ట్యాగులు

, , ,

ఇంటి నుండి బయటకు లాగిన కుర్రవాడు, రైఫిల్ గురి పెట్టగానే నమాజు చేసుకొంటున్న దృశ్యం.

ఒకేలాంటి సంఘటనలు. ఒకేలాంటి తీర్పులు. కాలాలు వేరవవచ్చు. స్థలాలు వేరవచ్చు. వీరు ఉమ్మి మోసుకొని తిరిగిన దళితులు కావచ్చు. వారు దేశ ద్రోహులుగా నిత్యం తిరస్కరించబడే ముసల్మానులు కావచ్చు. ఇక్కడ ఆత్మ గౌరవ యుద్ధంలోనూ, అక్కడ వారి మతం ద్వారా వారి పైన ఏర్పడిన ద్వేషంలోనూ … దేశమంతా ఒకే గాయం. కారు చౌక ఇక్కడ ప్రాణం.

1987లో మీరట్ లోని హషింపురలో జరిగిన జనసంహారం కేసులో సాక్ష్యాలు లేవని ఇటీవల కోర్టు కేసు కొట్టేసింది. 42 మందిని చంపి ముర్దాబాద్ లోని పై గంగా జలాల్లో పాతేసిన దురంతం తాలూకు విషాదం, 28 సంవత్సరాల తరువాత న్యాయస్థానం చేత రద్దు చేయబడింది. అప్పటి గాయాల మచ్చలు మోసుకొని తిరుగుతున్నవారు ఇక ఆ గాయాలు ఎప్పటికీ మానవని, వారి తరం నుండి తరవాత తరాలకు అవి బదిలీ కావాల్సిందేనని నిర్ణయించుకొన్నారు. అసలు తామే ఎందుకు ఈ సంహారానికి ఎంచుకోబడ్డామో తెలియని అయోమయం ఇప్పటికీ వీడని స్థితిలో వీరు ఉన్నారు.

భర్త కోసం విలపిస్తున్న మహిళ, ఆమె పిల్లలు

భర్త కోసం విలపిస్తున్న మహిళ, ఆమె పిల్లలు

ఇరవై ఎనిమిదేళ్ళు క్రితం భర్తను పోగొట్టుకొని పిల్లల్ని ఒంటి చేత్తో పెంచిన అదే మహిళ

ఇరవై ఎనిమిదేళ్ళు క్రితం భర్తను పోగొట్టుకొని పిల్లల్ని ఒంటి చేత్తో పెంచిన అదే మహిళ

అది 1987 ఏప్రెల్. రాజీవ్ గాంధీ అప్పటి వరకు మూసి ఉన్న బాబ్రీ మసీద్ ను ప్రార్ధనలకోసం తెరిపించాడు. ఉత్తరప్రదేశ్ లోని అన్ని పట్టణాలు లాగానే మీరట్ కూడా కొంత ఉద్రిక్తతకు గురి అయ్యింది. కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగాయి. హశింపుర లోని కొన్ని షాపులు కాల్చివేశారు. షాబ్ -ఇ – బారత్ ఊరేగింపు మీద ఎవరో రాళ్ళు వేశారు. హషింపుర చేనేత పని చేసే ముస్లిమ్స్ నివసించే ప్రాంతం. మే 22 న పెద్ద ఎత్తున పి.ఏ.సి దళాలు మీరట్ పట్టణంలో దిగాయి. రంజాను ఉపవాసం చేస్తున్న ముస్లిమ్స్ ఇళ్ళల్లో ఈ దళాలు చొరబడ్డాయి. 10 సంవత్సరాలు నిండిన ప్రతి మగాడిని బయటకు లాక్కొని వచ్చారు. స్త్రీలు తమ భర్తలను, పిల్లలను లాక్కొని పోతుంటే హృదయ విదారకంగా విలపించారు. అందరి చేత చేతులు ఎత్తించి రోడ్డు మీద పెరేడ్ చేయిస్తూ పోలీసు స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. చాలా మందిని చావగొట్టారు. మీరట్ జైళ్ళలో తోశారు. విడుదల అయ్యి తిరిగి వచ్చిన వారిలో 42 మంది అదృశ్యం.

