ట్యాగులు

 

Top_5_Survey_Question_Examplesవారి దుఃఖం గుండెను కెలుకుతుంది. మోయలేని బాధ కళ్ళకు వేలాడుతుంటే ఉబ్బిన కళ్ళతో ఒక తండ్రి …. తన బొడ్డు పాశము నశించి పోయిందని తెలిసీ దాని అవశేషమైనా అందివ్వమని బేజారిపోయిన మనసుతో, శరీరంతో అర్ధిస్తున్నఒక తల్లి …. నూనూగు మీసాలతో, కొత్తగా పొడుకొచ్చిన గడ్డాలతో, విరగబడే నవ్వును కళ్ళల్లో తొణికిస్తున్న చనిపోయిన పోరగాళ్ళు … ఆత్మవిశ్వాస ప్రకటనల లేత మొహాలను ఫొటోల్లోకి చాస్తూ సంతోషానికి సూచకాలాంటి మృతులైన అమ్మాయిలు … చావక బతికి జీవచ్ఛవాలు అయిన మిగిలిన పిల్లలు … దిన పత్రికల్లో … టీవి చానళ్ళలో నాలుగైదు రోజులుగా కలలో కూడా వెంటాడుతున్నారు. వేధిస్తున్నారు. నాదే కాదు. చాలా మంది తల్లుల పేగులు కదిలాయి. తండ్రుల ఆత్మలు చెమర్చాయి. వారి తల్లి దండ్రుల దుఃఖాన్ని సామూహిక దుఃఖంగా దేశం పంచుకొన్నది. విహారయాత్ర మిగిల్చిన ఈ విషాదాన్ని సమస్త ప్రజానీకం ఈ రోజుకీ మోస్తుంది. ప్రమాదకరమైన ప్రదేశంలో తెలియక ప్రవేశించి మృత్యువాత పడ్డ పసి ప్రాణాలు అందరిని అతలాకుతలం చేస్తున్నాయి.

ఇక్కడ నాకు నేను ఒక ప్రశ్న వేసుకొంటున్నాను. మీరు క్షమించాలి. మీ భావోద్వేగాలకు నా ప్రశ్న చిరాకు కలిగిస్తుందేమో. ట్రాక్టర్ బోల్తా పడి ఇరవైలు, ముప్పైల ప్రాణాలు ఒకేసారి చనిపోయిన వార్త చదివినపుడు ఇదే రకంగా కదిలిపోయానా? ఆ చనిపోయిన వాళ్ళలో పడుచుప్రాయపు కుర్రాళ్ళు ఉండవచ్చు. లంగా జాకెట్టులు వేస్తుకొన్న పదిహేనేళ్ళలోపు ఆడపిల్లలు ఉండొచ్చు. అయ్యో అనుకొని ఒక నిట్టూర్పు విడిచి మరునిమిషంలో పక్క కాలంలో డియే ఇంక్రిమెంట్ గురించి ఎందుకు చదివాను? ఆ చనిపోయిన వాళ్ళ మొహాన గుడ్డ వేసి వరుసగా పడుకోబెట్టిన ఫోటో వేసి కూడా పత్రికలు ఆ చావులకు కావాలిసినంత పాపులారిటీ సంపాదించలేక పోతున్నాయి. ప్రమాదమని తెలిసీ హైవేల మీద ఉరుకుతా లారీలను, ట్రాక్టర్లను ఆపి ఎక్కి చావుకు సవాల్ విసురుతూ … ఒక్కోసారి ఓడిపోయే బక్క ప్రాణుల గురించి వారి చావుకు ముందుకాని, తరువాత కానీ ఆలోచించానా?

ఆ మృత్యువుకి ముందు వారు తలకు టవళ్ళు కట్టుకొని … వాటి అంచులు నోట్లోకి తీసుకొని … చేతిలో ఆకుపచ్చ రంగులో ఉండే పెద్ద పాత లిమ్కా బాటిల్లో మంచి నీళ్ళు … స్టీలు డబ్బాల్లో పప్పు కూరతో అన్నం మోసుకొంటూ పరుగులు పెట్టే ఆడజనం అయి ఉంటారు. కిక్కిరిసిన షేర్డ్ ఆటోల వెనక కాళ్ళు జారాడేసి వెనుక వచ్చే హై స్పీడ్ కార్లను లెక్క చేయకుండా “నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నేనియ్యాల  ఆలస్యం కాకుండా పనికి పోవాల” అని చెబుతునట్లుండే తల మాసిన మగ జనం అయి ఉంటారు.

ఇంట్లో నుంచి వస్త వస్త ” సాయంత్రం కూలి డబ్బులు తెస్తా. పుస్తకాలు కొనుక్కొందువు కానిలే!” అంటూ పిల్లలకు ఆశలతో బాటు పనులు అప్పచెప్పి వచ్చి ఉంటారు. వాళ్ళు ఇంటికి పోయేటపుడు పిల్లలకి తింటానికి ఏంటో తీసుకొని వెళదామనుకొనే అమ్మలు అయి ఉంటారు. సెలవల్లో వచ్చిన కూలి డబ్బులతో ఇంట్లో ఏదైనా ఆపదకు ఆదుకొందామనుకొనే పెద్ద కొడుకులు, చిన్న కూతుళ్ళు కూడా అయి ఉంటారు.

వాళ్ళ చావులు ఎందుకు నన్ను ఇంతగా కదిలించలేక పోయాయి? వాళ్ళకు ఎవరు ఆరైపీ చెప్పరెందుకు! కాసేపు ఏడుపులు విన్నాక తరువాత వచ్చే ఆపత్బాందు డబ్బుల గురించే ఆ మొహాలు గుడ్డలు కప్పిన శవాలు మాట్లాడతాయి. ఎందుకంటే ఆ మరణాలు వాళ్ళ ఇళ్ళల్లో లేపే ప్రశ్నలు కుటుంబ బంధాల కంటే ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి కాబట్టి. ఆ ప్రశ్నలకు మానవీయ స్పర్శ ఉండదు. ఆటవిక ఆర్ధిక స్పర్శ మాత్రమే ఉంటుంది.