ట్యాగులు

IMG_9606

మేము తుష్టివారిగూడెం చేరుకొనేసరికి సాయంత్రం అయ్యింది. పోలవరంలో ఒక పెద్ద పడవ ఎక్కి, మధ్యలో పేరంటాళ్ళమ్మ దగ్గర చిన్న బోట్ లోకి మారి చేసిన ఆరు గంటల ప్రయాణం అలసటనూ , ఆందోళననూ, ఆవేదననూ మాత్రమే మిగిల్చింది. గోదావరి ప్రయాణం పొడవునా చుట్టూ కొండలు, కొండలను ఆవహించి ఉన్న అడవులు, అడవుల మధ్య నుండి కనిపిస్తున్న సన్నని గీతలు లాంటి కాలి దార్లు, పచ్చని అడవు మధ్యన అక్కడక్కడ చెమక్కున మెరుస్తున్న జన నివాసాలు, నది ఒంపులు తిగినప్పుడంతా దృశ్యం మారుతూ… కొండా కోనలు తమ అన్ని కోణాలను ప్రదర్శనకు పెట్టినట్లు … నన్నేదో ప్రశ్నిస్తున్నట్లు… మనసంతా చికాకు, కోపం, దుఃఖం.

మేము దిగిన రేవు నుండి రేకపల్లికి ఆటోలో ప్రయాణం. మధ్య మధ్యలో ఊళ్ళు తగులుతున్నాయి. ఊళ్ళు దాటాక అక్కడక్కడ పంట పొలాలు. రెండో ఆటో మారి మేము తుష్టివారి గూడెంకు వచ్చే సరికి సాయంత్రం అయ్యింది. ఆ గూడెంలో మొత్తం ముప్ఫై ఇళ్ళు కూడా లేవు. ఊరి చివరి గుడిశలకు తీసుకొని వెళ్ళారు. రెండు గుడిసల మధ్య మెత్తగా అలికినట్లున్న ఖాళీస్థలంలో మమల్ని చూడగానే మంచాలు తెచ్చి వేసిందో అమ్మాయి. బాగా కిందకు దిగిన చూరు ఉన్న ఇంట్లోకి బయటకు తిరుగుతూ మాకు మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.

‘గోదాటి చెలమల నీళ్ళు’ మా ఆరోగ్యాల మీద మాకున్న అనుమానంతో సందేహపడుతుంటే చెప్పింది.

సన్నగా రివటలాగా ఉన్న ఆ పిల్ల కొద్దిగా భారంగా తిరగటం గమనించి అడిగాను. ‘ఆరో నెల’ సిగ్గుపడుతూ చెప్పింది. “తొమ్మిదో నెల్లో అమ్మోరింటికి వెళ్తా’నని చెప్పింది.

ఇంటి ముందు ఉన్న బోరింగ్ లో నీళ్ళు కొట్టుకొని ఇంటి వెనక్కి వెళ్ళాము. చుట్టూ దడి. గిన్నెలు తోమి దడి కర్రలకు వేలాడ తీశారు. బాగా ఆరాకే లోపలికి తీసుకొని వెళతారు. తడి గిన్నెలు ఇంట్లో చెదలు పట్టిస్తాయని తెలిసు. ఆరోగ్యానికి, అవసరాలకు ఎక్కువ ఖర్చు పెట్టలేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు.

దడిని ఆనించి ఉన్న బండి చక్రం. చక్రం ఇరుసు మీద అరిగిపోయిన లైఫ్ బాయ్ సబ్బు. ఇంటి ముందు ఒకే ఒక పూల చెట్టు. మాటల్లో, మనుషుల్లో, వస్తువుల వినిమయంలో అంతా క్లుప్తత. క్లుప్తత.

ఇంటి ముందర సన్నటి తారురోడ్డు. సూర్యుడు గూటికి చేరే సమయం. భుజం మీద గుడ్డ, చేతుల్లో పనిముట్లతో మగాళ్ళు, ఆడాళ్ళు ఇళ్ళకు చేరుతున్నారు. అప్పటి దాకా మౌనంగా ఉన్న గూడెం సందడి చేయటం మొదలు పెట్టింది. రోడ్డు కవతల ఉన్న అటవీశాఖా భూమిని “పోడు” చేసామని చెప్పారు. అడవిలో చెట్లను కొట్టారు. కానీ మధ్య మధ్యలో కొన్ని చెట్లను వదిలేశారు. “ఇప్ప పూల చెట్లు అవి “ చెప్పిందామ్మాయి. భూమితో నిత్యం సావాసం చేసే గిరిజనులకు భూమినుండి మొలిచిన ప్రతి మొక్క విలువ తెలుసు. నాలుగు గింజలు పండించుకోవటానికి ఆ ఎత్తు పల్లాల్లోనే విత్తుతున్నారు. కొయ్య నాగలితోనే దున్నుతారు. భూమికి ఏమాత్రం నొప్పి తెలవని ఎగసాయం అది.

