ట్యాగులు

script_telugu

2013కు ముందు నేను పెన్ను పేపర్ మీద పెట్టి ఏమి రాయలేదు. ఆ సంవత్సరంలోనే కంప్యూటర్ మీద ‘లేఖిని’ ఉపయోగించి నేను చేసిన మొదటి పుస్తక పరిచయం ‘నిర్జనవారధి’. తరువాత కొన్ని పుస్తక పరిచయాలు చేశాను. ఒక ఇంగ్లీష్ కధను అనువాదం చేసాను. అదే సంవత్సరం నేను నా మొదటి కధ రాసాను. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చిందది. ( మనిద్దరమే కలిసి ఉందాం అమ్మ)

2014లో నా రచనా వ్యాసాంగం ఒక మాదిరిగా సాగింది. నాలుగు కధలు రాయగలిగాను. మే తరువాత కధలు ఇక ప్రయత్నించలేక పోయాను. కారణాలు అనేకం. కధలు రాయటానికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు నాలో ఉన్నాయా అనే సందేహం రావటం అందులో ఒక కారణం. కొన్ని పుస్తక పరిచయాలు, కధా పరిచయాలు, కొన్ని వ్యాసాలు రాశాను. భూమిక కాలం కోసం ఒక పేజీ ఆర్టికల్స్ ఎనిమిది రాశాను. ఆ లెంగ్త్ లో రాయటం నాకు సులభం అయ్యింది. ఇంకా నా బ్లాగ్ లో కొన్ని రాసుకొన్నాను.

ఈ సంవత్సరం నన్ను చాలా ఆనంద పెట్టిన యాక్టివిటీ సారంగాలో “మరొక్కసారి కారా కధల్లోకి” శీర్షిక నిర్వహణ. అలాగే కారాగారి పుట్టినరోజు నాడు ప్రత్యేక సంచిక సారంగాలో తీసుకొని రావటం. కారాగారి కధల గురించి పరిచయం రాసిన వ్యాసకర్తలతో ఆ కధల గురించి చర్చించడం నాకు ఇష్టమైన వ్యాసంగంగా మారింది. తృప్తినిచ్చింది. అలాగే ‘పక్షులు’ నవల మీద నేను రాసిన పరిచయం ఆ నవల రచయిత పసుపులేటి మల్లికార్జునరావుగారు ఆ నవల నలభై ఏళ్ల తరువాత వచ్చిన రీ ప్రింట్ లో ముందుమాటగా వేసుకోవడం నన్ను సంతోష పెట్టింది.

సాహిత్య కార్యక్రమాలు కొన్నిటికి హాజరు అయ్యాను. సుమ రాసిన ‘పొయ్యిగడ్డ కధలు’ పరిచయం చేయడానికి హోసూరు వెళ్ళాను. అక్కడ కృష్ణగిరి రచయితలతో మాట్లాడడం ఒక మంచి అనుభవం. ఒంగోల్లో జరిగిన ‘మా నాన్న బాలయ్య’, ‘నా పొగరు మిమ్మల్ని బాధించిందా’ పుస్తక పరిచయ సభల్లో మాట్లాడాను. కారుమంచిలో జరిగిన ‘తెగి పడిన చెయ్యి’ పుస్తక పరిచయ సభలో కూడా మాట్లాడాను. పై పుస్తకాల గురించి నేను పరిచయ వ్యాసాలు రాశాను.

రాయాలనుకొని రాయలేక పోయినవి చాలా ఉన్నాయి. ‘ఒండ్రు మట్టి’ నవల పరిచయం చేద్దామని అనుకొన్నాను. అవలేదు. తెరేష్ బాబు కవిత్వం మీద రాయలనుకొన్నాను.(కొద్దిగా సాహసమే నా స్థాయికి) ‘పాండవపురం’ నవల గురించి రాద్దామనుకొని రాయలేక పోయాను. అయితే డిశంబర్ లో ఇంకా 25 రోజులు ఉన్నాయి నా కోసం. ఇంతకు ముందు కవిసంగమంలో ఏవో పిచ్చి కవితలు కెలుకుతుండే దాన్ని. 2014లో వాటి జోలికి పోలేదు. మొదటి లేఖినితో అవస్థ పడ్డా, తరువాత గూగుల్ ఇన్ పుట్స్ చాలా ఉపకరించాయి. ఇప్పుడు చాలా స్పీడ్ గా టైప్ చేయగలుగుతున్నాను.

