ట్యాగులు

,

46473131“భారతదేశపు పుత్రిక” పేరు మీద లెస్లీ ఉడ్విన్ అనే బ్రిటిష్ ఫిల్మ్ నిర్మాత తీసిన డాక్యుమెంటరీ సంచలనం రేపింది. నిర్భయ అత్యాచారం ఉదంతం మీద తీసిన ఈ డాక్యుమెంటరీలో నిర్భయ తల్లిదండ్రుల మనోభావాలతో బాటు, నిర్భయ అత్యాచార నిందితుల అభిప్రాయాలను కూడా రికార్డ్ చేసింది. ఈ ఉదంతం జరిగిన తరువాత ఉవ్వెత్తున లేచిన నిరసనలను కూడా ప్రతిభావంతంగా చిత్రీకరించిన లఘు సినిమా యిది.

ఈ డాక్యుమెంటరీలో ఢిల్లీలో అత్యాచార నిందితులు నివసిస్తున్న బస్తీలలో ఉండే అధ్వాన పరిస్థితుల సజీవ చిత్రణ ఉంది. వారి తల్లిదండ్రుల అజ్ఞానం, ఒక నిందితుని భార్య అమాయకత్వం ఉన్నదున్నట్లుగా చూపించారు. చనిపోయే ముందు ఆమె అనుభవించిన బాధను పంచుకోలేక పోయాననే నిర్భయ తల్లి వేదననూ, ఆడపిల్లని ఆలోచించకుండా నిర్భయను చదివించటానికి ఉన్నపొలాన్ని కూడా అమ్మిన తండ్రి ఆమె మరణాన్ని ప్రత్యక్షంగా చూడాల్సిన నిస్సహాయ పరిస్థితిని అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సెంటిమెంట్ల వరకు చూపించి వదిలేస్తే ఎవరికి నొప్పి తగిలేది కాదు. ఇక్కడ సాక్షాత్తూ ప్రభుత్వానికే నొప్పి తగిలింది. ఈ చిత్రాన్ని నిషేదించింది. యూ ట్యూబ్ నుండి తొలగించే ప్రయత్నం మొదలు పెట్టింది. అప్పటికే ఈ చిత్రం అనేకమంది చూసి దాచుకొన్నారు. దేశంలోని వివిధ వర్గాల నుండి రకరకాల స్పందనలు వచ్చాయి.

ఇంతగా కలకలం రేపిన ఈ చిత్రంలో ఏముంది? భారతదేశంలో అత్యాచార నిందితుల మానసిక విశ్లేషణ ఉంది. డాక్యుమెంటరిగానే ఇది అత్యాచారాలకు, తదనంతర హత్యలకు భారతదేశంలో ఉన్న మూలాలను చూపించింది.

నిందితులలో ఒకడైన ముఖేష్ సింగ్ తన ఇంటర్వ్యూలో ఒళ్ళు జలదరించే కామెంట్లు చేశాడు. ఆడపిల్లలు రాత్రి తొమ్మిది తరువాత బయట తిరగకూడదనీ, అలా తిరిగితే అత్యాచారాలకు అబ్బాయిలు కంటే అమ్మాయిలే ఎక్కువ బాధ్యులు అవుతారనీ అన్నాడు. ఇల్లు చూసుకోవటం, ఇంటి పని చేయటం ఆడవాళ్ళ బాధ్యత అన్నాడు. డిస్కోలలో, బార్లలో రాత్రి పూట తిరుగుతూ చెడు దుస్తులు ధరించి చెడ్డపనులు చేయకూడదనీ ఉద్బోధించాడు. స్త్రీలను అత్యాచారం చేసేటపుడు మాట్లాడకుండా చేయించుకోవాలనీ, ఎదురు తిరగకూడదనీ, అప్పుడు ఆ స్త్రీని అత్యాచారం మాత్రమే చేసి వదిలి వస్తారని నీతి బోధలు చేశాడు. ఇంకా అత్యాచార నిందితులకు మరణ శిక్షలు వేస్తే ఆడపిల్లల ప్రాణాలకు ముప్పు అనీ, అత్యాచారం చేసి ఆమెను చంపివేస్తారని బెదిరించాడు.

