ట్యాగులు

download_image2014 అయిపోవస్తుంది.ఈ సంవత్సరం నా సాహితీ జీవనం ఒక గాడిన పడింది. మనిషిలోని అంతః ఘర్షణల తాలూకు వత్తిడి సాహిత్యంతో పలచబడుతుందని అంటారు. అది చదవటం అయినా, రాయటం అయినా సరే. ఆ రకంగా చూస్తే ఈ సాహిత్య సహజీవనం నాకెంతో మేలు చేసింది. ముఖ్యంగా నా మిడిల్ ఏజ్ క్రైసిస్ నుండి నన్ను బయట పడవేసింది. నా భావోద్వేగాలను అనేక సార్లు అదుపులో ఉంచి, మంచి మెడిసిన్ లా పని చేసింది. సాహిత్య మిత్రుల పరిచయం, సంభాషణలు కూడా నాకు ఎంతో ఉపకరించాయి.

2014 జనవరి లో విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ కు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొన్నప్పటి నుండి నా సాహిత్య పఠనం ఈ సంవత్సరం ప్రారంభం అయ్యింది. కధాసంకలనాలు, సంపుటిలు కలిపి మొత్తం 29 చదివాను. ఇప్పటి దాకా ఇవి ఎందుకు చదవలేదు అని నాకు నేను ప్రశ్న వేసుకొని నన్ను నేను కోప్పడుకొనేంత మంచి కధలను చదివాను ఈ సంవత్సరం. కంపేర్ చేయను కానీ, అన్నింటిలో నేను ఎక్కువ ఇష్ట పడిన కధా సంపుటాలు ‘నిత్య గాయాల నది’, ‘వీరగల్లు’, ‘రఘోత్తమ రెడ్డి కధలు’, ‘చెహోవ్ కధలు’ ‘ద్రోహ వృక్షం’, ‘కధల వాచకం’ ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ ‘పరాయోళ్ళు’ ‘మిత్తవ’, ‘గరుడ స్తంభం’, కాళీపట్నం రామారావు కధలు’, ‘ఓల్గా రాజకీయ కధలు’, ‘అస్తిత్వానికి అటూ ఇటూ’. ‘కతల గంప’లో కధలన్నీ ఇంతకు ముందే చదివేశాను కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమి అనిపించలేదు. కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. కారా గారి కధల్లో ‘యజ్ఞం’ తప్ప మిగిలినవన్నీ మొదటి సారి నేను చదవడం.

ఈ సంవత్సరం మొత్తం 19 నవలలు చదివాను. తెలుగులో ఈ సంవత్సరం వచ్చిన నవలల్లో ‘ఒండ్రుమట్టి’ నాకు బాగా నచ్చింది. ఆ పుస్తకం చదివాక ‘మాలపల్లే’ గుర్తుకు వచ్చి మళ్ళీ చదివాను. ‘భూచక్రం’ కూడా మంచి నవల. ఇక అనువాద నవలలు ‘పాండవపురం’, ‘వనమాలి’, ‘ఆ గోడకు ఒక కిటికీ ఉండేది’ అద్భుతంగా ఉన్నాయి. ‘కొమరం భీమ్ ’ ఒక రాత్రి నిద్ర పోనివ్వలేదు. ‘మూలింటామె’ వెంటాడి దెయ్యంలా వేధించింది. ‘జమీల్య’ ఏమిటేమిటో నేర్పించింది. ‘బక్, ఒక కుక్క కధ’ చదువుతూ నేనే బక్ అని చాలాసార్లు అనుకొన్నాను.

ఆత్మ కధ అనవచ్చు అనే నవలల్లో ‘హంపి నుండి హరప్పా’ వరకూ చదువుతూ ఆత్మానందానికి గురి అయ్యాను. మగపుటక (అదీ ఆ కాలంలో) పుట్టక ఆ ప్రివిలేజస్ పోగొట్టుకొన్నందుకు కాస్త బాధ పడ్డాను. ఇంచుమించు అదే ఫీలింగ్ అమరేంద్ర గారి ‘ఆత్మీయం’ చదివినప్పుడు కూడా అనిపించింది. ‘ఒక హిజ్రా ఆత్మకధ’ బాగా డిస్టర్బ్ చేసింది.

