ట్యాగులు

,

1015221_550326365028950_975033560_oదృశ్యం ఒకటి:

1988.

అప్పటికి గంట నుండి అక్కడ కూర్చొని వున్నాను. ఎదురుగా గోడకు డా.రామనాధం ఫోటో తగిలించి ఉంది. ఒంగోల్లో పార్ట్ టైమ్ వుద్యోగం వచ్చింది అని చెప్పగానే ‘తాత బిల్డింగ్ లో ఫలానా ఆయనను కలువు.’ అని చెప్పారు. ‘కూర్చోండి. వస్తారు’ పబ్లిక్ టెలిఫోన్ ముందు కూర్చొని వున్న బాబు చెప్పాడు. నా సొంత ఊరైనా అప్పుడు నేను కొత్త కళ్ళతో, కొత్త నీరు వచ్చిన ఏరు లాగా తుళ్ళిపడుతున్నాను. అప్పటి వరకు నాకు తెలిసిన వ్యక్తులను కూడా నూతన కోణాల్లో పరికిస్తున్నాను. మంచితనానికి విస్తృత అర్ధం చెప్పే కొంగొత్త వ్యక్తిత్వాలు నాకు పరిచయం అవుతున్న సమయం అది. ఒక గంట కూర్చున్న తరవాత వచ్చాడు ఆ ఫలానా. ‘గోవర్ధన్ చెప్పాడు మిమ్మల్ని కలవమని…’ చిరునవ్వుతో ఉన్న ఆ మనిషికితో చెప్పాను. ఒక గంట మాట్లాడి పిడియస్సూ ఆఫీసు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఏముందక్కడ ఒక చింకి చాప. నాలుగు మసిబారిన గిన్నెలు. ఒక పాత స్టవ్వు. అల్మరాలో మాత్రం లెనిన్, మావో నవ్వుతున్నారు నాకాహ్వానం పలుకుతూ.

దృశ్యం రెండు.

1991:

నెల్లూరు నుండి ఒంగోలు బదిలీ. ఉన్న నాలుగు గోతాల సామాన్ని, మమ్మల్ని ఒంగోలు పిడియస్సు ఆఫీసులో పడేసి వెళ్ళిపోయాడు పెరుమాళ్ళన్న. నెలరోజులు ఆఫీసులో మకాం.

‘ఇల్లు కావాలి.’

‘ఏమి కులం?’

ఇద్దరిలో ఒకరిదైనా ‘ఆ కులమైతే’ అబ్బో కష్టమే!

చివరకు సర్వేయర్ ‘అడ్వర్డు’ గారు ఇల్లు ఇచ్చారు. వరుసగా మూడు గదుల చలువ పెంకుల ఇల్లు. టాప్ లేని పెద్ద బాత్రూమ్. అందులో పెద్ద సిమెంట్ తొట్టి. షేర్డ్ లెట్రిన్. నవారు మంచం. ఇల్లంతా ఖాళీ. సావిత్రమ్మగారి ఆప్యాయత. మనసంతా చల్లన. ఆ చలవదనంలో ఎవరిదో జ్ఞాపకం అంతర్వాహినిగా … ఆ ‘ఫలానా’ ఆయన డొక్కు సైకులుతో సహా.

దృశ్యం మూడు

1992:

దిగులు, దుఃఖం. ఏమయ్యిందో తెలియదు. సహచరుడికి ప్రాణం బాగో లేదు. జ్వరం తగ్గటం లేదు. ఆపుకోలేని బెంగ బుగ్గల మీదా జారిపడిన ఆ నాటి కన్నీళ్ళకూ ఒకరి జ్ఞాపకం అంటి పెట్టుకొని ఉంది.  సాయంకాలం నాలుగైనా అన్నానికి ఇంటికి వెళ్ళకుండా సైలైన్ అయ్యిందాకా కూర్చొని వెళ్ళిన ‘ఫలానా ఆయన’ జ్ఞాపకం.

