ట్యాగులు

,

image_202ఈ అనంత విశ్వంలో భూమి ఒక చిన్న రేణువు. ఇక్కడ వాయువల మిశ్రమంగా పుట్టిన చిన్న కణం మానవిగా, మానవడుగా పరిణితి చెంది … తన శరీరంతో, మేధస్సుతో పడావుగా పడి ఉన్న భూమి మీద అపరిమితంగా పరిశ్రమించింది. ఈ భూమి కడుపులు నింపింది. భోగ భాగ్యాలు ప్రసాదించింది. నాగరికత నాజూకు జీవితాన్ని అనుభవింప చేసింది.

భూమి ఒక ఉత్కృష్టమైన ఉత్పత్తి సాధనం. ఒకప్పుడు అది శ్రమ చేసే వారికి బానిస అయ్యింది. ఆరుగాలం తనపై సాము చేసిన వారి చేతిలో పసిపాపలాగా ఒదిగిపోయింది. ఎండల్లో వానల్లో తనతో సావాసం చేసిన మనిషికి అది గులాము అయి, సలాము చేసింది. తనలోని సారాన్ని విత్తు విత్తుకి పంచింది. వేళ్ళను తన గర్భంలో పొదివి పట్టుకొని మొక్కను తన గుండెపై గర్వంగా పెరగనిచ్చింది. కాయకష్టం చేసిన వాళ్ళ కడుపులు నింపింది. భూమికి, మనిషికి ఉన్న బంధం అప్పుడు అత్యంత సహజంగా ఉండేది. అయితే కాల క్రమేణా బలవంతులు దాన్ని ఆక్రమించారు. భూమిపై కండలు కరిగించిన సమూహాలకు దాని సంపదపై హక్కు లేకుండా చేశారు. ముప్పొద్దుల కష్టించే వారు కూలీగింజల కొలతల దగ్గర పొడి కళ్ళతో మిగిలిపోయారు. శ్రమించేవారికి, భూమికి ఉన్న పేగుబంధం బలవంతంగా తెంచబడింది.

ఆమె వాటా ఎంత?

భారత దేశంలో ఇప్పటికీ మూడొంతుల స్త్రీలు భూమి పైనే బతుకు వెల్ల మారుస్తున్నారు. మొత్తంలో మూడో భాగం శ్రమను తమ వంతుగా భూమి పైనే ధార పోస్తున్నారు. ఆబగూబలు అణిగే దాకా, అక్కులు చెక్కులు ఎండే దాకా, ఆయిలో ఊపిరి కోయిలోకి వచ్చే దాకా రెక్కలు ముక్కలు చేసుకొన్నారు. మరి అడవులు కొట్టీ, నదులను మళ్ళించి, భూమిని తడిపి, విత్తిన పంట కడుపులోకి పోయేదాకా చేసిన మానవ శ్రమలో స్త్రీ వంతు ఎంత? పంటతో బాటు పొర్లిన మిగులు సంపదలో ఆమె వాటా ఎంత? సంపదకు సమాంతరంగా పెరిగిన నాగరికతలో ఆమె పాత్ర ఎంత? ఎర్రని ఎండకు ఒళ్ళు అప్పగించి, విత్తనం నుండి అప్పుడే పొడుచుకొని వచ్చిన మొలక ఆకారంలో వంగి భూమిపై ఆమె చేసిన పనిలో కారింది చెమటా? ఆమె రక్త మాంసాలా? యుగాలుగా భూమితో పెనవేసుకొన్నఆమె జీవితం, కాలం, ఉద్వేగం, బంధం ఆమెకు ఏమి ఇవ్వగలిగాయి? కూడికలు, తీసివేతలు వేసి చూస్తే ఆమెకు మిగిలింది సున్నాకంటే తక్కువే. పైసా వంతు హక్కు కూడా భూమి మీద సంపాదించలేక బికారిగా మిగిలిపోయారు.

వర్గ సంబంధాలు, అణచబడ్డ వర్గానికి భూమి మీద హక్కును తొక్కి పడితే, వాటితో బాటు సామాజిక సంబంధాలు స్త్రీలకు ఆ హక్కును పూర్తిగా నిరాకరించాయి. స్త్రీలు శ్రామిక వర్గంలో ప్రవేశిస్తే, అది వారి విముక్తికి దోహదపడుతుందని ఏంగెల్స్ చెప్పారు. ఇంకా ప్రైవేటు ఆస్తి పురుషుల చేతి నుండి తొలగించాలని … ఇంటి పని, పిల్లల పెంపకం సామాజికం చేయాలని కూడా చెప్పారు. భూమి మీద హక్కుకి, పేదరికానికి వ్యతిరేక సంబంధం ఉందనీ … హక్కు లేకుండా అందులో పనిచేయటం అంటే అత్యంత పేదరికానికి గురి కాబడటమే అనే వాస్తవం కావాలనే అశ్రద్ధ చేయబడింది. బ్రతుకు తెరువుకు, లింగ న్యాయానికి అవసరమైన భూఅధికారం ఆమెకు తిరస్కరించబడింది. భూమి సమస్యలో ఉండాల్సిన స్త్రీ పురుష సమానత్వ దృష్టి పూర్తిగా ఉపేక్షించబడింది.