ఈ యువకులలో ఎంత మంది మిగిలి  ఉన్నారో తెలియదు.

ఈ యువకులలో ఎంత మంది మిగిలి ఉన్నారో తెలియదు.

ఆ అదృశ్యానికి సాక్షులు వారిలోనే వున్నారు. జుల్ ఫికర్ నషీర్ వాళ్ళలో ఒకడు. తరువాత చాలా కాలం కోర్టులకు, విచారణ అధికారులకు, ప్రెస్ కు అసలు ఏమి జరిగిందో చెప్పాడు. రోడ్ల మీద పెరేడ్ అయిన తరువాత “మీలో విద్యార్ధులు ఎవరు?” అని అడిగారు. వదిలివేస్తారనే ఆశతో చేతులు ఎత్తిన వాళ్ళలో నసీర్ కూడా ఉన్నాడు. చేతులు ఎత్తిన వాళ్ళందర్నీ పసుపుపచ్చ వేన్ లో ఎక్కించి గజియాబాద్ లో ఒక్కొక్కరిని షార్ట్ రేంజ్ లో  కాల్చారు. బుజానికి గాయంతో చనిపోయినట్లు పడి ఉన్న నసీర్ ను గంగలోకి తోసివేశారు. ఒక్కొక్క శవం మీద పడుతుంటే నసీర్ ఉగ్గపట్టుకొని ఉన్నాడు. అలా బయటపడిన వాళ్ళు నసీర్ తో సహా ఐదుగురు.

నసీర్ ఒక్కడే ఈ విషయాలు చెబితే బహుశ ఒక దేశ ద్రోహి మహమ్మదీయుడు మాట్లాడుతున్నాడని అంటారు. ప్రవీణ్ జైన్ అనేబడే ఒక హిందూ ఫోటోగ్రాఫర్ ఈ ఘటనకు ఇంకో సాక్షి. అతను  అప్పుడు పని చేస్తున్న పత్రిక ‘సండే మైల్’ తరఫున అక్కడకు ఫోటోలు తీయడానికి వెళ్ళాడు. జరుగబోతున్న దారుణాన్ని గ్రహించి కెమేరా దాచి వేశాడు. కాని రహస్యంగా చాలా ఫోటోలు తీశాడు. వాటిని సాక్ష్యాలుగా కోర్టుకు సమర్పించాడు కూడా.

వీరిలో స్కల్ కేప్ పెట్టుకొన్న వ్యక్తి తిరిగి రాలేదు.

వీరిలో స్కల్ కేప్ పెట్టుకొన్న వ్యక్తి తిరిగి రాలేదు.

కేసు కొట్టి వేశారు. అయితే బాధిత కుటుంబాలు ఎవరి మీద కేసు పెట్టారు? కాల్చి చంపిన పియేసి కానిస్టేబుల్స్ మీద పెట్టారా? అయితే వారి చేత కాల్పించిన శక్తులు ఎవరు? ముస్లిములు ఎక్కువ నివసించే ప్రాంతం నుండి వారిని ఒక్కొక్కరినీ బయటకు లాగి సూటిగా గుండెకు గురి పెట్టి చంపిన ద్వేషం ఎవరిది? గడ్డకట్టిన ఈ ద్వేషం వెనుక ఏ శక్తులను సంతృప్తి పరచాలనే తాపత్రయం ఉంది? ఏ ఓట్ల రాజకీయం ఉంది?ఈ గ్రహింపు హషింపుర బాధిత కుటుంబాలకే కాదు. సమస్త భారత ప్రజలకు లేకపోతే వేల హషింపుర నరసంహారాలు కేవలం చెదురుమదురు సంఘటనలగానే మిగిలి పోతాయి.