ట్యాగులు

,

???????????????????????????????

శంషాబాద్ ఫ్లై ఓవర్ మీద కేబ్ మెత్తగా వెళుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుండి 20 నిమిషాల్లో ఫ్లై ఓవర్ మధ్యలో ఉన్నాము. “ఎంత డెవలప్మెంట్!” అనుకోకుండా ఉండలేక పోయాను.

ఇంతకు ముందు ఇక్కడకు రావాలంటే ఎన్నిగంటలు పట్టేదో! టైమ్ ప్రీషియస్ అయ్యే సరికి టెక్నాలజీ అవసరం బాగా పెరిగింది.

ఎవరో ముసలాయన తోపుడు బండితో కేబ్ కి అడ్డం వచ్చాడు. సడన్ బ్రేక్ వేసి డ్రైవర్ తిడుతున్నాడు.

“ఈ బండ్లను ఇంకా ఈ రోడ్ల మీద బాన్ ఎందుకు చెయ్యరో!” గొణుగుడు వినిపించింది నా పక్క నుండి. ఈశ్వర్ తన వాట్స్ అప్ చాట్ డిస్టర్బ్ అయినందుకు అసహనంగా మొహం పెట్టాడు.

“కమాన్! కాసేపు ఆ చాట్ ఆపు.” విసుగ్గా అన్నాను.

“మరి ఏమి చెయ్యను? ఆంటీతో వచ్చాను. బోర్!” అన్నాడు మిశ్చువస్ గా నవ్వుతూ.

“తలని సాఫ్ట్ వేరు వాడికి తాకట్టు పెట్టి బట్టతల చేసుకొన్నావు. చాటింగ్ గాళ్ ఫ్రెండ్ కి ఫోటో చూపించావా?” వెక్కిరించాను.

ఈశ్వర్ నా ఇంజనీరింగ్ క్లాస్మేట్. మొన్ననే మా ఇరవై ఐదు ఏండ్ల అల్యూమినీ మీట్ అయింది. అప్పుడు కలవలేని వెంకట్ ను ఎయిర్ పోర్ట్ లో కలవడానికి వెళుతున్నాము.

“నీ స్వార్ధం నాకు తెలుసులే. ఎక్కడికి కదలని దానివి, పాతికేళ్ళ క్రితం మనల్ని మర్చిపోయిన వాడిని కలవాలని ఎందుకు వస్తున్నావో? నా సండే పాడు చేస్తూ నన్నూ లాక్కొచ్చావు. వాడు వెయ్యి నూట పదహార్లు ఇస్తాడులే!” నా వెక్కిరింతకు కక్ష తీర్చుకొన్నాడు. మొన్న అల్యూమినీ మీట్ లో మా పత్రిక ట్రష్ట్ చందా పుస్తకం పట్టుకొని తిరిగానులే అందరి దగ్గరకు. అక్కడే వీడికి దొరికాను. చిన్నగా నవ్వుకొంటూ కిటికీలో నుండి చూశాను.

శంషాబాద్ లో కొన్ని మలుపులు తిరిగి ఎయిర్ పోర్ట్ రోడ్డు తీసుకొంది కేబ్. ముక్కులకు ఏవో వాసనలు తగిలాయి. ఉన్నట్లుండి నా కళ్ళు విప్పారాయి. “బంతులు.” అరిచాను. గుట్టలు గుట్టలుగా బంతులు. ఒక చోట పసుపు, ఒక చోట ఎరుపు, ఒక చోట తెలుపు … వందల బంతులు … ఒక్కొక్కటి పావు కేజీ బరువుతో … ఛీ ఛీ ఏమిటీ వర్ణన! అంత బొద్దుగా ఉన్నాయేమిటివి?  చిన్నప్పుడు పేడ ఎరువు వేసి పెంచే వాళ్ళం బంతి మొక్కలని. అప్పుడు పూలు ఇంతింత లేవే? డోర్ గ్లాస్ తీశాను. పూల పరిమళాలా అవి? నాకెప్పుడూ పూల పరిమళాలు వాటి రెక్కల కెమికల్ కాంపోజిషన్ వాసన అనిపిస్తుంది. బొత్తిగా భౌతికమై పోయింది బుర్ర. సౌందర్య స్పృహ పూర్తిగా చచ్చిపోయింది. కానీ ఈ దృశ్యంలో, ఆ వాసనలో ఏదో అసహజత్వం.