స్త్రీత్వాన్ని సంతరించుకొంటున్న భూమి

స్త్రీని భూమితో పోలుస్తారు. (సహనానికి ప్రతీకగా) ఆ పోలిక స్త్రీ పై వేస్తున్న భారాన్ని కాసేపు పక్కన పెడితే, స్త్రీలకు భూమిపై హక్కుల ప్రశ్న ముందు ముందు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోబోతుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగం ‘స్త్రీత్వాన్ని’ సంతరించుకొంటుంది. మన దేశంలో, వ్యవసాయ రంగం నుండి వ్యవసాయేతర రంగానికి క్షేత్ర సంబందమైన బదిలీ నెమ్మదిగాను, అసమానంగాను, స్త్రీ పురుష తారతమ్యంతోనూ జరుగుతుంది. వ్యవసాయేతర రంగాల్లో మగకూలీల ప్రవేశం పెరుగుతుంది. కానీ ఆ రంగంలోకి ఆడ కూలీల బదిలీ శాతం చాలా తక్కువగా ఉంది. ఇంకా ఎనభై శాతం గ్రామీణ మహిళలు భూములపైనే ఆధారపడి ఉన్నారు. పురుషులలో కేవలం యాభై మూడు శాతం మాత్రమే ఈ రంగంలో ఉన్నారు.

వ్యవసాయేతర రంగాల వేతనాలలో అసమరూపత ఎక్కువగా ఉంటుంది. చదువు లేకపోవటం, ఇంటి పని భారం, పెట్టుబడి పెట్టటానికి ఆస్తులు లేకపోవటం … మొదలైన విషయాలు స్త్రీలు వ్యవసాయేతర రంగాలకు మరలటానికి అడ్డంకులుగా ఉండటమే కాదు, వారికి ఆ రంగంలోకూడా తక్కువ స్థాయి పనులు మాత్రమే లభించటానికి కారణాలు అవుతున్నాయి. అంతే కాకుండా వైధవ్యం వలన, వివాహ విచ్ఛిత్తి వలన, మగవాళ్ళ వలసల వలన స్త్రీలు పెద్దలుగా ఉండే కుటుంబాలు పెరుగుతున్నాయి. నేటి వివాహాలు పటిష్ఠంగా లేకపోవటం, పిల్లలను పెంచే సహాయక వ్యవస్థలు లేకపోవటం కూడా స్త్రీల వలసలను నిరోధిస్తున్నాయి. వారు పల్లెల్లోనే ఉండే భూమి మీద కష్ట పడుతున్నారు. అయితే వ్యవసాయంలో స్త్రీల పని స్వభావం, పురుషుల పనుల కంటే సాధారణంగా ఉంటుంది. అందుకే వ్యవసాయ రంగంలో వారి వేతనాలు పురుషుల వేతనాల కంటే తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ మంది స్త్రీలు వ్యవసాయ రంగంలో ఉన్నప్పటికీ వారు సాధారణ కూలీలుగానో, స్వయం ఉపాధి కార్మికులుగానో ఉంటున్నారు.

ఈ స్వయం ఉపాధి స్త్రీ కార్మికులు (రెండు మూడు ఎకరాలు ఉండి, తమ పొలంలోనే శ్రమ చేసేవాళ్ళు) ఎక్కువగా పురుష యాజమాన్యం కల భూముల్లో వేతనాలు లేకుండా, ఏ హక్కులూ లేకుండా పని చేస్తుంటారు. దుక్కి దున్నినప్పటి నుండి పంట చేతికి వచ్చినదాక, ఒంటి సుకమెరగక కష్టించే ఈ స్త్రీలకు పంట ఎవరికి, ఎంతకూ అమ్మారో కూడా చాలా సార్లు తెలియక పోవటం అతిశయం కాదు. ఈ పరిస్థితి భారత భూభాగం అంతా కనిపిస్తుంది. కాశ్మీర్ లో యాపిల్ తోటల మహిళా రైతులు కాయ ట్రక్కులకు ఎక్కే వరకు నడుం విరిగేటట్లు చాకిరీ చేస్తారు. పంట డబ్బు మాత్రం నేరుగా పురుషుల చేతిలోకి, అక్కడ నుండి చాలా భాగం దుర్వ్యసనాలకు ఖర్చు అయిపోతుంది.

