ట్యాగులు

భారతదేశంలో మహిళా ఉద్యమం అత్యంత క్లిష్టభరితమైనది. ఎందుకంటే ఇక్కడ వేళ్ళూనికొని ఉన్నభూసామ్య భావజాలం అందులో వ్యవస్థీకృతమైన మగస్వామ్యం చాలా బలంగా ఉంటాయి. ఇవి స్త్రీని విద్యకు, వికాసానికి, ఉత్పత్తి ఫలితానికి దూరం చేశాయి. వారిని పరాధీనులుగాను, బానిసలుగాను మార్చాయి. మానసికంగా పురుషునికి దాస్యం చేసే భావజాలాన్ని అలవర్చాయి.

ప్రగతిశీల మహిళాసంఘం స్త్రీల సమస్యలకు పునాదిగా దోపిడీ వర్గ సమాజం ఉందని భావిస్తుంది. ఈ దేశంలో పేద ధనిక వ్యత్యాసాలతో పాటు కుల లింగ వివక్ష కూడా ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ స్త్రీలు పేదరికంతో పాటు పురుష పెత్తనం అనే ఆవరణలో ఉంటారు. అన్ని మతాలు, పురాణాలు, నీతులు, కట్టుబాట్లు స్త్రీ స్వేచ్చను నిరాకరించి, వారికి సంకెళ్ళు వేసేవిగా ఉన్నాయి.

భారతదేశంలో ప్రవేశించిన సాంస్కృతిక సామ్రాజ్యవాదం మానవ విలువలలో, భావజాలంలో తెచ్చిన మార్పులు మళ్ళీ మార్కెటైజ్ చేయబడుతున్నాయి. ఇవన్నీమహిళల జీవితాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయి. పెట్టుబడికి అవసరమైన దిశలో ఆమె గమనం బాహ్య శక్తుల ద్వారా నిర్దేశించబడుతుంది. ఏదీ వదలని మార్కెట్ భూతం దృష్టి భారదేశంలో వన్నరబుల్ గా ఉన్న స్త్రీల శరీరాల మీద కూడా పడింది. అందాల పోటీలు, ఫ్యాషన్ టెక్నాలజీ, పర్యాటక రంగాలలో స్త్రీలను ప్రోత్సహించి అదే మహిళా అభివృద్ధిగా చూపే దుర్మార్గ ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో సమాజంలో, కుటుంబంలో అంతర్భాగమైన పురుషాధిక్యత ఈ మార్పును జీర్ణించుకోలేక ఆమెపై మరింత హింస రూపంలో బయట పడింది. ఆ హింస అత్యాచారాల రూపంలోనూ, యాసిడ్ దాడుల రూపంలోనూ, ఫ్లెష్ మార్కెట్ రూపంలోనూ … బహు విధాలుగా ఆమెను హింసిస్తుంది.

భూసామ్య వ్యవస్థ తన ప్రయోజనాలకోసం తల్లిగాను, దేవతగాను మూర్తీభవించుకొన్న స్త్రీ రూపం, పెట్టుబడీదారీ వ్యవస్థలో అనివార్యంగా బీటలు వారుతుంది. ఈ రెండు వ్యవస్థలు సమీకృతమైన మన దేశంలో అంతిమంగా ఆమె తనకు ప్రమేయం లేకుండా తనకు ఆపాదించిన పాత్రలు మోయలేక కుంగి పోతుంది. ప్రకృతి పురమాయించిన పునరుత్పత్తి ఒక సహజ ప్రక్రియగా నిర్వహించగలదు కానీ దానికి అనుబంధమైన భావాలుగా చెప్పబడుతున్న ప్రేమ, కరుణ, సేవ, ఓర్పులాంటి లక్షణాలు బలవంతంగా రుద్దబడి మోస్తుంది. ఇంకో వైపు ఆమె శరీరం, నైపుణ్యం రెండూ వ్యాపారం చేయబడుతున్నాయి.

భారతీయ సాహిత్యంలో అందునా తెలుగు సాహిత్యంలో స్త్రీ పరిమిత కోణాల్లోనే ఆవిష్కరించబడింది అనే విషయం నిర్వివాదాంశం. ఆయా సమాజాల అవసరాల కనుగుణంగా ఆమెకు కర్తవ్యబోధన చేసి ఆ పరిధి లోనే ఆమె పాత్రలు సృష్టించబడ్డాయి. ఆమె మాటలు, చేష్టలు ఎలా ఉండాలో ముందుగానే స్క్రిప్ట్ రాయబడి ఆవిధంగానే ఆమె ప్రతి కదలిక శిల్పీకరించే ప్రయత్నం జరిగింది. సమాజం ఆమెకు స్థిరీకరించిన గుణాలను రోమాంటిసైజ్ చేసి ఆ నమూనాలోనే ఆమెను చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆ గోడలు పగలకొట్టుకొని వచ్చిన స్త్రీ పాత్రలు దుష్ట పాత్రలుగా చూపించారు. వి‌ప్లవ సాహిత్యం కూడా తొలుత స్త్రీ సహజ స్వభావాన్ని ఆవిష్కరించటంలో విఫలమైనదని అంగీకరిస్తూనే, తరువాత కాలంలో వచ్చిన స్త్రీ అస్తిత్వ ఉద్యమాలను అంది పుచ్చుకొన్న వామపక్షవాదులు, ఆ భావజాలంతో ప్రభావితులైన వారి నుండి వస్తున్న రచనలు ఆశాజనకంగా ఉన్నాయి. స్త్రీకి తగిలించిన కిరీటాలు తీసివేసి, ముసుగులు తొలగించి ఆమెను యధాతధంగా సమాజానికి ఆవిష్కరించాల్సిన అవసరం, సృజనకారుల పైన ఉంది. అసూర్యంపశ్యగా ఉన్న స్త్రీ నిజ రూపాన్ని, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత కూడా వాస్తవవాదులైన సాహితీవేత్తల మీద ఉందని ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యూ) భావిస్తుంది.