“షిట్” ఫోన్ సీటు కేసి కొట్టాడు ఈశ్వర్.

“చార్జ్ అయిపోయిందా?” ఆనందంగా నవ్వాను.

అరైవల్స్ దగ్గరకు వెళ్ళగానే కాఫీ షాప్ కి నేరుగా వెళ్ళిపోయాడు ఈశ్వర్. పాపం పొద్దున్నే కాఫీ కూడా తాగకుండా లాక్కొచ్చాను. టైమ్ చూద్దామని నా ఫోన్ తీస్తే చార్జ్ ఐదు శాతానికి పడిపోయి ఉంది.

సెల్ ఫోన్ చేత్తో పట్టుకొని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తిరుగుతున్నాను. వెంకట్ వచ్చే ఫ్లైట్ టైమ్ అయ్యింది. ఆ చార్జ్ అయిపోతే తనతో కాంటాక్ట్ కష్టం అవుతుంది. కాఫీ షాప్, ట్రావెలింగ్ ఏజెన్సీ, గిఫ్ట్ షాప్ … అందరిని అడిగి చూశాను. ‘సారి మేడమ్’ అంటున్నారు. “అక్కడ చార్జింగ్ పాయింట్ ఉంది చూడండి.” కొంత మంది సలహా ఇస్తున్నారు. “ఆ పిన్ చెడి పోయింది” చెప్పుకొంటూ తిరుగుతున్నాను.

కాఫీ షాప్ లో ఉన్న అమ్మాయి స్పెషల్ యూనిఫార్మ్ వేసుకొని ఉంది. కాఫీమిషన్ మీద ప్రెస్ చేస్తున్న వేళ్ళు మొరటుగా బండబారి ఉన్నాయి. చుట్ట చుట్టి ముడి వేసిన జుట్టు రాగి రంగులో గిడసబారి ఉంది. ఆరిపోయి కాటు తేలిన మొహం దైన్యంగా ఉంది. “మీ ప్లగ్ లో ఐదు నిమిషాలు చార్జ్ చేసుకొంటాను.” అంటే ‘నో పర్మిషన్ మేడమ్.’ అని చాలా బీదగా చెప్పింది. నిరాశగా ఒక సారి ఈశ్వర్ వైపు చూశాను. కాఫీ ఆస్వాదిస్తూ నన్ను పట్టించుకోలేదు. లేడీస్ టాయ్లెట్ వైపు కదిలాను. చార్జింగ్ పాయింట్స్ అన్ని మూసేశారు అక్కడ.

వచ్చేస్తూ ఆమెను చూశాను. టాయిలెట్ కేబిన్ రూమ్ లో కింద బండల మీద కాళ్ళు చాపుకొని కూర్చోని కళ్ళు మూసుకొని వుంది. బ్లూ రంగు నైలాన్ చీర … యూనిఫార్మ్ అనుకొంటాను కట్టుకొని ఉంది. ఎప్పటి నుండో అడగాలనుకొన్న ప్రశ్న. అడిగాను.

“మీరు ఇక్కడే ఎందుకు కూర్చోంటారు? బయట కూర్చోవచ్చుకదా” అడిగాను.

“ఇక్కడికొచ్చే వాళ్ళు టాయిలెట్ వాడి బయటకు వెళ్ళాక మేము చెక్ చేయాలి. అవసరం అయితే వెంటనే కడగాలి.” చెప్పింది.

“మీదే ఊరు?” అడిగాను.

టాయిలెట్ కేబిన్ లోనే తూర్పుకు తిరిగి చెయ్యెత్తి “అక్కడ ఉండేది మా ఊరు. చిన్న గొల్లపల్లి.”

“ఇప్పుడు?”

“ఇచ్చేసాంగా ఈ విమానాశ్రయానికి. మాది రెండు ఎకరాలు ఇచ్చాము.”

“అదిగో అక్కడ చూడండి. పూల పొదలు పెంచుతున్నారే వాళ్ళు మా ఊరు వాళ్ళే. నాకీ పని దొరికింది. ఇంటి కాడ వయసుకొచ్చిన పిల్ల ఉంది. నేనీడ దొడ్లు కడుగుతున్నాను.” నేను అడక్కుండానే చెప్పింది.