భూమి బదిలీలు

ఇప్పుడున్న సమాజంలో భూమి మీద హక్కులు రెండు విధాలుగా వస్తాయి. భూమి కలిగిన కుటుంబాలలో వారసత్వ హక్కుగా వారి కుటుంబ సభ్యులకు రావటం ఒక పద్దతి. భూమి లేని వారికి ప్రభుత్వం నుండి మిగులు భూములు , సీలింగ్ భూములు పంచటం రెండో పద్దతి. ఈ రెండు పద్దతుల్లో కూడా స్త్రీకి భూమి నిరాకరించబడింది.

భారతదేశంలో 86 శాతం భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవే. అందులో అతి తక్కువ భాగం మాత్రమే స్త్రీలకు వారసత్వ హక్కుగా ఉంది. ఒక సర్వే ప్రకారం 470 వితంతువుల్లో 13 మందికి మాత్రమే తండ్రి నుండి భూమి వచ్చింది. కొన్ని రికార్డుల్లో వితంతువులకు ఇచ్చే భూమి, పెద్దవాడైన కొడుకుతో కలిసి జాయింట్ పేరు మీద ఉంది. ఇలాంటి సందర్భంలో భూమిని ఎవరు కంట్రోల్ చేస్తారో చెప్పనవసరం లేదు. హిందూ, ముస్లిం మతాలు వాటి వారసత్వ చట్టాల్లో వ్యవసాయ భూముల్ని వేరుగా పరిగణించాయి. ఉదాహరణకు ‘హిందూ వారసత్వ చట్టం’ కౌలు భూముల మీద హక్కుల విషయం ఆయా రాష్ట్రాల మీదే వదిలి పెట్టింది. దేశం మొత్తం మీద ఆరో వంతు జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కౌలు భూములపై స్త్రీల హక్కు హరిచవేయబడింది. అదే బాటలో ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలు వెళ్ళాయి. హిందూ చట్టంలోని మరో అసమానత్వం, ఉమ్మడి కుటుంబ ఆస్తి చట్టంలో ఉంది. ఇందులో కేవలం మగసంతానికి మాత్రమే ఆస్తి హక్కులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలు ఈ యాక్ట్ ను సవరించి స్త్రీలకు కూడా వారసత్వ హక్కు ఇచ్చాయి. చట్టాల్లో ఉండే ఈ అసమతుల్యత వలనా… చట్టానికి, ఆచరణకూ ఉండే అగాధం వలనా… స్త్రీలు ఆస్తిని పొందటంలో సామాజికమైన, ప్రభుత్వ పరమైన వివక్షతకు గురి అవుతున్నారు. కొన్ని పితృస్వామ్య సమూహాలు స్త్రీలకు భూములు ఇవ్వటాన్నిగట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని సార్లు స్త్రీలే అన్నతమ్ముళ్ళ కోసం తమ ఆస్తి హక్కును వదులు కొంటున్నారు. సాంఘీక భద్రత ఇవ్వలేని వ్యవస్థలో, అన్నతమ్ముళ్ళే భద్రత ఇవ్వగలిగిన శక్తులుగా వారికి కనిపిస్తున్నారు. (ముఖ్యంగా స్త్రీ వివాహాలు విఫలం అయినప్పుడు). స్త్రీ పురుష వివక్షతకు సంబంధించిన సాంస్కృతిక నిర్మాణాలు స్త్రీలను భూమిని డిమాండ్ చేయనీయకుండా “మంచి సోదరి” గానే మిగిలి పోమని చెబుతాయి. హక్కు కలిగి ఉండటానికి, అనుభవించటానికి ఉండే వ్యత్యాసం కొన్ని ఉత్తర రాష్ట్రాలలో ఎక్కువగా కనబడుతుంది.

ఇక ప్రభుత్వం పంచే మిగులు భూములు, సీలింగ్ భూములు, అదనపు భూములు, పునరావాసపధకాలలో వచ్చే భూములు, పేదరిక నిర్మూలనా పధకాలలో వచ్చే భూములు సాధారణంగా కుటుంబ మగ పెద్ద పేరు మీదనే బదలాయించటం జరుగుతుంది. ప్రభుత్వానికి మైనారిటీ తీరిన కొడుకులపై ప్రత్యేక దృష్టి వుంటుంది కానీ అవివాహితులు అయిన కూతుర్లను పట్టించుకోదు. ఒక్క కేరళాలోనే (దాని మాతృస్వామ్య అవశేషాల వలన) అవివాహితులు అయిన మైనారిటీ తీరినా కొడుకులను, కూతుళ్ళను విడి వ్యక్తులుగా గుర్తించి భూ కేటాయింపులు జరుగుతాయి.

