ట్యాగులు

IMG_9684 సుక్కా సుక్కా చెమట సుక్కా! ఏడేడికి బోతివే?

మట్టి పుట్టిన కాడి నుండి నీ నొసల నే రాలి

నేలలో యింకి మొక్కనై లేసి యిత్తునై కాసి

నీ కంచం నిండా బువ్వ రూపు కట్టక పోతినే!

నీ ముక్కుబేసరంతా బూవికి నిను మారాణిని సేయక పోతినే!

IMG_9690 కొత్త రాజధాని ప్రాంతంగా చెప్పబడుతున్న గ్రామాల్లో చెమట చుక్కలు రోదిస్తున్నాయి. శ్రమ శక్తులు విలపిస్తున్నాయి. ఎండకు వళ్ళిచ్చి, నేలకు నడుమొంచి అహోరాత్రులు చేసిన కష్టం వల్లకాట్లో కలిసి పోతోంది. ఆకాశానికి, భూమిని అనుసంధానం చేసిన చేతులు నిర్వీర్యం అవబోతున్నాయి.

ఇది కుట్ర. నేల చుట్టూ అల్లుకొన్న కలలను ధ్వంసం చేసే కుట్ర. రైతుకూ, రైతుకూలికీ భూమితో ఉన్న పేగుబంధాన్ని మొరటు, మొద్దు కత్తితో నరికి వేసే కుట్ర. ‘అభివృద్ధి’ అనే బ్రహ్మపదార్ధాన్నికొంగ జపం చేస్తూ విధ్వంసానికి సమాయత్తం చేస్తున్న కుట్ర. పచ్చని పంట పొలాలను సిమెంటు గట్టిదనాల  క్రింద తొక్కి వేసే కుట్ర. గుప్పెడు మనుషుల సంపద పెంపుదలకు సమస్త ప్రజల సామూహిక జీవన భద్రతను ధ్వంసం చేసే కుట్ర. ఇది ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాయని చెప్పే పత్రికలు, అధికార యంత్రాంగం, పోలీసులు అనే మూడు ఎస్టేటులను ఊతంగా పట్టుకొని అధికార రాజకీయ వ్యవస్థ రైతు గుండె మీద ఎగిరి తన్నిన కుట్ర.

ఇది వ్యాపారం. రైతుల జీవితాలను విదేశీ గణనాధులకు ఫణంగా పెట్టి సాగిస్తున్న భూవ్యాపారం. భూమిమీద హక్కు లేకపోయినా దాన్ని ఆశ్రయించి జీవిస్తున్నవేలాది రైతుకూలీల జుట్టు పట్టి బయటకు ఈడ్చి చేస్తున్న వికటాట్టహాసం. ఇది ఇక్కడ చెమటోడ్చి బతుకులను నిర్మించుకొన్న కూలీ అక్కలను నేలకు తొక్కి ఆడుతున్న వికృత కేళి. కుటుంబ, ఆర్ధిక, సాంఘీక, సామాజిక భద్రతతో విలసిల్లుతున్న జీవన నిర్మాణాలను, వారు నిర్మించదలిచిన కాంక్రీటు నిర్మాణాల క్రింద శిధిలం చేస్తోన్న హృదయరహిత వాణిజ్య తంత్రం.   IMG_9695 సుక్కా, సుక్కా సెమట సుక్కా ఎందుకేడుస్తుంటివే?

మట్టిలో పుట్టి, అక్కడే పెరిగి

భూసారం పెంచే ఎరబామూలాగా

నీ సత్తువ చిందించి భూసత్తువ పెంచినా

చేల్లోంచి మల్లేసిన బరిగొడ్డు మల్లే

అడ్డొచ్చినావంటూ నిను వెల్లగొడతారా!

“పాతికేళ్ళ క్రితమే కృష్ణా జిల్లా నుండి ఇక్కడకు వచ్చి ఉంటున్నాము. వంద రూపాల కోసం అవసరం అయితే మూడూళ్ళు నడిచెళ్ళి అయినా కూలి పని చేస్తాను. ఉంటానికి ఇల్లు సంపాదించుకోక పోయినా తిండికి లోటు లేకుండా గడిచి పోయింది. లక్ష రూపాయల కట్నంతో పిల పెళ్లి చేశాను. అబ్బాయి తాపీ పనికి వెళతాడు. ఈ ఎండా కాలం నుండి పంటలు వేయొద్దని అంటున్నారు. ఇప్పుడు కడుపు పట్టుకొని ఏడకు బోవాలా?” ఉక్రోషం నిండిన గొంతుతో అంది కడవపొల్లు వెంకటేశ్వరమ్మ. ఫోటోకి నవ్వమంటే నవ్వినట్లు చేసి, ఫోటో అయిపోయాక కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది వెంకటేశ్వరమ్మ.

“కొత్త రాజధాని నిర్మాణంలో మీకు పనులు ఇస్తారంటా కదా?”

“ఆ! ఇంక వాళ్ళ దొడ్లు కడగాలి మేము. అవే మాకు దొరక బోతున్న పనులు. ఈపెడను చూడండి. ఈమెకు డెబ్భై ఐదేళ్ళు. ఇప్పటికీ పనికి పోతుంది. ఈమెకు ఏం పని ఇవ్వబోతున్నారు?” రత్తమ్మను ముందుకు తోస్తూ అన్నది మంగమ్మ. సన్నగా చువ్వలాగా ఉన్న రత్తమ్మ “ఈ నాటికి ఒక్క రోజు కూడా మధ్యాన్నం మంచెమెక్కి ఎరగను. ఆ రకంగా చేస్తేనే కుటుంబరం ఎక్కి వచ్చింది.” కాయ కష్టం ఆనవాళ్ళను మొహంలో మోస్తుంది ఆమె.