అంతకంటే దిగ్భ్రాంతి కలిగించే వ్యాఖ్యలు నిందితుల తరఫున వాదించే లాయర్లు ఎం.ఎల్ శర్మ, ఎకె సింఘ్ చేశారు. భారతదేశ సంస్కృతిలో స్త్రీ అనే భావన లేనే లేదనీ .. కేవలం అక్క, చెల్లి, కూతురు మాత్రమే ఉన్నారని ఎం. ఎల్ శర్మ అన్నాడు. స్త్రీ సరైన స్థలంలో ఉంటే పూజింపబడాలనీ, ఉండరాని స్థలంలో ఉంటే శిక్షింపబడాలనీ అన్నాడు. బహుశా అతని ఉద్దేశ్యం రేప్ చేయటం ద్వారా నిర్భయకు సరైన శిక్ష పడిందని అయి ఉంటుంది. నిర్భయ తల్లిదండ్రులు ఆమెను పరాయి పురుషుడితో బయటకు పంపి తప్పు చేశారని కూడా అన్నాడు. స్త్రీలు తినుబండరాలులాంటి వారనీ, పురుషులు కుక్కల వంటి వారనీ .. తినుబండారాలు రోడ్డు మీద ఉంటే తినకుండా ఎలా ఉంటారని ప్రశ్నించాడు. ఇక ఇంకో లాయర్ ఎకె సింఘ్ “నా కూతురు కనుక అలా పరాయి పురుషుడితో సినిమాకు వెళ్ళినట్లు తెలిస్తే, మా ఫామ్ హౌస్ లోనే ఆమెను పెట్రోల్ పోసి తగల పెడతానని” రౌద్రంగా అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేశాక ఢిల్లీ బార్ కౌన్సిల్ వాళ్ళు ఈ ఇద్దరు లాయర్లను కోర్టుల నుండి నిషేదించాలని అన్నప్పుడు ఎకె సింఘ్ తననెవరూ ఏమీ చేయలేరనీ, తనను అభినందిస్తూ అనేకుల నుండి ఫోనులు వస్తున్నాయని అనటం ఒక ఒక విశేషం.

ఈ విశేషం వెనుకనే అనేక విషయాలు ఉన్నాయి.

నిందితుడు ముఖేష్ సింగ్ మీదా, ఎకె సింఘ్ మీదా, ఎం.ఎల్ శర్మమీదా కోపం తెచ్చుకొనే వాళ్ళు ఆలోచించాల్సింది ఇక్కడే. వీరు వ్యక్తం చేసిన భావాలు వైయుక్తికమైనవి కావు. భారత సమాజంలో ఊడలు దిగి ఉన్న భావాలు ఇవే అనే వాస్తవాన్ని అందరికీ గుర్తు చేసిన సందర్భం ఇది. నిర్భయ ఘటన మీద ఆగ్రహావేశం, నిరసన వ్యక్తం అయ్యి ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని తేవాల్సివచ్చింది. ఆ చట్టం ఆచరణలోకి వచ్చినపుడు కూడా ఒక్క క్షణం కూడా అత్యాచారాలు ఎందుకు ఆగలేదు అన్న ప్రశ్నకు ఇక్కడే సమాధానం దొరుకుతుంది. ‘అత్యాచారాలకు స్త్రీలే కారకులు’ అనే భావజాలాన్ని కోట్లాది భారతీయులు తమ బుర్రల్లో మోయటం వలనే ఈ భావాలకు ఆమోదం, ప్రామాణికత ఏర్పడ్డాయని అర్ధం చేయించిన సినిమా ఇది.

