ట్యాగులు

, ,

images

పతంజలి … ఇరవై ఒకటో శతాబ్ధపు ఆలోచనలను రగిలించిన అగ్గి. తల్లక్రిందులుగా వేలాడుతున్న సమాజపు పోకడ పట్ల ఆయనకున్న అసహనం, ఆక్రోశం, ఆవేదన గుండె పొరలు చీల్చుకొని, కంఠనాళాలు ఉబ్బి, కంటి జీరలు ఎర్రగా పొంగి … చివరాఖరుకు ఆయన కలంలోని సిరాతో బులుగు రంగు అద్దుకొన్నాయి. ఆ బులుగు రంగు తీక్షణత వెటకారం అవతారం ఎత్తింది. ఆ వెటకారం ఒకసారి వీరబొబ్బిలిగా మారి మనసు లోగిళ్ళలో స్వేచ్ఛగా విహరిస్తూ మన హిపోక్రాటిక్ ఆలోచనలను మెల్లిగా నాకుతుంది. ఒక్కోసారి అదే వెటకారం గోపాత్రుడు రూపంతో భూమి బల్లపరుపుగా ఉందని వితండ వాదన చేసి గెలుస్తుంది.

సామాన్య ప్రజలు ఎన్నడూ చూడలేని ఫోర్త్ ఎస్టేట్ బండారాన్ని మనకు పరిచయం చేసినమిత్రుడు పతంజలి. “వెర్రి వెధవ. నీకు రాజకీయాలేమిటి?” అంటూ ఒక మినిస్టర్ ని ఎకసెక్కం చేసే విలేఖరి ఈ కొత్త లోకాలలో గవర్నరు బంగళా కాడా, అసెంబ్లీ మెట్ల మీదా ఉంటాడు. నిత్యం టీవీల్లో చూసే పరిసరాలే. పాత్రలే సామాన్య ప్రజానికానికి అపరిచితం. జర్నలిష్టుగా తనకు మాత్రమే తెలిసిన సత్య లోకాలను తెలుగు పాఠక లోకానికి సంశయం లేకుండా విదితం చేశాడు పతంజలి. పడి పోయిన రైల్లో డబ్బు, బంగారం దోచుకొనే రిపోర్టర్లతో మొదలు పెట్టి, ఆ దోపిడికి మూలాలు ప్రధాన మంత్రి కుర్చీలోనే ఉన్నాయని నిర్భయంగా వెల్లడి చేశాడు. బొగ్గు నుండి, వేవ్ లెంగ్త్ దాకా అమ్ముకొన్న అధికార రాజకీయాలు గుర్తుకు రావటం లేదూ?

పత్రికలనైనా, ప్రపంచాన్నయినా శాసించేది డబ్బు. ఆ డబ్బు ముంగిట్లో తాగి దొర్లే విలేఖరులు కూడా ఈ వ్యవస్థలో భాగమే. తన స్వజనం గురించి నిర్మొహమాటంగా మొదలు పెట్టి పెట్టుబడికి సాగిల పడే పత్రికా యాజమాన్య వైఖరిని ఆయన బట్టబయలు చేసి రెండు దశాబ్ధాలు గడిచిన సందర్భంగా చెప్పవచ్చేదేమిటంటే ఇప్పుడు రాజకీయాలు, పెట్టుబడి, పత్రికలు మూడూ ఒకే శరీరానికి అంటుకొని ఉన్న మూడు ముఖాలు. ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో ముఖం కనబడుతుంది. పతంజలి! నువ్వు తొట్ట తొలిగా తొలిచిన రంధ్రంలో చూసిన లోకాన్ని ఈ రోజు ఆమ్ ఆద్మీ 70 ఎం.ఎంలో చూస్తున్నాడు.

