ట్యాగులు

, , , ,

ఈ రోజు హిందు పేపర్ లో ఒక అడ్వకేట్  రాసినది

index

తమిళ ప్రాచీన సాహిత్యంలో ఎక్కడా తాళి ప్రస్తావన లేదు. శిలాప్పాధికారం అనే ప్రభంధంలో కోవలన్, కన్నగిల పెళ్ళి తాళి లేకుండానే జరిగిన మామూలు కార్యక్రమం. సంస్కృత ప్రభంధాలు కూడా రాజుల గురించి చెబుతాయి కానీ స్వయంవరంలో ఎవరు తాళీ కట్టరు. కాబట్టి తాళి తమిళుల ప్రాచీన సంస్కృతికి చిహ్నం కాదు.

గతంలో సంగం సాహిత్యంలో ‘అయింబదైత్ తాళి’ తాళి ప్రస్తావన ఉంది. అది పిల్లల కోసం ఐదు లోహాలతో తయారు చేసిన పతకం. పిల్లల ఆరోగ్యానికి మంచిదని అనేవాళ్ళు. కాబట్టి తాళి అనేది పిల్లల కోసం మాత్రమే. స్త్రీలకు పెళ్ళిలో కట్టేది మాత్రం కాదు.

తరువాత కాలంలో కొన్ని పద్యాలలో .. కధానాయకుడు తన ప్రియురాలి కోసం పులిని చంపి దాని గోరు లేక పన్ను ఎలా బహుకరించేవాడో వర్ణించారు. కధా నాయకురాలు దాన్ని తన హృదయానికి దగ్గరగా మెడ చుట్టూ చుట్టుకొని అపురూపమైన నగలాగా దాచుకొనేది. ఆ ఆచారం చాలా రోజుల క్రితమే మాయం అయ్యింది. ఈ కాలంలో ఏ పురుషుడు అలాంటి పులి గోర్లు, పళ్ళు తీసుకొని రాలేడు కాబట్టి , తీసుకొస్తే కటకటాలు లెక్క పెట్టాలి కాబట్టి.. ఇప్పటికి ఆ ఆచారం సరిపోదు.


కాబట్టి ఏరకంగానూ తాళి కట్టించుకోవటం తమిళ సంస్కృతిలో లేదు. ఒక వేళ అది తమిళ సాంప్రదాయం అయినప్పటికి సాంప్రదాయ చిహ్నాన్ని ధరించటం వ్యక్తుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద బలవంతంగా ఈ విషయాన్ని రుద్దకూడదు. ఉదాహరణకు ఇప్పుడు మనం ధరిస్తున్న దుస్తులు 100 సంవత్సరాల క్రితం లేవు. ఎవరైనా అప్పటి దుస్తులు ధరించాలనుకొంటే వారికి ఆ హక్కు ఉంటుంది. ఎవరు ఆ వ్యక్తిని బలవంతం చేయటం కానీ, విమర్శించటం కానీ చేయకూడదు.

తాళి హిందూ సంస్కృతి అని వాదిస్తే, హిందూయిజంలో ఏ ప్రవిత్ర గ్రంధం దాన్ని పెళ్ళిలో తప్పని సరి చేసిందో అడగాలి. ఏ హిందూ సెక్షన్లలో అది వర్తిస్తుందో అడగాలి. ఎవరు తాళి లేక మంగళసూత్రాన్ని పవిత్రంగా మార్చారు? ఎవరు ఈ తాడుకి గౌరవాన్ని, గర్వాన్ని, హుందాతనాన్ని ఆపాదించారు? ఇది కట్టుకొన్న హిందూ స్త్రీ భర్త చనిపోయాక ఎలాగూ ఘోరంగా చూడబడుతుంది. నలుగురిలో తిరగకుండా తిరస్కరింపబడుతుంది.

భర్త చనిపోయాక సమాజం చేత అవమానించబడుతూ ఎంతో క్రూరంగా తొలగించబడే ఈ తాళిని స్త్రీ ఎందుకు ధరించాలి?

చివరిగా తాళి మీద చర్చను ఆత్మ గౌరవ ఉద్యమం పాత్రను ప్రస్తావించకుండా, దాని మొదలు పెట్టిన పెరియార్ రామస్వామిని తలుచుకోకుండా ముగించలేము. రామస్వామి జీవితంలో అన్నికోణాల్లో స్త్రీల హక్కుల కోసం 1920,30 ప్రాంతంలో పోరాడాడు. పెరియార్ అవిశ్రాంత పోరాటమే హిందూ వివాహ చట్టంలో (1955) మార్పులు తెచ్చింది. అప్పుడు చేర్చిన 7(ఏ) ప్రకారం ఇద్దరు హిందువుల మధ్య పెళ్ళి దండలు మార్చుకోవటంతో కానీ, ఉంగరాలు మార్చుకోవటంతో కానీ, లేక తాళి కట్టించుకోవడంతో కానీ జరపవచ్చునని చెబుతోంది.

 ఆ కాలంలో వేల కొలదీ ఆత్మగౌరవ పెళ్ళిళ్ళు, తాళి లేకుండా జరిగాయని మర్చి పోకూడదు. మా తల్లిదండ్రుల పెళ్ళి కూడా అలా జరిగిందే. ఈ అమెండ్ మెంట్ వెంటనే అమలులోకి తెచ్చినందుకు అప్పటి డిఎంకే ముఖ్యమంత్రి అన్నాదురైకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. లేకపోతే నేను అక్రమ సంతానంగా పరిగణించబడేవాణ్ణి.

ఆత్మగౌరవ పెళ్ళి చట్టపరమైన పెళ్ళి. తాళి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొన్న చరిత్ర మా తమిళియన్స్ కు ఉంది. సమానత్వం, ఆత్మగౌరవం విషయాలకు వస్తే ఈ తరహా పెళ్ళిళ్ళు స్త్రీలకు చాలా విలువైనవి.