ట్యాగులు

మార్చి 1, 2014 నా ఆంధ్రజ్యోతిలో ప్రచురితం అయిన వ్యాసం

జాతీయోద్యమం తరువాత, మహత్తర తెలంగాణా పోరాటంలో స్త్రీలు ఉవ్వెత్తున ఉద్యమించిన సమయంలోనే అమెరికాలో పునరుత్పత్తి, సెక్సువాలిటీ, సమానత్వం మొదలైన హక్కుల కోసం రెండో తరం ఫెమినిస్టులు గొంతు ఎత్తారు. అదిగో, అల్లప్పుడే సంప్రదాయ కమ్యూనిష్టు మహిళా ఉద్యమాలకు భిన్నంగా ఉస్మానియా యూనివర్సిటీ కారిడార్లలో పాతికేళ్ళు నిండని యువతులు “అభ్యుదయ మహిళా సంఘం” గా ఏర్పడ్డారు. గోదావరీ లోయ నుంచి వస్తున్న పోరు గాలులు వారి అంతశ్చేతనకు తాకాయేమో, వెన్ను గట్టిపర్చుకొని స్త్రీల పై జరుగుతున్న అన్ని రకాల దాడులకు వేరులు వెదికారు. రమిజాబి అత్యాచారాన్ని ఆమె వ్యక్తిగతం నుండి వేరు చేసి సమాజపరం చేసి ఉద్యమింప చేయగలిగారు. ఇతర దేశాలకు హైదరాబాదు నుండి కూరగాయల ఎగుమతికి వ్యతిరేకంగా పదివేల మంది తోపుడు బళ్ళ వారితో ప్రదర్శన తీయగలిగారు. ఎమర్జెన్సీ దుర్మార్గం తరువాత 1978లో మళ్ళీ’ ప్రగతిశీలా మహిళాసంఘం’ పేరుతో పునర్నిర్మాణం చెందారు.

ప్రగతిశీల మహిళా సంఘం సమాజాన్ని విప్లవీకరించే ఒక మహత్తర కార్యానికి పూనుకొన్నది. వర్గ విముక్తి జరగనిదే శ్రమ విముక్తి జరగదనీ, శ్రమ విముక్తి మాత్రమే స్త్రీ విముక్తికి బాటలు వేయగలదని నమ్మింది. పారంపర్యంగా స్త్రీలపైనే రుద్దిన ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం లాంటి సమస్త దాస్యాలనుండి బయట పడి …. కుటుంబ, రాజ్య, సాంఘీక, సామాజిక హింసలనుండి విమోచన చెంది …. ఆర్ధిక, రాజకీయ సమానత్వంతో గుండెల నిండా ఊపిరి పీల్చుకొని చిరునవ్వు నవ్వే ఒక స్త్రీ మూర్తిని కల కన్నది. ఒకే కాడెకు కట్టిన ఎలపటి, దాపటి ఎద్దులలాగా సమాజాన్ని, కుటుంబాన్ని పురుషుడితో పాటు సమాన స్థాయిలో సాగుబడి చేసే ఒక రోజు కోసం కల కన్నది. భారత దేశంలోని సమస్త వనరుల సమాన భాగస్వామ్యం కోసం కల కన్నది. ఆ కలల సాకారం కోసం గత నలభై ఏళ్ళుగా శ్రమిస్తుంది. వర్గ చైతన్యానికి, జెండర్ చైతన్యాన్ని, కుల చైతన్యాన్ని జత పరచి పోరాటాలు నడిపింది. ప్రగతిశీల మహిళాసంఘం ఊహల నుండి, మధ్యతరగతి భ్రమల నుండి వచ్చిన సంఘం కాదు. ఇది పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన మహత్తర పోరాటాల కన్నబిడ్డ. మహిళా ఉద్యమానికి దిశ, దశ గుర్తెరిగిన సంఘం. స్త్రీ విముక్తికి నిర్దిష్ట మార్గం, లక్ష్యం స్పష్టాతిస్పష్టంగా ఉన్న సంఘమిది. సంక్లిష్టమవుతున్న సమకాలీన స్త్రీ సమస్యలను ఆత్మను ఒగ్గి విని, స్పందించి నడుస్తున్న, నడిపిస్తున్న చైతన్యం ఇది. తన ఆలోచనా సరళిని ఘనీభవించనీయకుండా, వివిధ సెక్షన్స్ నుండి వచ్చిన మహిళా సమూహాల ప్రశ్నలను ఆకళింపు చేసుకొని కార్యాచరణకు పూనుకొన్న పోరాట పర్యాయపదం ఇది. అనుభవాన్ని, ఆచరణకు అన్వయించి… ఆచరణలో నిగ్గుతేలిన సిద్దాంతాన్నిభుజాన ఎక్కించుకొని ఆ వెలుగులో పరిష్కారం వైపు దృష్టి సారిస్తుంది.