అక్షరాల మీద ప్రేమతో రిపోర్టరు వృత్తిలో చేరి, అదే అక్షరాల మీద జుగుప్సతో బతుకీడుస్తున్నవారు ఈ వృత్తిలో కోకల్లలు. కొత్త రాజధాని ప్రాంతంలో భూములిస్తున్న రైతులు ఆనంద భాష్పాలు రాలుస్తున్నారనీ అబద్ధాలు రాసీ రాసీ అలసి పోవటం లేదా? వీడియోలలో ప్రశ్నిస్తున్న రైతులను కత్తిరించి కత్తిరించి చేతులు నొప్పి పుట్టటం లేదా? పతంజలి చెప్పినట్లు అక్షరాలు ఖాళీ పంజరాల్లాగా, ఓటి కుండల్లాగా, ఎవరినో దగా చేస్తున్నాట్లు, వేళ్ళ సందులో నుండి తప్పించుకొని పారిపోతున్నట్లు అనిపించటం లేదూ? ఒక రాయి విసరలేక పోవటం, ఒక కత్తి దూయ లేక పోవటం, ఒక చెంపపెట్టు వార్త రాయలేక .. ప్రసారం చేయలేక పోవటం .. అక్షరాలను కడుపు కూటి కోసం, టూ బెడ్ రూమ్ అపార్ట్ మెంటు కోసం అమ్ముకొంటున్న అశక్తతని ఎన్నడో పతంజలి అర్ధం చేసుకొన్నాడు. ఆ అక్షర హత్యలనూ, ఆ గాయాలను సహృదయులైన తెలుగు పాఠకులకు చూపించే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ వర్గాల దృక్పధంతోనే జీవితాన్ని విశ్లేషించే మీడియా ప్రపంచపు మోసాన్ని జగద్విదితం చేశాడు.

రిపోర్టరు భార్యగా కాలరెగరేసుకొని తిరిగిన రాధిక అత్యాచారానికి, హత్యకు గురి అయినపుడు, ఆమెను పత్రికా రిపోర్టర్ల పేరంటాలుగా పేర్కొన్న దమ్ము పతంజలిది. “మందు బుడ్డీలకూ, పోసుకోలు కబుర్లకూ, అబద్ధాలకూ, కుట్రలకూ, క్షుద్ర రాజకీయాలకు అలవాటైనా పాపిష్టి ప్రెస్ క్లబ్ ను కూలదోసి మనందరం ఆవిడకు అక్కడ ఒక గుడి కట్టాలి.” అని రెండు దశాభ్డాల క్రితం ప్రతిపాదించాడు పతంజలి. పేగులు తెగేదాకా అత్యాచారానికి గురి అయి, చచ్చిపోయి .. దేశమంతా అలజడికి కారకురాలైనా ‘నిర్భయ’ను కనీసం ‘ఇండియన్ డాటర్’ గా నిరాకరించే స్థితిలో ఇంకా మేము ఉన్నాము అని మీకు మనవి చేసుకొంటున్నాము పతంజలి!

“పాలక వర్గాలు తమ దోపిడీ స్వేచ్ఛకు ప్రమాదం అనిపించినప్పుడల్లా ప్రజాస్వామ్యానికి ముప్పు అని గగ్గోలు పెట్టినట్లే, మీరు మీ వ్యాపార స్వేచ్ఛకు హాని కలిగినప్పుడల్లా పత్రికా స్వేచ్ఛకు ముప్పు అని గోల చేస్తారు. వెర్రి నా ప్రజలు రెండూ నమ్ముతారు.”

ప్రజలు హక్కులను గుర్తు చేసుకోకుండా ఏమార్చి, వారి కలలు నులిమేసి .. పత్రికలు పాలక వర్గాలకు కొమ్ముకాస్తున్న ఈ వర్ధమాన సందర్భం, ‘పత్రికా స్వేచ్చ’ గురించి చేస్తున్న జపం .. మనం పతంజలిని ఎంత స్మరించాలో కదా!

ఈ వ్యాసం సారంగ లో ఇక్కడ