ట్యాగులు

248102-harassed-woman-rna

భారతదేశ న్యాయం ఎప్పుడూ ఆధిపత్య వర్గాల వైవునే నిల్చోని ఉంటుంది. అందులో కూడా పురుషుల పక్షమే వహిస్తుంది. బలహీన వర్గాలు అయిన దళితులు, స్త్రీల పట్ల శీతకన్ను వేసి ఉంచటమే కాదు, అవసరమైనపుడు వారి వ్యతిరేకవర్గంలో తన స్థానాన్ని నిరభ్యరంతంగా ఖాయం చేసుకొంటుంది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన వర్గ, కుల, లింగ సమానత్వాన్ని నామకా అయినా పాటించాలనే మొహమాటాన్ని కూడా నిస్సంకోచంగా వదిలేస్తుంది. అరా కొర చట్టాలు ఏమైనా ఉంటే ఆ చట్టాలు పదే పదే చర్చలోకి వస్తాయి. “పునస్సమీక్ష” చేయబడతాయి. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా “కుటుంబ పరిరక్షకుల” నోటిలో నానుతున్న చట్టం సెక్షను 498ఎ.

498ఎ చట్టం పూర్వాపరాలు

సరళీకృత ఆర్ధిన విధానాలు ప్రవేశించిన 1980 లలో, వివాహ వ్యవస్థలోకి డబ్బు ప్రవేశించి వస్తు వ్యామోహం పెరిగింది. వస్తు వినిమయం అపరిమితంగా జరిగిన దశ అది. దేశంలో వరకట్న హత్యలు చెదురుమదరు సంఘటనల రూపం నుండి ఒక మూకుమ్మడి ఉపద్రవం అయిన ప్రమాదం అప్పుడే ప్రారంభం అయ్యింది. వాటికి సమాంతరంగా స్త్రీలపై జరుగుతున్నా కుటుంబ హింసకు వ్యతిరేకంగా మహిళా ఉద్యమాలు ఊపందుకొన్నాయి. గడప దాటి వినబడని, కనబడని హింసకు సామాజిక, ఆర్ధిక కారణాలు వెదికి ప్రభుత్వం మీద వత్తిడి పెంచాయి. 1975-85 కాలాన్ని అంతర్జాతీయ మహిళా దశాభ్ధంగా ఘనంగా ప్రకటించిన ఆనాటి ఇందిరాగాంధి ప్రభుత్వానికి మహిళా ఉద్యమాల సెగ కూడా తోడవటంతో 1983లో 498ఏ చట్టాన్ని తీసుకొని వచ్చింది. 1961లో తెచ్చిన వరకట్న నిషేదచట్టం పూర్తిగా విఫలం అయిన సందర్భంలో ఈ చట్టాన్ని అత్యంత పకడ్భందీగా రూపకల్పన చేశారు. భర్త కానీ భర్త సంబంధీకులు కానీ స్త్రీ మీద క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే ఈ సెక్షను ప్రకారం వారికి మూడు సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు. ఇక్కడ క్రూరత్వం అంటే నిర్వచనం కూడా ఇచ్చారు. అది వరకట్న వేధింపు ఒక్కటే కానవసరం లేదు. కట్నంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య స్త్రీలపై జరుగుతున్నశారీరిక మానసిక వేధింపులు మొదటి రకం హింసగా నిర్వచించి, కట్నం కోసం జరిగే హింసను రెండవరకం హింసగా పరిగణించారు. ఇంకా ఈ సెక్షన్ను నాన్ బైలబుల్ (కొంత కాలం వరకు జామీను తీసుకోవటానికి వీలు లేని), నాన్ కాంపౌండబుల్ (ఒక్క సారి కేసు పెట్టాక రాజీ పడటానికి వీలు లేని), కాజ్ఞజబుల్ ( వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చు)గా బందోబస్తు చేశారు. ఒక వేళ వరకట్నపు వేధింపులలో ఆ స్త్రీ మరణిస్తే ( పెళ్ళి అయిన ఏడు సంవత్సరాల లోపు) ఈ చట్టానికి అనుబంధంగా ఉన్న 304 బి (1986) క్రింద ఏడు సంవత్సరాల నుండి జీవితకాలం శిక్ష వరకు విధించవచ్చు. 2006 లో కుటుంబ హింస చట్టం వచ్చే వరకు 498ఏ మాత్రమే ఇంట్లో హింస పడుతూ.. విడాకులు తీసుకోవటానికి ఇష్టపడని స్త్రీలకు ఉపయోగపడేది. తరువాత కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు దానికి సవరణలు తెచ్చి కోర్టు అనుమతితో రాజీపడే ‘సదవకాశాన్ని’ కలగ చేసాయి.

