ట్యాగులు

, , ,

EEjbeKqv_400x400నేను నా పుస్తకాల్లో ఎప్పుడూ నిజాన్ని మాట్లాడలేదా?

ఇప్పుడు నువ్వు నన్ను అబద్దాలకోరు లాగా చూస్తున్నావు కదా!

ఆ రకంగా నన్ను నువ్వు చూడవద్దు.

నన్ను వదలనూ వద్దు.

నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

నన్ను తగలపెట్టు!

1933లో నాజీలు పుస్తకాల మీద సెన్సార్ షిప్ విధించి, పుస్తకాలను కాల్చివేసినపుడు .. కవి, నాటక రచయిత బెర్టోల్ట్ బ్రీచ్ ఈ వాక్యాలు రాశాడు. కల్లోల సమాయాలలో జీవిస్తూ అతను కోపంతో తనను కాల్చమని కోరాడు. దశాబ్ధాల తరువాత, ఇంకొక విషాదాంతంలో రచయిత పెరుమాళ్ మురుగన్ అన్నాడు కదా “పెరుమాళ్ మురుగన్ మరణించాడు. అతను దేవుడు కాదు. మళ్ళీ అవతారమెత్తడు. అసలు అవతారాలను నమ్మడు. ఇప్పటి నుండి పెరుమాళ్ మురుగన్ ఒక టీచరుగానే బతుకుతాడు.”

మురుగన్ కుల, హిందూ గ్రూపుల చేత గాయపడిన తరువాత ఇచ్చిన బహిరంగ ప్రకటన ఇది. 2010లో అతను రాసిన మదో రూబగన్ పుస్తకంలో అతని సొంత పట్టణం తమిళనాడులోని తిరుచెంగోడ్ ఒక శతాభ్ధం క్రితం ఎలా వుండేదో వర్ణించబడింది. పుస్తకం ప్రచురించిన నాలుగు సంవత్సరాల తరువాత ఇప్పుడు కధలో ముఖ్య అంశంగా ఉన్న సెక్సువల్ మత ప్రక్రియలు ఈ పట్టణాన్ని, దేవాలయాన్ని, ఇక్కడ స్త్రీలను అవమానించాయని అంటూ స్థానిక గ్రూపులు ఆందోళనలను చేస్తున్నాయి. పుస్తక ప్రతులను కాల్చారు. అతన్ని అరెస్టు చేయమని ఒక పిటీషన్ దాఖలు అయ్యింది.

హేతురహిత మౌనం

ఈ హింస ముందు రాజ్యాంగ యంత్రాంగము, రాజకీయ పార్టీలు కారణం లేని మౌనాన్ని పాటించాయి. పెరుమాళ్ మురుగన్ హక్కులు కాపాడలేని జిల్లా యంత్రాంగం ఈ కుల మత శక్తులతో ఒక ‘శాంతి సమావేశాన్ని’ నిర్వహించింది. ఈ యంత్రాగం అతని చేత బేషరతు క్షమాపణలు చెప్పించి, ఆ పుస్తకం నుండి కొన్ని భాగాల తొలగింపుకి ఒప్పించి, ఇంకా అమ్మని పుస్తకాలను వెనక్కి తీసుకొనే ఒప్పందం చేయించి, ఇంకెప్పుడూ ప్రజల మనోభావాలను గాయపరిచే వివాదస్పద విషయాలు రాయనని ప్రమాణం చేయించుకొని వదిలి పెట్టింది.

రచయిత మాటలను బలవంతంగా ఉపసంహరింపచేయటం .. అతను చేసిన ఊహాజనిత ప్రయోగానికి అతని చేత క్షమాపణ చెప్పించడం .. రచయితగా అతని గౌరవాన్ని లాగేసుకోవడం అనే విషయాలు దౌర్జన్యం, ఆమోదించలేని హింస క్రిందకు వస్తాయి. సరిగ్గా ఇలాంటి హింసే మురుగన్ మీద రుద్దబడింది.

