ట్యాగులు

,

కినిగె వెబ్ పత్రికలో వచ్చిన నా కధ

vision1తెల్లవారు ఝాము నుండే మొదలయ్యింది. లోపలి నుండి సన్నటి ఒరిపిడి. ఏ పనీ చేయనీయటం లేదు. మెదడు నుండి ప్రకంపనాలు మొదలయ్యి క్రిందకు జారుతూ ఉన్నాయి. అలలు అలలుగా … ఉండీ ఉండీ మెత్తనైన వత్తిడి దేహమంతా పాకుతూ ఉంది. గడియ గడియకు అది నన్ను నిలువరిస్తూ ఉంది. పక్క మీద దొర్లుతున్నాను. ఇంకాసేపుట్లో ప్రసవం జరగవచ్చు. ఎందుకైనా మంచిదని కావాలిసినవన్నీ దగ్గర పెట్టుకొన్నాను. ఎన్ని రోజులు అయింది? వేళ్ళతో నెలల్ని, రోజులను లెక్క పెట్టుకొన్నాను. ఈ మొలక నాలో పడి చాలా కాలమే అయ్యి ఉండాలి. ఎప్పుడు పడింది? ముఖ్యమైన రోజులు గుర్తు పెట్టుకోవటానికి నాకు కొన్ని కొండ గుర్తులు ఉంటాయి. ఆ రోజు జరిగిన ఒక సంఘటనను ఆ విషయానికి జోడించి మెదడులో దాచి ఉంచే అలవాటు ఉంది నాకు. సంఘటన తాలూకు అనుభూతి స్పర్శగా మారి, ఆ స్పర్శ నన్ను అంటిపెట్టుకొని ఒక సూచికగా ఉపయోగపడుతుంది. ఆ స్పర్శను మాటలుగా మారిస్తే పేలవం అయిపోతుందని తెలుసు. అయినా సరే మీకు ఆ రోజు ఏమి జరిగిందో చెప్పాలనిపిస్తుంది.

ఆ రోజు మేము నెల్లూరు వెళ్ళాము. ఒక కలంకారీ కళాకారుణ్ణి కలుసుకోవటానికి. ఆ పనిలో అతడే ఆఖరు మనిషి. అతడు చెప్పిన స్థలంలో మా కోసం ఎదురు చూస్తున్నాడు. సన్నగా, తెల్లటి నామంలాగా పాలిపోయి ఉన్నాడు. బలహీనమైన కాళ్ళతో అడుగులు వేస్తూ మమ్మల్ని సందులు, గొందులు దాటించి ఒక ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ ఆదివారం సాయం పొద్దు …. టీవీలు వాటి ముందు సమస్త లోకాన్ని కొలువు తీర్చిన టయాన … చుట్టూ మూగ దెయ్యాలలాగా ఎత్తుగా కమ్ముకొని ఉన్న ఇండ్ల మధ్య ఒక ఖాళీ స్థలం చివర్లో… తలుపులు సరిగ్గా లేని ఇల్లులాంటి గది. అక్కడ ఆ ఇల్లు .. తెలియని ప్రదేశానికి సముద్రంలో కొట్టుకొని వచ్చిన అపరిచిత అవశేషం లాగా ఉంది. ఇంటి చుట్టూ అల్లుకొని ఉన్న పేరు తెలియని పిచ్చి తీగలు ఆ కంకర లోకంలో బతకగలుగుతున్నందుకు కాబోలు .. ఆనందంగా పూలు పూసి ఉన్నాయి. బయట రేకులు దింపిన వరండాలో మాకోసమే వేసినట్లు రకరకాల ఆకారాల్లో కుర్చీలు దోమల ముఠాతో బాటు ఎదురుచూస్తున్నాయి. అతని భార్య బయటకు వచ్చి మమ్మల్ని చూసి మర్యాద పూర్వకంగా నవ్వింది. పిసరంత కండలేని ముఖంలో చిట్టి చామంతి ప్రమాణాన కుంకుమ బొట్టు.

“పిల్లలెంతమంది?”