“మేమంతా ఒక ఈడు వాళ్ళం. ఒకే సారి మాకు పెళ్ళిళ్లైనాయి. అందరికీ ఇద్దరిద్దరు పుట్టాక ఆపరేషన్లు చేయించుకొన్నాము. మాకందరికి బంతి తోటలు ఉండేవి. పిల్లలు మా తోటల్లో ఆడతా ఉండేవాళ్ళు. మాపిటేలకి ఆరు బయట మంచాలు వేసుకొని అందరం వరసగా పడుకొనే వాళ్ళం. బంతి పూల వాసనలు మా యింటి దాకా కొట్టేవి. ఏ ఝామున లేసినా పూల వాసనాలు తగిలేవి. ఇప్పుడు అన్ని టయాల్లో ఈ వాసనలలో బతుకుతున్నాము.” నీళ్ళ చప్పుడవుతున్న టాయ్లెట్లు చూపిస్తూ అన్నది.

“రెండకరాలకు కూలోల్లు చాలక మహబూబ్ నగర్ నుండి పిలిపించుకొనే వాళ్ళం…”

“ఇప్పుడు మా మగోళ్ళే కూలి పనులకు మహబూబ్ నగర్ వెళ్ళారు.” కాస్త ఆగి చెప్పింది.

“మీ పిల్లలు…?”

“పదేళ్ళ క్రితం మా యిల్లు, పొలాలు పోయే నాటికి అమ్మాయి ఐదో క్లాసులో ఉండింది. ఇప్పుడు ఇక్కడే రోడ్లూడుస్తుంది. అబ్బాయి ఈ మధ్యే చదువు మానేసి ఆవారాగా తిరుగుతున్నాడు. అయ్య బయం లేదుగా. ఇంటికాడ ముసలోళ్ళు ఉన్నారు. రోజుకి ఐదు రెండ్లు పది కంచాలు లేవాల ..”

“ఎన్నో కలలు కన్నాం. పిల్లకు దర్జాగా పెళ్లి చేయాలని. అబ్బాయిని మంచి చదువులు చదివించాలని … మా పొలాలు మాకు ఉండి ఉంటే … ఇప్పుడు ఆయన అక్కడ, మేము ఇక్కడ … వాళ్లిచ్చిన పదహారు గజాల ఇళ్ళకు మా బతుకులు కుంచించుకు పోయాయి.”

“దిగులు పడకు.” అంత కంటే ఒక్క ముక్క కూడా చెప్పలేను.

“ఇప్పుడు నా దిగులు అది కాదు. మా మావ ఇవ్వళో రేపో అన్నట్టున్నాడు. చస్తే ఏడ పూడ్చాలి? మాకిప్పుడు శ్మశానం కూడా లేదు.”

విసవిస బయటికి వచ్చాను.

“మీ హీరో హాండ్ ఇచ్చాడు. ట్రిప్ కాన్సిల్ అయ్యిందట. చెన్నై నుండి పూనా వెళ్ళి పోయాడు. మళ్ళీ ఫోన్ ఆన్ చేయగానే కనబడింది మెసేజ్. టట్టటాయ్ …” ఈశ్వర్ ఎదురు వచ్చాడు.

“పోదాం పద!”

అర్ధం కాక బుజాలు ఎగరేసుకొంటూ నా వెనుకే వచ్చాడు.

కేబ్ తో బాటే కదులుతున్నాయి బంతులు … బలంగా… పేడ ఎరువును పోసుకొని బతికినవి కావవి. మనుషుల జీవాన్ని పోసుకొని బలిసినవవి.

(ఇది జరిగిన కధ. ఆమె అక్కడే ఉంది శంషాబాద్ విమానాశ్రయంలో. ఇంకా అలాంటి ‘ఆమెలు’ చాలా మంది సంచరిస్తూ ఉంటారక్కడ. జీవరహితంగా.. అంద విహీనంగా .. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను సుందరంగా తీర్చిదిద్దుతూ.. ఆమె మనసును పట్టుకోగలిగాను కానీ ఆమె భాషను నేను పట్టుకోలేక పోయాను)