ముఖేష్ సింగ్ ఇలాంటి సమాజంలోనే పెరిగాడు. బడికి వెళ్ళి ఉంటే అక్కడ పాఠాలు స్త్రీ ప్రాతివ్రత్యం గురించి బోధించి ఉంటాయి. ఇంట్లో తల్లీ, చెల్లీ ఎప్పుడూ ఇంటి పనులు చేస్తూ కనపడుతూ ఉంటారు. (ఈ చిత్రంలో ఒక నిందితుడి చెల్లిని చూపించారు. ఆమెకు ఇంటి పని తప్ప ఇంకేమి తెలిసినట్లుగా లేదు.) బయట అతనికి స్త్రీల శరీరాలు కారు చౌకగా లభిస్తున్నాయి. (నిర్భయ సంఘటనకు ముందు ఈ నిందితులు అక్కడికే వెళ్ళి వచ్చామని చెప్పారు.) ఇక రాత్రి 9 గంటలకు ఒక పురుషునితో బస్సు ఎక్కిన ఆడపిల్ల పట్ల వాళ్ళకు ఎలాంటి భావాలు కలుగుతాయి? తన ఇంట్లో స్త్రీలాగా కనబడని బయట స్త్రీ తను కొనుక్కోగలిగిన స్త్రీలాగనే కనబడుతుంది. ఈ రెండు వైరుధ్యాల మధ్య కొట్టుకులాడించే గందరగోళం మన ఘనమైన భారతీయ సంస్కృతిలోనే ఉంది. అత్యాచారం హింసగా, హత్యగా మారటం .. ముఖేష్ చెప్పినట్లు ఆమె ఎదురు తిరిగినప్పుడే జరుగుతుంది. అత్యాచారం కేవలం లౌంగిక తృప్తినిచ్చే చర్య మాత్రమే కాదు. పురుషుడి ఆధిపత్యానికి, అహంభావానికి ఒక భీభత్సమైన ప్రదర్శన కూడా. ఈ హింస, బీభత్సం ఎంత క్రూరమైనవి అంటే ఆమె పేగుల్ని బయటకు లాగి ఆనందించేటంతగా. వాటిని మూట కట్టి బయటకు పారేశామని చెప్పినంత తేలిగ్గా.

ముఖేష్ సింగ్ ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించకుండ మాట్లాడాడు. పసందైన విందు భోజనం ఆరగించి, తరువాత దాని మీద కంప్లైంట్ చేసే వ్యక్తిగా ఈ కేసులు, చట్టాల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తూ కనబడ్డాడు. “ద రీడర్” అనే ఆంగ్ల సినిమాలో ఒక నాజీ మహిళా పోలీసు, విమానాల నుండి బాంబింగ్ జరుగుతుందని తెలిసి చర్చిలో దాక్కొన్న యూదులను బయటకు రానీయకుండా తాళం వేసి వారందరి మరణానికి కారణం అవుతుంది. తరువాత కాలంలో కోర్టు ఆ విషయం ప్రశ్నించినపుడు “నా పై అధికారులు ఎలా చెబితే అలా చేశాను.” అని అమాయకంగా సమాధానం చెబుతుంది. ఆమె తనకు తాను పై అధికారుల ఆజ్ఞలను శిరసావహించే బాధ్యత గలిగిన అధికారిణిగా భావించుకొంటుంది. ముఖేష్ సింగ్ సమాజంలో ఉన్న చెడుని సరిదిద్దే ధర్మకర్తగా తనను తాను భావించుకొన్నట్లు అనిపిస్తుంది. బహుశా భారతదేశంలో రేపిష్టులు అందరూ అలాగే అనుకొంటూ ఉంటారు. జైలు మానసిక వైద్యుడు మాట్లాడుతూ 200 రేపులు చేసి, కేవలం 17 కేసుల్లోనే శిక్ష పడిన నేరస్తుడు అదే జైలులో ఉన్నాడని అన్నాడు.

ఇదే రకమైన పితృస్వామిక ఉదాసీనత ఆయన లాయర్లలో కూడా కనబడింది. ముఖేష్, అతని లాయర్లు అద్దంలో ఒకరికొకరు ప్రతిబింబాలు. నిందితుల ఆర్ధిక, సామాజిక స్థితిగతులు పరిగణనలోకి తీసుకొంటే ఈ లాయర్ల కంటే నిందితులు ఎక్కువ నేరం చేయలేదు. ఈ లాయర్లు, మోరల్ పోలీసింగ్ చేస్తున్న సంఘీ కార్యకర్తలు, సాధ్వులు, సాధ్వీమణులు, బిజెపి అధికార ప్రతినిధులు ఇవే ధర్మ సూక్తులు చెవులు గింగురు పడేటట్లు అరిచి చెబుతున్నారు. ఈ సూక్తులకు సమాజం నుండి వస్తున్న ఆమోదాన్ని పరిశీలిస్తే మన సమాజ ధర్మమే ఇలాగే చెలామణిలో వుందని అర్ధం అవుతుంది. గొంగట్లో వెంట్రుకలు ఏరుకొంటున్నట్లు ఇక్కడ స్త్రీ సమానత్వం, స్త్రీ స్వేచ్చ కోసం వెదకటం శుద్ధ అవివేకం అని అర్ధం అవుతుంది.