“ఒక పాప. పెళ్ళైపోయింది.” చెప్పిందావిడ.

ఇంతలో అతను లోపలికి పోయి ఒక మూట పట్టుకొచ్చాడు. ఒక పెద్ద గుడ్డను అందులోనుండి ఏరి ఆవిడ్ని “పట్టుకో” అని ఒక కసురు కసిరాడు. ఆవిడకు అలవాటే కాబోలు. గబ గబ వెళ్ళి ఆ గుడ్డ ఒక అంచు జాగ్రత్తగా ఎంచుకొని దూరం బోయి నిలుచుంది. వారిద్దరి మధ్య విచ్చుకొన్న వర్ణాలలో ఒక వీరుడు కత్తి పట్టుకొని నిల్చోని ఉన్నాడు. త్రిభుజాకారంలో ఉన్న ఆ వీరుడి కళ్ళు విచ్చు కత్తుల్లాగా ఉండి ఎదుటి మనుషుల్ని నిలేస్తున్నాయి. అతని చేతిలో కత్తి పదును రంగుల్లో నిగ్గులు తేలి కళ్ళు చెదురుతున్నాయి.

“కాటంరాజు కధ.” చెప్పాడు గర్వంగా.

ఆవిడ చిన్నగా ఆవలించింది.

“మా నాయనకు కలంకారీలో బో గొప్ప పేరు ఉంది. ఇనమనమెళ్ళూరు ఆదినారాయణ అంటే ప్రపంచకం అంతా తెలుసు. గుండ్లకమ్మ ఒడ్డున ఆయన చేసిన అద్దకం పై దేశాల్లో కూడా పేరు. ఇనమనమెళ్ళూరు రంగరేజుల కులం అంటే అప్పట్లో గొప్ప మర్యాద.” చెబుతున్నాడు.

ఇనమనమెళ్ళూరులో హద్దుల్లో వేరుల్లాగా ప్రవహించే గుండ్లకమ్మ … ఆ పాయల మధ్య పైకి ఉబికి ఎండకు కాలే ఇసుక మేటలు … నీటిలో అప్పుడే స్నానం చేయించి పడుకోబెట్టిన పసిపిల్లల్లాంటి రాళ్ళు… ఏటి వడ్డున తోటల్లో అమ్మతల్లుల్లాగా జామ చెట్లు… తెల్లటి ఎండలో అక్కడక్కడ ఊగే చెట్ల నీడలు. అప్పుడెప్పుడో నిరాడంబరమైన ఈ వర్ణాలు కారిపోయి… గుండ్లకమ్మ నీటి ప్రవాహంలో కలిసి చాలా వరకు తమ ఉనికిని పోగొట్టుకొని ఉంటాయక్కడే. మిగిలిన వాటిని మోసుకొని వచ్చి ఈ డెబ్భై ఏళ్ళ ముసలివాడు నెల్లూరులో జీవిస్తున్నాడు.

“ఈ పని నేర్చుకోవటానికి మా నాయన్ను అమెరికా రప్పించాలని కూడా చూశారు. ఆయన పోలా. అప్పుడు మద్దిపాడులో తరగతులు పెట్టించి చాలా మందికి ఆయన చేత నేర్పించారు. ఎవరూ ఈ పనిలో సరిగ్గా కుదురుకోలేదు నేను తప్ప. మా నాన్న నూటారు బొమ్మలతో వేసిన గుడ్డను ఒక జమీందారుకి అప్పట్లో పాతిక వేలకు అమ్మాడు. ఇప్పుడది దొరికితే కోటిరూపాయలు చేస్తది. ఆయన చనిపోయాక ఆయన భార్య పెత్తనం నడిచింది. ఆపిడగారు మేము ఎంత బతిమలాడినా ఇవ్వల. ఆమె కూడా ఎల్లబారి పోయాక వెతికితే ఎలుకలు కొట్టి ముక్కలు ముక్కలు అయ్యి దొరికింది. ఏం లాభం?” పెదవి విరిచాడు.