“కొద్దిగా టీ దొరుకుతాయా?” అడిగారు మాలో ఒకరు.

ఎవరు మాట్లాడలేదు. మేము ఇక టీ మీద ఆశలు వదులుకొని నులక మంచాల మీద నడుం వాల్చాము. ఆకాశానికి అభిముఖంగా పడుకొని ఎన్ని రోజులు అయ్యింది? చల్లటి గాలి. మెల్లిగా నిద్రలోకి జారి పోయాను.

ఎవరో లేపుతున్నారు. చటుక్కున లేచి కూర్చోన్నాను. ఇందాకటి అమ్మాయి టీ గ్లాస్ పట్టుకొని నిల్చోని ఉంది. సెల్ ఫోన్ వెదికి టైమ్ చూశాను. ఎనిమిదయ్యింది.

“పాలు కోసం చానా దూరం పోవాలక్క. మా తమ్ముడు పక్కూరికి నడిచి వెళ్ళి తెచ్చాడు.”

టీ తాగి మళ్ళీ నిద్ర. ప్రకృతి వెచ్చంటి వడిలో పడుకొన్న ఊహ.

పదింటికి మళ్ళీ లేపారు. ఉన్న ఇరవై ఇళ్ళవాళ్ళు కలిపి మా కోసం కోడిని కోసి అన్నం పెట్టారు. సామూహిక ఆతిధ్యం.

మంచాలు చూరు క్రింద లాగటానికి వచ్చారు. “ఇక్కడే పడుకొంటాను.” బెంగగా అడిగాను.

“ఇమ్ము (మంచు) పడుద్ది. వద్దు.” ముక్తసరి సమాధానం ఇంటి పెద్ద నుండి వచ్చింది.

తెల్లవారి వచ్చిన మెళుకువ ఎంత బాగుందో. ముందు రోజుల్లో కూడా ఇక్కడ వాళ్ళకు ఇలాగే అందరికీ తెల్లవారితే ఎంత బాగుణ్ణు.

పోద్దున్నేఆ అమ్మాయి రోట్లో వేసి ఏదో రుబ్బుతుంది. దగ్గరకెళ్ళి చూశాను. నానా పెట్టిన బియ్యం. ఒక గంట రుబ్బి గిన్నె కెత్తింది. కాసేపటికి ఎక్కడ నుండో నల్ల మట్టి తెచ్చింది. పేడతో కలిపి తడిక గోడలను నున్నగా అలుకుతోంది. మునివేళ్ళను పిండిలో ముంచి అందమైన ముగ్గు వేస్తోంది.

తదేకంగా చూస్తూ అడిగాను.

“ఈ ఇల్లు ఇక ముందు ఉండదు తెలుసా?”

మోకాళ్ళ మీద కూర్చుని జరుగుతూ డిజైన్ వేస్తున్న ఆ పిల్ల తల తిప్పి నా వైపు చూస్తూ అడిగింది కదా!

“ ఎవరూ ఏమి చేయలేరా అక్కా?”

ఏమి చెప్పాను. కొన్నాళ్ళకు మీరు పోడు కొట్టుకొన్న పొలం, నువ్వు పెంచుకొన్న పూల చెట్టు, నీ కాళ్ళక్రింద భూమి అన్నీ కబళించే ‘మాయ లేడి’ రాబోతుందని

మాతో పాటు పడవలో ప్రయాణించిన ఒక తెలివైన కళ్ళ యువతి మేము ఏ పని మీద వెళుతున్నామో తెలుసుకొని, ఆటో ఎక్కిన తరువాత అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది.

“ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను. నాకు తలపోటు వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ను మీరు ఆపగలరా?”

ఆపలేమా?

మేమొక్కొక్కళ్ళమే ఆపలేక పోవచ్చు. భారత దేశంలో మాలాంటి వేల వేల సంఘాలు … ఈ గడ్డ మీద పుట్టి .. భూమి, నది ఏమిస్తే అది తిని.. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళగొట్టబడుతున్న మూడు లక్షల గిరిజనులు, ఈ గిరిజనలు ఇక ఉండరని తెలుసుకొని తల నొప్పి తెచ్చుకొన్న ఆ తెలివైన కళ్ళ యువతి లాంటి వాళ్ళు.. ఇంకా ఈ కొండా కోనల్లో బతుకుతున్న జంతువులు, పక్షులు , పురుగులు, పాములు… అన్నీ కలిసి ఆపలేమా?