ఉన్నత న్యాయస్థానాల వరస తీర్పులు

2003లో సావిత్రి దేవి కేసులో డిల్హీ హైకోర్టు జస్టిస్ జెడి కపూర్ 498ఏ సెక్షన్ మీద విరుకుపడ్డారు. కుటుంబాలను అతలాకుతలం చేసే చేటుగా ఈ చట్టాన్ని ఆయన వర్ణించారు. ఇంకా ఆయన ముందుకు పోయి.. ఈ చట్టాన్ని ఉపయోగించుకొని స్త్రీలు వారి భర్తలను, అత్తమామలను హింస పెట్టే హక్కు లేదని వక్కాణించారు. కుటుంబ తగాదాలను పరిష్కరించటంలో వైఫల్యం చెందిన పోలీసులను ఆయన తులనాడారు. స్పష్టమైన స్త్రీ వ్యతిరేకత, పోలీసుల పట్ల కొంత ధర్మాగ్రహం తప్ప ఈ చట్టం దుర్వినియోగం అయిందని చెప్పటానికి ఆయన వద్ద సరి అయిన ఆధారాలు పెద్దగా లేవు.

అదే సంవత్సరం మలవత్ కమిటీ “సహనం లేని ఉద్రేకపడే మహిళ చిన్న కారణాలకే కేసులు పెట్టవచ్చు. దాని వలన ఆమె భర్త, అతని కుటుంబం జైలు పాలు అవ్వచ్చు. అతని ఉద్యోగం పోవచ్చు. వారి వైవాహిక జీవితంలో తుఫాను రావచ్చు.” అని చెప్పింది. ఇవన్నీ జరగకూడదు కానీ కుటుంబ హింస, క్రూరత్వం, ఒక్కోసారి ఆమె మరణం దాకా జరిగినా పర్వాలేదని ఆ కమిటీ ఉద్దేశ్యం.

2010లో ప్రీతి గుప్తా వర్సెస్ జార్ఖాండ్ రాష్ట్ర ప్రభుత్వ కేసు సంధర్భంగా భారత ప్రభుత్వం లాకమీషన్ ను 498ఏ ను సమీక్షంచమని అడిగింది. లా కమిషన్ 2012లో ఇచ్చిన రిపోర్ట్ లో ఈ చట్టాన్ని కాంపౌండబుల్ చేయాలని, బైలబుల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాగే తప్పుడు కేసులు పెట్టిన స్త్రీలను శిక్షించే విధంగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని కూడా అభిప్రాయ పడింది. మానుషి మహిళల పత్రికను ప్రతిష్టాత్మకంగా నడిపి, వైవాహిక చావులను ప్రపంచానికి చూపిన మధూ కిష్వర్ నరేంద్ర మోడి భజన వర్గంలో చేరి గొంతు మార్చి 498 దుర్వినియోగమౌతుందనే పాట మొదలు పెట్టింది. ఆమ్ ఆద్మీ నాయకురాలు కిరణ్ బేడీ కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడింది.