“అప్పుడు ఈ తెరలను వేలాడదీసి కధలు చెప్పేవాళ్ళు. ఇప్పుడా! ఆ కధలు వినేవాళ్లే లేరు. ఇప్పుడంతా తేరు గుడ్డలు అడుగుతున్నారు. యాదవరాజులు ఎక్కువగా కాటమ రాజు కధలు అడుగుతారు. ఇదిగో! ఇది పట్టుకో” అని మళ్ళీ అరిచాడు. ఆమె లోపల నుండి టీ తెచ్చి మా కిచ్చి ఆయన విప్పిన గుడ్డ పట్టుకొని దూరంగా జరిగింది.

టీ పలచగా తియ్యగా ఉంది. ఈ సారి శివపురాణం. శివ పార్వతులు మధ్యలో ఠీవిగా కూర్చొని అమాయకంగా చూస్తున్నారు. కళ్ళు చెదిరే రంగుల్లో శివపార్వతులు ఘనంగా ఉన్నారు. వారిని మోస్తున్న ఈ కలంకారీ దంపతులు ఎండకు రంగు వెలిసి ఎగురుతున్న జెండా గుడ్డల్లాగా ఉన్నారు. ఒకటి తరువాత ఒకటి తీసి చూపిస్తూ అతను వర్షాకాలంలో తత్తరపడుతున్నగుండ్లకమ్మ లాగున్నాడు. ఆమె ఆయన అరుపులకు యధాలాపంగా ఊగే చెట్టుకొమ్మ లాగే ఉంది.

“దేనితో వేస్తారు? ఎలాంటి కుంచె వాడతారు?”

ఈ ప్రశ్న వినగానే ఒక్క ఉదుటన మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఒక ట్రంకుపెట్టె బయటికి తెచ్చి మా ముందు కుప్ప పోసాడు. అందులో ఆయన పనిముట్లు ఉన్నాయి. ఒక్కక్కటే తీసి చూపిస్తున్నాడు.

“దీన్ని తల వెండ్రుకలతో నేనే తయారు చేసుకొంటాను. ఇది బొమ్మలు వేయటానికి వాడతాను. అంచులు గీయటానికి ఇంకో కుంచె ఉండాలి…” వెదుకుతున్నాడు

ఆయన భార్య గొంతు సవరించుకొంది. “మూడు నెలల నుండి దగ్గుతున్నాడు. డాక్టర్ దగ్గరకు పోడు. కరక్కాయలు, కాషాయాలు ఎంతకని తగ్గిస్తాయి?” తలవంచి పరధ్యానంగా మొహం ఊపి మొదలు పెట్టింది.

“తాతల నాటి నేతుల గొప్పలే. తినటానికి తిండి లేదు. ఇంటి బాడిగ రెండు వేలు కట్టాలి. యాడాదికి ఒకళ్ళో ఇద్దరో తేరు గుడ్డలు కావాలని వస్తారు. ఒళ్ళు హూనం చేసుకొని నాలుగు మాసాలు పని చేస్తాడు. ఖర్చులు పోను మిగిలేవి ఐదో పదో. ఒక్కో యేడు అవి కూడా ఉండవు. కళాకారులకి ఇచ్చే పింఛను కూడా ఈయనకు లేదు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు.”

ఆయన వైపు చూశాను. దీక్షగా ఆ గుట్టలో వెదుకుతున్నాడు. “అంచులు గీసే కుంచె కనబడటం లేదు.” గొణుక్కొంటున్నాడు.