ప్రగతిశీల మహిళాసంఘం నిరంతరం తన చైతన్యాన్ని పెంచుకొంటూ, సామాజిక చైతన్యాన్ని పెంచుతూ నూతన ఒరవడితో వేగంగా రాష్ట్రమంతా వ్యాపించింది. సమాజంలో అణువణువున వేళ్ళూనుకొని ఉన్న పితృసామ్య భావజాలం తాలూకూ ప్రతిఘటనను ఎదుర్కొంటూ ముందుకు సాగడం చిన్న విషయం కాదు. మహిళా సంఘాలంటే ఉన్నత వర్గ మహిళలు కాలక్షేపం చేసే ‘మహిళా మండళ్ళు’ గా సినిమాల్లోనూ, సాహిత్యంలోనూ అపహాస్యం చేసే రోజులలో ప్రగతిశీల మహిళా సంఘం ఆవిర్భావం సమాజం పై విన్నూత ప్రభావాన్ని చూపింది. మహిళలు ఎక్కువగా సంఘటితం అయి ఉన్న తునికాకు సేకరణ, బీడీ తయారీ రంగాల్లో క్రియాశీలక పాత్ర వహించి ఫలితాలు సాధించ గలిగింది. చెమట చుక్కలో కూడా జెండర్ భేదాన్ని పాటిస్తూ, స్త్రీల చెమటకు తక్కువ వెల కట్టే వ్యవసాయ రంగంలో ‘సమాన పనికి సమాన వేతనాలు’ కావాలని ఆందోళనలు నిర్వహించింది. గిరిజన స్త్రీలపై జరుగుతున్న ఆర్ధిక, లైంగిక దోపిడీ లోతులను పరిశీలించి వారిని చైతన్య పరిచింది. మహిళా వివక్షతతో బాటు, కుల వివక్షతకు గురవుతున్న దళిత స్త్రీ సమస్యలోని ప్రత్యేకతను అర్ధం చేసుకొని వారిని ప్రగతిశీల మహిళా సంఘం పందిరి కిందకు చేర్చగలిగింది.

అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు కారణాలు వ్యవస్థలో చూసి ఆ వైపు గురిపెట్టాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించింది. వీటి వెనుక అల్లుకొని ఉన్న మగ దురహంకార భావజాలాన్ని బద్దలు చేయాల్సిన ముఖ్య కర్తవ్యాన్ని ఆదమరువలేదు. స్నేహం, ప్రేమ ప్రాతిపాదికగా కాకుండా… డబ్బు, ఆధిపత్యం పునాదిగా ఉన్న వివాహ వ్యవస్థలో అనేక అస్తవ్యస్థ, అనాగ్యకర ధోరణులు ఉన్నాయి. భద్రతను, భరోసాను ఇవ్వలేక కుటుంబ, వివాహ వ్యవస్థలు విఫలం అవుతున్న సామాజిక సందర్భంలో … స్త్రీ నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్న హింస పట్ల సమాజానికి సృహ కలిగించటానికి ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా కృషి చేస్తున్నది. మూసి ఉన్న తలుపుల వెనకాల స్త్రీల నెత్తుటి గాయాల, మరణాల పట్ల స్పర్శ కోల్పోతున్న సమూహాల హృదయ పొరల్లో సున్నితత్వాన్ని తట్టి లేపుతున్నది.

