ట్యాగులు

cover pages 001 copy(1)

మాతృక ప్రగతిశీల మహిళా సంఘం అధికార పత్రికగా 1991 నుండి దాదాపు 25 సంవత్సరాల నాడు తన ప్రస్థానం ప్రారంభించింది. ప్రగతిశీల మహిళా వుద్యమ నిర్మాణంలో మహిళా కార్యకర్తలకు ‘కరదీపిక’గా వుపయోగపడాలనే ఆకాంక్షతో ఈ పత్రికను ప్రారంభించటం జరిగింది. పత్రిక యాజమాన్యం అయిన ప్రతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం – శ్రామిక మహిళా వుద్యమ పునాదిగా అన్ని పీడిత, తాడిత వర్గాల మహిళల సమస్యలపై వ్యాసాలు, వ్యాఖ్యలు, కధలు, కవితలు, పాటలు ప్రచురించింది. ప్రధానంగా అణచబడిన, అన్నార్తుల, వ్యధా భరిత, బాధాతప్త మహిళల వేదనాభరిత అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అత్యధికంగా మహిళలు రచనలు సాగించిన పత్రిక యిది. ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, కుటుంబ రంగాలలో మహిళలు ఎదుర్కొనే దోపిడీ, పీడన, వివక్షకు మూల కారణమైన ‘లైంగిక శ్రమ విభజన’ను ఎత్తి చూపింది. రాజకీయ రంగంలో స్త్రీల సమానత్వానికి పెను ఆటంకంగా దాపురించిన పితృస్వామ్యపు అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ఎండగట్టింది. దోపిడీ, పీడన, వివక్ష, అసమానత, అంటరానితనాలు లేని గౌరవప్రదమైన సమానత్వ ప్రాతిపాదికగల సమాజం కోసం, స్త్రీ విముక్తి కోసం, సమ సమాజం కోసం ఆహుతైన వీరనారుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేందుకు ‘వీలునామా’ అనే శీర్షిక ద్వారా ఈ దేశ అమరవనితల ధీర, వీర గాధలను ప్రచురించింది. ప్రపంచదేశాల అమరుల ధీరోదాత్త, త్యాగమయ చరిత్రను ‘వింటినారి’ వంటి శీర్షిక ద్వారా మహిళాలోకానికి అందించింది. ఆదివాసీ, దళిత, మైనారిటీ తదితర పీడిత మహిళల వుత్తేజకర పోరాట చరిత్రలను రికార్డు చేయటం తన బాధ్యతగా భావించిన మాతృక ‘చరిత్ర పుటల్లో…’ అనే శీర్షిక ద్వారా వెల్లడించింది. మాతృక చేపట్టిన అంశాల్లో యివి మచ్చుకు కొన్ని మాత్రమే.

ప్రగతిశీల, విప్లవ, మహిళా రచయిత్రులు, కవయిత్రులు భాగస్వామ్యంతో పాటు యితర ప్రగతిశీల రచయితలు, మేధావులు, మిత్రుల క్రియాశీల ఆత్మీయ మద్దతు, ఆత్మీయ సహకారంతో పత్రిక నడిచింది. దానికి తోడు తన పాఠకులు, అభిమానులు, మహిళావుద్యమకారుల నుండి తన స్వంత రచయిత్రులను అభివృద్ధి చేసుకునేందుకు సంపాదక వర్గం పలు దఫాలు ‘మాతృక రచయిత్రుల వర్క్ షాపులను’ నిర్వహించింది. అన్నింటితో పాటే విద్య, విజ్ఞాన రంగాల్లో వెనక్కు నెట్టబడిన మహిళా యాక్టివిష్టులలో ఏదో ఒక రూపంలో తమ పత్రికకు రాయాలనే అభిలాషను ఏర్పరచగల్గింది. ఇంకా సాధించవలసింది ముందెంతో ఉన్నది. ఆ లక్ష్యం సాధించే మార్గంలో వుండగా మాతృక నిర్వహణలో అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం, భరించరాని జాప్యం అనే అనారోగ్య ధోరణులు ముందుకు వచ్చాయి. అందువలన వచ్చిన విరామానికి చింతిస్తున్నాం.

సకల రంగాలలో స్త్రీల అంశాన్ని ప్రతిబింబించేలా వుండాలని భావించిన మాతృక సంపాదక వర్గం యిక ముందు “మహిళల గొంతుక మాతృక అనే పేరుతో మీ ముందుకు వస్తున్నది. ఇది గతంలో ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం అధికార పత్రిక ‘మాతృక’కు వారసురాలే.

సమాజంలో అందరూ – అలాగే పురుషులూ చదువుకునేందుకు, రచనలు చేసేందుకు వస్తున్న పత్రికలు చాలానే వున్నాయి. వాటికి కొదవ లేదు. మహిళల ప్రయోజనాలు, మహిళా విముక్తి పట్ల ఆర్తితో, జండర్ భావనతో ప్రచురించే పత్రికలు తక్కువే వున్నాయి. కనుక దాదాపు మహిళలే రచయిత్రులుగా, మహిళలచే, మహిళల కోసం మీ ముందుకు వస్తున్నది ఈ పత్రిక. ఈ పత్రిక ‘మీ మాతృక’, ‘మా మాతృక’ ‘మనందరి మాతృక’. అదే మహిళా గళం .. యికపై ‘మహిళా గొంతుక మాతృక’ గా దర్శనమిస్తుంది! దీనిని యధాప్రకారం ఆదరించి, వుపయోగించుకుంటూ, భాగస్వాములవుతూ పత్రికను మెరుగు పర్చుకోవటంలో మీ వంతు పాత్ర వహిస్తూ లక్ష్య సాధనకు మహిళలు, మహిళా ఉద్యమకారులు, ప్రగతిశీల మేధావులు, మిత్రులు అందరూ సహకరిస్తారనీ, సహకరించాలని కోరుకుంటూ….

ప్రగతిశీల సాహితీ వందనాలతో

మీ సంపాదక వర్గం

మహిళా గొంతుక

మాతృక

(మాతృక పత్రికలో సంపాదక వర్గం రాసిన విజ్ఞప్తి)