……

ఇంతకూ ఈ సంగతులు మీకెందుకు చెబుతున్నాను? ఏ రోజు బిడ్డ నా కడుపులో పడింది అని ఆలోచిస్తూ ఉంటే ఈ సంఘటన గుర్తుకు వచ్చింది కదూ. అంతే. ఆ రాత్రి నెల్లూరులోనే ఉన్నాము. ఆ రాత్రే ఈ బిడ్డ నా కడుపులో పడి ఉండాలి. మొదట కొన్ని నెలలు దాని ఉనికి నా దైనందిక చర్యలో అప్పుడప్పుడు నాకు తెలుస్తూనే ఉండింది. బస్ లో ప్రయాణం చేస్తూ ఉంటానా. ఒక తాపు తన్ని నేను నీలో ఉన్నానని గుర్తు చేస్తూ ఉంటుంది. క్లాసులో పిల్లలకి పాఠం చెప్పేటపుడు ఉన్నట్లుండి లోపలేదో చిరునవ్వు నవ్వుతున్నట్లుగా ఉండేది. దాని రూపురేఖలు నాలో మెల్లిగా రూపు దిద్దుకోవటం తెలుస్తూనే ఉంది. చేప ఈత లాంటి కదలికలు నాలో పురా స్మృతులలాగా మెదలాడుతూనే ఉండేవి. గుండెకాయ మొదటి నాలుగు వారాలలోనే ఏర్పడి ఉండాలి కదా. ఆత్మ అంటూ ఏర్పడ్డాక ఎదగడం ఎంత సేపు?

బిడ్డ బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. నిట్టూర్పులు అణచుకొంటూ పక్కకు చూశాను. పక్క మంచం మీద నా మొదటి ఇద్దరు పిల్లలు నిద్ర పోతున్నారు. నిజానికి వాళ్ళు కళ్ళు తెరిచినా, మూసినా ఒకటే. పుట్టు గుడ్డితనంతో పుట్టారు. నాకు వివేకం పూర్తిగా విచ్చకుండా తొందరపడిన పాపానికి వాళ్ళకా శిక్ష. వాళ్ళ కళ్ళు పరీక్షించిన డాక్టరు కంటి పాపల్లోకి వెలుతురు పోయేందుకు వీలు లేకుండా గట్టి పొర అడ్డం పడుతుందని చెప్పారు. ఇప్పుడిక ఎలాంటి శస్త్రచికిత్స ఆ పొరను తొలగించలేదు. పుట్టు నిర్మాణంలోనే ఉన్న లోపానికి ఎవరు మాత్రం ఏమి చేయగలరు?

మెల్లిగా ఓపిక చేసుకొని లేచాను. మంచి బిడ్డ కావాలనుకొనేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో వైద్యులందరూ చెప్పారు. అందులో మొదటిది మనసును ప్రశాంతంగా పెట్టుకోవటం. ఆ పని నేను ఈ సారి బాగానే చేశాను. భావోద్వేగాలను అదుపు చేసుకొంటూ నన్ను కల్లోల పరిచే విషయాల గురించి తార్కికంగా ఆలోచించటం మొదలుపెట్టాను. మా అమ్మ ఈ విషయంగా నా మీద చాలా శ్రద్ధ తీసుకొనింది.

“చుట్టు పక్కల జరిగే విషయాలు పట్టించుకొని మనసు పాడు చేసుకోవద్దు. అవన్నీ నీకు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం కలిగిస్తాయి.” అంటుంది మా నాయనమ్మ. ఆమెకు పదిమంది ‘మంచి’ పిల్లలు పుట్టిన ఘనత ఉందిలే. మా అమ్మ ఆ మాటను కొట్టి వేసింది. మా నాయనమ్మను ఎప్పుడూ సాధిస్తూనే ఉంటుంది మా అమ్మ.

“ఆ. కన్నదిలే మాలావు. ఆమె బిడ్డలందరూ ఆవిడ నోట్లో నుండే ఊడి పడ్డారు. ఎవరి జోలికి రాకుండా వాళ్ళు ఉంటేనే మంచి వాళ్ళు అనుకొంటుంది మీ నాయనమ్మ. ఆ పిల్లలూ అంతే. పక్కనోడు చచ్చి పోతున్నావాళ్ళ లోకంలో వాళ్ళుంటారు. గుల్లల్లో నివసించే మనుషులు.” మూతి తిప్పుతుంది.