సాహితీ విమర్శలలో వల్లంపాటి ‘కధా శిల్పం’ చాలా ఉపయోగ పడింది. చరిత్ర పుస్తకాల్లో బత్తుల శివరామరెడ్డి గారి ‘మహత్తర శ్రీకాకుళ పోరాటం’ చాలా కాలం తీసుకొని చదివిన గొప్ప పుస్తకం. ‘జాంబవ పురాణం’ లో సంపాదకీయాలు చాలా బాగున్నాయి. ‘పల్లెను మింగిన పెట్టుబడి’ కూలంకషంగా చదవాల్సి వచ్చింది అనేక సార్లు. ‘ఇండియా లో దాగిన హిందుస్తాన్’ ఇంకో ఉపయోగకరమైన చరిత్ర. ‘రియాలిటీ చెక్’ ఆపకుండా చదివించింది. మనిషిలోని ఘర్షణను తీవ్రంగా ధ్వనించింది తెరేష్ బాబు కవిత్వం

ఇక కుప్పలు కుప్పలుగా పడి ఉన్న చదవాల్సిన పుస్తకాలు రోజూ నిద్ర లేవగానే నన్ను ప్రశ్నిస్తున్నాయి. ఇష్టంగా తెప్పించుకొన్న ఉత్తరాంధ్ర సాహిత్యం వాటిల్లో నుండి ముందుకు దూకుతుంది. సగం చదివి టేబుల్ మీద పెట్టిన పుస్తకం నుండి పతంజలి సూటి ముక్కేసుకొని తీక్షణంగా చూస్తున్నాడు. రంగారావుగారి ‘ఆలాపన’ ఒక పక్క బొద్దుగా కూర్చొని నన్ను చదవటం ఎక్కువ టైమ్ పట్టదు అని పిలుస్తోంది. నాకు ఎంతో ప్రియమైన చరిత్ర కు సంబంధించిన పుస్తకాలు, అనేక కధల సంకలనాలు మా సంగతేమిటని అడుగుతున్నాయి. సిద్ధాంత పుస్తకాలు నువ్వు చివరకు కదా మా దగ్గరకు వస్తావూ? అని వ్యంగ్యంగా నవ్వుతున్నాయి. నేనున్నాను నీకు అని 2015 భరోసా ఇస్తోంది.

ఈ సంవత్సరం నేను చదివిన పుస్తకాలు

జనవరి 2014

1. ఎర్నూగపూలు

2. తొలి కతలు

3. జిగిరి – (నవల) పెద్దింటి అశోక్ కుమార్

4. నేను హిందువు నెట్లవుత – అయిలయ్య పుస్తకం పై శూద్ర విమర్శ-జి.ఎస్ రామ్మోహన్

5. తెగిపడ్డ ఆ చెయ్యి – సి. ఎస్ సాగర్ (సి.పి.ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ ప్రచురణ)

6. టీచర్ – కధా కమామీషు –సంపాదకుడు కట్టి నరసింహా రెడ్డి. (ఎస్.టి.యు ప్రచురణ)

7. నిత్య గాయాల నది – బెజ్జారపు రవీందర్ (పాలపిట్ట బుక్స్)*

8. శతాబ్ది వెన్నెల – కె.గీత కవిత్వం (సత్య ప్రచురణలు)

9. హంపి నుండి హరప్ప వరకు – తిరుమల రామచంద్ర (అజో-విభో ప్రచురణలు) *

10. కాలం చెప్పిన కధలు – కాశీబొట్ల వేణుగోపాల్

11. నికషం – (నవల) కాశీబొట్ల వేణుగోపాల్

12. కధా శిల్పం –వల్లంపాటి వెంకటసుబ్బయ్య *

ఫిబ్రవరి 2014

13. వీరగల్లు – బండి నారాయణస్వామి*

14. బక్, ఒక కుక్క కధ – (నవల) జాక్ లండన్*

15. ఆత్మీయమ్ – దాసరి అమరేంద్ర

మార్చి 2014

16. పల్లెను మింగిన పెట్టుబడి – విద్యా సాగర్*

17. మోరియ –జాన్ మిల్లింగ్జన్ సింజ్ – (డ్రామా) అనువాదము శివ లక్ష్మి

18. తాయమ్మ కధ – మరికొన్ని కధలు – కరుణ

19. అవసరాల రామకృష్ణారావు కధలు – అవసరాల రామకృష్ణారావు.

20. రఘోత్తమ రెడ్డి కధలు *

21. చెహోవ్ కధలు – అనువాదం ముక్తవరపు పార్ధసారధి

22. చెహోవ్ కధలు – అనువాదం రామచంద్రారెడ్డి

23. ఒక కధకుడు – నూరుగురు విమర్శకులు (తుమ్మెటి రఘోత్తమ రెడ్డి రచనలపై విమర్శ)*

24. సాహిత్యాకాశంలో సగం (కాత్యాయనీ విద్మహేకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకం)*

25. కధల వాచకం (14 దేశాలు – 20 కధలు) అనువాదం- ముక్తవరపు పార్ధ సారధి

ఏప్రెల్ 2014

26. పరాయోళ్ళు – జి. ఉమామహేశ్వర్

27. తన మార్గం – అబ్బూరి ఛాయాదేవి కధలు – అబ్బూరి ఛాయాదేవి

28. రేగడి విత్తులు (నవల) – చంద్రలత

29. ద్రోహవృక్షం – డా. వి చంద్రశేఖరరావు కధలు

30. జమీల్య – (నవల) చింగీజ్ ఐత్ మాతోవ్*

31. పాండవపురం (నవల) – మూలం సేతు- అనువాదం స్వామి*

32. 2012 ప్రాతినిధ్య కధ.