నా సాహితీ వ్యాసాంగం కోసం నేను త్యాగం చేసినవి కొన్ని ఉన్నాయి. టీవి చూడటం పూర్తిగా మానేశాను. సినిమాలు అసలే మానేశాను. బయట ఊళ్ళు వెళ్ళటం తగ్గించేశాను. ఇవి త్యాగాలు అనకూడదు. ఒక్కోసారి ఒక్కో విషయం ప్రయారిటీలోకి వస్తుంది. ప్రస్తుతానికి మిగతా అన్ని విషయాలను ఈ చదవటం, రాయటం డామినేట్ చేశాయి. కానీ ఈ పిచ్చిలో పడి నేను కొన్ని చేయాల్సినవి కూడా చేయడం లేదు. ఉదాహరణకు వాకింగ్ మానేశాను. న్యూస్ పేపర్ కూడా అరుదుగా చూస్తున్నాను. (పర్వాలేదు. నా చుట్టు పక్కల చాలా న్యూస్ పేపర్స్ మనుషుల రూపంలో నడుస్తున్నాయి 🙂 )

నా వ్యాసాలు, కధలు ప్రచురించిన అఫ్సర్, కల్పన, వసంత లక్ష్మి, గుడిపాటి, పూడూరి రాజిరెడ్డి, మెహర్, హేమలత, కొండవీటి సత్యవతి, రవి వీరెల్లి, ఈ మాట మాధవ్… ఇంకా ప్రజాసాహితీ , అరుణతార, మాతృక పత్రిక, ప్రజాపంధా, తెలుగు వెలుగు, ఆంధ్ర జ్యోతి, సాక్షి పత్రికల ఎడిటర్స్ అందరికీ మప్పిదాలు.

కధలు

1. చావుదేవర (పాల పిట్ట, జనవరి 2014)

2. నమూనా బొమ్మ (తెలుగు వెలుగు, మార్చి 2014)

3. పీచు మిఠాయి రంగు రిబ్బను పిల్ల (సాక్షి, మే 2014 )

4. చూపు (కినిగే, జూన్ 2014)

వ్యాసాలు

1. ప్రగతిశీలా మహిళాసంఘం ప్రస్థానం (ఆంధ్రజ్యోతి)

2. 498ఏ దుర్వినియోగం – వెర్రి ప్రచారం – వాస్తవాలు (నా బ్లాగ్)

3. భూమి – స్త్రీలు (మాతృక)

4. నేటి సమాజంలో మహిళల సమస్యలు – సవాళ్ళు (నా బ్లాగ్)

5. జలజల కురిసి తడిపే దళిత కధలు – పొయ్యిగడ్డ కధలు పరిచయం (సారంగ)

6. కాలానికి ముందున్న కధలు (ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి)

కధల పరిచయాలు

1. పేద బతుకుల గుడి గుడి గుంజం ఆట – ఆర్ వస్తుంధరాదేవి ‘ఇంతేలే నిరుపేదల బ్రతుకులు’ కధా పరిచయం (విహంగ)

పుస్తక పరిచయాలు

1. శతాబ్ధి కాలంలో భూమి పరిణామక్రమం “భూచక్రం” నవల (ఈ మాట)

2. ముజఫర్ నగర్ లో ఏమి జరిగింది – వాస్తవ కళ్ళద్దాల పరిశీలన – ‘నిషిద్ధ మేఘాలు’ పుస్తక పరిచయం (విహంగ)

3. తెగిపడ్డ ఆ చెయ్యి మొలుస్తూనే ఉంటుంది – ‘తెగిబడ్డ ఆ చెయ్యి’ పుస్తక పరిచయం (ఆంధ్ర జ్యోతి, కినిగే)

4. ఇతని ఆగ్రహానికి ఒక ధర్మం ఉంది. ఈ యుద్ధానికి ఒక అనివార్యత ఉంది – ‘నా పొగరు మిమ్మల్ని బాధించిందా, అయితే సంతోషం’ పుస్తక పరిచయం (కినిగే)

భూమిక కాలం

1. సగాలు రెండూ సమానమేనా

2. అస్తిత్వం – ఆక్రందన

3. పునర్నిర్మాణం

4. జయహో పల్లె వెలుగు

5. అల్లూరయ్య మైసూర్ పాక్

6. ఏమీ చేయలేమా?

7. ఆ ఫోటో

8. అదృశ్య వత్తిడి

నాతో నేను

1. శిధిలశకలం

2. ప్రసన్న కోసం డిక్షనరీ

3. ఆరైపీలకు నోచుకోని చావులు

4. స్థితప్రజ్న విప్లవకారుడు

5. వృద్ధ వృక్షాలు

6. షాలినీకి నేను ఫ్రెండ్ ను కాను.