“అన్ని రకాల వాతావరణాలలో తిరగాల. ఏది మంచిది, ఏది చెడ్డది మన బుద్ధికి అందే వయసులోనే పిల్లల్ని కనాలి.” మా అమ్మ పాలసీ. ఆమె పధకంలో భాగంగానే ఈ రెండేళ్ళు నన్ను దేశం నలుమూలలా తిప్పింది. మిన్నునీలాన్ని, తెల్లటి మంచుకొండలు ముద్దాడే చల్లని ప్రదేశాలకు తీసుకొని వెళ్ళింది. ఎండ, ఉక్కపోతలతో ఊపిరాడని ఊళ్ళు తిప్పింది. ఒక దగ్గర మనుషులు డేరాల్లో ఉంటున్నారు. చుట్టూ రొచ్చు. పిల్లలు ఆ బురదలోనే ఆడుకొంటున్నారు.

“వీళ్ళకు ఇళ్ళు, ఊళ్ళు లేవా? ఇక్కడెందుకు ఉన్నారు?” అడిగాను.

“ఎన్నో తరాల క్రిందట వీళ్ళ పూర్వీకులు ఎక్కడో తప్పు చేశారట. అందుకే వీళ్ళను ఊళ్ళ నుండి తరిమేసి, ఇండ్లను కాల్చేశారు. ఇంకా వీళ్ళ ఆడపిల్లలను చెరిచారు.” చెప్పింది అమ్మ నా కడుపు వైపు పరిశీలనగా చూస్తూ. ఉన్నట్లుండి వంగి నా బిడ్డ స్పందనలను చెవి పెట్టి విన్నది. “నీ బిడ్డ అన్నీ వింటుంది” ఆనందంగా చెప్పింది.

నా మొదటి పిల్లల్ని చూసి ఎక్కువ దిగులు పడింది అమ్మే. ఈ సారి నాకు బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరఫరా చేయటంలో తాత్సారం చేయలేదు. అర్ధ వంతమైన చిత్ర ప్రదర్శనలకు తీసుకొని వెళ్ళేది. ప్రపంచంలోని క్లాసికల్ సినిమాలు అన్నీ దగ్గరుండి చూపించేది.

ఏవో నవ్వులు వినబడితే కిటికీలో నుండి చూశాను. పక్కింటి పాప ఆడుకొంటూ కనపడింది. పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ నవ్వుతుంది. అద్భుతమైన కళ్ళు అవి. కాని సూక్ష్మంగా పరిశీలిస్తే గాని అర్ధం కాదు., ఆ పాప కంటి గుడ్లు ఒక దగ్గర నిలవక అలా తిప్పుతుందని. ఒక్కో దిక్కున క్షణకాలం కంటే ఎక్కువ చూడలేని ఆ పాప చూపులకు జాలి వేస్తుంది. కానీ వాళ్ళ అమ్మకు ( అదే మా పొరిగింటి ఆమెకు) ఆ విషయంలో పెద్ద పట్టింపు లేదు. అసలు ఆ లోపం ఆ పాపకు ఉన్నట్లు కూడా ఆమె ఎప్పుడు గమనించినట్లు అనిపించదు. తన పాప కళ్ళు చాలా అందమైనవని ఆమె అభిప్రాయం. ఒక చోట నిలపలేని చూపుతో ఆ పాప ప్రకృతిని, ప్రపంచాన్ని ఎలా ఆఘ్రాణించగలదు?

“ఆంటీ” అంటూ ఎదురింటి పిల్లగాడు బయట పడేసిన పేపర్ పట్టుకొని వచ్చాడు. వాడికి మెల్ల కన్ను. వాడు ఒక వైపు చూస్తుంటే ఇంకో వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. చూపుతో చేయగలిగిన ఈ మోసం వాడికి బాగానే ఉపయోగ పడుతుంది. వాడు చూస్తున్నాడనుకొన్న వైపు మన దృష్టి మళ్ళించి వాడు చూడాలనుకొన్నది చూస్తాడు. ఆ విషయాన్ని నేను అందరి కంటే ముందు గ్రహించాను. కుక్క పిల్ల వైపు జాలిగా చూస్తున్నట్లు ఉండే వాడి చూపులు నిజానికి దానిని కొట్టటానికి ఉపయోగించే కర్ర మీద ఉంటాయని.