33. రాజకీయ కధలు – ఓల్గా

34. ప్రపంచ రచయిత్రుల కధలు 14 – అనువాదం ముక్తవరపు పార్ధసారధి

35. వలస బతుకులు – పెద్దింటి అశోక్ కుమార్ కధలు.

36. వనవాసి (నవల) – బభూతిభూషన్ బంధోపాధ్యాయ – అనువాదం సూరంపూడి సీతారాం*

37. నిషిద్ధ మేఘాలు – బండారు విజయ, అనిశెట్టి రజిత.

38. కేతు విశ్వనాధరెడ్డి కధలు – కేతు విశ్వనాధరెడ్డి

39. మిత్తవ – మంచికంటి కధలు

40. భారత వ్యవసాయరంగపు అర్ధ భూస్వామ్య స్వభావం – విమోచన ప్రచురణలు

41. గరుడ స్తంభం – జి‌. వెంకటకృష్ణ కధలు*

42. ఒండ్రుమట్టి (నవల) – నల్లూరి రుక్మిణి*

43. ఆ గోడకు ఒక కిటికీ ఉండేది (నవల) – వినోద్ కుమార్ శుక్ల – అనువాదం మలయశ్రీ

44. వక్ర రేఖ (నవల) – ఇస్మాత్ చుగ్తాయ్

45. అథో జగత్ సహోదరి (నవల) – అక్కినేని కుటుంబరావు

46. పున్నాగపూలు (నవల) – జలంధర

47. అగ్నిశిఖ(సావనీర్) – ప్రరవే ప్రచురణలు

మే 2014

48. కొమరం భీమ్ (నవల)- అల్లం రాజయ్య, సాహు*

49. కధ 2014

50. పొయ్యిగడ్డ కధలు – సుమ

51. మాలపల్లి (రి) (నవల)- ఉన్నవ లక్ష్మీ నారాయణ

52. మూలింటామె (నవల) నామిని*

53. పలక – పెన్సిల్ (పూడూరి రాజిరెడ్డి)

54. రియాలిటీ చెక్ (పూడూరి రాజిరెడ్డి)

55. మహత్తర శ్రీకాకుళ పోరాటం (డా. బత్తుల శివరామిరెడ్డి)*

జూన్ 2014

56. ఆమ్ స్టర్ డామ్ లో అద్భుతం (నవల) – మధురాంతకం నరేంద్ర

57. సాహితీ యాత్ర (వ్యాసాలు- ఇంటర్వ్యూలు) – దాసరి అమరేంద్ర

58. బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర – శ్రీరామ్ – అనువాదం టి. పద్మిని

59. లెనిన్ జీవితం – భోదనలు – బత్తుల శివరామరెడ్డి

60. అస్తిత్వానికి అటూ ఇటూ (కధలు) మధురాంతకం నరేంద్ర *

61. భూచక్రం (నవల) మధురాంతకం నరేంద్ర*

62. జాంబవ పురాణం – సంపాదకులు తిరుమల జయచంద్ర, కె.పి అశోక్ కుమార్, ఎ.కె ప్రభాకర్, ఆర్. భాస్కర్ రావు.*

63. పొరుగు తెలుగు – వ్యాసాలు – రాయదుర్గం విజయలక్ష్మి

జులై 2014

64. కొల్లేటి జాడలు – (నవల)- అక్కినేని కుటుంబరావు

65. కాళీపట్నం రామారావు రచనలు

ఆగస్టు 2014

66. గిఖోర్ (నవల) – తుమన్యాన్

67. మాక్సీం గోర్కీ కధలు

68. కొండ గాలి కొత్త జీవితం (నవల) – సూరెన్ ఐవజ్యాన్

69. పిచ్చివాని జ్నాపకాలు (మూడు కధలు) – టాల్ స్టాయ్

అక్టోబర్ 2014

70. హిందూ మహా సముద్రం – (దీర్ఘ కవిత) తెరేష్ బాబు

71. నాలుగో ప్రపంచం – తెరేష్ బాబు

నవంబర్ 2014

72. ఒక హిజ్రా ఆత్మ కధ. – రేవతి

73. ఇండియాలో దాగిన హిందుస్తాన్ – పెరి అండర్ సన్

74. సంగీతం రీతులు – లోతులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

75. కధా నేపధ్యం 2 – తానా ప్రచురణలు

76. నేను నా వింతల మారి ప్రపంచం (దీర్ఘ కవిత) – తెరేష్ బాబు

డిశంబర్ 2014

77. కాళీపట్నం నవతీతరుణం

78. అవుటాఫ్ కవరేజ్ ఏరియా – పసునూరి రవీందర్

79. అల్పపీడనం – తేరేష్ బాబు.

80. కతల గంప – స.వెం. రమేశు