ట్యాగులు

నేడు ప్రపంచ పటంలో అధిక భాగం ఆకలితో, పేదరికంతో కునారిల్లుతుంది. ఆర్ధిక, సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనే వేల కాళ్ళ రాక్షసి తన విశ్వరూపం ప్రదర్శిస్తూ, వికటాట్టహాసం చేస్తూ ఉంది. బడుగు బతుకుల మీద మృత్యు తాండవం ఆడుతూ ఉంది. మూడో ప్రపంచ దేశమైన భారత దేశ మెజారిటీ ప్రజల వీపులు పేదరికంతో వంగిపోతున్నాయి. అర్ధ జనాభాగా ఉండి … దరిద్రాన్ని, ఆకలిని , దోపిడీకి గురవడాన్ని వారసత్వంగా పొంది… భారత మహిళా లోకం ఈ భారాన్ని తన భుజస్కంధాలపై ఎక్కువగానే మోస్తుంది. అదనంగా దేశంలో వేళ్ళూనుకొని ఉన్న ఫ్యూడల్ సంబంధాలు ప్రసాదించిన పురుషాధిక్యతని కూడా భరిస్తుంది. చదువుల్లోనూ, సంస్కృతితోనూ, జీవనవిధానంలోనూ నిబిడీకృతమైన భూస్వామ్య సంబంధాల ఉక్కు కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అంతే కాకుండా, సరళీకృత ఆర్ధిక విధానాలు మన దేశానికి ఉదారంగా సరఫరా చేసిన విష సంస్కృతి పర్యవసానాల్ని అనుభవిస్తుంది. అసమాన, అమానవీయ, హింసాయుతమైన వాతావరణంలో… గాయపడుతుంది. నెత్తురు స్రవిస్తూనే …. కుటుంబం కోసం, దేశోత్పత్తి కోసం చీమ లాగా నిరంతరం శ్రమిస్తూనే ఉంది.

స్త్రీలను దేవతలుగా పూజిస్తామనే భారతదేశంలో ఆమె శ్రమ కారు చౌకగా కొల్లగొట్టబడుతుంది. రాజకీయ నిర్ణయాధికారంలో ఆమె పాత్ర నిరాకరించబడుతుంది. సమాజాన్ని శాసిస్తున్న పలు సామాజిక సూత్రాలు ఆమె ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతున్నాయి చదువుకొనే చోటా, పని స్థలాల్లో, బహిరంగ ప్రదేశాలలో… లైంగిక వేధింపులకు, అత్యాచారాలకూ గురౌతుంది. స్త్రీ పురుషులకు ఇద్దరికీ అవసరం అయిన వివాహ జీవితంలో వరకట్నం ప్రవేశించి ఆమె బ్రతుకును మరింత దుర్భరం చేసింది. మత గ్రంధాలు పరిరక్షిస్తున్న కుటుంబ సంబంధాలలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న హింస ఆమె బతుకును అతలాకుతలం చేస్తుంది. చట్టాలు స్పృహతో మౌనం వహించిన నేపధ్యంలో, ఆమె అన్ని రకాల హక్కులు కాలదన్నబడుతున్నాయి. పురుషస్వామ్యము, ఫ్యూడల్ వ్యవస్థా మూర్తీభవించిన పోలీసు స్టేషన్లు మగాధిపత్యానికి కాపలా కాస్తున్నాయి. స్త్రీ పురుష సమానత్వాన్ని హక్కుగా దాఖలు పరిచిన రాజ్యాంగం సాక్షిగా ఆమె రెండో తరగతి పౌరురాలిగా ఇంకా ఈ దేశంలో పరిగణించబడుతుంది.

నాలుగు దశాబ్దాల క్రితం నక్సల్బరీ, గోదావరీ లోయా పోరాటాల స్పూర్తితో కొంత యువరక్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తేజితం అయ్యింది. ఉస్మానియా యూనివర్సిటీ భవనాలు ఎర్రరంగును పులుముకొన్నాయి. అక్కడ నుండే కొంత మంది ప్రగతిశీల దృక్పధం కలిగిన యువతులు మహిళా విముక్తికి మార్గం వ్యవస్థలో వెదకనారంభించారు. ఆ చూపుతోనే హైదరాబాదులో జరిగిన రమిజాబీ అత్యాచారాన్ని వ్యక్తిగత సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా సమాజం పరం చేసి ఉవ్వెత్తున ఉద్యమింప చేయగలిగారు. కూరగాయల ఎగుమతికి వ్యతిరేకంగా పదివేల మంది తోపుడు బండ్లవారి ఊరేగింపుతో హైదరాబాదు నగరాన్ని ఉర్రూతలూగించగలిగారు. ‘ప్రగతిశీల మహిళాసంఘం’ గా ఏర్పడి ఒక నూతన వొరవడితో కార్య రంగంలో దూసుకొని పోయారు. ఎమర్జన్సీ కాలంలో నిర్భంధానికి గురి అయ్యారు.