ఒక రోజు ఆ పిల్లవాడు మా ఇంటి దగ్గర పార్కులో ఆడుకొంటున్నాడు. పార్క్ లో ఆడవాళ్ళు అందరూ వాడిని దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టుకొంటున్నారు. వాడి రూపురేఖలకు వాళ్ళు ముగ్ధులు అవుతున్నట్లున్నారు. కిటికీలోనుండి ఇదంతా గమనిస్తున్ననేను అకస్మాత్తుగా అలర్ట్ అయ్యాను. వాడి చూపు ఎదురుగా ఉన్న తాడు మీద పడింది. ఆ విషయాన్ని గమనించకుండా ఆ ఆడవాళ్ళు పెద్దగా నవ్వుతున్నారు.

“వాడు వాళ్ళను కట్టి వేస్తాడు” గట్టిగా అరిచాననుకొన్నాను. కానీ నా అరుపు బయటికి రాలేదు. ఈ లోపల వాడు ఆ తాడు తెచ్చి వాళ్ళ చుట్టూ తిప్పాడు. వాళ్ళు నవ్వుతూ తాడును తప్పించుకొని వెళ్ళారు. పిల్ల చేష్టగా వాళ్ళు అనుకొన్నారు కానీ ఆ పిల్లగాడి చూపు ముందు ముందు చాలా ప్రమాదకరంగా మారగలదని నాకు తెలిసింది.

ఆ మధ్య మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు. అప్పుడు అమ్మ కూడా ఉండింది. వాళ్ళ పిల్లలకు హ్రస్వ దృష్టి ఉంది. దగ్గర వస్తువులే కనబడుతున్నాయని, దూరపు వస్తువులు చూడటానికి వాళ్ళకు శక్తి చాలటం లేదని అర్ధం అయ్యింది. అయితే వాళ్ళు తాము చూడగలినంతవరకే లోకమని అనుకొంటున్నారు.

“మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళవచ్చు కదా! వైద్యుల పనే అది కదా” అడిగాను వాళ్ళ అమ్మను. ఆమె పెద్ద ఉత్సాహం చూపలేదు. పైగా “లేనిపోనివి అన్నీ మా పిల్లలకు అంటగడుతుంది. మా పిల్లల సంగతి మాకు తెలియదా? మా వాళ్ళు తన పిల్లల కంటే అందంగా ఉన్నారని కుళ్ళు” అని అందట.

“పాపం ఆమె పిల్లలు పుట్టు గుడ్డివాళ్ళు కదా, అది సహజమేలే.” అని కూడా అందట. నోరు జారి ఉచిత సలహాలు ఇచ్చినందుకు నన్ను నేనే తిట్టుకొన్నాను. గోడ వైపు తిరిగి బాగా ఏడ్చాను. అమ్మ చెయ్యి ఆర్తిగా నా నుదుటిని తాకింది.

“చిన్నప్పుడు జగజ్జెట్టిలాగా ఉండేదానివి. ఇప్పుడింత బేలగా తయారు అయ్యావేమిటి? నీలో ఏదో శూన్యం కనిపిస్తుంది. అందులో నుండి బయట పడకుండా నువ్వు కనటం కూడా మంచిది కాదు. నిన్నుఒక దగ్గరకు తీసుకొని వెళతాను పద.” అంటూ నన్ను బలవంతంగా బయలుదేరదీసింది.

మా ప్రయాణం ముందు గతుకుల్లో జరిగి ఒక సుందరమైన బాట పట్టింది. బాటకు ఇరువైపుల అందమైన మోదుగుపూల వనాలు. అప్పుడు అమ్మతో అన్నాను “చిన్నప్పుడు నాకు ఇలాంటి తోటల్లో ఎగురుతున్నట్లు కల వచ్చేది. ఆ కలలో కనుచూపు మేరకు ఉండే ఖాళీ మైదానాలలో నేను ఒక్కదాన్నే కాలి కొద్దీ పరుగులు పెడుతుంటే అంతులేని ఆనందం కలిగేది. శరీరమంతా తేలికయ్యి మనసంతా హాయిగా మారి మెలుకువ వచ్చేది.”

