ట్యాగులు

68e7e-widow“నవ్వటం పెదాలతో కాదు, నాతోనే నవ్వాలి” అన్నట్లు ఉండే నీ ముద్దు మొహంలో ఇప్పుడు ఏ భావప్రకటన కనబడటం లేదు. ఎనభై ఏళ్ళ నీకు ఒక రాత్రి హటాత్తుగా మూతి పక్కకు పోయి ఎడం వైపు మొహం వాచింది. అంతకు ముందు నాలుగు నెలల నుండి గొంతులో మింగుడు పడటం లేదని ఫిర్యాదు చేస్తుంటే మేము పట్టించుకోలేదు.

హాస్పిటల్ కి వెళ్ళిన పది నిమిషాల్లోనే డాక్టర్ గారు పైనుండి వచ్చి చూశారు. స్కాన్ కు పంపారు. ఇసిజి, రక్త పరీక్షలు బెడ్ దగ్గరే జరిగాయి. పదకొండు గంటలకు అంతా డాక్టర్ గారు చెప్పేశారు. అది అటాక్ కాదని, మెల్లిగా తగ్గుతుందనీ. అయితే కొన్ని రోజులు ఆ కన్ను ఇబ్బంది పెడుతుందనీ, గొంతు ఒకవైపు మింగుడు పడదనీ చెప్పారు. మెడిసన్స్ ఇచ్చి ఐదు రోజుల తరువాత రమ్మని చెప్పారు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే హాస్పటల్ కు తీసుకొని రమ్మన్నారు.

డాక్టర్ గారు ఆ మాట చెప్పగానే మంచం మీద నుండి మెల్లిగా కర్ర సాయంతో లేచి, ఆనని చూపుతో చెప్పులు వెదుక్కొంటూ “హమ్మయ్య. తేలిగ్గానే అయిపోయింది. పదండి పోదాం.” అన్నావు.

“విశాలాంధ్ర వైపు నుండి వెళదాం” కారు ఎక్కుతూ డిక్లేర్ చేసావు.

“ఎందుకు?”

“ప్రసన్నకోసం తెలుగు డిక్షనరీ కొనాలి.”

ప్రసన్న అంటే మీ ఇంట్లో పని చేసే సీతమ్మ కూతురు కదూ. తొమ్మిది చదువుతున్న ఆ పాప కు ఈ మధ్య నువ్వు చదువు చెబుతున్నావులే.

నీ ఆరోగ్యం పట్ల ఆందోళనతో మేము “ఇప్పుడా పుస్తకానికి తొందరేమోచ్చింది. తర్వాత కొనచ్చులే.” అని బలవంతంగా తీసుకెళ్ళి పోయాము.

నీ ఆరోగ్యం మార్పు రాలేదనీ, గుంటూరు తీసుకొని వెళ్ళాలని నేను లేనప్పుడు అందరూ నిర్ణయం చేసి తీసుకొని వెళ్ళారు. అక్కడేదో కొత్త పరీక్షలు చేసి, కొత్త జబ్బు పేరు చెప్పి, కొత్త మందులు వారానికి రాసి పంపారు. ఏ మార్పు లేదు. రాత్రిళ్ళు నిద్రలేక, జావ తప్ప అన్నం తినలేకా నువ్వు చిక్కి పోయి మెత్త పడి పోయావు.

వారం తరువాత మేము కూడా నీతో గుంటూరు వచ్చాము.

నీ పేరు పిలవగానే లోపలికి వెళితే తెల్లటి పాలిపోయిన చిన్న డాక్టర్ నిన్ను నిల్చోబెట్టే ఒకే ప్రశ్న వేశాడు.

“ఎలా ఉందీ” అని .

నువ్వు గబ గబ “కన్ను ఇంకా మూత పడటం లేదు డాక్టర్ గారు. నిద్ర పట్టటం లేదు. మాట్లాడుతుంటే మూతి వంకర వస్తుంది. కంటి చూపు బాగా మందగించి పోయింది. పొడి దగ్గు వస్తుంది. మింగటం కష్టంగా ఉంది.“ చెక్కలాంటి మొహంతో నిల్చోనే చిన్న పిల్లలాగా సమాధానం చెప్పావు. చిన్న డాక్టర్ మొహంలో ఎలాంటి భావం పలికించకుండా అప్పుడప్పుడు భృకుటి ముడి వేస్తూ బర బరా ఏదో రాసుకొన్నాడు. రోగులు చెప్పేదానికి ఊ కొట్ట కూడదనీ, వాళ్ళ మొహం కూడా చూడకూడదనీ వాళ్ళు ఈ మధ్యే మెడిసిన్ చదివి వచ్చిన ప్రైవేట్ కాలేజీలు చెప్పాయి.

తరువాత పక్కనే ఉన్న పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. ఎనభై ఏళ్ళ నిన్ను నిల్చోబెట్టి చిన్న డాక్టర్ రాసిన కాగితం చదివి ఇంకో మందు కలిపి రాసి “తగ్గుతుంది లే!” అని ఒక మాట అన్నాడు ఆయన. రోగి వంటి మీద చెయ్యి వేసే పని ఆయన అనవసరంగా ఎప్పుడూ పెట్టుకోడు. రోజుకు వంద ఒపీలు చూడాలని, సమయాన్ని వృధా చేయకూడదనీ ఆయన చదివి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆయన పని చేసి వచ్చిన ప్రభుత్వాసుపత్రులు నేర్పించాయి మరి.

అప్పుడు నువ్వు రెండు చేతులు.. నీ చేతికర్ర తో సహా ముక్కు దాకా పైకి ఎత్తి .. ఆయనకు నమస్కారం చేశావు. బాధతో మొహం గంటు పెట్టుకొన్న మమ్మల్ని చూసి నవ్వావు.

కారు ఎక్కాక “బ్రాడీ పేట పోవాలి.” హుకుం జారీ చేశావు.

“ఇప్పటికే ఆలస్యం అయ్యింది. మనం ఈ రాత్రి ఇంకా రెండు గంటలు ప్రయాణం చేస్తే కానీ ఇంటికి చేరుకోలేము. ఇక్కడ కరెంట్ కూడా పోయింది. అయినా ఇప్పుడు బ్రాడి పేట ఎందుకు?”

“మొన్న కూడా కొననివ్వలేదు మీరు. చాలా కష్టం అవుతుంది పాఠం చెప్పటం. ప్రసన్న కోసం డిక్షనరీ కొనాలి.”