“భూమి లేని వాళ్ళకు 2500 ఇస్తాడంటా కదా?” ఈ ప్రశ్నకు ఆగ్రహావేశాలు మిన్నంటాయి.

“మా కడుపుకాడిది లాక్కొని మాకేంటి వాడిచ్చేది? 2500 దేనికి వస్తాయి? ఈ కూరగాయ తోటల్ని రాజధానిగా మార్చిన తరువాత కూరగాయల ధరలెంత ఉంటాయి?

ఏమి మాట్లాడక ఉన్న లక్ష్మిని కదిలిస్తే “మాకున్నది తొంభై సెంట్లు. ముప్పై సెంట్లు ఆడపిల్లకు ఇచ్చాం. ఇప్పటి దాకా కౌలు డబ్బులో, గింజలో వాళ్ళకు పంపేవాళ్ళం. ఈ మిత్తవ మీద పడ్డాక పొలం అమ్ముకు రమ్మని అల్లుడు పిల్లను యింటికి పంపాడు. ఇంట్లో రోజుకో తగాదా.” దిగులుగా అంది. “మా ఆయనకు ఒంట్లో బాగోదు. ఆడపని, మగపని నేనే చెయ్యాలా. ఇప్పుడు పొట్ల వేశాం మా పొలంలో. నాలుగు నాళ్ళు ఆగితే దొండ ఏస్తాం. రోజూ పొలాన్ని చూసుకొని ఏడవటమే!” ఆమె మాటలకు అప్పటి దాకా గలగలలాడుతున్న వాళ్ళు నిశ్శభ్ధమ్ అయ్యారు.

పూడుకు పోయిన గొంతును సవరించుకొంటూ మంగమ్మ “కొందరు చెప్పుకొంటున్నారు. కొందరు చెప్పుకోవటం లేదు. ప్రతి ఇంట్లో ఒక కుంపటే. కంటి నిండా నిద్ర పోయి, కడుపునిండా తిని ఎన్ని రోజులయ్యిందో! రేపటి రోజు ఎలా గడుస్తుంది? ఒక పూటైనా తినగలమా? పిల్లల్ని గవర్మెంట్ స్కూల్ లో అయినా చదివించుకోగలమా? ఈ మాయదారి జనాలు మా మీదనే పడాలా?” అంది.

“ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చారు?”

“తుళ్ళూరు ఏరియాలో రేట్లు తక్కువ. వాళ్ళకు చాలా ఎకరాలు ఉన్నాయి. ఎక్కువ మంది భూములు సాగు చెయ్యటం ఎప్పుడో మానేశారు. మావి జరీబు బూములు. నాలుగు అడుగులు తవ్వితే నీళ్ళు పడతాయి. ఏ కాలంలో అయినా పంటలు పండుతాయి. ఒకేడాది వానలు లేకపోయినా పర్వాలేదు. ఒకేడాది వానలు ఎక్కువైన పర్వాలేదు. అరకెరం ఉన్నా దర్జాగా గడిచి పోతుంది ఈడ. ఇప్పుడు మా భూములు, తుళ్ళూరు ఒకటే రేటు చేసేశారు.” లక్ష్మి చెప్పింది.

“భూములు కొంటామని మా చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఒకే నంబరు కార్లు ఉన్న వాళ్ళు. వాళ్ళంతా నారాయణ, సుజనా చౌదరీ మనుషులే. ఎవరైనా ఒక అరెకరం పొలం అమ్ముతామని వాళ్ళ దగ్గరకు వెళితే లాండ్ పూలింగ్ కి ఇస్తేనే కొంటామని ఆ ఫారాలు చూయించమని అడుగుతున్నారు. మా అంగీకార ఫారాలు గవర్నమెంట్ కు ఇవ్వక్కర్లా. వీళ్ళకిస్తే చాలు. క్రిడా అంటే పేద రైతుల దగ్గర బూములు లాక్కొని నారాయణలకు, సుజనా చౌదరిలకు ఇచ్చే ఆఫీసే.” ఏమీ చదువుకోని ఎంకాయమ్మ ఘంటా పధంగా చెప్పింది.

“డాక్రా రుణాలు మాఫీ అన్నాడు. వడ్డీలతో సహా మళ్ళీ కట్టాము. రుణాల మాఫీ అన్నాడు. ఎవడికొచ్చిండో ఎవడికి పోయిందో తెలియదు. ‘నన్ను నమ్మండి.’ అంటున్నాడు. నమ్మటానికి ఏమైనా ఇది ఓటా? మా బతుకు.”

“ఎట్టా బతకాలా? ఏం తినాలా? రోజుకు మూడు కూలీలకెళ్ళే దాన్ని. అర్ధరాత్రి కూడా భయం లేకుండా పోయేవాళ్ళం పూలు కోయటానికి. ఇక ఈ పొలాలు లేక పోతే ఒల్లమ్ముకొని బతకాల్సిందే.” ఏడ్చేసింది సీతారావమ్మ   1505149_1563578830593061_2672342028829588754_n సుక్కా, సుక్కా! ఓ సెమట సుక్కా! ఇపుడేమి సేద్దామే?

సుక్కా సుక్కా కలిస్తే కృష్ణమ్మ కాదా?

కృష్ణమ్మపొంగితే పాపాత్ములు పోరా?

నీకు నాకు పోయేదేముంది యిక కొత్తగా?

దేహామంతా ఆయుధం చేసుకొందాం. డేగల్ని తరుముదాం.