దృశ్యం నాలుగు

1993.

ఎపిసియల్సి జిల్లా మహాసభలు. బాల గోపాల్. కనకయ్య. ఇంకా ఎవరో? వసంత లక్ష్మీ కూడా వచ్చినట్లు గుర్తు. ‘రమ జిల్లా కమిటీలో ఉండాల్సిందే’ వాదిస్తున్నాడెవరితోనో. జ్ఞాపకం అంతా ‘ఫలానానే’.

దృశ్యం ఐదు.

1996

ఈతముక్కల నుండి కొత్త పట్నం మీదుగా ఒంగోలు రైల్వే స్టేషన్ కి సహచరుడి స్కూటర్ మీద. ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన పిల్లలు. రైలు వెళ్ళిపోతుంది. డ్రైవర్ ని చూసి ఆపమని చెయ్యి ఎత్తాను. ఆపేశాడు. రైలు ఎక్కాక గుర్తుకు వచ్చింది టికెట్ తీసుకోలేదని. బిక్కు బిక్కు మంటూ ఆ గంట గడిపి చీరాల రైల్వే షెడ్ల మీదగా స్టేషన్ దొంగ చాటుగా దాటి సెంటర్ కి వెళితే అక్కడ మైకులు లేని స్టేజ్ మీద (మైక్ పర్మిషన్ ఇవ్వలేదు) బాలగోపాల్, హరగోపాల్ ఇంకా ఎవరో కూడా అరిచి అరిచి మాట్లాడుతున్నారు. నన్నక్కడకు రప్పించిన ‘ఫలానా’ కూడా ఉన్నాడు స్టేజ్ మీద.

దృశ్యం ఆరు

1998

తాతా బిల్డింగ్ లో చివరి గది తలుపులు వేసి ఉంది. గర్రు గర్రున తిరుగున్న ఫాన్. కిక్కిరిసిన జిల్లా సమావేశం. ఉక్కిరిసి పోతున్న చెమటలు. ఆవిరులు చిందుతున్న చర్చలు. కొత్త సెక్రెటరీ ఆవేశంగా ఉన్నాడు. (మళ్ళా ఆయన నాకు కనబడలేదు. ఎవరు అతని గురించి చెప్పటం లేదు) మధ్యలో వెళ్ళి అందరికీ తనే టీలు పట్టించుకొచ్చాడు. అధ్యక్షుడు ‘ఫలానా’ మధ్య మధ్యలో కునికిపాట్లు పడుతున్నాడు వయసు రీత్యా.

దృశ్యం ఏడు

1998

ఒంగోలు మహిళామండలి. లోపలికి వెళ్ళే వాళ్ళను ఆపి పోలీసులు ఫోటోలు తీస్తున్నారు. చాలా మంది మీటింగ్ విందామని వచ్చి ఈ హడావుడికి రాకుండా వెళ్ళిపోతున్నారు. మొహం గంటు పెట్టుకొని ‘మీటింగ్ ఫైల్ చెయ్యాలనేనమ్మ’ అంటున్నాడు ‘ఫలానా’.

