూడా ఉంటుంది. పాండన్న అని అందరం పిలుచుకొనే ఈ వ్యక్తి ఒక సారి కరుణగాను, ఒక సారి కఠినంగాను నా వైపు చూస్తున్నట్లు అనిపిస్తుంది.

కడప జిల్లాలో పుట్టిన పాండన్నకు (పాండు రంగారావు) ఆ జిల్లా కేవలం పుట్టిన ముచ్చట చెప్పుకోవటానికే పనికి వచ్చింది. నెల్లూరు ఆయన రాజకీయ గడ్డ అయితే శ్రీకాకుళం ఆయన పోరాట గడ్డ. దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించమని భగత్ సింగ్ చెప్పి పోతే, పేద ప్రజల కోసం మరణానికి సవాల్ విసరమని ఆయన నమ్మిన రాజకీయాలు చెప్పినట్లున్నాయి. శ్రీకాకుళం … రాష్ట్రం కొస అంచున ధగ ధగ మండుతూ పిలుస్తుంటే ఒక్క ఉదుటన దూకాడు. తుపాకితో ఆయన సంపర్కం అత్యంత ప్రేమాస్పదంగా మారినట్లుంది. అనతికాలంలోనే దళ కమాండర్ అయ్యాడు.

శ్రీకాకుళం జ్వాల ఆరింది. నిప్పు రవ్వలు మిగిలాయి. అవి రాష్ట్రమంతటా వ్యాపించి అగ్నిని రాజేశాయి. ఒక నిప్పు రవ్వ ప్రకాశం జిల్లా పలుకూరు చేరింది. భర్త చనిపోయిన ఇద్దరు పిల్లల తల్లిని మనువాడింది. మాలవాడలో ఈ కాపాయన మమైక్యం అయ్యాడు. పలుకూరు పాండన్న జిల్లా వి‌ప్లవ రాజకీయాలకు చిరునామా అయ్యాడు. తరువాత తరాలకు కాలిబాటలు వేశాడు.

కూలి చేసి వచ్చిన డబ్బులతో మగడిని ‘మీటింగులకు’ సాగనంపిన సహచరి అకాల మరణం … ఆయన అనారోగ్యం లాంటి లౌకిక బాధలు వేధించినా ఆయనలోని స్థితప్రజ్ఞ విప్లవ తత్వం చివరిదాకా ఆయనను సజీవంగానే ఉంచింది.

ఈ రోజు ఆ పాండన్న మరణించాడు. పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం … పోరాటంలో అమరులైతే పలుకూరు పాండురంగారావు తన జవజీవాలు, ఇంద్రియజ్ఞానాలు సజీవంగా ఉన్నంత వరకు అదే లక్ష్యం కొరకు పని చేశాడు. ఎందరో వీరులను బలికొన్న శ్రీకాకుళ ఉద్యమం మిగిల్చిన ప్రాణాలు ఎంత విలువైనవో నిరూపించాడు.