ఈ చట్టం కోరలు తీయటానికి దారులు ముందు నుంచే వేసుకొంటూ వచ్చిన బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే .. ఈ సంవత్సరం జులై రెండున సుప్రీం కోర్టు 498 గురించి చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఆశ్చర్యపరచవు. ‘అసంతృప్తి భార్యలు భర్తలను, అత్తమామలను వేధించటానికి ఈ చట్టాన్ని వాడుకొంటున్నారని వ్యాఖ్యానించింది. ఈ సెక్షను క్రింద ఎవరినంటే వారిని అరెస్టు చేయవద్దని పోలీసులకు సూచించింది. విచారణతో సహకరించని వారిని, సాక్ష్యాలను తారుమారు చేయ ప్రయత్నించేవారిని, పారిపోవాటానికి ప్రయత్నించే వారిని మాత్రమే అరెస్ట్ చేయమని చెప్పింది.

498ఏ నిజంగా దుర్వినియోగం అవుతుందా?

నాలుగు గోడల మధ్య స్త్రీల మీద హింస అనేది ఒక కఠిన వాస్తవం. భారత దేశంలో వరకట్న వేధింపులు ఈ హింసకు ఒక ప్రధాన కారణం. దానిని నివారించటానికి రూపకల్పన చేసిన చట్టం 498 ఏ. వరకట్నపు ప్రసక్తి లేని గృహహింసకు కూడా ఈ సెక్షను వర్తిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా గృహహింస అనుభవిస్తున్న మహిళలు 498ఏలో మొదటి భాగాన్ని ఉపయోగించుకొని కేసు పెట్టుకోవచ్చు. కానీ 498ఏ ప్రస్థానం వరకట్న వ్యతిరేక ఉద్యమాలనుండి ప్రారంభం అవటం వలన కోర్టులు కానీ పోలీసులు కానీ వరకట్న ఆరోపణలు లేకుడా ఈ కేసులను ముట్టుకోవటం లేదని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు. గతి లేని పరిస్థితుల్లో వరకట్నానికి సంబంధించిన కొన్ని వాక్యాలైనా జత పరచాల్సి వస్తుంది. అయితే ఈ తప్పు కంప్లైంట్ చేసిన వారిదా? లేక తప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్న పోలీసులు, లాయర్లదా? లేదా చట్టం స్వభావంలోనే లోపం ఉందా? అనే విషయం తరచి చూడాలి. అవినీతి, తప్పుడు విచారణలు, కేసు పడిన భర్త మీద సానుభూతి .. ఇవన్నీ యాంత్రిక తీర్పులకు దారి తీస్తున్నాయి. ‘వరకట్న చట్టాలు దుర్వినియోగమవుతున్నాయి’ అనే వ్యంగ్య పూరిత ప్రచారం వెనుక ఈ చట్టాన్ని పటిష్ట పరిచి పకడ్బందీగా అమలు పరచాలనే కర్తవ్యం మరుగున పడుతుంది.

భర్త నుండి డబ్బు గుంజటానికే ఈ కేసులు పెడుతున్నారని ఈ సెక్షను మీద ఇంకో ఆరోపణ. ఎందుకంటే ఎక్కువ కేసులు డబ్బు తీసుకొని సెటిల్ అవుతున్నాయి కాబట్టి. మెజారిటీ 498 కేసులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని రాజీ పడుతున్నపుడు అది న్యాయమే అవుతుంది. ఆ డబ్బుతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. కోర్టులు కూడా ఎప్పటి కప్పుడు ఈ విషయంలో నిర్దేశిక సూత్రాలు చెబుతూ ఆ సౌకర్యం కలిగిస్తున్నాయి. హింసాయుతమైన వైవాహిక జీవితంలో చిక్కుకొన్న యువతికి భర్తకు శిక్ష పడటం ఉపశమనం కలిగించదు. కొంత డబ్బు భద్రతతో గౌరవనీయమైన నిష్క్రమణ ఆమెకు అవసరం. ఈ రాజీల వలన వచ్చే డబ్బు ఆమె అప్పటికే దావా వేసిన మనోవర్తికి బదులుగా (ఇంకా చెప్పాలంటే చాలా తక్కువగా) ఇస్తున్నారని అర్ధం చేసుకోవాలి.