దృశ్యం ఎనిమిది

2005

‘నల్లమలై లో ఎంకౌంటర్ జరిగింది వచ్చి శవాలను తీసుకొనే వెళ్ళండి.’ ఎస్సై ఇంటి మెట్ల మీద నిలబడి అడుగుతున్నాడు. అప్పటికి చాలా సార్లు తిట్టి ఇక ఏమి అనలేక ‘మాకు తెలియదు.’ ముక్తసరి సమాధానం చెప్పాను. గుట్టలుగా కుళ్ళబెట్టి తెచ్చిన శవాలు ఒంగోలు మార్చురీలో. అందర్నీ రమ్మని పిలుస్తూ .. వస్తే ‘మీ సంగతి చెబుతాం.’ శాడిస్టిక్ ఎక్స్ రే కళ్ళ బెదిరింపులు. ఇంట్లో నుండి కదలకుండా కూర్చొని టివి పెట్టుకొంటే సిటీ కేబుల్ లో ఒక మహిళ ‘జోహర్ అమరజీవులకు. కొనసాగిస్తాం అమర జీవుల ఆశయాలను!’ చనిపోయిన వారి పేద తల్లిదండ్రులు వెనుక ఏడుస్తుంటే వంటరి రోడ్ల మీద, వంటరిగా, వంటరి నినాదాలు యిస్తూ … హృదయాన్ని ఎవరో తోడేస్తున్నారు. ఆమెకు తోడుగా బయటకు రాలేని నా భద్ర జీవితపు అడుగులు ఎవరి కోసమో వెదికాయి. పోలీసులు ఇంటి ముందు టివియస్ లో బాంబ్ పెట్టి పేలిస్తే అనారోగ్యంతో వున్న భార్య, మెంటల్లీ రిటార్డెడ్ కొడుకుని ఎక్కడో దాచి తనెక్కడో తలదాచుకొన్న ‘ఫలానా ఆయన’.

దృశ్యం తొమ్మిది

2006

మహిళా సంఘం మీటింగ్. హాలు కావాలి కొద్దిగా చవక్కా. ‘ఫలానా ఆయన’ ఉన్నాడా? పదింటికి హాలు దగ్గరకు వెళ్ళేసరికి నీరసంగా బయట బెంచి మీద కూర్చొని ఉన్నాడు. ‘ మాట్లాడానమ్మ. మనకు తక్కువకే ఇస్తానన్నాడు. ఎవరనుకొన్నావు? మనకు చానా కావాల్సినోడు. నాకీ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. షుగర్ లెవెల్స్ పెరిగాయి. కాళ్ళకు గాంగ్రీన్ వచ్చింది.’

దృశ్యం పది.

2011

‘ఫలానా ఆయన్ని’ కలవాలి. ఇంకా తాతా బిల్డింగ్స్ కి వస్తున్నాడా?’

బయట కుర్చీ వేసుకొని వచ్చే పోయే వాళ్ళను చూస్తున్నట్లు ఉన్నాడు. కొంత మంది ఆగి పలకరించి పోతున్నారు.

‘నీ పళ్ళు అలా అయిపోయాయి అన్న. కట్టించుకో!’

‘వెళ్ళాలమ్మ. రాఘవ డాక్టరు ఎవరనుకొన్నావు? మనకు చానా కావాల్సినోడు. మెట్లు ఎక్కలేక ఆలోచిస్తున్నాను. కాస్త తగ్గాక వెళతాను.’

‘సైకిలు తొక్కలేక పోతున్నానమ్మ. మీరిచ్చిన టివియస్ మీదే శ్రీను రోజూ దింపి తీసుకొని వెళుతున్నాడు.’

……

2015

ఇక దృశ్యాలు లేవు. జ్ఞాపకాలు, కాలాలే. మిగిలిన జీవితం పొడుగునా ఆ వాసనలే. సంఘటనలలో, సంభాషణలలో, స్థలాల్లో, నవ్వుల్లో, విజయాల్లో, మెదడు పొరల్లో, ఆలోచనల దొంతరలలో .. ఉన్నట్లుండి నీ ఊసే గుర్తుకు వచ్చి ఒక క్షణం పరధ్యానం. తరువాత క్షణం నిశ్శభ్ధం. తడికన్నులతో తమాయింపు. మనసు పుస్తకంలో ఎక్కిన మరో ముగిసిన లెక్క. చిహ్నించబడ్డ చెరిగిపోని చిత్రం. కుంభవృష్టిలో తడిచి కూలిపోయిన మేఘాలు.
తొట్రు పడుతున్న గొంతుని సవరించుకొని అడుగుతున్నాను ‘ఈ రోజు నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావ్ గాండ్ల వెంకట్రావ్ అన్న!’