స్త్రీలకు భూమి మీద హక్కులు లేకపోవటం వలన సాధికారిత, సమానత్వం లోపించటమే కాదు … సంక్షేమానికి సంబంధించిన ప్రశ్న కూడా వస్తుంది. భూమి కలిగి ఉండటం అనే విషయం ప్రత్యక్ష, పరోక్ష లాభాలను కలగచేస్తుంది. ప్రత్యక్షంలాభం … వచ్చిన పంటను అనుభవించగలగటం. పరోక్షం లాభం … అవసరమైనప్పుడు భూమిని తాకట్టు పెట్టి అవసరమైన అప్పులు, సదుపాయాలు పొందే సౌలభ్యం ఉంటుంది. భూమిపై పురుషుడి ఏకైక యాజమాన్యం స్త్రీలకు, పిల్లలకు అంత ఉపయోగకరంగా ఉండదు. ఆదాయాన్ని ఖర్చు పెట్టటంలోనూ, ఇల్లు నడపటంలోనూ స్త్రీ పాత్రను దృష్టిలో పెట్టుకొంటే, భూ వనరులు మరియూ దానిపై వచ్చే ఆదాయం స్త్రీ పరం అయితే … పిల్లల్ని, కుటుంబాన్ని పేదరికం అనే ఆపద నుండి రక్షించవచ్చు. అంటే కాకుండా భూమిని కలిగి ఉండటం అనే విషయం స్త్రీకి ఆత్మ విశ్వాసాన్ని పెంచి … ఆరోగ్యం, విద్యకు సంబంధించిన ప్రభుత్వ పధకాలలో ఆమె వాటాను అధికారికంగా అడిగే శక్తిని ఇస్తుంది. వృద్ధులైన స్త్రీలకు, వితంతువులకు భూమి హక్కు వృద్ధాప్యంలో రక్షణను ఇస్తుంది. స్త్రీలు వనరులను సామర్ధ్యంతో ఉపయోగించుకోగలరని పరిశోధనలు తెలుపుతున్నాయి. పంటలను, సాగు విధానాలను స్త్రీలు ఎన్నుకొనే పద్దతులు ఎక్కువ దిగుబడులు ఇస్తున్నాయి. స్త్రీ పురుష నిర్ణయ భాగస్వామ్యంతో ప్రతిభావంతమైన సాగు జరుగుతుందని నిర్వివాదంగా చెప్పగలము.

పురుషుడితో ఉమ్మడి పట్టాలా? వ్యక్తిగత పట్టాలా ?

ఉమ్మడి పట్టాల వలన స్త్రీలకు ఎక్కువ ఉపయోగం ఉండదు. పితృస్వామ్య సమాజంలో భూమి మీద పట్టు రావాలంటే స్త్రీలకు వ్యక్తిగత పట్టాలుంటేనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఉమ్మడి పట్టాలుండటం వలన వివాహం విఫలం అయినప్పుడు, కేవలం భూమి కోసం ఆ వ్యక్తి తో కలిసి ఉండాల్సిన పరిస్థితికి స్త్రీలు నెట్టబడతారు. సాగుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికీ, పంటను అనుభవించటానికీ భూమి ఆమె పేరు ఉండటం సముచితం. వ్యవసాయానికి కావాల్సిన వనరుల సమస్యను ఇతర స్త్రీల తో కలిసి, ఉమ్మడి సాగు … ఉమ్మడి పెట్టుబడితో పరిష్కరించుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన జ్నానాన్ని ఇచ్చి పుచ్చుకొనే అవకాశం ఉంది.

దున్నేవాడిదే భూమి – శ్రమించే స్త్రీకి కూడా భూమి

నాగలి పట్టి వాడు భూమి హక్కుదారుడు అవ్వాలనే సూత్రాన్ని నిజమైన అర్ధంతో తీసుకోవాలి. భూమి ఎవరి చెమట చుక్కలతో తడుస్తుందో … ఎవరి పగుళ్ళు బారిన బోసికాళ్ళతో తొక్కబడుతుందో…. ఎవరి మట్టి చేతులతో విత్తబడుతుందో …. ఎవరి కలలూ, ఆశలూ భూమి చుట్టూ తిరుగుతుంటాయో, ఆ స్త్రీకి భూమి మీద సర్వ హక్కులు ఉండాలి. మట్టిని ప్రేమించి, స్నేహించి … ఎర్రటి ఎండలో నాట్లు వేస్తూ, కలుపులు తీస్తూ, శ్రమను మర్చిపోవటానికి కదం తొక్కుతూ పాటలు పాడుతున్న ఆ శ్రామిక స్త్రీ మూర్తిని భూమికి నిజ అర్ధంతో యజమానురాలిని చెయ్యాలి.