ఈ చట్టం చదువుకొన్న, ధనిక, మధ్య తరగతి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మహిళలకు మాత్రమే ఉపయోగపడుతుందని, వారు ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. ఏక్తా గ్రూపు సర్వే ప్రకారం ఈ కేసుల కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నవారు భర్తల మీద ఆధారపడి పడిన నిర్భాగ్యులయిన స్త్రీలు. చదువుకొన్న,ధనిక స్త్రీలు పరిహారం కోసం నేరుగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఏటా ఐదు కోట్ల మహిళలు గృహహింస పాలు అవుతుంటే రెండు లక్షల కేసులు మాత్రమే ఈ సెక్షను క్రింద్ర నమోదు అవుతున్నాయి. యాభైవేల అరెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. పదిహేను శాతం కేసుల్లోనే శిక్షలు ఖరారు అవుతున్నాయి. తక్కువ శిక్షలు పడటానికి కారణం దొంగ కేసులు నమోదు అవటమేనని కోర్టులు అంటుంటే , స్త్రీలకు కోర్టుల్లో న్యాయం జరగటం లేదని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

భర్త తరఫు బందువులను నిందితులలో చేర్చటం సరి అయినదేనా?

పితృసామ్య, పురుషాధిక్య సమాజంలో వివాహిత స్త్రీ మీద భర్తతో బాటు అతని కుటుంబ సభ్యులకు అధికారం ఉంటుంది. తల్లిగా కూతురి అత్తింటి కష్టాల గురించి ఆవేదన చెందే స్త్రీ కోడలి విషయంలో తన అధికారాన్ని వదులుకోదు. స్త్రీ పురుషులకు అసమాన హోదాలు లభించిన మన వివాహ వ్యవస్థలో అన్నీ అస్తవ్యస్థ సంబంధాలే. పురుషస్వామ్య భావజాలం పురుషులనే కాదు స్త్రీలను కూడా పాలిస్తుందిక్కడ. ఆ భావజాలం వలనే అత్త ఆడబడుచుల వేధింపులు కోడలికి తప్పని పీడ అవుతాయి. అయితే కేసులు విచారించే పోలీసులు, వాదించే లాయర్లు “అత్త మామలను, ఆడ పడుచులను లోపల వేస్తే దారికి వస్తారు.” అనే తప్పుడు సూచనలు ఇవ్వటం పరిపాటి. ఒక వేళ మహిళ అత్తామామలు, ఆడపడుచుల మీద అన్యాయంగా ఆరోపిస్తే .. కేసును కూలంకషంగా పరిశీలించే ఓపిక లేక కూడా యాంత్రికంగా అందరి పేర్లు నమోదు చేస్తున్నారు. తప్పకుండా ఈ విషయం పట్ల బాధితురాలు, ఆమె తరఫు బందువులు జాగ్రత్త వహించాలి. ఈ సెక్షను సారము దెబ్బతినకుండా అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ బాధిత స్త్రీల మీదనే ఉంది.

ఎందుకూ, ఎవరికీ ఈ చట్టం కంటకింపుగా ఉంది?

అంతర్జాల ప్రపంచంలో అనేక బ్లాగులు ఈ చట్టానికి వ్యతిరేకంగా వెలిశాయి. 498ఏ కు వ్యతిరేకంగా కోర్టులు చెబుతున్న తీర్పులకు హర్షం వ్యక్తం చేయటం, ఆ కేసులు వేసిన మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేయటం ఈ బ్లాగుల్లో కనబడుతుంది. 498ఏ చట్టం అమలు విషయంలో మహిళల్లో ‘ద్వేషం’, ‘పగ’ గురించి మాట్లాడటం, ఎలాంటి విశ్వసనీయమైన సమాచారం లేకుండా తీర్మానాలు చేయటం ఇప్పుడు కొత్త కాదు. మహిళల విలువైన ప్రాణాల కంటే ‘కుటుంబ విలువలు’, ‘కుటుంబ జీవితం’ లాంటి పదాలకు పవిత్రత ఆపాదించి ఈ చట్టాన్ని సంస్కరించాలనే అతి తెలివి సిఫార్సులే ఇప్పుడు కొత్తగా వింటున్నాము.