ఏ సమాజమైతే కధా రచయితల మీద ఆజమాయిషీ చేసి నోరు మూయిస్తుందో ఆ సమాజం తప్పకుండా సూక్ష్మమైన నైతిక, రాజకీయ ఆత్మ విమర్శకు గురి కావాల్సిన అవసరం ఉంది. మనం ఒకే రకమైన అపాయకరమైన సాహిత్యానికి మాత్రమే అవకాశం ఇస్తే అది రాజకీయ సేవలో తరిస్తుంది. ఈ సంఘటన వృత్తాంతం కేవలం భావప్రకటనా స్వాతంత్ర్యం గురించి మాత్రమే చెప్పటం లేదు. దీన్ని దౌర్జన్యకరమైన వృత్తాతంగా, కుల మత దురహంకారానికి ఆజ్యం పోసిన సంఘటనగా, రాజ్యం తన పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించటంలో చూపించిన బాధ్యతారాహిత్యంగా చూడాలి.

పుస్తకం అధికారాన్ని ప్రయోగించగలదు, విమర్శించనూ గలదు

ఈ ప్రపంచంలో ఉన్నదంతా పుస్తకంలో ఉందని స్టీఫెన్ అనే కవి అన్నాడు. పుస్తకం మన జ్ఞాపక శక్తిని, మన ఊహలను, మన జ్ఞానాన్ని దాచిపెట్టే ప్రాధమిక సాధనం. అది సిద్దంతాలను తయారు చేస్తుందీ సవాలు చేస్తుందీ .. ఇంకా రాజ్యాన్ని ప్రశ్నిస్తుంది. అన్నిటికంటే మించి అది అధికారాన్ని ప్రయోగించటానికీ విమర్శించటానికీ ఒక సాధనంగా ఉంటుంది. “నిజాన్ని మౌనం చేత భర్తీ చేస్తే ఆ మౌనం ఒక అబద్ధం అవుతుంది.” అని సోవియట్ నుండి వచ్చిన రచయిత ఎవ్గని ఎవ్టుశెంకో రాశారు. రచయిత నోరు మూయించటం అనాగరికం కంటే తక్కువది కాదు. పుస్తకాన్ని కాల్చటమనేది సెన్సార్ షిప్ కి తీవ్రమైన కర్మకాండలాంటి రూపం. ఇది పుస్తకాన్ని, అది తీసుకొచ్చిన భావాల్ని చంపివేసే చర్య. దేన్ని అంగీకరించి ఆమోదించాలో తీర్పునిచ్చే దౌర్జన్యమే ఈ చర్య. భావాలని నిర్మూలించాలని చేసే స్పష్టమైన ప్రయత్నం ఇది. స్వేచ్చాహృదయానికి చావు దెబ్బ. సంభాషణలకు ముగింపు. రాబోతున్న ఉపద్రవానికి సూచన.

1933లో నాజీలు పుస్తక దహనాన్ని జరిపినపుడు ఆ బహిరంగ వేడుకలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళ చర్యలను ఎలా సమర్ధించుకొన్నారు అంటే “కుటుంబానికి గౌరవం దృవీకరించటానికీ”, “జర్మన్ భాషకు తిరిగి గొప్పతనాన్ని ఇవ్వటానికి” అని. ఈ రోజు మురుగన్ పుస్తక దహనం రోజు కూడా ఇలాంటి సమర్ధించుకొనే అరుపులనే వింటున్నాము. “ఆడవాళ్ళు అవమానింప బడ్డారు. కావాలని అతను కుల మనోభావాలను గాయపరిచాడు లేకపోతే అతను జరగని విషయాలు రాశాడు” ఇలాంటివి. ఖండించటానికి కావాల్సిన ఐడియాలు మనకు ఉన్నాయి. ఈ ఐడియాలు ఎలాంటి నైతిక, రాజకీయ ఊహలు లేని మనుషుల చేత సంరక్షించబడుతున్నాయి. ఈ మనుషులకు ఫిక్షన్ అంటే అర్ధం తెలియక విలువలు అనే పేరుతో దాన్ని నాశనం చేస్తున్నారు. ఈ సంకుచిత తాత్పర్యాలు కొనసాగితే … సంక్లిష్టమైన, భావోద్వేగపరమైన, శృంగారపరమైన రాజకీయ ప్రపంచంలో వేళ్లూనికొని ఉన్నగొప్ప తమిళ సాహిత్యం ప్రాచీనత్వంలోకి ప్రయాణం చేయటం నిషేదించబడుతుంది.