కొద్దిగా ఆలోచించి అమ్మ “నీకు ఉక్క పోస్తుంది కదూ?” అని అడిగింది.

నా నుండి సమాధానం రాక పోయేసరికి “గుండె నిండా శ్వాస పీల్చి వదులుతుంటే బాగుంటుంది కదూ?” అని రెట్టించింది.

“అందరికీ హాయిగా శ్వాస పీల్చే అవకాశం ఉంటే ఇంకా బాగుంటుంది.” ఎటో చూస్తూ చెప్పింది.

“ఈ మధ్య నాకు పీడ కలలతోనే మెలకువ వస్తూ ఉంది.” చెప్పాను. అమ్మ ఏమీ మాట్లాడలేదు.

వనాలు, మైదానాలు, జలపాతాలు దాటి ఒక అందమైన పల్లెకు వెళ్ళాము. అక్కడ ఇళ్ళకు తలుపులు లేవు. ఆరు బయట తోటలో చెట్లు విరగబూసి ఉన్నాయి. అన్ని సంవత్సరాలకూ కలిపి ఒకేసారి పూసినట్లుగా ఉన్నాయవి. చాలా మంది మాలాగే బయట నుండి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు అక్కడ కాపురం ఉంటున్న రంగు రంగుల బట్టలు వేసుకొన్న రకరకాల వయసులు గల వ్యక్తులతో మాట్లాడుతున్నారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న వాళ్ళ కన్నీళ్ళను ఆ రంగు బట్టల వాళ్ళు తుడుస్తున్నారు. అలసిన వాళ్ళను పడుకో బెట్టి విసన కర్రలతో వీస్తున్నారు. చాలా మందికి మట్టి పిడతల్లో ఏవో పానీయాలు ఇస్తున్నారు. అవి తాగిన వాళ్ళు జవసత్వాలు పుంజుకొన్నట్లు చిరునవ్వుతో బయలుదేరుతున్నారు. అమ్మ కూడా ఏదో రంగు దుస్తులు వేసుకొన్నమనిషితో మాట్లాడుతూ ఉంది.

నేను దిక్కులు చూస్తున్నాను. హఠాత్తుగా ఎర్రటి బట్టలతో ఒక యువకుడు నా భుజం మీద చేయి వేశాడు. అతనికి ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయేమో. మా కళ్ళు కలిశాయి. ఆ కళ్ళలో ఆ దేదీప్యమానమైన వెలుగు ఏమిటి? ఆ వెలుగుతో పాటు ఏమిటో నాలోకి ప్రసారం అవుతుంది. ఒక్క క్షణం నేను వివశురాలిని అయ్యాను. ఆ చూపు నాకొక్కదానికే కాదు అని తెలుస్తూ ఉన్నా ఏమీ అనిపించటం లేదు ఎందుకో. సమస్త బాధల నుండి నన్ను విముక్తను చేయగలిగిన సమ్మోహన శక్తి అతని చూపులకు ఉన్నట్లుంది. నాలో ఉన్న ఆత్మన్యూనత పటాపంచలు అయ్యింది. దిగులు, దుఃఖం గిజ్జిగాళ్ళలాగా నాలో ఎప్పుడూ గూళ్ళు కట్టుకొని నివసించేవి. అవి ఒక్క సారిగా గూళ్ళను తెంచుకొని ఎగిరి పోయాయి. నాలోని ఆకలి, దాహం, అలసట మాటుమాయం అయ్యాయి. ఆ చూపులో సూటితనం నన్ను గిలిగింతలు పెట్టింది. నా లోపలి బిడ్డ ఆనందంగా పెట్టిన కేరింత నాకు వినబడింది.