“గృహహింసను మిగతా హింసలతో సమానంగా చూడకూడదు. అందులో ‘ మన కుటుంబాలు’ ఉన్నాయి.” అనే తర్కంలోనే “సర్ధుకుపోవాలి” అనే భావన కూడా వినిపిస్తుంది. ఇప్పటి అప్రజాస్వామిక కుటుంబాలలో సర్దుకుపోవటం స్త్రీలే చేయాలి అన్న విషయం సర్వవిదితమే. కాబట్టి మన కుటుంబ పరిరక్షకులు అందరూ కుటుంబాలను కాపాడే ప్రయత్నంలో స్త్రీల పై జరిగే హింస విషయం బేఖాతరుగా ఉన్నారు. రాజ్యం, దాని యంత్రాంగం, కోర్టులు, పోలీసులు పురుష స్వామ్యానికి కాపలా కాస్తున్నాయి. కుటుంబాలను నిలబెట్టే ప్రయత్నంలో ఆమె మరణాన్ని కూడా మూల్యంగా చెల్లించమని అంటున్నాయి.

మళ్ళీ లేవాలి. పొలికేక వెయ్యాలి.

మహిళా రిజర్వేషను బిల్లును మానభంగం చేసిన ప్రజా పతినిధులు పార్లమెంటులో కుర్చీలు ఆక్రమించిన దౌర్భాగ్యం మనది. మహిళలను వేధించిన కేసుల్లో ఉన్నవాళ్ళు పార్లమెంటేర్లియన్లుగా రేపు చేసిన వారిని ఉరి తీయమని చట్టాలు చెయ్యమని మెలోడ్రామా ఆడిన ఘనత వహించిన దేశం మనది. ప్రజల ప్రజాస్వామిక కాంక్షలను అణచటానికి సాక్షాత్తు ప్రభుత్వమే రేపిస్టుగా మారిన రాజ్యాంగ వ్యవస్థ మనది. ప్రజల్లో కుల మత తగాదాలను రెచ్చగొట్టి అందులో స్త్రీలను లైంగిక పరికరాలుగా వాడుకొన్న పచ్చి ఫ్యూడల్ యుగం మనది.

రాజ్యాంగ పుస్తకంలో కనిపించే చాలా హక్కులు బయట అదృశ్యమవుతాయి. అనేక చట్టాలు సౌకర్యవంతంగా ప్రభుత్వం చేతనే అతిక్రమించబడతాయి. ఒక్క పోలవరం ప్రాజెక్టు విషయంలోనే ఏజన్సీ చట్టం, అటవీ హక్కుల చట్టం, అటవీ సంరక్షణ చట్టం, పర్యావరణ రక్షణ చట్టం, జీవ వైవిధ్య చట్టం, పెసా చట్టాలను ఒక్క ఏటున తుంగలోకి తొక్కారు. భారత మహిళలు రాని చట్టాల గురించి పోరాడాలి. ఉన్న చట్టాలను కాపాడుకోవాలి. వరకట్న నిషేధ చట్టం నూరు శాతం ఫైల్ అయినా పట్టించుకొన్ననాధుడు లేడు. ఈ పురుషాధిక్య వ్యవస్థలో వివాహిత స్త్రీల చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం 498ఏ. దానిలోని చిన్న చిన్న వైఫల్యాలకు పునాదులు ఎక్కడ ఉన్నాయో వెదికే ఆసక్తి చూపకుండా దాని మీద సర్వోన్నత న్యాయ స్థానాలు, ఢిల్లీ గద్దె నెక్కిన ప్రభువులు కళ్ళెర్ర చేసి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించటానికి నేలను గట్టి పరుచుకొంటున్నారు. ఇప్పుడిక జవసత్వాలు కూడా తీసుకొని మహిళలు లేచి నిలబడే సమయం ఆసన్నం అయ్యింది.

ఈ వ్యాసం “జాతీయ అంతర్జాతీయ పరిస్థుతులు” బ్లాగ్ లో ఇక్కడ