కాలానుగతంగా ప్రగతిశీల మహిళా సంఘం తన పరిధినీ, దృష్టినీ విస్తరించుకొంటూ వెళ్ళింది. నిర్మాణం, సంఘాలకు గుండెకాయ అని గ్రహించి గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేసుకొంది. స్త్రీ విముక్తి, సమాజ విముక్తితో ముడిపడి ఉందనే ప్రాధమిక సూత్రాన్ని ఇంకింప చేసుకొన్నది. అనేక దొంతరలుగా విభజింపబడి ఉన్న సమాజంలో, ఆయా వర్గాల ప్రజల ప్రయోజనాలు వేరు వేరుగా ఉన్నాయని, మహిళా విముక్తికి చేయూత ఇవ్వగలిగిన సహోదర సమూహాలతో కలిసి మొదట ఉమ్మడి సమస్యల మీద నడుం కట్టాలని గ్రహించింది. అదే సమయంలో మహిళలుగా నిత్యం ఎదుర్కొంటున్న పీడనపై ప్రత్యేక పోరాటాలు నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని గుర్తెరిగింది. ఆ దిశగా స్త్రీలను సమీకరించి మహిళా ఉద్యమాన్ని నిర్మించింది. ప్రగతిశీల మహిళాసంఘం నిర్మించిన ఈ ఉద్యమం విశిష్టంగా, వినూత్నంగా, వేగంగా రాష్ట్రమంతా పాకింది. అనేక రకాల పీడనలతో, బాధలతో వెల్లబారుతున్న మహిళల జీవితాలను ప్రత్యేక దృక్కోణంతో తడిమి చూసింది. గిరిజన మహిళలపై జరుగుతున్న ఆర్ధిక, లైంగిక దోపిడీ లోతులను పరిశీలించింది. మహిళా వివక్షతతో బాటు, కుల వివక్షతకు గురౌతున్న దళిత స్త్రీ సమస్యలోని ప్రత్యేకతను అర్ధం చేసుకోగలిగింది. ఆరుగాలం శ్రమించే శ్రామిక స్త్రీ విముక్తి ప్రధాన లక్ష్యంగా పోరాటాన్ని పదును పెట్టింది.

“కుక్క, శూద్రుడు, స్త్రీ ఒకటే” అన్న మనువు మనవళ్ళు ఏలే రాజ్యం మనది. ఆమె మసిలే స్థల కాలాల మీద నియంత్రణలు, ఆంక్షలు విధించి … ఆమెపై జరిగే అత్యాచారాలకు ఆమెనే హేతువుగా చూపే దుర్మార్గ సమాజం మనది. అత్యాచారాల నిరోధానికి కృషి చేయటం ఒక పని అయితే … అత్యాచారాలు, లైంగిక వేధింపుల చుట్టూ అల్లుకొన్న భూస్వామ్య భావజాలాన్ని బద్దలు చేసే ఇంకో క్లిష్టతరమైన పని బాధ్యత గల మహిళా సంఘాల మీద ఉంది. ప్రగతిశీల మహిళా సంఘం ఈ కార్యాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం, నిర్భయ చట్టాల కోసం అనేక పోరాటాలు చేసి, వాటి రచనలో నిర్మాణాత్మక సూచనలు చేసింది. దళిత, ఆదివాసీ స్త్రీల మీదా… ఈశాన్య రాష్ట్రాల స్త్రీల మీద రాజ్యం నిత్యం జరుపుతున్న అత్యాచార పర్వం, వారి హక్కులపై ఉక్కుపాదం మోపటానికి ప్రభుత్వం ఉపయోగిస్తున్న సాధనం అనే నిజాన్ని నిస్సంకోచంగా, నిష్కర్షగా బయట పెట్టింది. అత్యాచారాలు మరణ శిక్షలతో తగ్గవనీ …. ఈ సమస్యని మౌలికంగా, వ్యవస్థాపరంగా చూడాలని పిలుపు నిచ్చింది.