“ఎవరితను?” గుసగుసగా అడిగాను అమ్మను. అమ్మ చూపు సారించిన వైపుకి చూశాను. “ఆమె కొడుకు” చెప్పింది. ఒక కుర్చీలో గంభీరంగా కూర్చొని ఉంది ఆమె. కళ్ళకు నల్ల కళ్ళద్దాలు ఉన్నాయి. “ఆమె పిల్లలు చాలా గొప్పవాళ్ళు.” చెప్పింది అమ్మ క్లుప్తంగా. ఆ నల్ల కళ్ళద్దాల ఆవిడతో నేను మాట్లాడలేదు. ఆమె పిల్లలతో చాలా సేపు సంభాషించాను.

“వెళ్ళి పోదాం” చెప్పాను అమ్మకు. ఆ రాత్రి నేను ప్రశాంతంగా నిద్ర పోయాను. ఇదివరకటి పూలతోట కల నాకు మళ్ళీ వచ్చిందని చెప్పాక అమ్మ వెళ్ళి పోయింది. “ప్రసవం టైమ్ కి ఉండకుండా పోతావా” అని నేను మారాము చేస్తే చిత్రంగా నవ్వి “ఈ సారి నీ కానుపు ఏకాంతంలో జరిగితేనే మేలు. నీకు సుఖప్రసవం అవుతుందిలే. మంచి బిడ్డ పుడుతుందిలే.” అని దీవించింది.

మళ్ళీ గొంతు తగ్గించి “మనలో మాట. ఆ టయానికి మీ ఆయన అసలు దగ్గర ఉండకుండా చూసుకో ” అన్నది.

మా ఆయన అనే కాదు. అందర్నీ దూరం ఉంచాను. నాకు పుట్టబోయే బిడ్డను నేనే ముందు చూసుకోవాలి. అవసరం అయితే వైద్యం నేనే చేయాలి. తరువాతే ఎవరైనా చూసేది. ఇందులో ఇంకెవరి ప్రమేయం ఉండకూడని ఎందుకో గట్టిగా అనిపించి అందర్నీ తరిమేశాను.

సమయం దగ్గర పడినట్లుంది. శ్వాస వెంట వెంటనే తీసుకొంటున్నాను. తటాకంలో వేసిన రాయి చుట్టూ దట్టంగా అల్లుకొన్నట్లు అలలు కమ్ముకొని వస్తున్నాయి. నా లోపల ఒదిగి ముడుచుకొని ఉన్న దేహం కాళ్ళు చేతులు ఝాడించి బయట పడటానికి తొందర పడుతుంది. నా మనశ్శరీరాలు రెండూ అందుకు సహకరిస్తున్నాయి. ఉగ్గబట్టుకొన్న కేక నా నోటి నుండి బయటికి వచ్చింది. అలలన్నీ కలిసిపోయి నిశ్చలమై పోయింది తటాకం. బిడ్డ బయట పడింది.

ఆత్రంగా దగ్గరకు లాక్కొని చూశాను. ఆడా మగా అనే పట్టింపు నాకు లేదు. అందంగా ఉందా లేదా అనే భయం కూడా లేదు. చూపు సరిగ్గా ఉందో లేదో అని చూశాను. ఆ కంటి పాపల్లోకి నాలుగు వైపుల నుండి వెలుతురు చేరగలదో లేదో అని ఆత్రంగా చూశాను. ఆ చూపులు చీకటి మూలాలకు దూసుకు పోగలుగుతాయో లేదో అని చూశాను. ఆ కళ్ళు వన్నె వెలిసి పోయిన నా కలంకారీ ఆఖరు మనిషిని, వాళ్ళావిడను సరిగ్గా చూడగలవా లేవా అని వేగమైన గుండె చప్పుళ్ళ మధ్య వంగి బెంగగా పరిశీలించాను.

తెల్లగా రెపరెపలాడే కాగితాల మధ్య నిగనిగలాడుతూ, చురుకైన చూపులు నాలుగు వైపులకు ప్రసరిస్తూ… నా పాపాయి నన్ను చూసి నవ్వింది.

కినిగె పత్రికలో ఈ కధ ఇక్కడ