కీర్తిశేషులైన ప్రొఫెసర్ పాండన్ గారు ఇలా అన్నారు. “లౌకిక భావం ‘ప్రాపంచిక దృక్పధంగా’ తనకు తాను గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ స్థానికంగా అది ఎలా తీసుకోబడుతుందనే సంగతి మాత్రమే అది ఎంత, ఎలాంటి రాజకీయ పని చేస్తుందో చెబుతుంది.” ఇప్పటికి బయటికి వచ్చిన విషయాలను అర్ధం చేసుకోవటానికి ఈ చర్యను ఇష్టంగా అమలు పరిచిన వాళ్ళను అర్ధం చేసుకోవాలి. ‘హిందు మున్నని’ చుక్కానిగా మూడు కుల సంఘాలు పెరుమాళ్ ను నోరు మూయించటానికి ప్రచారం చేశాయి. హిందూ గ్రూపుల రాజకీయ తరలింపులు, తమిళనాడులో ఎన్నికల పోటీల సందర్భాన్నిదృష్టిలో వుంచుకొని కృత్రిమంగా సృష్టింపబడిన ఈ ఆగ్రహాన్ని అర్ధం చేసుకోవాలి.

తమిళనాడు రాజకీయ చిత్రపటం

తమిళనాడు రాజకీయ చిత్రపటం అనేక చారిత్రాత్మక శక్తుల కలయికతో ఆసక్తి దాయకమైనది. చాలా భాగాల్లో ఇది మతపరమైన పునాది కలది. ఇక్కడ కుల పట్టింపులతో బ్రాహ్మణ సాంప్రదాయాలు ముఖ్యమైన భూమిక వహిస్తాయి. అదే సమయంలో ఈ ప్రాంతం ద్రావిడ ఉద్యమంతో అట్టుడికి పోయిన సమాజం కూడా. ఈ ద్రావిడ ఉద్యమ ఉద్దేశ్యాలు హేతువాదం, నాస్తికత్వం, యాంటీ బ్రాహ్మణిజం  మీద ఆధారపడి ఉంటాయి. ఈ రాష్ట్రం ముఖ్యంగా రెండు రాజకీయ పార్టీల చేత పరిపాలించబడింది. ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం, ద్రవిడ మున్నేటి కజగం. ఈ రెండు పార్టీలు హేతువాద, నాస్తిక సాంప్రదాయాల నుండి వచ్చినా, ఏళ్ళు గడిచేకొద్ది ఇవి ఎన్నికల్లో విజయాల కోసం సిద్దాంతపరంగా రాజీ పడ్డాయి. రెండు పార్టీలు తరచుగా స్వల్పకాల ప్రయోజనాల కోసం చట్టపరమైన ఏలుబడిని వదులుకొన్నాయి.