ఉపాధి, ఆహారం, నివాసం మనిషికి భద్రతనూ, నిశ్చింతనూ ఇస్తాయి. కుటుంబంలోనూ, సమాజంలోనూ అత్యంత బాధ్యతతో వ్యవహించే స్త్రీలు ఈ హక్కుల కోసం చేస్తున్న పోరాటాలకు పూర్తి అండదండలు అందిస్తున్నది. ప్రగతిశీల మహిళా సంఘం. గ్రామీణ జీవితాన్ని విధ్వంసం చేస్తున్న ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు వ్యతిరేకంగా శ్రామిక స్త్రీలు చేస్తున్న అవిరామ పోరాటాలకు పూర్తి మద్దతు నిచ్చి ముందు భాగాన నిలుస్తున్నది. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను ఎత్తి చూపుతూ సాగిన చరిత్రాత్మక పోరాటంలో పీవోడబ్ల్యూ తన వంతు పాత్రను నిర్వహించగలిగింది. మహిళా రిజర్వేషన్, మద్యపాన నిషేదం, స్త్రీల అందాలపై వ్యాపారాలు, మురికి వాడల సమస్యలు వంటి అనేకానేక అంశాలపై పోరాడుతున్నది. ప్రభుత్వాల పరిధిలో, రాజ్యాంగం పరిధిలో పరిష్కరించగలిగిన చిన్న చిన్న సమస్యలపై దృష్టి సారించలేని పాలకుల మొద్దు నిద్రను వదిలించటానికి, పీడిత మహిళల సామూహిక గొంతుగా మారి పొలికేక వినిపిస్తున్నది.

ఈ ప్రయాణం సాఫీగా, సౌకర్యవంతంగా ఏమి జరగలేదు. అరెస్టులు, నిర్భంధాలు, జైళ్ళు. ప్రతి మూలమలుపు వద్ద అంతులేని త్యాగాలు. పంచాది నిర్మల, సరస్వతి, శాంతక్క, లలిత, స్నేహలత, కమల, పూలక్క, రంగవల్లి, పారమ్మ, చింతా లక్ష్మి, సుసేనా, కారం పార్వతి, సుజాత, రాధ లాంటి వీర నారుల పాదముద్రలను గుండెల్లో పొదివి పట్టుకొని ప్రగతిశీల మహిళా సంఘం ముందుకు సాగుతుంది.

ప్రగతిశీల మహిళాసంఘం ఇప్పుడిక స్త్రీ చుట్టూ అల్లిన భూస్వామ్య-వ్యాపార భావజాలాల ఇనుప కట్టడాలను ఛేదించే ఆయుధాల తయారీ కోసం సన్నద్దమవుతున్నది. మానవజీవితంలో నిభిడీకృతమైన కరడు కట్టిన పితృస్వామ్య పెచ్చులు కరిగించే సమ ఉష్ణోగ్రతను సరఫరా చెయ్యటానికి నడుం కట్టింది. హింస, పీడన, దోపిడీ, వివక్ష, అసమానత్వం లేని నూతన జగంలో ఆత్మ స్థైర్యంతో, ఆనందంతో, అమితోత్సాహంతో పరుగులు పెట్టే స్త్రీ కోసం అన్ని జవజీవాలను కూడతీసుకొని సమాయత్తం అవుతున్నది. అమ్మోరుగా ఆరాదించనూవద్దు, అంగట్లో సరుకుగా మార్చనూ వద్దు. నీలో సగమై, నీతో సమమై నడిచే ధీరను నేను అనే స్త్రీల ధిక్కార పతాకంగా ప్రగతిశీల మహిళా సంఘం తన కృషికి పునరంకితం అవుతున్నది.

రమాసుందరి బత్తుల

ప్రగతిశీల మహిళాసంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు

01_03_2014_006_006