ఇక బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రహసనం అంతా ఇంతా కాదు. హోమ్ మినిస్టర్ రాజనాధ్ సింగ్ కోపోద్రిక్తుడయ్యాడు. ‘భారత్ మహాన్’ కి చెడ్డ పేరు వస్తుందని హడావుడి పడ్డాడు. ఈ డాక్యుమెంటరీలో చూపించిన కఠిన వాస్తవాలను అంగీకరించి స్త్రీల భద్రతకు మరింత హామీ ఇవ్వాల్సిన ప్రభుత్వం జైలు నియమాలు ఎలా అతిక్రమించబడ్డాయి అనే విషయం మీద చర్చ పెట్టి ప్రజలను దారి మళ్ళించే ప్రయత్నం మామూలుగానే చేసింది. ఈ డాక్యుమెంటరీ ఆపడం వలన గతంలోనే పోయిన భారత ప్రతిష్ట తిరిగి వస్తుందా? అంతర్జాతీయ ప్రపంచం ఎప్పుడో ఇండియాలోని ఈ పరిస్థితిని గుర్తించి ఢిల్లీని ‘రేపుల నగరం’గా పేర్కొనింది.

“బీబీసీ తన వ్యాపార ప్రయోజనాల కోసం ఈ డాక్యుమెంటరీ తీసింది. రేపులు వాళ్ళ దేశాల్లో జరగటం లేదా?” అని ప్రశ్నించే దేశభక్తులు కూడా ఉన్నారు. గతంలో సత్యజిత్ రాయ్ మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి., ఆయన తీసే సినిమాల్లో ఎక్కువ పేదరికాన్ని చూపిస్తాడనీ, మన దారిద్రాన్ని అంతర్జాతీయంగా అంత ప్రచారం చెయ్యాలా అని. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమా వచ్చినపుడు కూడా విదేశస్తులు మన పేదరికాన్నివాళ్ళ లాభాల కోసం వాడుకొంటున్నారని అన్నారు. ఈ చిత్రాన్ని తీసిన లెస్లీ ఉడ్విన్ ఒక పరిణితి చెందిన, తెలివైన ఫిల్మ్ మేకర్. భారతదేశంలో ఈ చిత్రాన్ని నిషేదించిన తరువాత అమెరికాలో ఈ చిత్ర ప్రదర్శనకు పెద్ద ఎత్తున ముఖ్య రంగాల్లో ఉన్న వ్యక్తులు హాజరు అయ్యారు. “నిర్భయ భారతదేశ పుత్రిక. ఈ రాత్రికి ఆమె మా పుత్రిక” అని ప్రకటించారు.

ఎవరు ఏ ప్రయోజనాల కోసం తీసినా, రాసినా వస్తువులో వాస్తవికత వుందా లేదా అనేదే గీటురాయి. భారతదేశంలో సామాన్య ప్రజల వద్ద లేని సంపదను ఉన్నట్లుగా తీసే సినిమాలను ప్రపంచం మీదకు వదిలి మిధ్యా ప్రతిష్ట పెంచుకొన్నట్లు భ్రమ పడుతున్నాము. విషయాన్ని ఉన్నదున్నట్లుగా తీసిన చిత్రాలను నిషేధించాలని అంటున్నాము. విలువలు తల్లకిందులై రాజ్యామేలుతున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ఈ డాక్యుమెంటరీ చూసి ఇక్కడ మహిళలు భీతిల్లుతుందీ, భయోత్పాదకానికి గురి అవుతుందీ పరువు ప్రతిష్టల గురించి కాదు. నేరమయం, క్రూరమయం అవుతున్న భారత సమాజ మెదళ్ళ గురించి మాత్రమే!