ఒకప్పుడు వాళ్ళు చాటుకొన్న హేతువాదం, నాస్తికవాదం, లౌకికత్వం నుండి తిరోగమనం చెందటం వారి సిద్దాంతపరమైన పెద్ద ఓటమి. తమిళ లౌకిక వాదం గురించి మాట్లాడినా అన్నాదొరై ద్రావిడ రాజకీయాలు క్రమంగా కుల రాజకీయాలుగా మారి 1979ల నుండి ఎన్నికల విజయానికి ప్రాధమిక విధానంగా మారాయి. కాలం గడిచేకొద్ది కుల ఆధారిత రాజకీయాలు, పాలన – ప్రభుత్వ పని విధానంలో వ్యవస్థీకృతం అయ్యాయి. ఈ వాతావరణంలో 1990ల నుండి హిందు మున్నని  పార్టీ పైకి ఎగబాకడం మొదలైయ్యింది. ఆరెస్సెస్ తో బాటు ‘మున్నని’  తమిళనాడులో హిందూ జాతీయ మతపరమైన పార్టీగా తయారయ్యి రాజకీయ, మతపరమైన, నైతిక పోలీసింగ్ పాత్రను ఉత్తరభారతదేశంలో విహెచ్ పి లాగా పోషిస్తుంది. అయితే గత దశాభ్ధంగా హిందు విభాగం తమిళనాడులో ఒక అర్ధవంతమైన స్థానం సృష్టించుకోవటంలో విఫలం అయ్యింది. పెరుమాళ్ మురుగన్ సంఘటనతో ప్రమాదకరమైన ద్వేషం, మత వైరము, సిద్ధాంతపరమైన ఓటమి కూతకొచ్చాయి. కుల యుద్దాలు, దుందుడుకు హిందూ జాతీయత రెండూ మొదటి సారి చేతులు కలిపాయి. తమిళనాడుకు అపరిచతమైన రైట్ వింగ్ హిందూయిజం పెరిగి సహజమై పోయింది. భాషాకారుల, నైతిక పోలీసుల, మత తిరుగుబాటుదారుల యింకా బహుతలల అల్లరిమూకల వేషాలతో లిబరల్ స్వేచ్చ ప్రమాదంలో పడింది. రక్షించాల్సిన రాజ్యం మూగబోయింది. పెరుమాళ్ మురుగన్ చట్టపరమైన రక్షించబడే హక్కు కాల రాయబడింది. అదే సమయంలో గొప్ప ఆసక్తితో ప్రభుత్వం కొన్ని చట్టాలను పాస్ చేసింది. (బట్టల ఆంక్షలను తొలిగిస్తూ బహిరంగ ప్రదేశాలలో ప్రవేశం హక్కును కల్పిస్తూ చట్టం). అవి కేవలం తమ ఓటు బాంకును పెంచుకోవటానికే. రాష్ట్ర ప్రభుత్వం ఇక చట్టపరంగా పరిపాలించదు. ప్రాధమిక హక్కులను ఫణంగా పెట్టి ఓట్ల దాహంతో పరిపాలిస్తుంది.

సమాజపరంగా మనమిప్పుడు సిగ్గుతో తలవంచుకొన్నాము. నైతికంగా దివాలు తీసిన రాజకీయ నాయకత్వంలోకి వచ్చాము. అది మన మేధోపరమైన భవిష్యత్తును, సాహిత్య గతాన్ని తాకట్టు పెడుతుంది. మన వాదనలు కుల వైరాలలో రంగు కోల్పోతున్నాయి. మన తిరుగుబాటు అరాజకీయం అవుతుంది. ఈ దుర్దినాన మనకి – చరిత్ర లాంగ్ మార్చ్ లో నిషేదకులు, గణాచారులు, సంకుచితమైన మనుషులు ఎప్పుడూ ఓడిపోయారు అనే నిజం ఒక్కటే ఉపశమనాన్ని ఇస్తుంది. మూగబోయిన ఆ రచయిత ఏమీ రాయకపోయినా రచయితగానే మిగిలిపోతాడు అనే ఆశ మనకు ఓదార్పునిస్తుంది. ఈ విషయాన్నిరచయిత చావుకి స్తోత్రంగా చేయొద్దు. దీన్ని మన సంఘటిత పిలుపుగా మార్చుకొందాం.

( వ్యాసకర్త సుచిత్రా విజయన్ బారిస్టర్, రచయిత్రి, రాజకీయ సిద్దాంతవేత్త.)

అనువాదం: రమాసుందరి