అలాగే కుటుంబహింస గురించి మాట్లాడటమంటే కుటుంబాలకు వ్యతిరేకంగా మాట్లాడటం అనే అవగాహనారాహిత్యాన్ని సమాజంలో పోగొట్టటానికి ప్రగతిశీల మహిళా సంఘం చెమటోడ్చాల్సి వచ్చింది. ప్రేమ, స్నేహం కాకుండా … డబ్బు, ఆధిపత్యం పునాదిగా ఉన్న వివాహ వ్యవస్థలో నెలకొని ఉన్న అస్తవ్యస్థ, అనారోగ్య ధోరణులు స్త్రీ ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. సమాజంలో పెట్రేగి పోతున్న వినియోగదారీ తత్వం దీనికి తోడై వరకట్న హత్యలు, బలవంత ఆత్మ హత్యలు దినపత్రికల్లో నిత్యమూ వార్తలు అవుతున్నాయి. భద్రతనూ, భరోసానూ ఇవ్వలేక కుటుంబ, వివాహ వ్యవస్థలు ఫలం అవుతున్న నేటి సామాజిక సందర్భంలో … స్త్రీ నాలుగు గోడల నడుమ అనుభవిస్తున్న హింస పట్ల సమాజానికి సృహ కలిగించటానికి ప్రగతిశీల మహిళా సంఘం ఎంతో కష్ట పడుతుంది. గృహహింస నిరోధక బిల్లు చట్ట రూపంలో రావటానికి, అది సక్రమంగా అమలు జరగటానికి అవిరళంగా పని చేస్తూనే ఉంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలోకి వచ్చినప్పటి నుండి ఓబిసీ సవరణతో అమలు చేయాలనే డిమాండ్ తో అనేక ఉధ్యమాలు నడిపిన ఘనత పీవోడబ్ల్యూకి ఉంది. పార్లమెంట్ ముందర పలుసార్లు ధర్నాలు చేసి మహిళా సాధికారిత సాధన పట్ల తన నిబద్ధతను ఎలుగెత్తి చాటింది. ఈ బిల్లుపై మీద అన్ని రాజకీయ పార్టీల రెండు నాల్కల ధోరణిని ఎండగట్టింది. చట్ట సభల్లో ముప్ఫై శాతం కాదు, యాభై శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ పోరాడుతుంది. ప్రపంచానికి ఆదర్శమైన సంపూర్ణ మద్య నిషేద ఉద్యమంలో ప్రగతిశీలా మహిళా సంఘం తన శక్తులన్నీ కేంద్రీకరించి పని చేసింది. 1991 నుండి నేటి వరకు అంచెలంచలుగా సాగుతున ఈ ఉద్యమం మహిళా సామూహిక శక్తికి నిదర్శనంగా చరిత్రలో నిలిచి పోయింది.

ఉపాధి, ఆహారం, నివాసం మనిషికి నిశ్చింతనూ, భద్రతనూ ఇస్తాయి. జీవించే హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ అంశం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యానికి గురవుతుంది. కుటుంబం పట్ల అత్యంత బాధ్యతగా ఉండే స్త్రీలు ఈ హక్కుల పోరాటాల్లో ముందు ఉంటున్నారు. ప్రగతిశీల మహిళాసంఘం న్యాయమైన ఈ పోరాటాలకు నాయకత్వం వహిస్తుంది. స్త్రీలను మాంసం ముద్దలుగా చూపే అందాల పోటీలకు వ్యతిరేకంగా, మహిళల అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించింది.

భూమితో ముడిపడి ఉన్న గ్రామీణ జీవనాన్ని విధ్వంసం చేస్తున్న ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు, శ్రామిక మహిళా బ్రతుకును కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్నఈ నాశనానికి ఆధిపత్య శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి. మహిళలు తమ శక్తినంతా ఒడ్డి, ప్రాణాలకు తెగించి ఈ ఆర్ధిక మండళ్ళను అడ్డు కొంటున్నారు. పీవోడబ్ల్యూ ఈ ఉద్యమానికి తన అండదండలు పూర్తి స్థాయిలో అందిస్తుంది. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను ఎత్తిపడుతూ సాగిన చారిత్రాత్మక పోరాటంలో కీలకమైన పాత్రను పోషించింది.

ప్రగతిశీల మహిళా సంఘం చేసిన ఈ ప్రయాణం పూల బాట మీద నడవలేదు. నాలుగు దశాభ్ధాల ఈ ప్రస్థానంలో ఎన్నో నిర్భంధాలు, కేసులు, జైళ్ళు ఎదుర్కొంది. పలు మైలురాళ్ళ దగ్గర రాలిపోయిన స్నేహలత, అంకమ్మ, పంచాది నిర్మల. వారి వారసత్వాన్ని అందుకొన్న త్యాగాలు రంగవల్లి, చింతా లక్ష్మి, సుసేన. అమరుల పాదముద్రలను కళ్ళకద్దుకొని ప్రగతిశీల మహిళా సంఘం తన దృష్టిని, నిర్మాణాన్ని, పోరాటాన్ని పదును పెట్టుకొని ముందుకు సాగుతూ ఐదు మహా సభలను జరుపుకోగలిగింది.

అసమానత్వం, ఆర్ధిక, సామాజిక, రాజకీయ దోపిడీ లేని స్త్రీ ఉనికి కోసం ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం కల కంటుంది. హింస లేని స్త్రీ జీవితాన్ని ఆకాంక్షిస్తుంది. ఆ స్వప్న సాకారానికి, ఆ కోరిక నెరవేరటానికి అహర్నిశలు శ్రమిస్తూ …. ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ మార్చి 1,2,3 తేదీలలో రాష్ట్ర ఆరవ మహాసభలను, తను పురుడు పోసుకొన్న హైదరాబాదు నగరంలోనే జరుపుకోబోతుంది. మహిళలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, మహిళా విముక్తి కోరే వారందరూ ఈ మహాసభలకు అన్ని విధాల సహకరించమని కోరుతున్నాము.